రాష్ట్రంలో అద్భుత ప్రగతి… కలెక్టరేట్ల ప్రారంభ సభలో సీఎం కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచాయని, ఈ కాలంలో రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. జనగామ, యాదాద్రి`భువనగిరి జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మనం నిర్మించుకున్న కలెక్టర్ కార్యాలయాల మాదిరిగా కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా లేవని అన్నారు. కలెక్టరేట్లు దేవాలయాల వంటివని, వీటిని ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఒక్కసారి వెనక్కుతిరిగి చూసుకుంటే.. ఏడేళ్ళ క్రితం మనం ఎంతో వెనకబడి ఉన్నామని, ఈ రోజు అద్భుతమైన ప్రగతి సాధించుకుని, దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే ఎంతో ముందున్నామని అన్నారు.
జనగామలో…
మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధించినట్లని, అలా తెలంగాణలో ఈ రోజు మారుమూల ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా యన్నారు. మూడు ఎకరాల భూమి వున్న వ్యక్తి ఈ రోజు కోటీశ్వరుడని అన్నారు. బచ్చన్నపేట, జనగామ ఒకప్పుడు ఎంతో వెనకబడ్డ ప్రాంతాలని, బచ్చన్నపేటలో 8సార్లు కరువు వచ్చిందని అన్నారు. యువకులంతా పొట్టచేత బట్టుకుని వలసలు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎంతో దు:ఖించేవారన్నారు. అలాంటి జనగామ ప్రాంతం ఇప్పుడు పచ్చని పైరులతో కళకళలాడుతోందని, బాగా పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. భూముల ధరలు విపరీతంగా పెరిగాయని, రైతులు ధనవంతులయ్యారని అన్నారు. దేశంలో అభివృద్ధిచెందిన పది గ్రామాల్లో 7 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయంటే, మన అభివృద్ధి ఎంతగా ఉందో స్పష్టమవుతుందన్నారు. గ్రామాలలో 2,601 రైతు వేదికలు నిర్మించుకున్నామని, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుంటున్నామని అన్నారు. ఈ అభివృద్ధి అంతాకూడా మీ అందరి దీవెనలతో సాధ్యమవుతోందని అన్నారు.
ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతూ, ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించు కుందామని అన్నారు. చిన్న చిన్న సమస్యలతోనే బెంబేలెత్తిపోవద్దన్నారు. ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకు వెళ్ళడంలేదని, అలా వెళ్ళకపోతే ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం ప్రశ్నించారు.
ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు కాదన్నారు. ఉద్యోగుల చెమట చుక్కల కృషే ఈ అభివృద్ధి అని ప్రశంసించారు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 2.70 లక్షలు ఉంటే, ఆంధ్రాలో రూ. 1.70 మాత్రమే ఉందని అన్నారు.
తెలంగాణలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయని, కులపిచ్చి, మతపిచ్చిలు లేవని, సకల సంపదల తో ధనిక రాష్ట్రంగా తులతూగుతోందన్నారు. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని కేసీఆర్ చెప్పారు. పరిశ్రమలు, ఐటీ సెంటర్లు అన్ని గ్రోత్ సెంటర్లు కావాలన్నారు. హైదరాబాద్ తో పాటు 32 గ్రోత్ కారిడార్లు రాబోతున్నాయని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, జోనల్ సిస్టమ్ తెచ్చుకున్నామని, అనేక రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్నదని అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారని దీని ఫలితమే బంగారు తెలంగాణ అని పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.
యాదాద్రి-భువనగిరి జిల్లాలో..
ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ని సరళీకరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడి ఉద్యోగుల సమావేశంలో ప్రసంగించారు. జోనల్ విధానం వల్ల స్థానికులకే 95శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా జోనల్ పరిధిలోకి తెచ్చామన్నారు. ఉద్యోగులు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఈ కృషిని ఇలాగే కొనసాగించాలని కోరారు. ఉద్యోగుల కృషితో ఎకో తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.
భువనగిరి జిల్లాగా మారిన తరువాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఘట్కేసర్, బీబీనగర్ లాగా ఈ పట్టణం కూడా త్వరలో హైదరాబాద్‌లో కలిసి పోతుందన్నారు. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలోని మారుమూల పల్లెల్లో కూడా ఎకరాకు రూ. 25లక్షలకు తక్కువ పలకడం లేదన్నారు. జిల్లాల ఏర్పాటు కూడా ఆషామాషీగా చేయలేదని, ఎందరో మేధావులతో చర్చించాకే చేశామని సీఎం తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
