గోదావరి వందనం!

12 రోజులు….
5 జిల్లాలలో 106 పుష్కరఘాట్లు…
కోట్లాదిమంది భక్తజన ప్రవాహం
చీమల బారుల్లా వాహనాలు…
దారులన్నీ గోదావరికే దారితీశాయి.
ఎటుచూసినా జనం..జనం..జన ప్రభంజనం.

గోదావరి-వందనం!aభక్తజన వాహిని ఉప్పొంగింది. గోదావరి మాతకు హారతులు పట్టి నీరాజనం పలికింది. గోదావరి నదీమతల్లి పులకించింది. భక్తులను ఆశీర్వదించింది. రాష్ట్ర మంతటా ఆధ్యాత్మిక శోభ ఇనుమడించింది. బాసర నుంచి భద్రాద్రి దాకా గోదావరి తీరమంతా ఇసుకవేస్తే రాలని జనం. పుష్కర ఘాట్లతోపాటు, వాటి సమీపంలోని ఆలయాన్నీ భక్తులతో పోటెత్తాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆశించిన విధంగానే గోదావరి మహా పుష్కరాలు రాష్ట్రంలో కుంభమేళాలను తపించాయి. తీపి గుర్తుగా మిగిలిపోయాయి.

ఆకుపచ్చని-పొద్దు-పొడువాలేaతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చిన తొలి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సకల సదుపాయాలు కల్పించింది. అందరిచేత భేష్‌ అనిపించుకుంది. జులై 14 నుంచి 25 వరకూ 12 రోజుల పాటు సాగిన గోదావరి మహా పుష్కరాలను న భూతో న భవిష్యతి అన్నతీరుగా విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వం తన సత్తా చాటుకుంది.

పుష్కరాలు ప్రారంభం రోజైన జులై 14న ఉదయం 6గంటల 26 నిముషాలకు గురువు సింహ రాశిలోకి ప్రవేశించిన శుభ ఘడియల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దంపతులు ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి సాన్నిధ్యంలో గోదావరి నదిలో పుష్కర స్నానమాచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు.

ఆకుపచ్చని-పొద్దు-పొడువాలేaaఅంతకుముందుగా, పూర్ణ కుంభంతో యతీంద్రులు వెంట రాగా, మేళతాళాల మధ్య, వేదమంత్రోఛ్ఛారణతో భక్తజనం శోభాయాత్రగా గోదావరి నదీతీరానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులు కూడా పాల్గొన్న ఈ శోభాయాత్రకు ధర్మపురి ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర గోదావరి తీరానికి చేరిన తరువాత యతీంద్రులు పుష్కరావాహన, బృహస్పతి పూజ, తదితర లాంఛనాలు పూర్తిచేశారు. ఉదయం 6 గంటల 21 నిముషాలకు యతీంద్రులు ముందుగా పుష్కరస్నానం ఆచరించారు. వీరిలో పుష్పగిరి పీఠాధిపతి విద్యా నరసింహ భారతి, మంత్రాలయం శ్రీరాఘవేంద్ర పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ మహాస్వామి, శ్రీశైలం వీరశైవ పీఠాధిపతి శివాచార్య, హంపి పీఠాధిపతి విద్యారణ్య విరూపాక్ష స్వామి, శ్రీమఠం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, తొగుట మదనానంద సరస్వతి పీఠం అధిపతి మాధవానంద సరస్వతి, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, శోభ దంపతులు పుష్కరస్నానం ఆచరించి నదీపూజ, దీపార్చన, గంగమ్మకు చాట వాయినం, సారె ప్రదానం కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరి మాతకు పూలహారం, పట్టు వస్త్రాలు సమర్పించారు. సువర్ణ దానంచేశారు.

ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, చీఫ్‌ విప్‌ ఈశ్వర్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్‌ కె.వి. రమణాచారి, తదితరులు పుష్కర స్నానం చేశారు. శంభో శంకర హరహర మహాదేవ నినాదాలు మార్మోగుతుండగా భక్తులంతా గోదావరిలో పుణ్యస్నానాలు ఆరంభించారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సూచికగా ధర్మపురిలో ఏర్పాటు చేసిన పుష్కర పైలాన్‌ ను ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేవాదాయశాఖ, సాస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోదావరి పుష్కరాలు భక్తిగీతాల సి.డిని కూడా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఒక రోజు ముందుగానే ధర్మపురికి చేరుకొని అక్కడి పీఠాధిపతులను, వేదపండితులను సత్కరించి, పుష్కరాలకు ఆహ్వానించారు.

భద్రాద్రిలో చిన జీయర్‌ స్వామి

గోదావరి-వందనం!abశ్రీ సీతారామచంద్రస్వామి వేంచేసియున్న ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రంలో చిన జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో పుష్కరాలను వైభవంగా ప్రారంభించారు. చిన జీయర్‌ స్వామి తొలుత శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోని శ్రీ శఠారికి, సుదర్శన మూర్తికి, శ్రీరామ పాదుకలకు ఆరాధన జరిపారు. పుష్కర ఆరంభ సూచికగా పవిత్ర నదీజలాలతో విశేష స్నపనం చేశారు. గోదావరి మాతకు పూజాద్రవ్యాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. గోదావరి మాత విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం, రాష్ట్ర మంత్రులు టి. హరీష్‌ రావు దంపతులు, తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పుష్కర స్నానం ఆచరించారు.

వరంగల్‌ జిల్లాలోని మల్లూరు పుష్కరఘాట్‌ వద్ద శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారి చక్రస్నానంతో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎం.పి సీతారాం నాయక్‌ దంపతులు పుణ్యస్నానం చేశారు. నిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని పుష్కరఘాట్‌ వద్ద రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు, పార్లమెంటు సభ్యురాలు కవిత దంపతులు, కలెక్టర్‌ రొనాల్డ్‌ రాస్‌ పూజాకార్యక్రమాలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంలో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌ పుష్కరాలను ప్రారంభించారు. చదువుల తల్లి సరస్వతీదేవి కొలువుదీరిన ఆదిలాబాద్‌ జిల్లా బాసర క్షేత్రంలో రాష్ట్ర మంత్రి జోగు రామన్న, ఎం.పి. నగేష్‌, కలెక్టర్‌ జగన్మోహన్‌ పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారి సన్నిధిలో తొలుత ప్రత్యేకపూజలు నిర్వహించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గోదావరి ఘాట్‌ వరకూ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పుష్కర స్నానాలు ఆచరించారు. ప్రారంభం రోజు నుంచి పుష్కరాలు ముగిసేదాకా గోదావరికి జనప్రవాహం సాగుతూనే వుంది. జులై 25న పుష్కరాల ముగింపు రోజు కూడా రాష్ట్రంలోని పుష్కరఘాట్లు మరింత కిటకిటలాడాయి. కోట్లాది మంది పూజలు అందుకొని భక్తులను దీవించిన చల్లనితల్లి గోదావరికి వందనం.!