93 కోట్ల చేప పిల్లలు .. 20 కోట్ల రొయ్య పిల్లలు
రాష్ట్ర జలాశయాలలో పెరుగుతున్న మత్స్య సంపద
రంగనాయక సాగర్, సిద్ధిపేట సమీపంలోని కోమటి చెరువులలో చేప పిల్లలు, రొయ్య పిల్లలను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, తన్నీరు హరీష్ రావులు విడుదల చేసి, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద తెలంగాణ విజయ డెయిరీ నూతన ఔట్ లెట్ ను మంత్రులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని, మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతున్నదని పేర్కొన్నారు. వచ్చే ఒకటి రెండు సంవత్సరాలలో ఫెడరేషన్ ద్వారా మత్స్య సహకార సంఘాల నుండి చేపలను కొనుగోలు చేసి మార్కెట్ చేయాలనే ఉద్దేశ్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అప్పటి వరకు మత్స్యకారులు మత్స్య సంపదను స్థానికంగా తక్కువ ధరకు అమ్మకుండా ఎక్కువ డిమాండ్ ఉన్న హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోని బహిరంగ విపణిలో విక్రయించి లాభాలు పొందాలన్నారు.
మత్స్య సంపదను మరింతగా పెంపొందించేందుకు పంపిణీ చేస్తున్న చేప పిల్లల నాణ్యత, సైజ్ విషయంలో రాజీపడకుండా, అవకతవకలకు అవకాశం లేకుండా చేప పిల్లల విడుదల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం జల వనరులలో 93 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడ్డ మత్స్య రంగాన్ని తెలంగాణ వచ్చాక సీఎం కేసీిఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస యాదవ్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల్లో 365 రోజులు నీళ్ళు ఉండడం, ఉచిత చేప పిల్లల విడుదల వల్ల మత్స్య సంపద పెరిగేలా చూస్తున్నారని అన్నారు. మార్కెటింగ్ చేసుకునేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను, ఆటోలను అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు సూచన మేరకు మొబైల్ ఔట్ లెట్లకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయ డైరీ నీ తెలంగాణ లో 750 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. బహిరంగ విఫణిలో ప్రైవేట్ సంస్థల తో పోటీ పడుతూ వాటన్నింటి కంటే ముందంజలో విజయ డైరీని నిలిపామన్నారు.

తెలంగాణలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సిద్ధిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు తీసుకొచ్చారని, రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని వెల్లడిరచారు.
సిద్ధిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. గుక్కెడు మంచి నీళ్లకోసం గోసపడ్డ ప్రాంతం ప్రస్తుతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నదని తెలిపారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతున్నదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యపు సిరులు, మత్స్య సంపద కళ్లముందు కనబడుతున్నదని చెప్పారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతున్న దన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. సాంప్రదాయ వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు.
షామీర్ పేట చెరువులో …..
ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజక వర్గంలోని శామీర్పేట్ చెరువులో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చొరవతో తెలంగాణలో ఊహించనంత మత్స్య సంపద వస్తుందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ఆశయం అన్నారు.
చెరువులు అన్నింటిని అన్ని విధాలుగా లాభదాయకంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో దాదాపు 414 చెరువులున్నాయని వాటిలో ఒక కోటి చేప పిల్లలు విడుదల చేసే యోచన లో ప్రభుత్వం ఉందని చెప్పారు. కూడా 96 లక్షల చేపలు చెరువులలో విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. చెరువులను పటిష్ట పర్చడం ద్వారా వాటి చుట్టూ ఆర్థిక కార్య కలాపాలను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు .