‘రాజర్షి’… రాజన్నశాస్త్రి

By: రమణ కొంటికర్ల 

ధర్మపురంటే రెండు విశిష్టతలే అనుకునేవారున్నారు. అవేంటంటే, ఒకటి దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి… రెండు ఉగ్రనృసింహుడు కొలువైన క్షేత్రమని. కానీ మూడో విశిష్టత కూడా ఉంది… 

అదే ఆ గోదావరి మాత ఆశీస్సులతో… ఆ లక్ష్మీనృసింహుడి కృపాకటాక్షాలతో అవతరించిన ‘బ్రహ్మశ్రీ రాజయోగి గుండి రాజన్న శాస్త్రి చరిత్ర’. అందుకే ఆ నృసింహుడి సన్నిధిలో… ఆ గోదారమ్మ చెంతన ఆయనకూ ఓ విగ్రహం వెలిసింది. 

‘రాజు జీవించె రాతి విగ్రహములందు.. సుకవి జీవించె ప్రజల నాలుకలయందు’ అంటారు గుఱ్ఱం జాషువా. కానీ రాజన్నశాస్త్రి కేవలం విగ్రహరూపంలోనే కాదు… ధర్మపురి చరిత్ర ఉన్నంతవరకూ ప్రజల నాలుకల్లోనూ నిల్చే కలియుగమెరిగిన మహాపురుషుడు. ఆయననెరిగిన వారికి ఆయనో నడిచిన దేవుడు.   దయార్ద్రహృదయత,  మందస్మిత వదనారవింద సుందర సాధుమూర్తిమత్వానికి సిసలైన చిరునామా రాజన్నశాస్త్రి.

రాజన్నశాస్త్రి ఓ సాధుపురుషుడని… వేదాన్ని ఔపోశన పట్టి… తన ఆస్తినంతా పండితులకు ధారబోసి, ప్రస్థానత్రయ భాష్యములను బోధిస్తూ… భాగవతాది పురాణములను ప్రవచించున్నారంటూ… ఏకంగా కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వంటి వారే సంగీత శాస్త్రాన్ని విశదీకరిస్తూ రాసిన  తన మ్రోయుతుమ్మెద పుస్తకంలో ఇలా వర్ణించారంటే, ఆయనెంత మహానుభావుడో ప్రత్యేకంగా చర్చించుకోవాలా…?

‘‘సమలోష్టాశ్మ కాంచనః’’  అన్నట్టుగా బంగారాన్నీ… మట్టినీ… రెండిరటినీ తన ఆత్మజ్ఞానమనే సమదృష్టితో చూడగల్గిన స్థితప్రజ్ఞుడు రాజన్నశాస్త్రి. అందుకే ఆయన రాజయోగి. నిరంతర భక్తి ప్రపత్తులతో ఉదయం, సాయంసంధ్యావేళల్లో గోదావరీ స్నానంగావించి… ఆ నృసింహుడిని స్మరించుకోందే ఆయన దిన చర్య ప్రారంభమయ్యేదీ కాదు… ముగిసేదీకాదు. 84 ఏళ్లపాటు జీవించిన ఆ భూలోకదేవుడు కంఠం సరిచేస్తే వేదమైనా… భాగ వతంలోని 18 వేల శ్లోకాలైనా కంఠతా, స్పష్టతా… ఆ గోదావరీ ప్రవాహమల్లే జాలువారే నయాగారాలే.

‘‘బ్రాహ్మణస్య చ దేహో యం నోపభోగాయ కల్పతే… ఇహ క్లేశాయ మహతే ప్రేత్యానన్తసుఖాయ చ…’’ అంటే ఈ బ్రాహ్మణదేహం సుఖాలననుభ వించేందుకు కాదు.. తపోనిత్యనైమిత్తక కర్మానుష్ఠాన రూపమైన కష్టమనుభవించి… మరణానంతరం అనేక సుఖాలననుభవించేందుకని వశిష్ఠస్మృతి ఏదైతే చెప్పిందో… ఆ మాదిరి జీవనశైలి రాజన్నది. అందుకే ఆయన స్వర్గస్తులు.

ఒక గంజాయి మొక్కపడితే… తులసీవనన్నాంత ఆ గంజాయి నాశనం చేస్తుందంటారే… కానీ రాజన్నశాస్త్రి వంటి తులసీమొక్కతో.. గంజాయి వంటి పంటలు కూడా తులసీవనాలైపోవాల్సిందేనన్నది ఆయన చరిత్ర చెప్పే సత్యమే తప్ప అతిశయోక్తి ఏమాత్రం కాదు. అందుకే ఆయన కీర్తి ఎలాంటి ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా లేని రోజుల్లోనే… అంతకంతకూ దశదిశలా విస్తరించింది. ఆయన ఆశీస్సులు… ఆయన కుటుం బానికే కాదు.. ఆ ఊరికి… చుట్టుపక్కల గ్రామాలకూ నిత్యం విరాజిల్లే భానుడి కిరణాల్లా విస్తరించి విచక్షణా పూరిత జ్ఞానోదయ వెలుగులు పంచాయి. 

మాజీ ప్రధాని పాములపర్తి నర్సింహారావు అంతటి స్థితప్రజ్ఞులే ఆయన పాదారవిందాలకు నమస్కరించి గురుతుల్యులుగా భావించేవారంటేనే… ఆ రాజయోగి ఔన్నత్యమేపాటిదో చెప్పుకోవడానికి ఆ మెతుకొక్కటి చాలదూ..? వేదాంత శిరోమణి ఆచార్య మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు వంటివాళ్లు కూడా ఆయన్ని శుకాంశ సంభూతుడని కొనియాడా రంటే… ఆ మహోజ్వల మనీషి జన్మసార్థ’కథ’ ఏపాటిదో అర్థం చేసుకోలేమా…?

కొందరు భక్తులు ఆ కాలంలోనే గుండిరాజన్న శాస్త్రికి ఆయన ప్రవచనాలకు ముగ్ధులై భూములు, ఇతర సంపదలిస్తామన్నా సున్నితంగా నిరాకరించిన నిరాడంబర మూర్తిమత్వం గుండిరాజన్నశాస్త్రి.’’ఆకించన్యం ధనం విదుషామ్‌’’ అని అన్నట్టుగా… ధనమూ, ఐహికసుఖాలు ఏమీ కోరుకోకపోవడమే ఓ విద్వాంసుడి లక్షణమట. అందుకు ప్రతిపదార్థం బ్రహ్మశ్రీ గుండిరాజన్న శాస్త్రి. 

ఎంతసేపు ఆ మహానుభావుడి ఔన్నత్యం గురించి చెప్పడమేగానీ… ఆయనేం చేశారంటారా…? ఆధ్యాత్మికతకు మారుపేరైన ఆయన దైవచింతన మార్గం ఎందరికో అనుసరణీయం. మరెందరికో మార్గదర్శనం. ఆయన భాగవత పురాణాలు చిరస్మరణీయం. ఆయన ప్రవచనాలతో ఏ ఒక్కరో… లేక ఆయన జన్మస్థలి అయిన ఆ ధర్మపురో… చుట్టుపక్కల గ్రామాల్లోని వారు మాత్రమే విద్యావంతులయ్యారనుకుంటే పొరబడ్డట్టే. ఆయన ప్రభావం అపారం. ప్రత్యక్షంగా ఆయన్నెరిగినవారికి  అనుభవైకవేద్యమైన ఆ సత్సాంగత్య కలయిక తమ జీవితాలనే ధన్యం చేసిన జీవితకాలపు ఓ తీపి జ్ఞాపక మైతే… ఆయన గురించి విని పరోక్షంగా తెలుసుకుని ఆయన్ను చదివినవారిని కూడా అదే స్థాయిలో ప్రభావితం చేసిన నడిచేదేవుడి మధురచరిత్ర రాజన్న శాస్త్రిది. అందుకే ఆయన శిష్యపరంపరైన పాలెపు వెంకటరాజశాస్త్రి, బాలకృష్ణశాస్త్రి, మాణిక్యశర్మ, చంద్రశేఖరశాస్త్రి, రంగాచార్యులు, ముకుందశాస్త్రి, సదాశివశాస్త్రి, అచ్యుతశర్మ, రఘురామశాస్త్రి ఇలా ఎందరో ఆయన భాగవత సప్తాహ, పురాణాలను కొనసాగించి.. ధర్మపురిని ఆధ్యాత్మిక అగ్రహారపు చిరునామాగా నిలిపినవారే. రాజన్నశాస్త్రి చొరవతో ప్రారంభమైన ప్రాచ్య కళాశాల మూలంగా ఇవాళ ఎందరో తెలుగు, సంస్కృత పండితులుగా విరాజిల్లుతూ… వారి జీవితాలను సుసంపన్నం చేసుకుంటున్నారు. క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక విద్వత్తులో ఆయనో హిమశిఖరం.

లౌకిక, సంసార జీవన ప్రస్థానంలోని ఆటుపోట్లనెదుర్కోగల్గేలా… ఆధ్యాత్మిక చింతన, జ్ఞానసముపార్జన, ఆర్జించిన జ్ఞానాన్ని పంచడంలో ఉండే విద్యాదాన తృప్తి వంటి పలు అంశాల సమాహారంతో అలౌకికమైన ఆనందాన్ని ఎలా పొందవచ్చో ఆయన ప్రవచనాలు నిరూపించాయి. అందుకే ఆబాలగోపాలం నాటి రాజన్నశాస్త్రి ప్రవచనాలంటే చెవికోసుకునేవారట. బ్రాహ్మణాగ్రహారాలలో ఆచారపరంగా, సంప్రదాయపరంగా వస్తున్న వైధవ్యపు బాధల్ని భరించలేని స్థితిలో అలాంటి మహిళలకు తన పురాణ భాగవత ప్రవచనాలతో ఓ దిక్సూచయ్యారు రాజన్నశాస్త్రి. సంతానశోకతప్తులైనవారిని, శ్రామికులను, కర్షకులను, విద్యావంతులను అందరినీ సమంగా ప్రభావితం చేసిన ప్రభావశీలి ఆ రాజయోగి.

కేవలం పురాణ ప్రవచనాలేనా…? భాష్యప్రవచనమూ చేసి  ఎందరో తన తరం వారికి స్ఫూర్తిగా నిల్చి.. వేదాంతజ్ఞానాన్నందించిన అపర వేదవ్యాసుడు గంగొడ్డున జన్మించిన ఆ గుండిరాజన్న. ఆయన స్ఫూర్తి మనం మొదట చెప్పుకున్నట్టుగా దిగంతాలకు పాకింది. వేద,శాస్త్ర విజ్ఞాన దాహార్తులెందరికో ఆయనో చలివేంద్రం. అందుకే ఆయన్ను చూసేందుకు నాడే విదేశాల నుంచీ భక్తులు వచ్చేవారట. శాస్త్రి మహిమ విన్న ఓ జర్మన్‌ మహిళ… ఆయన భాష్యాలను ఆంగ్లంలోకి తర్జుమా చేయించుకుని విని ముగ్ధురాలవ్వటంతో పాటే… మన భాషాసంస్కృతైన సంస్కృతాన్ని తాను నేర్చుకున్నారంటే… ఆయనెంత గొప్ప స్ఫూర్తిప్రదాతో అర్థం చేసుకోవచ్చు. ధర్మపురిలో మూడు ముఖ్యమైన స్పాట్స్‌. ఒకటి గంగ (గోదావరి), రెండు లక్ష్మీనృసింహ సన్నిధానం, మూడు గుడిలాంటి ఆధ్యాత్మిక పరిమళాలు పంచిన గుండిరాజన్న శాస్త్రి ఇల్లు. ఊరికెవరు వచ్చినా… గోదావరికి వెళ్లేకంటే ముందే… సాక్షాత్తూ ఆ భూషణ వికాసుడైన ధర్మపురి నివాసుణ్ణి దర్శించుకునేకంటే మొదలే… ముఖ్యమంత్రులైనా, సాహితీవేత్తలైనా, సంఘసంస్కర్తలైనా, కవులైనా, సామాన్యులైనా రాజన్న శాస్త్రి గారింట్లోకి వెళ్లి ఓసారి దండం పెట్టుకుని… తమ పుణ్యస్నాన, దర్శనాలనంతరం వచ్చి ఆయన ప్రవచాలను మళ్లీ విని తరించేవారట ఆ రోజుల్లో. కంచి కామకోటి పీఠాధిపతులు,  శ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెద్దజీయర్‌ వంటి గురువులచే సత్కారం పొందిన బ్రహ్మజ్ఞాని రాజన్నశాస్త్రి.

ఓ ఫోటో తీసినా వద్దనే అపేక్షలేని జీవిత మాయనది. శేషప్ప చెప్పినట్టు ఆయనకు తెలుసు… పచ్చి చర్మపు తిత్తి పసలేని దేహంబు లోపలనంత రోయ రోత… నరములు, శల్యముల్‌, రక్తమాంసంబులు కండలున్‌ మైలతిత్తని. అందుకే ఆయనేనాడు ఐహికవాంఛలకు దూరంగానే ఉన్నారు. ఇంటి పేరు గుండి అయితే… ఆయన ఊరికి గుండెకాయ. స్వర్గీయులు గుండి లక్ష్మీనర్సింహ ఘనాపాఠి, లక్ష్మీనర్సమ్మలకు దివ్యమంగళ దత్తరూపంగా జన్మించిన సుందర విగ్రహం గుండి రాజన్నశాస్త్రి.  పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా… బాల్యం నుంచే ఓ ధృవుడు, ప్రహ్లాదుడి వలె పరమాత్మ చింతనాపరులు రాజన్న. ఉర్దూభాషలో విద్యనభ్యసించి… ఆ తర్వాత రాజపత్రాలకు అర్థాలు చెప్పుతూ.. నాటి రాజకీయోద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారంటారూ ఆయన్నెరిగిన తెలుగు, సంస్కృత కవి, పండిరతులు, సమీప బంధువైన కొరిడె రామారావు. వొజ్జల హన్మంతయ్య సిద్ధాంతి వద్ద లీలావతీ గణితం వంటి లౌకిక విద్యలతో పాటే… అష్టవర్ష ప్రాయంలోనే ఉపనయన సంస్కారమాచరించి గాయత్రీ మంత్రోపాసనతో తండ్రి లక్ష్మీనృసింహ ఘనాపాఠి వద్ద వేదాధ్యయనం చేసిన విద్యావిశారదులు గుండి రాజన్న శాస్త్రి. 

‘పండితపుత్ర పరమశుంఠ’ అన్నది ఓ నానుడి. కానీ రాజన్నశాస్త్రి కుటుంబం అందుకు పూర్తి భిన్నం. నాటి రాజన్నశాస్త్రి ఆశీస్సులతో నేటి నాల్గు తరాల వరకూ ఆ వర్చస్సు కొనసాగుతూనే ఉంది.  ఇవాళ ఆ కుటుంబీకులందరి తేజోమ యమైన జీవనప్రస్థానానికి  ప్రధాన హేతువు ఆయన వారసులు కావడమే.  ఆయన  వంశీయులు ఎక్కువమంది ఈరోజు మంచి స్థానాల్లో ఉండగా… ఆయన తమకు పెట్టిన  ఆ విద్యాభిక్షకు కృతజ్ఞతగా ఉడుతసాయం రీతిలో ఆయన మనవడు గుండిప్రసాద్‌, వారిజా రాణి దంపతులు ఆయన గురించి ఓ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, రిటైర్డ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఏబీకే ప్రసాద్‌ వంటి రిటైర్డ్‌ ఐఏఎస్‌, భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్‌ కొలనుపాక రాజేశ్వర్‌ రావు, ఐఏఎస్‌… పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ గా పనిచేసిన ఎల్లూరి శివారెడ్డి, తెలుగుశాఖ పూర్వాధ్యక్షులుగా పనిచేసిన ముదిగొండ వీరభద్రయ్య వంటివారి అభిప్రాయాలతో… పూర్వ ఆచార్యులు కొరిడె రామారావుతో పాటు… ఎందరో ఆచార్యులు, ముఖ్యుల సౌజన్యంతో ‘రాజయోగి శ్రీ గుండి రాజన్నశాస్త్రి’ పేరుతో ఓ పుస్తకాన్ని ఎమెస్కో ద్వారా ప్రచురించి వెలువరిం చడంతో పాటు… www.gundirajannashastry.com పేరుతో ఓ వెబ్సైట్‌ ను కూడా తీసుకురావడం ముదావహం. ఆ వెబ్సైట్‌ ను సందర్శిస్తే  మరింత నిక్షిప్తమై ఉన్న ఆయన సమాచారాన్నీ పొందవచ్చు.

చివరగా ఆ మహర్షి.. రాజర్షి… మహాయోగైన గుండిరాజన్న శాస్త్రి గురించి చెప్పేంత స్థాయి లేకపోయినప్పటికీ… ఆయన్ను గురించి విన్నప్పుడు… ఆయన యాదికొచ్చినప్పుడు పుట్టే తన్మయత్వంతో… ‘‘రాజయోగి శ్రీ గుండి రాజన్నశాస్త్రి’’ అనే పుస్తకంలోని పలువురి ముందుమాటల సారాంశంగా సంకలనం చేయడం మినహా… అంతస్థాయి పాండిత్యమూ, ఔన్నత్యానికి అర్హతలేనివాడని వినమ్రపూర్వకంగా విన్నవిస్తూ… ఈ సంకలనం చేయడానికి చేసిన ఓ పేద్ద సాహసమే అపరవ్యాసుడైన రాజన్న వ్యాసం. ఈ క్రెడిట్‌ అంతా పుస్తకంలో  ముందుమాటలను పొందుపర్చిన విద్వత్సంపన్నులు, ఆ పుస్తక ప్రచురణ కర్తలు… అందుకు తమవంతుగా ఇతోధికంగా కలిసి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మాత్రమే. 

చివరాఖరుగా ఇంకో మాట. రాజర్షి, బ్రహ్మర్షిగా ఈ కాలం చూసిన ఆ నడిచే దేవుడి చరిత్రను.. సంద్రంలో బిందువంత మాత్రమే మనం చర్వితచరణంగా చర్చించుకున్నామే తప్ప… అది రాస్తే రామయణమంత… చెప్పుకుంటూ పోతే ఆ మహానుభావుడు రాజన్నశాస్త్రి భాగవత పురాణాలంత.  కాబట్టి… ఎందరో మహాను భావులు… అందరికీ వందనాలు… ధర్మపురి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన వ్యాసమహర్షి సర్వసమానులైన బ్రహ్మశ్రీ గుండిరాజన్నశాస్త్రికి ప్రత్యేక వందనాలతో ఇక్కడితో సశేషంగా స్వస్తి పలుకుతూ…