|

ఆరోగ్య తెలంగాణ దిశగా పరుగులు

రానున్న రోజుల్లో తెలంగాణ ఆరోగ్య తెలంగాణగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు: రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఔషధరంగంలో 35 నుండి 40 శాతం ఔషధాలు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని, ప్రపంచానికి ఫార్మా రంగంలో తెలంగాణ సహకరిస్తున్నదని అన్నారు. ఫార్మా రంగంలో హైదరాబాద్‌ దేశంలో అగ్రభాగాన ఉందని చెప్పారు.

కేసీఆర్‌ కిట్‌ అమలు చేసిన తర్వాత రాష్ట్రంలో మాతృ మరణాల, శిశు మరణాలు తగ్గాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 40 నుండి 50 శాతం వరకు ప్రసవాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తోందని, ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షలు ‘కంటి వెలుగు’ పేరుతో నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సామాన్యుడికి వైద్యం ఖర్చు తడిసి మోపెడు అవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకాన్ని కల్పించటం జరిగిందని, అయితే ఇంకా విశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్య రంగంలో పనిచేసే పెద్దలు, అధికారులపై ఉందని ఆయన అన్నారు. కోవిడ్‌ కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమైందని, ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు కోవిడ్‌ అని, రాష్ట్ర ఆరోగ్య మంత్రితో సహా కింది స్థాయి వరకు అందరూ ప్రాణాలకు తెగించి గొప్ప సేవ చేస్తున్నారని, విపత్తు వచ్చినప్పుడు అందరూ సమష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కోవిడ్‌ వచ్చిన వారు కూడా 98 శాతం బాగయ్యి ఇళ్లకు వెళ్తున్నారని, కేవలం 2 శాతం మంది మాత్రమే వివిధ కారణాల వల్ల చనిపోతున్నారని, దాన్ని మాత్రమే భూతద్దంలో చూడరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ వల్ల అగ్రరాజ్యం సైతం అతలాకుతలం అవుతున్నదని ఆయన తెలిపారు. భౌతిక దూరం పాటించడం వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటూ ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని మంత్రి సూచించారు.


ఎకో పార్క్‌ ప్రారంభం
ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ అంటే చిన్నచూపు ఉండేదని, కానీ ప్రస్తుతం మహబూబ్‌ నగర్‌ జిల్లా రూపురేకలు మారిపోయాయి అని కే.టీ.ఆర్‌. అన్నారు. భారతదేశంలోనే అతి పెద్దదైన 2087 ఎకరాల కలిగిన ఎకో పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ పార్కును మంత్రి ప్రారంభించడం విశేషం. కేసీఆర్‌ పార్క్‌గా నామకరణం చేసిన ఈ పార్కుకు హైదరాబాద్‌ నుండి కూడా టూరిస్టులు వచ్చేలా ఏర్పాటు చేయాలని అన్నారు. ఒకప్పుడు పాలమూరు బాగా వెనుకబడి పోయిందని, కానీ ప్రస్తుతం ఉన్న పాలమూరును చూస్తే చాలా సంతోషం వేస్తున్నదని రానున్న రోజుల్లో తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లా మిగిలిన జిల్లాల కంటే అగ్రగామిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన తెలిపారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలోనే మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాలను పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. మహబూబ్‌నగర్‌కు వలస జిల్లాగా దేశవ్యాప్తంగా పేరు ఉండేదని, కానీ ప్రస్తుతం ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తి కావటం, వైద్య రంగంలో కూడా ముందుండడం అభినందించదగ్గ విషయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తయారైందని, ఇటీవల వేసవిలో కోటి ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌.సి.ఐ సేకరించగా 65 లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఒక్క తెలంగాణ నుండి వెళ్ళిన విషయాన్ని గుర్తుచేశారు. వైద్య రంగంలో కూడా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమాణికంగా ఉందని ఆయన చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఒక్క మెడికల్‌ కళాశాల కూడా రాలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు మెడికల్‌ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు.

దేశంలో కేరళ, తమిళనాడు తర్వాత మూడవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రంగంలో ఉన్నదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌తో అన్ని దేశాలు విలవిలాడుతున్నాయని, అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నెలలుగా అన్నిరకాలుగా ఎదుర్కొంటున్నామని, రాబోయే కాలంలో కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. మహబూబ్‌ నగర్‌ మెడికల్‌ కళాశాలలో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు ధీటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కోవిడ్‌కు వంద పడకల ఆసుపత్రితో పాటు త్వరలోనే టెస్టింగ్‌ సౌకర్యం కూడా కల్పిస్తామని అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ గతంలో వైద్యం కోసం ప్రతి చిన్న విషయానికి హైదరాబాదు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదని, మహబూబ్‌ నగర్‌ లోనే అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ సభ్యులు మన్నే శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ శ్రీనివాస్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ, వైస్‌ ప్రిన్సిపల్‌ సునంద మున్సిపల్‌ ఛైర్మన్‌ నర్సింలు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.