| |

బంగారు బాటలో ఆరోగ్య తెలంగాణ!

ts19


తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు సయితం కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణ ను సాధించే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దిశానిర్దేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విశేష కృషి చేస్తోంది. భవిష్యత్తు బంగారు తెలంగాణ దార్శనికులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గ నిర్దేశనంలో నిరంతరం కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతూ, వాటి అమలు, సమీక్షలతో ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకం పెంచడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌. సి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారు.

ప్రభుత్వ దవాఖానాలలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు 24 గంటలు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నిరంగాలతోపాటు వైద్యరంగం కూడా నిర్లక్ష్యానికి, వివక్షకు గురైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణ అనంతరం, ఈ మూడేళ్ళల్లో గత నిర్లక్ష్యాల బూజు దులిపి, బంగారు తెలంగాణ బాటలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ కృషిచేస్తోంది.

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ వరకు అన్ని వైద్యశాలలకు వసతుల కల్పన మీద పభుత్వం ముందుగా దృష్టి సారించింది. ఆస్పత్రులకు కొత్త ఫర్నీచర్‌, వీల్‌ చైర్లు, స్ట్రెచర్లు, స్టూల్స్‌, సెలైన్‌ స్టాండ్స్‌ వంటివి కల్పించడం, అన్ని వైద్యశాలలకు సున్నాలు, రంగులు వేయడం జరిగింది.

తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 17,000 బెడ్స్‌ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 20,000 లకు బెడ్స్‌ని పెంచడం జరిగింది. నిమ్స్‌ లో 500, నిలోఫర్‌ లో 500, ఎం.ఎన్‌.జె. క్యాన్సర్‌ హాస్పిటల్లో 250, మిగతావి అన్ని జిల్లా హాస్పిటల్స్‌ లో పెంచడం వల్ల రోగులకు సదుపాయాలు పెరిగాయి.

మరోవైపు రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలు అమర్చడం మరో ఎత్తు. రోగ నిర్ధారణ పరీక్షలు అన్నీ ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోగ నిర్ధారణ పరీక్షలు ఒకే హాస్పిటల్లో వేర్వేరు చోట్ల జరుగుతున్నాయి. కొత్తగా 40 హాస్పిటల్స్‌ లో అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు ఒకే చోట జరిగే విధంగా తీర్చిదిద్దుతున్నారు. లేబర్‌ రూమ్స్‌ని ఎల్‌డిఆర్‌ కాన్సెప్ట్‌తో అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు.

వైద్యశాలల రూపురేఖలు మార్చేందుకు, పడకలు పరిశుభ్రంగా వుండేందుకు వీలుగా తెలుపు, గులాబీ రంగుల బెడ్‌ షీట్లని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా కేంద్రానికి సూపర్‌ స్పెషాలిటీ హంగులతో ఓ జిల్లా హాస్పిటల్ని ఏర్పాటు చేస్తున్నారు.

పంజాగుట్ట, బీబీ నగర్‌ నిమ్స్‌

కాగితాలకే పరిమితమై మూలన పడ్డ బీబీ నగర్‌ నిమ్స్‌ కొత్త జవ సత్వాలు కల్పించడం ఒక ప్రత్యేకత. అనేక సమస్యలతో నిర్మాణ దశలోనే నిలిచిపోయిన బీబీ నగర్‌ నిమ్స్‌ నిర్మాణం పూర్తి కావస్తున్నది. నిమ్స్‌ బీబీ నగర్‌ ఓపి గత ఏడాది జూన్‌ లో ప్రారంభమైంది. ఇప్పటికే 20 వేల మందికి ఓపి సేవలు అందించగా, 40 వేల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిగాయి.

ఇక పంజాగుట్ట నిమ్స్‌ లో స్పెషాలిటీ ట్రామా బ్లాక్‌ మొదలైంది. లక్షలాది మందికి ట్రామా కేర్‌ ని నిరంతరాయంగా అందిస్తున్నది. నిలోఫర్‌ లో కొత్త బ్లాక్‌ ప్రారంభమైంది. ఇందులో ఆపరేషన్లు కూడా అవుతున్నాయి. ఆదిలాబాద్‌, వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ టవర్స్‌ నిర్మాణంలో ఉన్నాయి.

70 ఏళ్ళ పైబడిన స్వాతంత్య్ర చరిత్ర, 60 ఏళ్ళు పైబడిన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ దవాఖానాల్లో ఐ.సి.యూ.ల ఊసే లేదు. తెలంగాణ వచ్చాక, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, సిద్ధిపేటలో ఐసియూలు పని చేస్తున్నాయి.

పుట్టిన పిల్లల రక్షణ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం 21 ఎస్‌.ఎన్‌.సి.యు.లు ఉన్నాయి. మరో 7 ఈ ఏడాదిలోపే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే పుట్టిన శిశువులలో 15 శాతం మందికి ఎస్‌.ఎన్‌.సి.యుల అవసరం ఉంటుంది. తెలంగాణలో ఏడాదికి 6 లక్షల 50 వేల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో లక్ష మంది పిల్లలకు ఈ సేవలు అవసరం అవుతాయి.

ట్రామా కేర్‌

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణ నష్టాలను తగ్గించడానికి ట్రామా కేంద్రాలను అభివృద్ధి పరుస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో డయాగ్నసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, ఆల్ట్రా సౌండ్‌, సిటీ స్కాన్‌, సి ఆర్మ్‌ తదితర వ్యాధి నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తేవడం జరుగుతోంది. ఆపరేషన్‌ థియేటర్లను కూడా ఆధునీకరించి, అవసరమైన పరికరాలను సమకూరుస్తున్నారు.

కొత్తగా 40 డయాలిసిస్‌ కేంద్రాలు

నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ, కింగ్‌కోఠి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ హాస్పిటళ్ళలో 7 డయాలసిస్‌ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 10 వేల మంది రోగులకు డయాలసిస్‌ జరుగుతున్నది. ఈ కేంద్రాలను మరింత విస్తరించి, ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. డయాలసిస్‌ పేషంట్లకు బస్‌ పాస్‌లని కూడా ఉచితంగా అందించనున్నది.

కిడ్నీ మార్పిడిలు కూడా ప్రభుత్వ హాస్పిటళ్ళలో ఉచితంగా నిర్వహిస్తున్నది. కిడ్నీ డోనర్‌ లేని వాళ్ళకి జీవన్‌ ధాన్‌ స్కీం ద్వారా క్యాడవర్‌ కిడ్నీ మార్పిడులను చేపట్టడం జరిగింది. కిడ్నీ మార్పిడులు చేసుకున్న వాళ్ళకి ఫ్రీ లైఫ్‌ సేవింగ్‌ మెడిసిన్స్‌ కూడా ఇస్తున్నారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్ళలో ఈ ప్రక్రియ మొదలైంది.

రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి, ప్రాణరక్షణకు అవసరమైన (19 పాతవి, 13 కొత్తగా) 31 బ్లడ్‌ బ్యాంకులు, లేదా బ్లడ్‌ స్టోరేజీ యూనిట్లను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

ఉచిత డయాగ్నసిస్‌ సేవలు

ప్రభుత్వ హాస్పిటళ్ళకు వచ్చే రోగులకి అధునాతన పరికరాలతో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే రోజు రిపోర్టులు ఇవ్వడమేగాక, మందులు కూడా అందించే పథకానికి రూపకల్పన చేశారు .

ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు ఉచితంగా సరఫరాచేసే మందుల కొనుగోలుకు గతంలో కేవలం రూ.114 కోట్లు ఖర్చుచేసేవారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.300 కోట్లకు అంటే దాదాపు మూడింతలు పెంచి ఎన్నడూ లేని విధంగా నెలకు సరిపడా ఒకేసారి ఉచితంగా మందులు అందించడం జరుగుతోంది. కిడ్నీ, గుండె వంటి అవయవ మార్పిడులు జరిగాక అవసరమైన మందులు అత్యంత ఖరీదైనవే కాకుండా దీర్ఘకాలికంగా వాడాల్సినవి. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక నిధిని కూడా కేటాయించి ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్ళలో మందుల పంపిణీ చేస్తున్నది ప్రభుత్వం. మిగతా ప్రభుత్వ హాస్పిటళ్ళకీ ఈ స్కీంని విస్తరించే ఆలోచనలో ఉంది.

ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ

ఆరోగ్యశ్రీ చికిత్సలను ప్రభుత్వ హాస్పిటళ్ళలో పెంచడం జరిగింది. గతంలో ప్రభుత్వ హాస్పిటళ్ళలో 30 శాతం మాత్రమే చికిత్సలు జరిగేవి. ఇప్పుడు ఆస్పత్రులలో వసతులు పెంచడం వల్ల 40 శాతం వరకు చికిత్సలను ప్రభుత్వ హాస్పిటళ్ళలో చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ లో మరిన్ని చికిత్సలను చేర్చి, పట్టిష్ట పరచడం జరిగింది.

గత మూడేళ్ళుగా ఆరోగ్య శ్రీ లో జరిగిన చికిత్సలు, ఖర్చు చేసిన నిధులు ఈ విధంగా ఉన్నాయి.

2014-15లో 1,65,258 చికిత్సలు- రూ.622 కోట్లు

2015-16లో 1,84,130 చికిత్సలు- రూ.684 కోట్లు

2015-16లో 1,77,428 చికిత్సలు- రూ.652 కోట్లు

జర్నలిస్టులకు. ఉద్యోగలకు వెల్‌నెస్‌ సెంటర్లు

దశాబ్దాల తరబడి ఉద్యోగులు, జర్నలిస్టులు ఎదురుచూసినా, ఉమ్మడి రాష్ట్రం లో సాధ్యం కాని ఉద్యోగుల, జర్నలిస్టుల హెల్త్‌ స్కీం ని గత ఏడాది డిసెంబర్‌ 18వ తేదీన ప్రభుత్వం ప్రారంభించింది. అవుట్‌ పేషంట్‌ సేవలకు ప్రత్యేకంగా వెల్‌ నెస్‌ సెంటర్ని ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 20,406 మందికి ఓపి, 4,406 మందికి ఐపీ రెఫరల్‌ సేవలు అందించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకి అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచితంగా వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా అందిస్తున్నారు. ప్రస్తుతం రెండు చోట్ల ఉన్న వెల్‌ నెస్‌ సెంటర్లను అన్ని పాత జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నారు.

108 వాహనాల సేవలు పెంపు

108 వాహనాలు అందిస్తున్న సేవలను విస్తృత పరుస్తూ, వాటి సంఖ్యను 200 లకు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే 145 కొత్త వాహనాలను సమకూర్చారు . రోజుకు 4.18 వేల ట్రిప్పులు వాహనాలు తిరుగుతున్నాయి. ఈ వాహనాల ద్వారా అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. అలాగే, ఆస్పత్రులలో మరణించినవారిని వారివారి సొంత ప్రదేశాలకు తీసుకొని వెళ్ళడానికి నిరుపేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న విషయం గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం , మానవతా ధృక్పథంతో వీటికోసం 49 వాహనాలను ప్రారంభించింది. వీటి సంఖ్యని కూడా పెంచాలని భావిస్తున్నారు.

విజయవంతంగా అవయవ మార్పిడులు

ఇంతకాలం ప్రయివేటు కార్పొరేట్‌ ఆస్పత్రులకే పరిమితమైన అవయవ మార్పిడులు ఇప్పుడు ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ లాంటి ప్రభుత్వ హాస్పిటళ్ళలోనే జరుగుతున్నాయి. కిడ్నీ, గుండె, పాంక్రియాసిస్‌, కాలేయ మార్పిడులు జరుగుతున్నాయి. ఇప్పటికే నిమ్స్‌లో 110 అవయ మార్పిడులను విజయవంతంగా నిర్వహించారు. ఉస్మానియాలో తొలిసారిగా కిడ్నీ, పాంక్రియాసిస్‌ సర్జరీని నిర్వహించి చరిత్ర సృష్టించారు ఆ హాస్పిటల్‌ వైద్య బృందం. తెలంగాణ వచ్చాకే అరుదైన ఆపరేషన్లు ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో జరుగుతున్నాయి. వరల్డ్‌ రికార్డుని సృష్టిస్తూ ఉస్మానియా వైద్యులు 20 సెంటి మీటర్ల క్యాన్సర్‌ కణతిని తొలగించారు. జపాన్‌ వైద్యులు ఇప్పటి వరకు 14 సెంటి మీటర్ల కణతిని తొలగించారు. అరుదైన ప్లాస్టిక్‌ సర్జరీలు, ఇతర శస్త్ర చికిత్సలు ప్రభుత్వ హాస్పిటళ్ళలో జరుగుతున్నాయి. ఇవన్నీ మన ప్రభుత్వ గౌరవాన్ని పెంచేవి. ప్రభుత్వ దవాఖానాల్లో 20శాతం ఓపీ పెరిగింది. 10శాతం ఐపీ పెరిగింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర సర్కార్‌ వైద్యశాఖ అవార్డుని కూడా స్వీకరించింది. ఆరోగ్యశ్రీ చికిత్సలు కూడా 10శాతం పెరిగాయి.

వైద్య విద్యకు పెరిగిన అవకాశాలు

తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలు ఏర్పడ్డాయి. మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో 150 సీట్లు వచ్చాయి. మొత్తం 700 ఎం.బి.బి.ఎస్‌ సీట్లు పెరిగాయి. తాజాగా సిద్ధిపేటలో మరో మెడికల్‌ కాలేజీ ఏర్పాట్లు చురుకుగా జరగుతున్నాయి. మరోవైపు ఎంబిబిఎస్‌, పీజీ సీట్ల భర్తీని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ ద్వారా నిర్వహిస్తున్నారు

శిశుమరణాలు తగ్గాయి

శిశు మరణాల రేటు తగ్గించడంలో కూడా ప్రభుత్వం విజయవంతమవుతోంది. ఈ మరణాలు ప్రతి వెయ్యి మందికి 32 శాతంగా వుండగా, అది 28 శాతానికి తగ్గింది. అలాగే -తల్లుల మరణాల రేటు ప్రతి లక్ష మందికి 92 నుంచి 71 కి తగ్గించగలిగాం. ప్రభుత్వ హాస్పిటళ్ళలో ప్రసవాలు 50 శాతం పెరిగాయి.

కేసీఆర్‌ కిట్‌-అమ్మ ఒడి

సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వ మానవీయ కోణానికి ఈ కార్యక్రమం మరో నిదర్శనం. అమ్మ ఒడిలో భాగంగా గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం అందచేస్తారు. అమ్మాయి పుడితే మరో వెయ్యి రూపాయలను అదనంగా ఇస్తారు. ప్రసవం తరువాత అమ్మ ఒడి కింద 102 అనే నెంబర్‌ వాహనాల ద్వారా తల్లీబిడ్డలను వారి ఇళ్లకు సురక్షితంగా చేరుస్తున్నారు. ప్రస్తుతం 41 వాహనాలతో నెలకు నికరంగా 1000 మంది గర్బిణీలకు సేవలు అందుతున్నాయి.

ప్రసూతి అయిన తల్లీ బిడ్డలకు 15 రకాల వస్తువులతో కేసీఆర్‌ కిట్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం జూన్‌ నెలనుంచే ప్రారంభమవుతోంది.ఈ కిట్స్‌ లో బిడ్డకు బేబీ సోప్స్‌, బేబీ ఆయిల్‌, బేబీ పౌడర్‌, రెండు బేబీ డ్రెస్సులు, టవల్స్‌ , దోమతెర, తల్లికి రెండు చీరలు ఇతరత్రా వస్తువులతో కలిపి ప్రభుత్వం కానుకగా ఇస్తున్నది. ఇందుకు అవసరమైన బడ్జెట్‌ని కూడా ప్రభుత్వం కేటాయించింది.

ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యల వల్ల సర్కార్‌ దవాఖానాల్లో ప్రసవాలు 50 శాతానికి పెరిగాయి. తాజాగా కేసీఆర్‌ కిట్స్‌, గర్భిణులకు ఆర్థిక సహాయం వంటి చర్యల వల్ల ప్రభుత్వ ఆస్పత్రులలో ఈ ప్రసవాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. మిషన్‌ ఇంద్ర ధనుష్‌ కార్యక్రమం కింద టీకాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం ప్రకటించింది. ఏఎన్‌ఎంలకు ద్విచక్ర వాహనాలు సమకూర్చి ఇంటింటికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యే ప్రారంభించడం జరిగింది. దీంతో మలేరియా లాంటి విష జ్వరాలు పెద్ద సంఖ్యలో తగ్గాయి.

కొత్త సానిటేషన్‌ విధానాన్ని అమలులోకి తేనుంది తెలంగాణ వైద్యశాఖ. కంపు కొట్టే వైద్యశాలలను ఇక కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే ఈ ప్రణాళిక. అలాగే. పేషంట్ల సేవలను మరింత విస్తృత చేసే ఆలోచన జరుగుతున్నది. దవాఖానాకు వచ్చే రోగులకు రిసెప్షన్‌ దగ్గరే వారికి అవసరమైన సేవల వైపు తీసుకెళ్ళడానికి అవసరమైన సిబ్బందిని నియమించనుంది. రోగులకు దిశానిర్దేశం చేయడమే కాక, వారికి సేవలు అందించడానికి నిరంతరం వ్యక్తులను అందుబాటులో ఉంచాలన్నది ఈ కొత్త పాలసీ ఆలోచన.

ఇలా గడిచిన మూడేళ్ళల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య రంగంలో సమూల, సమయోచిత, సముచిత మార్పులను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం.

మార్గం లక్ష్మినారాయణ