|

అమ్మ లాలన,తండ్రి పాలన మన గురుకులాలు

tsmagazineశేవపంతుల వేంకటేశ్వరశర్మ
బంగారు తెలంగాణకు బలమైన పునాదులు పడుతున్నాయి. ఆరు దశాబ్దాల విధ్వంసాన్ని సమూలంగా మార్చేసి నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటిలో భాగంగానే కేజీ టూ పీజీ విద్యను అందిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ప్రకారం గురుకులాలను ప్రారంభిస్తూ నాణ్యమైన విద్యకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినరోజు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. పిల్లలు మన భవిష్యత్‌, భావి తరాలు బాగుంటేనే సమాజం బాగున్నట్లు లెక్క అన్నారు. ఈ వాక్యాలు రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానానికి అద్దం పడుతున్నాయి. సరిగ్గా మూడేండ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి  కేంద్రంతోసహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కమిటీ నుంచి ఇటీవల శ్యామ్ ప్రిటోడా కమిటీ వరకు వేసిన విద్యాకమిషన్‌లు ఇచ్చిన సూచనలను దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన పాలకులు విస్మరించారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ వ్యవస్థలను ప్రోత్సహించారు. విద్య సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిల్చారు.

విద్యను చదువుకునే పరిస్థితి నుంచి చదువు కొనే స్థితికి తీసుళ్లాెరు. ఈ స్థితిలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఏదో చెప్పాం కదా అని ఆఘమేఘాల మీద కాకుండా ఒక పక్కా ప్రణాళికతో నాణ్యమైన విద్యను అందించడం. పటిష్ఠమైన విద్యా వ్యవస్థను రూపొందించడం కోసం కసరత్తు చేసింది. దార్శనికుడు, విద్యావేత్త, ముఖ్యమంత్రి మార్గదర్శ కత్వంలో, సుదీర్ఘ అనుభవం ఉన్న విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ప్రారంభించారు. ఏడాదికేడాదికి వాటి సంఖ్యను పెంచుకుంటూ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు చేయకుండా ఆలస్యమైనా అమృత తుల్యమైన వ్యవస్థను రూపొందిస్తూ ముందుకు పోతుంది ప్రభుత్వం. పాఠశాలలో మూస విద్యాబోధనలకు స్వస్తి చెప్పి సాంతిేకతను అందింపుచ్చుకొని పాఠ్యాంశాల బోధన. క్రీడలు, వ్యక్తిత్వవికాసాలకు ప్రాధాన్యం ఇస్తూ గురుకులాలు, కార్పొరేట్‌ విద్యకు పోటీగా తయారు అవుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో సర్కార్‌ బడులు, సంక్షేమ హాస్టళ్లు అన్ని అనేక సమస్యలతో కునారిల్లుతుండేవి. సర్కారు విద్యపై దాదాపు అందరికి నమ్మకం పోయింది. ఎక్కడో ఒకచోట మెరిసే ప్రతిభావంతులు తప్ప నాణ్యమైన విద్య కరువైందన్న భావన ఏర్పడింది. మంచి అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఉన్నా వ్యవస్థలోని లోపాలతో సర్కార్‌ విద్యపై నమ్మకం సడలింది. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు రెడ్‌కార్పెట్‌ వేసిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు సర్కార్‌ విద్యపై నిర్లక్ష్యం వహించారు. విద్యావ్యవస్థలో కేజీ నుంచి పీజీ వరకు భ్రష్ఠు పట్టించారు. ఈ నేపథ్యంలో సమగ్రమైన అధ్యయనం చేసిన కొత్త ప్రభుత్వం తనదైన శైలిలో కేజీ టూ పీజీ విద్యను రూపొందించింది. వడివడిగా అడుగులు వేస్తూ చెదలు పట్టిన వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. ఆకలితో అలమటించే పేదవిద్యార్థులు మాత్రమే సర్కార్‌ బడికి అనే పరిస్థితి దాపరించింది. ఈ స్థితిలో ప్రభుత్వం మంచి మధ్యాహ్నం భోజనం, సర్కార్‌ బడుల్లో మౌలిక వసతుల ఏర్పాటు చేస్తూ తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచుతూ వస్తుంది. మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యానికి బదులు నాణ్యమైన సన్న బియ్యంతో రుచికరమైన భోజనం, గుడ్డు అందిస్తుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిణామల క్రమాన్ని పరిశీలిస్తే…

  •  2015, జనవరి 1 నుంచి 2,200 కోట్లతో సుమారు 2,157 సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన సన్నని బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. దీంతో సుమారు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థుల కష్టాలు తీరుతున్నాయి. పురుగుల అన్నం నుంచి విముక్తి కలిగింది. చదువుకోవాలన్న ఆశ రగిలింది. దీంతోపాటు 34,319 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30 లక్షల మందికి పైగా విద్యార్థులకు చక్కటి మధ్యాహ్న భోజనం అందుతోంది.
  • కార్పొరేట్‌ విద్యను పేదపిల్లలకు అందించాలనే సంకల్పంతో కేజీ టూ పీజీ మిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతిని కల్పిస్తోంది. ఐదో తరగతిలో చేరిన విద్యార్థి డిగ్రీ పూర్తిచేసుకొని పట్టభద్రునిగా వెళ్లేలా సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇంగ్లిష్‌ మీడియంలో బోధన:

  •  ఇప్పటి వరకు పాలించిన పాలకులు అణగారిన వర్గాలకు, పేదలకు ఇంగ్లిష్‌ విద్యను దగ్గర చేయలేక పోయాయి. కానీ కె.సి.ఆర్‌. ప్రభుత్వం గురుకులాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో భోధన ప్రారంభించి కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల చర్యలు అంటే బోధనా సిబ్బంది, మౌలికవసతులు, డిజిటల్‌ క్లాస్‌లు, లైబ్రరీ, విశాలమైన క్రీడాప్రాంగణాలు తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆయా టేగిరీల వారీగా 296 గురుకులాలు మాత్రమే అందుబాటులో వుండేవి.. కానీ తెలంగాణ ఏర్పడ్డాక రికార్డు స్థాయిలో 842 గురుకులాలను ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి సంకల్ప బలానికి తార్కాణం.

ఇంటిని మరిపించే గురుకులం
విద్యార్థి ఐదో తరగతిలో చేరితే డిగ్రీ పూర్తయ్యే వరకు అన్ని వసతులను ప్రభుత్వమే చూస్తుంది. ఇంటిని మరిపించేలా గురుకులాల్లో అన్ని సౌకర్యాలను కల్పించారు. హోం సిక్ (ఇంటి మీద బెంగ)ను మరిపిం చేలా ఇక్కడ ఉపాధ్యా యులే తల్లిదండ్రుల్లా విద్యార్థులతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారు.

  •  ఉచిత విద్య, హాస్టల్‌ వసతితో పాటు ఒక్కో విద్యార్థికి ఏడాదికి మూడు జతల యూనిఫాంతోపాటు ట్రాక్‌సూట్‌, బెల్టు, ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఒక జత బూట్లు,సాక్సులు, టవల్‌, నాణ్యమైన పరుపులు, దిండ్లు, ప్లేటు, గ్లాసు, కటోరా, ఇనుప పెట్టె అందిస్తారు. ఇవన్నీ బ్రాండెడ్‌ కంపెనీలవి ఇవ్వడం మరో విశేషం.

పోషకాహారం:
అమ్మలాలన, తండ్రి పాలనకు మారుపేరుగా గురుకులాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఎదిగే వయసులో సరైన పోషకాహారం లభిస్తేనే శారీరకంగా, మానసికంగా అభివృద్ధి సాధ్యం. అందు ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులను తమ పిల్లలుగా భావించి పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నది. సన్న బియ్యంతో నిత్యం భోజనం చాలామందికి నేటికి అందని ద్రాక్షే. కానీ తెలంగాణ ప్రభుత్వ మానవీయతకు మచ్చుతునకగా సర్కారు బడుల్లో, గురుకులాల్లో నిత్యం సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నారు. ఇక గురుకులాల్లో నెలలో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్‌ మెనూలో తప్పనిసరి చేసింది ప్రభుత్వం. వీటికితోడు గుడ్లు, పాలు, పెరుగు, బూస్ట్‌, పండ్లు, స్వీట్లు అందజేస్తారు. ప్రతిరోజు ఆహారంలో నెయ్యి తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

క్రీడలకు చిరునామా గురుకులాలు:
– కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో వేలం బట్టీ చదువులకు ప్రాధాన్యతనిచ్చి విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని తుంగలో తొక్కివేస్తున్నారు. పిల్లలను పుస్తకాల పురుగులుగా ఎంసెట్‌, ఐఐటీ, నీట్‌లే లక్ష్యంగా తయారు చేస్తున్నారు. కానీ వారికి స్వేచ్ఛనిచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే వారి విజయాలకు హద్దు ఉండదు అనేది మానసిక శాస్త్ర నిపుణుల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు క్రీడలు, సహాస క్రీడలు అంటే పర్వతారోహణ వంటివాటిలో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. దీనికి నిదర్శనం ఎవరెస్ట్‌ను ఎక్కిన గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌ మౌంట్‌ ఎల్‌బ్రస్‌లు ఎక్కిన శ్రీవిద్య, పూర్ణ, మౌంట్‌ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు విద్యార్థుల బృందం దీనికి నిదర్శనం. ఇక జాతీయ, క్రీడల్లో పతకాలను సాధిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నిరుపేద విద్యార్థి సచిన్‌ బేతమళ్ల రెగెట్టా (పడవ పందెం)లో చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్‌ రెగెట్టా చాంపియన్‌షిప్‌ జూనియర్‌ టేగిరిలో రెండు బంగారు పతకాలను సాధించాడు. రాష్ట్ర కీర్తిని దశదిశాల వ్యాపింప చేస్తున్నారు. సంగీతం, భరతనాట్యం, కూచి పూడి, వెస్ట్రన్‌ మ్యూజిక్‌, డ్యాన్స్‌, మృదంగం, గిటార్‌, కీబోర్డు తదితర రంగస్థల కళల్లో విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని బట్టి శిక్షణనిస్తున్నారు.

ప్రతిభకు ప్రోత్సాహం:
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యార్థులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నారు. ఐఐటీ, నిట్‌, అజీం ప్రేమ్ జీ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందుతున్నారు. వీరిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రకరకాల బహుమతులను ఇస్తోంది. ఉదాహరణకు ఎస్సీ గురుకుల విద్యార్థులకు ఎస్సీ అభివృద్ధి మంత్రి ఐఐటీ, నిట్‌లలో సీట్లు వచ్చిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. వీటితోపాటు 50 వేల రూపాయలను అందిచారు
tsmagazine
తెలంగాణ గురుకులాలపై దేశం చూపు:

రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రారంభించిన ప్రతి పథకం రికార్డులను సృష్టిస్తున్నాయి. దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి. మిషన్‌ కాకతీయ, భగీరథ, రైతుబంధు, ప్రాజెక్టుల రిడిజైనింగ్‌, భూ రికార్డుల ప్రక్షాళన ఇలా ప్రతి ఒక్కటి కెసిఆర్ దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటి పరంపరలోనే కేజీ టూ పీజీ మిషన్‌ కూడా నిలుస్తుంది. రాష్ట్రంలో ప్రారంభించిన గురుకులాలను ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, చివరకు కేంద్రం సైతం వీటిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.

  •  జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎల్‌ మురుగన్‌ గురుకులాలను సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో అందించే నాణ్యమైన విద్య, ఆహారం, వసతి ఇతర సౌకర్యాలను ఆయన అభినందించారు. విద్యార్థులు భయం లేకుండా ఇంగ్లిష్‌ మాట్లాడటం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా విద్యావ్యవస్థను రూపొందించారని ఆయన కితాబునిచ్చారు.
  • ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాలను పంజాబ్‌, ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారుల బృందాలు వచ్చి సందర్శించాయి. మన గురుకుల వ్యవస్థను అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

కొసమెరుపు : 

ఆరు దశాబ్దాలుగా పాలకులు చేయలేని పనిని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం చేయడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఆలోచింపజేస్తోంది. ఈ పనే దేశ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చేసి వుంటే ఈ పాటికి వంద శాతం అక్షరాస్యతతో పాటు రాష్ట్రం సమగ్రాభివృద్దితో దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోయేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రారంభంలో ఏ పని చేసినా బాలారిష్టాలు సహజమే. కానీ వాటికి భయపడకుండా ‘ఆరంభింపరు..’ అనే పద్యం హితోక్తి ప్రకారం అనుకున్న లక్ష్యం సాధించే వరకు పట్టు విడవకుండా చేయడమే ధీరోధాత్తుల లక్షణం. దీనికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సరిగ్గా సరిపోతున్నాయి. రాబోయే సంవత్సరంలో మరిన్ని గురుకులాలను ప్రారంభించి అన్నీ వర్గాల ప్రజలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అంధించడానికి విద్యాశాఖ ప్రణాళికలను రూపొందిస్తోంది.