నల్లా కనెక్షన్లలో మనమే నెంబర్‌ వన్‌

ఇంటింటికీ నల్లాలద్వారా శుద్ధిచేసిన, స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 98.31 శాతం ఆవాసాలకు నల్లాల  ద్వారా తాగునీటిని అందిస్తూ దేశంలోనే మన రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత అనేక అంశాల్లో దేశంతోనే పోటీపడుతూ, సాధిస్తున్న విజయపరంపరలో ఇదో మైలురాయి.

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జల్‌ జీవన్‌ మిషన్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇంటింటికీ నల్లాల  ద్వారా మంచినీరు అందించడంలో 98.31 శాతంతో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 54.38 లక్షల ఆవాసాలు ఉండగా 53.46 లక్షల ఆవాసాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగునీరు అందజేస్తోంది. కాగా, 89.05 శాతంతో గోవా ద్వితీయస్థానంలో, 87.02 శాతంతో పుదుచ్చేరి తృతీయస్థానంలో నిలిచాయి. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ 34.71 శాతంతో 12వ స్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కేవలం 2.05 శాతం నల్లాకనెక్షన్లతో చివరిస్థానంలో ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో తాగునీరులేక, ముఖ్యంగా ఫ్లోరైడ్‌ విషం నిండిన నీటిని తాగడంవల్ల ఎముకలు బలహీనపడి, వికలాంగులుగా మారిన తెలంగాణ బిడ్డల దుర్భర బతుకులు ప్రపంచానికి తెలుసు. గుక్కెడు నీటి కోసం ఆడపడుచులు మండుటెండలో మైళ్ళకుమైళ్ళు బిందె నెత్తిన పెట్టుకొని పడిన నీటిగోసకు ఈనాడు మిషన్‌ భగీరథ పథకంతో మన ప్రభుత్వం పరిష్కారం చూపింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ళలో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడలేదని ఇండియన్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ ఎకనమిక్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండేషన్‌ ప్రకటించడం గమనార్హం. మినరల్‌ వాటర్‌ కంటే మిషన్‌ భగీరథ ద్వారా అందిస్తున్న నీరే శ్రేష్ఠమైనవని కూడా ఈ సంస్థ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఎట్టిపరిస్థితుల్లో ప్రతిరోజూ, ప్రతి ఇంటికీ ఖచ్చితంగా మంచినీరు అందించితీరాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మేధోమథనంచేసి మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, 45 వేల కోట్ల రూపాయల వ్యయంతో అమలుచేసి చూపించారు. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలుచేసే ఆలోచన ఉన్నట్టు కేంద్రజల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ గతంలోనే ప్రకటించారు. అలాగే, మరో 11 రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహాలో ఈ పథకం అమలు చేయడానికి ఆసక్తి చూపడం మనకు గర్వకారణం.