కొండంత ఆసరా

kcreవృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం కొండంత ‘ఆసరా’ ఇచ్చింది. వీరికి చెల్లించే పింఛను మొత్తాన్ని దాదాపు ఐదురెట్లు పెంచడంతోపాటు, ఈ పింఛన్ల పథకానికి ‘ఆసరా’ అని నామకరణం చేసింది. ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు నవంబరు 8నుంచి ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. మొదటి నెలలో లబ్దిదారులకు పింఛను మొత్తాన్ని నగదురూపంలో అందించింది

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు గ్రామంలో ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించి, లబ్దిదారులకు పింఛన్లు అందించారు. మిగిలిన జిల్లాలలో రాష్ట్రమంత్రులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కొత్తూరులో జరిగిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ ‘‘ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం అమలుచేసి చూపుతాం. చెప్పిందే చేయడం, చేసేదే చెప్పడం కేసీఆర్‌ నైజం. ఇతర రాజకీయ నాయకుల్లా కల్లబొల్లి మాటలుచెప్పి మోసం చేయడం నాకురాదు’’అని అన్నారు.

‘‘ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలని, ఆత్మహత్యలులేని తెలంగాణ కావాలని కలలుగన్నం. ఉద్యమపథంలో నాడు అదే లక్ష్యంగా పనిచేసినం. నేడు తెలంగాణ సిద్ధించింది. నాటి కలలను సాకారం చేసేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాం. తెలంగాణలో ఎవరికి చెందాల్సింది వారికే చెందాలి. అర్హులకు పూర్తి న్యాయం జరగాలి. అందుకే రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ పేరుతో పథకాలన్నీ ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా అర్హులకు అన్యాయం జరుగుతోందని కొందరు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. అది ఎప్పటికీ కానివ్వం. అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తం. అదే సమయంలో అనర్హులను ఉపేక్షించేది లేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు.

వెయ్యి పింఛను ఎందుకు?

పింఛన్ల పథకం ఎలా రూపుదిద్దుకున్నది, పింఛను మొత్తాన్ని పెంచాలని ఎలా నిర్ణయం తీసుకున్నది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. పింఛను మొత్తాన్ని పెంచడానికి ప్రభుత్వం కొంత కసరత్తుచేసిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నది.

ఎన్నికలముందు పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన సందర్భంగా పెన్షన్‌ మొత్తం ఎంత ఉండాలన్న విషయంపై విస్తృతంగా చర్చించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చర్చల సందర్భంగా పింఛను మొత్తాన్ని 600 రూపాయలకు పెంచుదామని ఓ ప్రతిపాదన వచ్చింది. అయితే, అది తనకు తృప్తి కలగలేదని, ‘మనం పెన్షన్‌లు ఎందుకు ఇస్తున్నాం. వాటి ఉద్దేశ్యం ఏమిటి, ఆసరా లేనివారికి ఆర్థికపరమైన ఆసరా ఉండాలనేకదా. మరో నాలుగువందలు కలిపి రూ. 1,000 చెయ్యాలి’ అని చెప్పి మరీ మ్యానిఫెస్టోలో పెట్టించినట్టు చంద్రశేఖరరావు వివరించారు.

ఇప్పుడు తన చేతులమీదుగా ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
గతంలో చాలామంది అనర్హులకు, 40 సంవత్సరాల వయస్సున్నవారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు. కొత్త రాష్ట్రంవచ్చింది. ఇకపై అలాంటి పొరపాట్లు జరగవద్దని సీఎం చెప్పారు.

‘‘ఇంకా ఎవరైనా పెన్షన్లు రాని వారు వుంటే, అర్హులైనవారు ఎం.ఆర్‌.ఓ., ఆర్‌.డి.వో. కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. అధికారులతో పరిశీలన జరిపించి తప్పకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇప్పిస్తా’’ అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లకోసం 67 కోట్ల రూపాయలు ఇస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం 730 కోట్ల రూపాయలు ఇచ్చిందని, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయలు కేటాయించిందని ముఖ్యమంత్రి చెప్పారు.

దీనితోపాటు రేషన్‌కార్డులపై ఒక్కొక్కరికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 6 కిలోలకు పెంచామని, కుటుంబానికి నెలకి 20 కిలోలు మాత్రమే అనే నిబంధనను సడలించి, కుటుంబంలో ఎంతమంది వుంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని సి.ఎం. స్పష్టంచేశారు.

‘ఆసరా’ ప్రధాన అంశాలు

 • ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే అందులో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్‌ చెల్లిస్తారు. ఎందుకంటే, గతంలో వృద్ధాప్య పెన్షన్‌ క్రింద ఒక్కొక్కరికి రూ. 200 మాత్రమే చెల్లించేవారు. ఆ వంతున ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్‌ ఇచ్చినా ఆ కుటుంబానికి దక్కిన లబ్ది కేవలం 400 రూపాయలు మాత్రమే. కానీ ఇప్పుడు ఒక్కరికే రూ. 1000 పెన్షన్‌ చెల్లిస్తున్నందున ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.
 • అ అయితే, ఒక ఇంట్లో ఒక్క వృద్ధాప్య పెన్షను మాత్రమే మంజూరు చేసినా, ఆ ఇంట్లో ఎవరైనా వితంతువులుగానీ, వికలాంగులు కాని ఎంతమంది వుంటే అంతమందికి ఆయా పెన్షన్లు అందజేస్తారు. వితంతువులకు రూ. 1,000, వికలాంగులకు రూ. 1500 పెన్షన్‌ అందిస్తుంది. నవంబరు నెలపెన్షన్‌ నగదుగా చెల్లించారు. ఈ నెల నుంచి బ్యాంకులోగానీ, పోస్టాఫీసులోగానీ లబ్దిదారుల ఖాతాలో నేరుగా జమచేస్తారు.

ప్రతి నెలా ‘ఆసరా’ ఎవరికి ఎంతెంత..

 • శ్రీ వృద్ధులకు రక్షణ రూ. 1,000
 • శ్రీ వితంతువులకు జీవనాధారం రూ. 1,000
 • శ్రీ వికలాంగులకు భద్రత రూ. 1,500
 • శ్రీ చేనేత, మర నేత కార్మికులకు చేయూత రూ. 1,000
 • శ్రీ కల్లుగీత కార్మికులకు ఆలంబన రూ. 1,000
 • శ్రీ ఎయిడ్స్‌ బాధితులకు భరోసా రూ. 1,000

పాలమూరుకు వరాలజల్లు

 • శ్రీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొత్తూరు పర్యటన సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లాపై వరాలజల్లు కురిపించారు. దశాబ్దాలుగా జిల్లా ప్రజలు కలలు కంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం సర్వేకోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశామన్నారు. సర్వే నివేదిక రాగానే తానే స్వయంగా మహబూబ్‌నగర్‌ వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు.
 • శ్రీ అలాగే, జిల్లాలో మొత్తం 10,381 కిలోమీటర్ల రోడ్లు ఉండగా, మొదటి విడతగా 5వేల కిలోమీటర్ల రోడ్లను మెరుగుపరుస్తామని సి.ఎం. ప్రకటించారు. మరో 1800 కిలోమీటర్ల ఆర్‌ అండ్‌ బి రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని, రాగల నాలుగైదు నెలల్లో ఈ రోడ్లన్నీ అద్దంలా తయారవుతాయని ఆయన చెప్పారు.
 • శ్రీ జిల్లాలోని 7,480 చెరువులలో మొదటి దశలో 1496 చెరువుల పునరుద్ధరణ పనులు చేపడతామని, జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా సి.ఎం. హామీ ఇచ్చారు.