‘రాజీ’కి రాజబాట హైదరాబాద్‌!

హైదరాబాద్‌ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరింది. నగరంలోని నానక్‌ రామ్‌ గూడ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐ.ఏ.ఎం.సి) కొలువు దీరింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మధ్యవర్తిత్వం అన్నది అనాదిగా ఉన్న ఆచారమే. మహాభారత కాలంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టం, మన గ్రామాలలో రచ్చబండల వద్ద గ్రామ పెద్దల తీర్పులు మనకు తెలిసిందే. ముందు రాజీ మార్గంలో సమస్య పరిష్కారానికి ప్రయత్నించి, అప్పటికీ పరిష్కారం కాకపోతే కోర్టు తలుపు తట్టడం మేలు.

న్యాయస్థానాలలో తీర్పులు జాప్యం జరిగిన కొద్దీ కక్షిదారులకు న్యాయం దూరమవుతూనే ఉంటుందన్నది జనాభిప్రాయం. అనేక కారణాల వల్ల న్యాయస్థానాలలో కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. న్యాయస్థానాలపై పనివత్తిడి తగ్గించి, తక్కువ ఖర్చుతో సత్వర పరిష్కారం పొందేందుకు రూపొందించిందే అంతర్జాతీయ, ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌.

ఇప్పటివరకూ ఆర్బిట్రేషన్‌ కేంద్రాలు అంతర్జాతీయ వాణిజ్య నగరాలైన పారిస్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, లండన్‌, న్యూయార్కు, స్టాక్‌ హోంలలో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన మన హైదరాబాద్‌ నగరం కూడా చేరింది.

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు దేశంలో తెచ్చిన ఆర్ధిక సంస్కరణల ఫలితంగా ఈ దేశ చట్టాలలో మార్పులు చేయవలసి వచ్చింది. దీనిలో భాగంగానే ఆర్బిట్రేషన్‌, కన్సిలియేషన్‌ యాక్ట్‌ – 1966 రూపొందింది. ఈ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ మన హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు కావడానికి సీజెఐ ఎన్‌.వి. రమణ, మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావులు ప్రధాన కారకులుకాగా, హైదరాబాద్‌ నగర ఔన్నత్యం మరో ప్రధాన కారణం. ‘‘ఇది నా నగరం. దీనిపట్ల పక్షపాతం చూపుతున్నానని నిందించ వచ్చు. నిజాయితీగా చెప్పాలంటే, హైదరాబాద్‌కు ఒకరు అనుకూలంగా వ్యవహరించ వలసిన అవసరంలేదు. దేశంలోని గొప్ప నగరాల్లో ఇదొకటి. ఈ నగరం శోభకు నావంతు సాయం చేసినందుకు గర్వపడుతున్నా. ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వారధిగా ఉన్న హైదరాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ భిన్న సంస్కృతులు, భాషల వారున్నారు. ముఖ్యంగా ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. ఐ.ఏ ఎం.సిని ఏర్పాటు చేయడానికి ఇంతకంటే గొప్ప ప్రాంతం లేదు’’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అనడం ఈ ప్రాంతంపై ఆయనకుగల ప్రేమాభిమానాలకు, అవగాహనకు నిదర్శనం.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుది పెద్ద మనసు. ఆయన ఏది చేసినాపెద్ద ఆర్భాటంగానే చేస్తారు. అది పెద్దలు, తీర్చిదిద్దిన గురువులు ఆయనకిచ్చిన వరం. ఇంతపెద్ద అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, భూమిని ఇవ్వడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనమని సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసించడం మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ కార్యశీలతకు, కార్యదక్షతకు లభించిన గుర్తింపు.

మన రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు, పెద్ద పెద్ద పరిశ్రమలలో జరిగే ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కోసం ఈ కేంద్రానికి వచ్చేవిధంగా రాష్ట్ర చట్టాలకు తగిన సవరణలు తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించడం ఎంతో ముదావహం.