ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం ఫ్లైఓవర్‌

హైదరాబాద్‌ నగరానికి విశ్వ నగరంగా గ్నుర్తింపు తెచ్చేందుకు చేపడుతున్న పలు కార్యక్రమాలలో భాగంగా, నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. నగరానికి దక్షిణ భాగంలో ఉన్న పాత బస్తీ ప్రాంతంలో ప్రజల మౌలిక వసతులు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా వాహనాల రద్దీ క్రమబద్దీకరణ నేపథ్యంలో వ్యూహాత్మక పథకాల ద్వారా రోడ్ల వెడల్పు, జంక్షన్‌ అభివృద్ది సుందరీకరణ పనులు చేపడుతున్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వయా దక్షిణ ప్రాంతం నుండి సులువుగా తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా వెళ్లేందుకు ఫ్లై ఓవర్‌ నిర్మాణాలను చేపడుతున్నారు.

మినీ రింగు రోడ్డుగా పిలువబడే ఆరాంఘర్‌ నుండి ఎల్‌.బి నగర్‌ వరకు గల రోడ్డు మార్గంలో ఫ్లైఓవర్‌లు, అండర్‌ పాసులు ఎస్‌.ఆర్‌.డి.పి మొదటి దశలో నిర్మాణాలను చేపట్టి ప్రజలకు అందుబాటులో తేనున్నారు.

ఈ నేపథ్యంలో మిధాని నుండి ఓవైసీ జంక్షన్‌ వరకు రూ. 63 కోట్ల అంచనా వ్యయంతో 1.36కిలోమీటర్లు గల ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేశారు. దీన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐ.టిశాఖల మంత్రి కె. తారక రామారావు లాంచనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫ్లై ఓవర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు కేటీఆర్‌ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఫ్లై ఓవర్‌ ఫ్రీ క్యాస్ట్‌ టెక్నాలజితో నిర్మించారు. నగరంలో దక్షిణ ప్రాంతంలో మొట్ట మొదటి బ్రిడ్జి నిర్మాణ వ్యయం రూ. 63కోట్లు కాగా, భూసేకరణ యుటిలిటీ నష్టపరిహారం కింద మారో రూ. 17 కోట్లు వెచ్చించినందున ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.80 కోట్ల ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఫ్లైఓవర్‌ పైన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మూడు లైన్లతో ఒకే మార్గంతో నిర్మాణం చేపట్టారు. కాంక్రీట్‌ తోనే ఫౌండేషన్‌ పనులు చేపట్టిన మిగతా ఫ్రీ క్యాస్ట్‌ టెక్నాలజీని ఉపయోగించినట్లు, ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా వాహనాల రద్దీ నియంత్రణ, పొల్యూషన్‌ నివారణ చర్యలు తీసుకున్నట్లు సి.ఈ దేవానంద్‌ వెల్లడిరచారు.