|

‘మిషన్‌ కాకతీయ’ సఫలతకు వినూత్న పథకాలు

శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే

తెలంగాణ ఉద్యమ కాలంలో సాగునీటి రంగంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన అన్యాయం, చూపిన వివక్ష గురించి చాలా చర్చ జరిగింది. ఆ చర్చలో ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరువుల విధ్వంసం గురించి మధన పడినాము. చెరువుల విధ్వంసం వలన తెలంగాణ గ్రామీణ జన జీవితం ఏ విధంగా విధ్వంసం పాలయ్యిందో వలపోసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చెరువుల పునరుద్ధరణ జరగాలని కోరుకున్నాం. తెలంగాణ కవులు, రచయితలు, చెరువుల విధ్వంసంపై టన్నుల కొద్ది సాహిత్యాన్ని సృష్టించినారు. ఒక పురా జ్ఞాపకంగా మారిన చెరువు తల్లి తిరిగి పునర్జీవనం చెందాలని ఆకాంక్ష వ్యక్తం చేసినాం.

చెరువు చుట్టూ అల్లుకొన్న తెలంగాణ సాంస్కృతిక జీవనాన్ని చిత్రీకరిస్తూ గోరటి వెంకన్న, అందెశ్రీ, మిత్ర, జైరాజ్‌ లాంటి కవులు అధ్భుతమైన పాటలు రాసినారు. కవులు అనేక మంది కవితలు రాసినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణా ప్రజల స్వప్నం అయిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ‘మిషన్‌ కాకతీయ’ పేరుతో, ‘మన ఊరు మన చెరువు’ ట్యాగ్‌ లైన్‌తో బృహత్తరమైన ఫ్లాగ్‌ షిప్‌ ప్రోగ్రాంని రూపకల్పన చేశారు ముఖ్యమంత్రి కెసిఆర్‌. ఆ ప్రోగ్రాంని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాక ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నడిచే ఒక ప్రజా ఉద్యమ కార్యక్రమంగా జరగాలని ఆయన భావించారు. ఈ నాలుగేండ్లలో మిషన్‌ కాకతీయ కార్యక్రమం నాలుగు దశల్లో అమలయింది. తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత గొప్ప మార్పు కనిపిస్తున్నది. సుస్థిర వ్యవసాయం ఇప్పుడు సాధ్యం అవుతున్నది. చెరువుల్లో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రజల వలసలు తగ్గిపోయినాయి.పశువులకు , గొర్లు , మేకలలకు నీటి తావులు ఏర్పడ్డాయి. మేతకు దూర ప్రాంతాలకు తోలుకుపోయే అగత్యం తగ్గింది.

మిషన్‌ కాకతీయ ఫలితాలు :

ఈ నాలుగేండ్లలో మిషన్‌ కాకతీయ అమలు అయిన తర్వాత ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ నాలుగేండ్లలో నాలుగు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27,653 చెరువుల పునరుద్ధరణకు 8,742 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వీటి కింద 21.38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. వీటిలో 20,192 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి అయినాయి. మిగతా చెరువుల పనులు కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు మిషన్‌ కాకతీయ పథకం అమలుకు ప్రభుత్వం రూ. 3,719 కోట్లు ఖర్చు పెట్టింది. చెరువుల కింద 13.80 లక్షల ఎకరాలను స్థిరీకరించింది. పూడిక తీత వలన చెరువుల్లో నీటి నిల్వ సామర్ధ్యం 8 టిఎంసీలు పెరిగినట్టు అంచనా. మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో పునరుద్ధరణకు నోచుకున్న చెరువుల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరినందున 2016-17 రబీ పంట కాలానికి చెరువుల కింద సాగునీరు పుష్కలంగా అందింది. రెండేండ్ల వరుస కరువుల అనంతరం చెరువుల్లోకి నీరు చేరింది. గత 10 ఏండ్ల నుంచి తమ ఊరి చెరువుల్లో నీరు చూడని గ్రామస్తులు పునరుద్ధరణ అనంతరం చెరువులు నీటితో కళకళలాడుతుంటే చూసి ఉప్పొంగి పోతున్నారు. వర్షపాతం లేని ప్రాంతాల్లో కూడా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌, దేవాదుల తదితర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేసినందున చేరువుల్లో ఎండాకాలంలో కూడా నీరు నిలువ ఉన్న సందర్భం రాష్ట్రంలో ఏర్పడింది. దీనితో గ్రామాల్లో మునుపెన్నడూ లేనివిధంగా, వ్యవసాయం చెరువుల కింద పుంజుకున్నది. మిషన్‌ కాకతీయ అమలు కారంణంగా 57.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. వరి పంట దిగుబడి 4.1శాతం, పత్తి పంట దిగుబడి 4.7శాతం పెరిగినట్లుగా రికార్డు అయ్యింది.

పూడిక మట్టిని చల్లుకున్నరైతు కుటుంబాలకు రసాయనిక ఎరువుల వాడకం 30శాతం తగ్గింది. ఆ మేరకు రైతుకు ఆర్థిక భారం తగ్గింది. పూడిక మట్టిని చల్లుకున్న రైతులకు మంచి ప్రయోజనాలు దక్కినాయి. అట్టి పొలాల్లో పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. వరి దిగుబడి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్ళు, పత్తి దిగుబడి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు, కందుల దిగుబడి ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మక్క దిగుబడి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు పెరిగినట్టు నాబార్డు వారి అధ్యయనంలో తేలింది. 5 వేలకు పైగా మిషన్‌ కాకతీయ చెరువుల్లో మత్స్య శాఖ తరపున 40 కోట్ల చేప పిల్లలని వదలడం జరిగింది. దీనితో చేపల ఉత్పత్తి 62 శాతం పెరిగినట్లు నమోదు అయ్యింది. చేపల పెంపకందారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. భూగర్భ జలాల వృద్ధిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని భూగర్భజల శాఖ అధ్యయనంలో తేలింది. 2017-18 రబీ సీజన్‌ లో చెరువుల కింద 15 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. ఇది ఒక రికార్డు. పంట దిగుబడి గణనీయంగా పెరిగినట్లు మార్కెటింగ్‌ శాఖ ద్వారా ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్ళ ద్వారా తెలుస్తున్నది.

నిండు కుండల్లా చెరువులు :

మిషన్‌ కాకతీయ ఫలితాలు మొదటిసారిగా 2016 -17లో రైతుల అనుభవంలోనికి వచ్చింది . 2017-18 రబీలో కూడా ఇవే అనుభవాలు పునరావతం అయినాయి.2018-19 సంవత్సరం జూన్‌ నెల నుంచే వర్షాలు బాగా పడినందున రాష్ట్రం అంతటా ముఖ్యంగా గోదావరి బేసిన్‌ లో చెరువులు నిండు కుండల్లా మారినాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూస్తే 18 వేల చెరువులు నిండు కుండల్లా మారాయని మైనర్‌ ఇరిగేషన్‌ ఇంజనీర్లు పంపిన క్షేత్రస్థాయి సమాచారం బట్టి తెలుస్తున్నది. చెరువుల కింద ఖరీఫ్‌ పంట కాలంలో వ్యవసాయం గణనీయంగా పెరినట్టు సమాచారం. ఖరీఫ్‌లో దిగుబడులు కూడా బాగా పెరిగినాయి. మరొక ముఖ్యమైన అంశాన్ని 2016లో గమనించడం జరిగింది. ఈ ఏడు సెప్టెంబరులో కురిసిన వర్షం 100 ఏండ్లకు ఒక్కసారి వచ్చే పెద్ద వర్షం. అయినా కూడా మిషన్‌ కాకతీయలో చెరువు కట్టలు బలోపేతం అయిన కారణంగా వరదలకు తెగిపోయిన చెరువులు, ఇతరత్రా నష్టపోయిన చెరువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వేల సంఖ్యలో నష్టానికి గురి అయ్యే చెరువులు వందల్లోకి పడిపోయినాయి. బాగా వర్షాలు పడిన సంవత్సరాల్లో నష్టపోయిన చెరువుల సంఖ్య ఈ విధంగా ఉన్నది. 2009 లో 1107, 2010లో 4251, 2013లో 1868, 2016లో కేవలం 571 మాత్రమే. అది మిషన్‌ కాకతీయలో చెరువు కట్టలను బలోపేతం చేసినందువల్లనే సాధ్యమయ్యింది. మిషన్‌ కాకతీయ ఫలితాలపై ప్రభుత్వానికి ఉన్న అంచనా ఈ ఫలితాల ద్వారా నిజమని నిర్ద్వందంగా తేలిపోయింది.

ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం :

అయితే ముఖ్యమంత్రి ఆలోచన ఇక్కడితోనే ఆగిపోలేదు. ‘మిషన్‌ కాకతీయ’ విజన్‌ జయప్రదం కావాలంటే చెరువుల్లో కనీసం 10 నెలల పాటు నీరు నిలువ ఉండాలి. రెండు పంటలకు నీరు అందాలి. భూగర్భ జలాలు పైకి రావాలి. ఇందుకు చెరువులను భారీ మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేసినప్పుడే సాధ్యం అని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్రంలో గత నాలుగేండ్ల పాలనా కాలంలో అనేక భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నిర్మాణం పూర్తి చేసుకొని 2019 జూన్‌ / జూలై నెలల్లో నీరు సరఫరాకు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణాకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు 2019 లోనే అందుబాటులోకి రానున్నాయి. 2019 సంవత్సరాంతానికి మరిన్ని ప్రాజెక్టులు నీటి సరఫరా సిద్ధం అవుతాయి. వీటిని చెరువులతో అనుసంధానం చేయడం ద్వారా చేరువులన్నీ రెండు పంటలకు నీరివ్వగలిగే స్థితి వస్తుంది. గోదావరి బేసిన్‌ లో 175టిఎంసీలు, కృష్ణా బేసిన్‌ లో 90టిఎంసీలు, మొత్తం 265టిఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

వాగుల పునర్జీవన పథకం :

చెరువుల అనుసంధానంతో పాటూ తెలంగాణా రాష్ట్రంలోని ఆన్ని ప్రధాన వాగులు, వంకలు పునర్జీవనం పొందాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తి అవుతున్న కారణంగా దాదాపు రాష్ట్రమంతా (కొన్ని ఎత్తైన ప్రాంతాలు మినహా) కమాండ్‌ ఏరియాగా మారబోతున్నది. ఈ ప్రాజెక్టుల ద్వారా భూములకు నీరు అందుతుంది. వాటి నుండి వచ్చే పడవాటి నీరు (Regenerated water) తిరిగి ఈ వాగుల్లోకి చేరుతాయి. వీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసుకోగలిగితే ఆ ప్రాంతాల్లో ఆ వాగులు పునర్జీవనం చెంది భూగర్భ జలాలు రీచార్జ్‌ కావడంతో పాటు అనేక రకాలుగా ఈ నీరు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంలోనికి రానున్నాయి. ఈ పడవాటి నీటిని, వర్షపు నీటిని వొడిసి పట్టడానికి చెక్‌ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ, పంచాయతిరాజ్‌ శాఖ వారు వాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను చెక్‌ డ్యాంలతో సహా నిర్మించాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చినందున ఆ శాఖలు కూడా చెక్‌ డ్యాం ల నిర్మాణాలు చేపట్టినాయి. వాటిని కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినారు. గోదావరి, కృష్ణా, వాటి ఉప నదులపై ఈ రకమైన కట్టడాల నిర్మాణం మహారాష్ట్రా, కర్ణాటక రాష్ట్రాలు గత 20 ఏండ్ల క్రితమే చేపట్టినట్టు ముఖ్యమంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి సూచించిన ఈ రెండు కార్యక్రమాల అమలు కోసం సాగునీటి శాఖ విస్తృత  అధ్యయనం చేసింది. సర్వే ఆఫ్‌ ఇండియా వారి మ్యాపులతో పాటు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (NRSA) వారి ఉపగ్రహ చిత్రాల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. రిటైర్డ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ విజయ్‌ ప్రకాశ్‌, కాడా కమీషనర్‌ మల్సూర్‌ నేతృత్వంలో ఇంజనీర్ల బృందం క్షేత్ర స్థాయిలో మైనర్‌ ఇరిగేషన్‌, ప్రాజెక్టుల ఇంజనీర్లతో సమాచార సేకరణ చేసి విశ్లేషణ జరిపినారు. ఈ విశ్లేషణ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

1. రాష్ట్రం మొత్తంలో 559 మండలాల్లో సుమారు 48,845 చిన్న నీటి వనరులున్నాయి. వీటిలో 27,814 చెరువులు, కుంటలు 12,154 గొలుసుల కింద ఉన్నట్టు తేలింది. ఈ చెరువులను నింపడానికి ప్రాజెక్టుల కాలువలకు ఎక్కడెక్కడ తూములు నిర్మించాలన్న దానిపై స్పష్టత వచ్చింది. గొలుసులకు బయట ఉన్న 16,771 చెరువులు, కుంటలను నింపడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానానికి సమగ్రమైన మార్గ నిర్ధేశాలను తయారుచేసి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఇంజనీర్లకు అందజేసినారు. ప్రతీ మండలానికి ఒక ఇరిగేషన్‌ చిత్రపటాన్ని రూపొందించి క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు అందజేయడం జరిగింది. తూముల నిర్మాణానికి, ఫీడర్‌ ఛానళ్ళ పునరుద్ధరణకు అంచనాలు రూపొందించే పని జరుగుతున్నది. ప్రతీ చెరువుకు ఫీడర్‌ చానల్‌ తప్పనిసరిగా ఉంటుంది కనుక వీటికి ఎటువంటి భూసేకరణ అవసరం ఉండదు. అయితే తూముల ద్వారా వాటి సహజ ఫీడర్‌కు నీరు చేర్చడానికి కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి భూసేకరణ అవసరం పడుతుంది. వాటి వివరాలు కూడా సేకరించమని ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది.

2. రాష్ట్రం మొత్తంలో ఉండే నదులను, వాగులను, వంకలను 8 స్థాయిల్లో (Orders) వర్గీకరించడం జరిగింది. 4 నుంచి 8 స్థాయి కలిగిన వాగులను పెద్ద వాగులుగా పరిగణించాలి. ఇవి రాష్ట్రంలో 683 ఉన్నట్టు, వారి పొడవు 12,183 కిలోమీటర్లు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. వీటిలో నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రథమ ప్రాధాన్యతలో ఈ వాగులపై చెక్‌ డ్యాంలను ప్రతిపాదించాలని సూచించడం జరిగింది. అందులోనూ పూర్తి అయిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కమాండ్‌ ఏరియాల్లో ఉండే వాగులను మొదటి దశలో ఎంపిక చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినారు. రెండవ దశలో ఒకటి రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోబోతున్న ప్రాజెక్టుల కమాండ్‌ ఏరియాల్లో ఉండే వాగులపై చెక్‌ డ్యాంలను ప్రతిపాదించాలని సూచించారు.

రాష్ట్రం మొత్తంలో 559 మండలాల్లో సుమారు 48,845 చిన్న నీటి వనరులున్నాయి. వీటిలో 27,814 చెరువులు, కుంటలు 12,154 గొలుసుల కింద ఉన్నట్టు తేలింది. ఈ చెరువులను నింపడానికి ప్రాజెక్టుల కాలువలకు ఎక్కడెక్కడ తూములు నిర్మించాలన్న దానిపై స్పష్టత వచ్చింది. గొలుసులకు బయట ఉన్న 16,771 చెరువులు, కుంటలను నింపడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానికి సమగ్రమైన మార్గ నిర్దేశాలను తయారుచేసి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఇంజనీర్లకు అందజేసినారు. ప్రతీ మండలానికి ఒక ఇరిగేషన్‌ చిత్రపటాన్ని రూపొందించి క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు అందజేయడం జరిగింది. తూముల నిర్మాణానికి, ఫీడర్‌ ఛానళ్ళ పునరుద్ధరణకు అంచనాలు రూపొందించే పని జరుగుతున్నది. ప్రతీ చెరువుకు ఫీడర్‌ చానల్‌ తప్పని సరిగా ఉంటుంది కనుక వీటికి ఎటువంటి భూసేకరణ అవసరం ఉండదు. అయితే తూముల ద్వారా వాటి సహజ ఫీడర్‌ కు నీరు చేర్చడానికి కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి భూసేకరణ అవసరం పడుతుంది. వాటి వివరాలు కూడా సేకరించమని ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది.

3. ఈ వాగులపై ఇప్పటికే 510 చెక్‌ డ్యాం లు, 245 ఆనకట్టలు, 29 కత్వాలు, 1 మాటు ఉన్నట్టు తెలుస్తున్నది. అన్ని స్థాయిల వాగులపై ఇప్పటికే నిర్మాణం అయి ఉన్న చెక్‌ డ్యాం ల సంఖ్య 2,376 ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అయితే చిన్న స్థాయి వాగుల పైననే పెద్ద సంఖ్యలో చెక్‌ డ్యాంల నిర్మాణం జరిగినట్టు తెలుస్తున్నది. పెద్ద స్థాయి వాగులపై ఇంకా సుమారు వేయి చెక్‌ డ్యాంల నిర్మాణానికి అవకాశం ఉన్నట్టు అధ్యయనంలో విశ్లేషించారు.

4. నాగార్జున సాగర్‌, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, జూరాల, కడెం తదితర ప్రాజెక్టుల కమాండ్‌ ఏరియాల్లో వీటి అధ్యయనం దాదాపు పూర్తి అయ్యింది. వీటి వివరాలు క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు అందజేయడం జరిగింది.

5. చెక్‌ డ్యాంల స్థల ఎంపిక దగ్గర నుంచి ప్రతీ దశలోనూ భూగర్భ జల శాఖతో సమన్వయము చేసుకోవాలని క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు సూచించినారు. భూగర్భ జల శాఖ ఎంపిక చేసుకున్న చెక్‌ డ్యాంల వద్ద రీచార్జ్‌ గొట్టాలను అమర్చాలని సూచించారు.