శాసనాల పరిశోధన చరిత్ర

(ప్రముఖ శాసనాలు – దాడులు, దుష్ప్రచారాలు) – డా|| డి. సూర్యకుమార్‌

”తెలంగాణ చరిత్రకారులకి స్వర్గధామం”, తెలంగాణ ప్రాంతం శాసనపరిశోధకులకు స్వర్గం” అంటూ కొమర్రాజు లక్ష్మణ రావు పంతులు వంద సంవత్సరాల క్రితం అన్న మాటలని ఎన్ని వేదికల మీద ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వ్యాసాలలో ఎన్నిసార్లు రాసినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. మళ్ళీ, మళ్ళీ రాయాలనిపిస్తుంది. అంత గొప్ప మాట అది !!

ప్రత్యేక జీవావరణ పరిస్థితులున్న దక్కన్‌లోని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం – జీవనదులతో, పర్వత పంక్తులు అరణ్య సంపదతో మొదటి నుండి జీవావాసమై, అనేక రాజవంశాల వలసలకు, పాలనకు కేంద్రమయింది. క్రీ.పూ. 6వ శతాబ్దిలో భారతదేశంలో ఏర్పడ్డ 16 జనపదాలతో దక్షిణ భారతదేశం మొత్తంలో ఉన్న ఒకే ఒక జనపదం – అస్సకా – మన తెలంగాణ లోని కరీంనగర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలంటేనే తెలంగాణ ప్రాశస్త్యం తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజ వంశాల వారు, అధికారులు తదితరులు వివిధ సందర్భాలలో అనేక శాసనాలు జారీచేశారు. ఈ చారిత్రక శాసనాలు మన చరిత్ర రచనకు శ్వాసనాళాలు. ఈ శాసనాలలో ఎక్కువగా దాన శాసనాలే కన్పిస్తాయి. క్రీ.పూ. 4వ శతాబ్ది నాటి కోటిలింగాల నాణెములపై కన్పించే గోబధ, కంవాయస, నరన, మున్నగు పేర్లు కన్పిస్తాయి. ఇవి శాతవాహనుల పూర్వకాలానికి చెందినవి.

వీటి తర్వాత క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి, నేటి జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల, దనాళికట్ట, మునులగుట్టలో కన్పించిన లఘుశాసనాలు మన ప్రాంతంలోని తొలి శాసనాలని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా బౌద్ధుల చైత్య, స్థూప విహారాలలో లభించినవే. వస్తుపరంగా యివి రాతిపై (శిలలపై) చెక్కినవి. దీన్ని శాసన పరిశోధకులు ”తొలిశిలాశాసన యుగం” అంటారు. తర్వాత్తర్వాత క్రీ.శ. 2,3 శతాబ్దాల నుండి రాళ్ళకి (శిలకి) బదులుగా శాసనాలకి రాగి రేకులను (లోహపు రేకులు) వినియోగించారు. దీన్ని రాగిరేకుల యుగమని లేక లోహరేకుల యుగమని అంటారు. వీటిని ఎక్కువగా బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసే సందర్భంలో యిచ్చేవారు. మల్లపల్లి వారి అభిప్రాయంలో ‘రాగిరేకుల శాసనం లభించిందంటే అది బ్రాహ్మణులకిచ్చిన భూ దానమని చెప్పవచ్చు. ‘వైదిక, బ్రాహ్మణ మతంలోనే ఈ రాగి రేకుల జారీ అధికంగా కన్పిస్తుంది. క్రీ.శ. 7,8 శతాబ్దాల నుండి రాగి రేకులతోపాటు తిరిగి శిలాశాసనాలు జారీ కావడం పునః ప్రారంభమైనది. ఇది కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలానికి ఉచ్ఛ స్థాయికి చేరింది. దీన్ని ”రెండవ శిలాశాసన యుగం” అంటారు. లోహయుగంలో శిలా శాసనాలు లేవనికాదు. కానీ, తక్కువగా ఉన్నాయి. అట్లే శిలాశాసన యుగాలలో లోహశాసనాలు లేవని కాదు కానీ తక్కువగా ఉండేవి. ఇక మనకు లభించిన వాటిలో కూడా శిలాశాసనాలే అధికము. రాగిరేకులు తక్కువ. దీనికి కారణం చారిత్రక స్పృహలేని వారు దొరికిన రాగిరేకులను కరిగించివేయడమే ముఖ్య కారణము.

ఇక తెలంగాణలో శాసనాలిచ్చిన రాజ వంశాల విషయానికి వస్తే తెలుగువారిని పాలించిన రాజవంశాలన్నీ (దాదాపు)గా తెలంగాణ ప్రాంతాన్ని పాలించాయి. కనుక ఈ రాజ వంశాలు, వారి సామంతులు, అధికారులు, ప్రముఖులు శాసనాలనుజారీ చేశారు. తెలుగు వారినందరినీ ఏకం చేసి పాలించిన రాజవంశాలలో శాతవాహనులు, విష్ణుకుండినులు, కాకతీయులు, కుతుబ్‌షాలు తెలంగాణా నుండి వచ్చినవారే. ఇక శాసన భాషల విషయానికి వస్తే ప్రాకృతం, సంస్కృతం, కన్నడము, తెలుగు, పార్శీ భాషలు తెలంగాణాలో శాసనాలలో కన్పిస్తాయి. 18వ శతాబ్దం నాటి ఏలేశ్వరం శాసనంలో యింగ్లీషు, ఫ్రెంచి భాషలు కన్పిస్తాయి. బ్రాహ్మీ, కన్నడ తెలుగు, తెలుగు దేవనాగరి, అరబ్బీ, మోడీ లిపులు శాసనలిపులుగా కన్పిస్తాయి.

ఈ శాసనాలిచ్చిన రాజవంశాలలో శాతవాహనులు (కోటిలింగాల నాణెములు శాతవాహనుల కంటే ముందువే), ఇక్ష్వాకులు, విష్ణు కుండి, బాదామి కళ్యాణి, వేములవాడ, ముదిగొండ చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు మసునూరు వంశీయులు, రెడ్డి రాజులు (కొండవీడు వారి శాసనం వాడపల్లిలో లభించింది). రేచర్ల పద్మనాయకులు, విజయనగర, కుతుబ్‌షా, అసఫ్‌ జాలు ప్రముఖులు – కుతుబ్‌షాల శాసనాలలో పార్శీ, తెలుగు ద్విభాషా శాసనాలు లభిస్తున్నాయి. వీరితో పాటు వీరి సామంతులయిన, ప్రాంతీయ పాలకులయిన రేచర్ల రెడ్డి, చెరకురెడ్డి వంశీయులు, విరియాల, మల్యాల వంశీయులు, మున్నగువారే గాక, ఉత్తర, పశ్చిమ దేశాల నుండి వచ్చిన కాయస్థులు, పరమార, యాదవ (వీరిలో అనేక ఉపశాఖలున్నాయి). వంశీయుల శాసనాలు లభిస్తున్నాయి.

తెలంగాణలో శాసన పరిశోధన, శాస్త్రీయ పరిష్కరణ క్రీ.శ. 1882 నుండి జె.ఎ.ఫ్లీట్‌ హనుమకొండ వేయి స్థంభాల గుడి శాసనం చదివిన నాటి నుండి ఆరంభమైనదని చెప్పవచ్చు. ఫ్లీట్‌ అప్పట్లో భారత ప్రభుత్వ (ఆంగ్లేయుల అధికారంలోని) ప్రధాన శాసన పరిశోధకునికి సహాయకారిగా ఉండేవాడు. హైదరాబాద్‌ నిజాం నుండి ప్రత్యేక అనుమతి పొంది ఫ్లీట్‌ రుద్రదేవుని హనుమకొండ శాసనం చదివాడు. దీని ద్వారానే చరిత్రకారులకి తొలిసారిగా ”కాకతీయ వంశం” గురించి తెలిసింది. తర్వాత వనపర్తి సంస్థానంలో ఆస్థాన పండితుడైన మానవల్లి రామకృష్ణ కవి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బూధ్‌పూర్‌, వర్థమానపురం శాసనాలను ప్రకటించారు. అట్లే వీరు వరంగల్‌ జిల్లాలోని శాసనాలు కొన్నింటిని పరిష్కరించారు. కవి తెలంగాణా శాసనములు అన్న గ్రంథాన్ని సంకల్పించారట కానీ, అలభ్యము. అటు పిమ్మట శేషాద్రి రమణ కవులు 1915-20 మధ్య కాలంలో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అనేక ప్రాంతాలు తిరిగి, అనేక శాసనాలు సేకరించి, పరిష్కరించారు. 1914లో నిజాం ప్రభుత్వం హైదరాబాద్‌లో పురావస్తుశాఖను ఏర్పరచింది. దీన్ని ‘ఆర్షశాఖ’గా వ్యవహరించారు. దీనికి గులాంయాజ్దాని సంచాలకులుగా నియుక్తులయ్యారు. వీరి సంచాలకత్వంలోనే తర్వాత కాలంలో పుట్టపర్తి శ్రీనివాసచారి, సంపాదకత్వంలో ‘కార్పస్‌ ఆఫ్‌ యిన్స్‌ క్రిప్షన్స్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేర శాసన సంపుటాలు వెలువడ్డాయి. వీటిలో మూడింటికి పుట్టపర్తివారు సంపాదకులుగా కాగా నాల్గవదానికి మల్లంపల్లి సోమశేఖర శర్మ సంపాదకత్వం వహించారు.

ఆపైన లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ‘తెలంగాణా శాసనాలు’ పేరిట రెండు సంపుటాలు వెలువ రించారు. మొదటి సంపుటంలో 123 శాసనాలున్నాయి. దీనికి అప్పటి మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ‘వేసా రామేశం’ సంపాదకులుగా వ్యవహరించారు. ఇది 1935లో ప్రచురింపబడినది. పరిశోధక మండలి వారి రెండవ సంపుటి గడియారం రామకృష్ణ శర్మ సంపాదకత్వంలో 1960లో వెలుగుచూసింది.

మానవవల్లి రామకృష్ణ కవి హనుమకొండలోని సిద్ధేశ్వర గుట్టపైగల శాసనాలను నకలు తీసుకొనేటపుడు కారణాంతరాల వల్ల కొంత భాగమే కాపీ చేసుకున్నారట. తర్వాత మెకంజీ యొక్క పండితుడొకడు దీని పూర్తి పాఠాన్ని నకలు తీసికొని మద్రాస్‌ ప్రాచ్య లిఖిత భాండాగారములో భద్రపరిచారని తెల్సుకొని, మిగిలిన భాగాన్ని అక్కడికిపోయి రాసుకున్నారట. అంటే మెకంజీ దొర కూడా తెలంగాణా శాసనాల సేకరణలో పాలుుపంచుకున్నాడన్నమాట. 1932లో వరంగల్‌లో కాకతీయ జయంత్యుత్సవాలు జరిగాయి. ఫలితంగా 1935లో ‘కాకతీయ సంచిక’ వెలువడ్డది. దీనిలో కాకతీయులనాటివి శాసనాలు అనేకం ప్రచురించబడ్డాయి. మారేమండ రామారావు దీనికి సంపాదకులు. భావరాజు వెంటక కృష్ణారావు, రాళ్ళబండి సుబ్బారావు, శేషాద్రి రమణ కవులు, ఆచార్య సిరుగూరు హనుమంతరావు వంటి చరిత్ర, శాసన పరిశోధకులు దీనిలో పాలుపంచుకున్నారు.

1940 దశకంలో ‘హైదరాబాద్‌ ఆర్కియలాజికల్‌ సీరిస్‌’ పేర అనేక శాసనాలపై లఘు గ్రంథాలు వెలువడ్డాయి. 1050 నుండి 53 వరకు మైదరాబాద్‌ నుండి గడియారం రామకృష్ణ శర్మ సంపాదకత్వంలో వచ్చిన ‘సుజాత’ పత్రిక సంచికలలో అనేక శాసనాలు పరిష్కరింపబడి ప్రకటించబడ్డాయి.

1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణతో హైదరాబాద్‌ ఆర్ష శాఖ ‘ఆంధ్ర ప్రదేశ్‌ పురవాస్తు శాఖ’గా రూపాంతరం చెందింది. 1964లో డా. రమేశన్‌ సంచాలకులుగా ఉన్నపుడు శాసన పరిశోధనకు ప్రత్యేకంగా ‘ఎపిగ్రఫీ విభాగము ఏర్పడ్డది. దీనికి నేలటూరి వెంకటరమణయ్య ఉపసంచాలకులుగా నియుక్తులయ్యారు. డా. పరబ్రహ్మ శాస్త్రి, ముకుందరావు, జవహర్‌లాల్‌, జోగినాయుడు, మార్కండేయ శర్మ, యన్‌.యస్‌. రామచంద్రమూర్తి మున్నగువారందరూ ఈ విభాగంలో నియుక్తులయిన వారే. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాన్ని సర్వే చేసి, శాసనాలు సేకరించి, పరిష్కరించి, జిల్లాల వారీగా శాసన సంపుటాలు ముద్రించడం వీరి ఆశయం. ఆ ఒరవడిలో తెలంగాణాలోని పది జిల్లాల్లో (అప్పటి లెక్కలో) ఐదు జిల్లాల శాసనాలు సేకరించి ప్రకటించారు. వాటి వివరాలు పై పట్టికలో చూడొచ్చు.

తెలంగాణా శాసనాల గురించి చర్చించేటపుడు మనం నిత్య చరిత్ర సత్యాన్వేషి, గొప్ప చరిత్రకారుడు, అంతకుమించిన శాసన పరిశోధకులు ”శాసనాల శాస్రిగా పేరుపొందిన బి.యన్‌. శాస్త్రి గురించి ప్రస్తావించకుండా వుండలేము. 14 శాసన సంపుటాలను ఒంటి చేత్తో వెలువరించిన ఘనులు శాస్త్రి. కాయస్తుల శాసనాలు, రేచర్ల రెడ్డి శాసనాలు, చెఱకురెడ్డి శాసనాలు, మల్యాల వంశ శాసనాలు, దుర్గామల్లీశ్వరాయల శాసనాలు, ముఖ లింగం శాసనాలు, త్రిపురాంతక దేవాలయ శాసనాలు, వేములవాడ శాసనాలు, పద్మనాయకుల శాసనాలు, గోల్కొండ కుతుబ్‌ షా శాసనాలు వీటిలో ప్రముఖమైన కొన్ని. ఇప్పటి వరకు ‘తెలంగాణలో పుట్టి తెలంగాణా శాసనాలు పరిష్కరించిన తెలంగాణా వాది, వాసి బి.యన్‌. శాస్త్రి గారే!! వీరికి ముందు తెలంగాణా శాసనాలను పరిష్కరించిన వారందరూ తెలంగాణా ప్రాంతేతరులే!! 2013లో వ్యాసరచయిత ”ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని) పేర ఇరవై ఐదు శాసనాలు పరిష్కరించి ప్రకటించారు.

తెలంగాణా ఉద్యమ ఫలితంగా తెలంగాణా వారు ముఖ్యంగా యువకులు తమ చారిత్రక మూలాలను వెతుక్కుంటున్నారు.. చరిత్ర పట్ల, చారిత్రక ఆధారాల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా అనేక మంది యువకులు చారిత్రక శాసనాధ్యాయనం చేస్తున్నారు. వారిలో పేర్కొనదగ్గ వారు ఆలేరు నివాసి విశ్రాంత అధ్యాపకులు రామోజు హరగోపాల్‌. వీరు శాసనాలపై ప్రత్యేక శ్రద్ధతో క్షేత్ర పర్యటనలు చేస్తూ నూతన శాసనాలను పరిష్కరిస్తున్నారు. అలాగే వరంగల్‌కు చెందిన రాచర్ల గణపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు శ్రీనివాసన్‌లు కూడా తెలంగాణా చరిత్ర, శాసనాలపై ప్రత్యేక ఆసక్తికలవారు.

తెలంగాణాలో లభించే శాసనాలన్నీ చరిత్ర రచనకి ప్రముఖమైనవే ! అయితే అత్యంత ప్రత్యేకమైనవి. మన తెలుగువారి చరిత్ర గతిని మార్చినవి కొన్ని శాసనాలున్నాయి. అదే సమయంలో మిక్కిలి ప్రాశస్త్యమున్న శాసనాలు కొన్ని, శాసన పరిష్కర్తలు కూడా ప్రాంతేతరుల దాడులకు, దుష్ప్రచారాలకు గురైనారు. వాటిలో
1.పైన పేర్కొన్న తెలంగాణాలో తొలి లిపి, శాసనాలు కోటలింగాల నాణెములపై కన్పిస్తాయి. అట్లే శాతవాహనుల తొలి శాసనాలు కోటిలింగాల, ధూళికట్ట, మునులగుట్ట వద్ద లభిస్తున్నాయి. (ఈ మూడు ప్రాంతాలు నేటి జగిత్యాల జిల్లాలలోనివే). కానీ వీటిని తెలుగువారి చారిత్రక గ్రంథాలలో యింకా పేర్కొనక దాడులు చేస్తూనే ఉన్నారు.

2.ఇక్ష్వాకుల కాలంనాటి నాగార్జునకొండ, ఏలేశ్వరం, ఫణిగిరి శాసనాలు చారిత్రక ప్రాధాన్యత ఉన్నవి. నాగార్జున కొండ త్రవ్వకాలలో లభించిన శతాధిక శాసన శకలాలలో నాలుగు శాసనాలు అత్యంత ప్రాముఖ్యమైనవన్న విషయం అందరూ అంగీకరించాల్సిన విషయమే. మరొక శాసన శకలముపై ‘శక’ వంశానికి చెందిన బాలిక ప్రశంస ఉన్నది. ఉజ్జయిని కేంద్రంగా ఇక్ష్వాకుల సమకాలీనులుగా పరిపాలన చేసిన వారు ఈ శకులు. ఈ ఉజ్జయినీ శకరాజ కుమార్తె రుద్రధర భట్టారిక ఇక్ష్వాకు వీరపురుష దత్తుని భార్య. నాగార్జున కొండ శాసనాల ద్వారా తెలంగాణా ప్రాంతానికి యితర ప్రాంతాలలో (సుదూర శ్రీలంకతో సహా) గల సంబంధ బాంధవ్యాలు తెలుస్తాయి. అట్లే ఇక్ష్వాకు రాణీవాసపు ఘనత కూడా తెలుస్తుంది. ఫణిగిరిలో యిటీవల బయల్పడిన రుళ పురుష దత్తుని 18వ రాజ్య సంవత్సరపు శాసనం అత్యంత ప్రాముఖ్యమైనది. యిప్పటి వరకు రుళ పురుష దత్తుడు 12 సంవత్సరాలే రాజ్యం చేశాడని భావించారు. కానీ, ఈ శాసనం వల్ల ఇక్ష్వాకుల పాలనా కాలం మరొక ఆరు, ఏడు సంవత్సరాలు ముందుకు జరుగుతుంది. అలాగే ఈ శాసనంలో బుద్ధున్ని ‘కంసనిసూదన’ వంటి బిరుదులతో పేర్కొన్నారు. అంటే బుద్దుడు హైందవ దేవగణంలో కలిసే దశ (కలిపేసే దశ) ఆరంభమైనదని చెప్పవచ్చు. అట్లే శాసనాలు ప్రాకృత భాష నుండి సంస్కృత భాషలోకి మార్పు చెందడం ఈ శాసనం ద్వారా తెలుస్తుంది.

3.ఇక్ష్వాకుల తర్వాత యిక్కడ కన్పిస్తున్నవి విష్ణుకుండినుల శాసనాలు. వీరి శాసనాలలో చరిత్ర గతిని మార్చినవి గోవింద వర్మ, విక్రమేంద్ర భట్టార వర్మల తుమ్మల గూడెం తామ్ర శాసనాలు. తెలంగాణా ప్రాశస్త్యాన్ని చారిత్రక ప్రాధాన్యాతను యినుమడింపచేసిన ఈ తామ్రశాసనాలు, వీటిని పరిష్కరించిన బి.యన్‌. శాస్త్రి కూడా యితర శాసన పరిశోధకుల దాడులకు, దుష్ప్రచారాలకి గురైనారు. దీని వల్ల శాస్త్రి చాలా కాలం మనస్తాపం చెందారు.
(దాడులు, దుష్ప్రచారాలు వచ్చే సంచికలో…)