క్యాన్సర్‌కు మందు నా లక్ష్యం
తెలంగాణలోని మారుమూల పల్లెలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినా కూడా స్వయంకృషితో పైకి ఎదిగి, ఉన్నత చదువులు చదివాడు, 2010లో నైపర్‌లో పీహెచ్డీ ప్రవేశపరీక్ష వ్రాసి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు, ఉన్న ఊరికి, తన రాష్ట్రానికి పేరు తెచ్చిన ఆ యువకుడు నీరడి దినేష్. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి ఈ రోజు పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. క్యాన్సర్‌కు మందు కనిపెట్టడం తన జీవితలక్ష్యం అంటున్నారు. యువ సైంటిస్టుగా ఎన్నో పరిశోధనలు చేస్తూ పలు ఆవిష్కరణలకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. ప్రతిష్ఠాత్మకమైన మొహాలీలోని నైపర్‌లో సీటు సాధించడం గొప్ప విషయం. దేశం మొత్తంలో 600 మంది ఎంపిక కాగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురు మాత్రమే ఎంపికయ్యారు. వారిలో తెలంగాణ నుంచి దినేష్ ఒకడు కావడం ఆయన ప్రతిభకు తార్కాణం. ప్రస్థుతం గేదెల పొదుగులకు వచ్చే సంక్రమిత వ్యాధులపై పరిశోధనలు చేస్తు న్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌లేని, వ్యాధిని పూర్తిగా నయం చేయగలిగే మందు కనిపెట్టాలనేది తన జీవితధ్యేయమని చెప్పుకొచ్చారు. దినేష్ సాధించిన విజయాల గురించి ప్రశ్నించగా తన గురించి వివరించారు. ఆయన విజయగాథ తెలుసుకుందాం.

నిజామాబాద్జిల్లా కొండాపూర్‌లో 1986లో జన్మించిన నీరడి దినేష్ వాళ్ళది ఒక వ్యవసాయ కుటుంబం. తండ్రి, తల్లి, ముగ్గురు అన్నలు, ఒక అక్క ఉన్నారు. అన్నలు, తండ్రి వ్యవసాయ పనులు చూసుకునే వారు. దినేష్ మొదటి నుంచి కూడా బాగా చదువుకునే వాడు. ఇతనికి చదువుపై ఉన్న శ్రద్ధను చూసి దినేష్‌ను ఉన్నత చదువులు చదివించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. 4వ తరగతి వరకు కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదివిన అనంతరం 5వ తరగతికి ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరారు. 10వ తరగతి వరకు అక్కడ చదివిన తరువాత ఇంటర్మీడియట్ హత్నూర లోని గురుకుల కళాశాలలో చేరారు. ఇంటర్ పూర్తయిన తరువాత శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఫార్మసీలో 2 సంవత్సరాలు డిప్లొమ ఇన్ ఫార్మసీ పూర్తి చేశారు.
అనంతరం హన్మకొండలోని వాగ్దేవి కాలేజీలో బిఫార్మసీ పూర్తి చేశారు. అప్పటికి సంతృప్తి చెందక ఇంకా పై చదువులు చదవాలనే ఉద్దేశ్యంతో జాతీయస్థాయి ప్రవేశపరీక్షలైన గేట్, నైపర్ ప్రవేశపరీక్షలు వ్రాశారు. గేట్లో 1200 ర్యాంకు రాగా, నైపర్‌లో 28వ ర్యాంకు వచ్చింది. దీంతో మొహాలీలోని నైపర్ కళాశాలలో చేరిపోయారు. అక్కడ రెండు సంవత్సరాలు ఫార్మా బయోటెక్నాలజీ కోర్సు పూర్తి చేశారు. అనంతరం పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ వ్రాసి జాతీయస్థాయిలో మొదటిర్యాంకు సాధించారు. 4 సంవత్సరాలు పీహెచ్‌డీలో మానవ రక్త నమూనాలపై పరిశోధనలు చేశారు. బీహార్, బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో స్లమ్ ఏరియాల్లో వచ్చే కాలా హజార్ (లీష్ మెనియాసిస్) జ్వరంపై పరిశోధనలు చేసి 15 అంతర్జాతీయ వైజ్ఞానిక పత్రాలు సమర్పించారు. 6 మాలిక్యూల్స్ చేయడం జరిగింది. క్లినికల్ సాంపుల్స్ తీసుకుని పరిశోధించారు. దీంతో పేటెంట్ హక్కు రావడం జరిగింది. ఈ పరిశోధనలపై దినేష్‌కు డాక్టరేట్ ప్రధానం చేయబడింది.
డాక్టరేట్ పూర్తి చేసుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత దినేష్ హైదరాబాద్ తార్నకలోని జాతీయ పోషకాహార సంస్థలో పోస్టు డాక్టరల్ ఫెలోషిప్ (పి.డి.ఎఫ్.) ఒక సంవత్సరం పూర్తి చేశారు. అనంతరం సీసీఎంబీలో జూనియర్ సైంటిస్ట్‌గా చేరి 4 సంవత్సరాల పాటు మలేరియా వ్యాక్సీన్‌పై, ఆటోఫేజీపై పరిశోధనలు చేశారు. అవి పూర్తి అయ్యాయి.

ప్రస్థుతం పి.వి.నరసింహారావు వెంటర్నరీ యునివర్సిటీలో పశువుల పొదుగులపై వచ్చే సంక్రమిత వ్యాధుల గురించి పరిశోధనలు చేస్తున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపగా వారు ఈ పరిశోధనల గురించి రూ. 25లక్షలు మంజూరు చేసినట్లు దినేష్ తెలిపారు. దేశం మొత్తంలో 25 మంది యువ శాస్త్రవేత్తలను గుర్తించి నిధులు మంజూరు చేయగా అందులో తాను ఒకడినని తెలిపారు. తాము, వెటర్నరీ యునివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనలు కొనసాగిస్తున్నా మని తెలిపారు. ఈ వ్యాధులకు మందులు కనుగొనే పరిశోధనలో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు. ఇది ఫలవంత మైతే పాడిపరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
భార్య కవిత, ఆమె ప్రస్తుతం వనిత ఫార్మసీ కాలేజీలో అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తమకు బాబు పుట్టి బ్లడ్ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు, దీనితో క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నానని తెలిపారు. ఇది ప్రపంచాన్ని పీడిస్తున్న మహమ్మారి అన్నారు. ఈ జబ్బుకు కీమోథెరపీ చేసినా కూడా అది మనిషిని పీల్చిపిప్పి చేస్తుందని, క్యాన్సర్ వ్యాధి తగ్గినా సైడ్ ఎఫెక్ట్స్‌తో మనిషి చనిపోతాడని తెలిపారు. ఈ ట్రీట్మెంట్ రోగికి హాని చేస్తుందన్నారు. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, వ్యాధిని పూర్తిగా నయం చేయగలిగే మందు కని పెట్టాలని ప్రయత్నిస్తున్నానని తెలిపారు. జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ఉపయోగించి మందు కనిపెట్టాలని పరి శోధిస్తున్నట్లు తెలిపారు. దినేష్ తన పరిశోధనల ద్వారా ప్రపంచాన్ని పీడిస్తున్న పలు వ్యాధులకు మందు కనుగొనాలని ఆశిద్దాం.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంస
తెలంగాణ యువకుడు నీరడి దినేష్ చేస్తున్న పరిశోధనలు, ఆయన తెచ్చుకున్న జాతీయ స్థాయి ర్యాంకుల గురించి తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందించారు. అలాగే పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు దినేష్‌ను సత్కరించి గౌరవించాయి.