దావోస్‌లో పెట్టుబడుల వెల్లువ

By: దిలీప్‌ కొణతం

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మే నెలలో లండన్‌, దావోస్‌లో తెలంగాణ ప్రతినిధి బృందంతో జరిపిన పర్యటన పెట్టుబడుల వెల్లువ సృష్టించింది. ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో పేరెన్నిక గలిగిన అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చాయి.

రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికా, చైనా, జపాన్‌ వంటి దేశాలకు ప్రతినిధి బృందంతో వెళ్లిన మంత్రి కేటీఆర్‌, తొలిసారిగా లండన్‌ పర్యటనకు వెళ్లారు. తొలుత లండన్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు హీత్రో విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ పౌరులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మంత్రి వెంట బ్రిటిష్‌ డిప్యూటీ హైకమీషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, యూకే-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

లండన్‌లో అనేక ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరిపారు. బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల మంత్రి రనిల్‌ జయవర్ధనేతో జరిగిన సమావేశంలో తెలంగాణ, బ్రిటన్‌ల మధ్య వివిధ అంశాల్లో పరస్పర సహకారం గురించి చర్చించారు.

ప్రఖ్యాత బ్రిటిష్‌ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు లార్డ్‌ కరణ్‌ బిల్లిమోరియా మంత్రి కేటీఆర్‌ తో బ్రిటన్‌ పార్లమెంటు భవనంలో సమావేశమయ్యారు.

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు, పలువురు బ్రిటన్‌ ఎంపీలతో పార్లమెంటు భవనంలో జరిగిన సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ బ్రిటిష్‌ కంపెనీలకు హైదరాబాదు నగరం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ అవకాశాల గురించి సవివరంగా వివరించారు.

లండన్‌లోని భారత హైకమీషన్‌ కార్యాలయం అక్కడున్న ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. సుమారు వందమంది ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు పాల్గొన్న ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న సర్వతోముఖాభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పట్టణంలో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొనవలసిందిగా మంత్రి కేటీఆర్‌ను నిర్వాహకులు ఈ ఏడాది కూడా ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం జనవరి మూడో వారంలో జరిగే దావోస్‌ సదస్సు ఈసారి కోవిడ్‌ కారణంగా వాయిదాపడి మే నెలలో జరిగింది.

లండన్‌లో వారం రోజుల పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్‌ బృందం నేరుగా అక్కడినుండి ప్రపంచ ఆర్థిక సంస్థ (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) సమావేశాల్లో పాల్గొనడానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరి వెళ్లింది.
దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఈసారి భారత్‌ నుండి ఆరు రాష్ట్రాలు పెవిలియన్లు ఏర్పాటు చేసి తమతమ ప్రతినిధి బృందాలను పంపగా మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దావోస్‌లోని ప్రధాన వీధి ప్రోమినేడ్‌లో తెలంగాణ పెవిలియన్‌ సదస్సు జరిగిన నాలుగు రోజులపాటు సందర్షకులతో కిటకిటలాడింది.

విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటయిన తెలంగాణ పెవిలియన్‌లోకి ప్రవేశించగానే రిసెప్షన్‌ పక్కనే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి సందర్షకులకు వివరించే ఒక వర్చువల్‌ రియాలిటీ షో ఏర్పాటు చేశారు. మీడియా ఇంటర్వ్యూల కోసం ఒక వేదిక, మీటింగుల కోసం ఒక బోర్డ్‌ రూం, సందర్షకుల కోసం తెలంగాణ సమాచారం, పాలసీలతో కూడిన బ్రోచర్లు అందుబాటులో ఉంచారు. పెవిలియన్‌కు విచ్చేసిన మల్టీ నేషనల్‌ కంపెనీల సీ.ఈ.ఓ.లు, మీడియా ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నాయకులు, తెలంగాణ పెవిలియన్‌ను అద్భుతంగా ఉన్నదని కొనియాడారు.

2022 దావోస్‌ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలు

  • హ్యుండై గ్రూప్‌ తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో దావోస్‌లోని తెలంగాణ పెవీలియన్‌లో హ్యుండై సిఐఓ యంగ్చోచి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది.
  • తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్‌ రైల్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధా సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్టాడ్లర్‌ రైల్‌ కలిసి ఈ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. స్టాడ్లర్‌ రైల్‌ కంపెనీ పెడుతున్న వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు.
  • అలియాక్సిస్‌ సంస్థకు చెందిన ఆశీర్వాద్‌ పైప్స్‌ రూ. 500 కోట్ల పెట్టుబడితో తమ తొలి కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో అలియాక్సిస్‌ సిఎఫ్‌ఓ కోయెన్‌ స్టిక్కర్‌ సమావేశం అనంతరం సంస్థ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలోని 500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. అలియాక్సిస్‌ సంస్థ ప్లాస్టిక్‌ పైల్స్‌, ఫిట్టింగ్లు ఇతర ఉపకరణాలు తయారు చేస్తుంది.
  • లులు గ్రూప్‌ రాష్ట్రంలో రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ప్రాసెసింగ్‌ రంగానికి సంబంధించి తెలంగాణలో మరో ప్రాంతంలోనూ తమ యూనిట్‌ ప్రారంభించే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు యూసుఫ్‌ అలీ తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు సంబంధించి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్‌ వంటి విదేశాలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్‌ ఉండబోతున్నట్లు యూసుఫ్‌ అలీ తెలిపారు. రాష్ట్రంలో తమ గ్రూప్‌ తరఫున మరిన్ని పెట్టుబడులను భారీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాల కోసం పెట్టనున్నట్లు మంత్రి కేటిఆర్‌కు యూసుఫ్‌ అలీ వివరించారు.
  • ఫెర్రింగ్‌ ఫార్మా హైదరాబాద్‌లో రూ. 500 కోట్లతో తన విస్తరణ ప్రణాళికలు వెల్లడించింది. భారతదేశంలో తమ కార్యకలాపాల విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్‌ కు చెందిన ఫెర్రింగ్‌ ఫార్మా ప్రకటించింది.
  • స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బీమా సంస్థ స్విస్‌ రీ ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌తో స్విస్‌ రీ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెరోనికా స్కాట్టి భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. 160 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన స్విస్‌ రీ బీమా సంస్థ స్విట్జర్లాండ్లోని జ్యూరిక్‌ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా 80 స్థానాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.
  • ఈ కామర్స్‌ సంస్థ ‘మీషో’ హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చింది. ఇప్పటిదాకా ఈ సంస్థ సేవలు నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఈ సంస్థ సేవలు అందనున్నాయి.
  • స్పానిష్‌ మల్టీ నేషనల్‌ కంపెనీ ‘‘కీమో ఫార్మా’’ హైదరాబాద్‌ నగరంలో 100 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. స్పెయిన్‌ దేశానికి చెందిన కీమో ఫార్మా ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా, అదనంగా తన రెండో ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
  • తెలంగాణలో మరో తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ష్నైడర్‌ ఎలెక్ట్రిక్‌ ఈ రోజు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌ తో దావోస్‌ లో సమావేశమైన ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లుక్‌ రిమోంట్‌ ఈ మేరకు కంపెనీ తరఫున ప్రకటన చేశారు. తమ నూతన తయారీ ప్లాంట్‌ నుంచి ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ఆటోమేషన్‌ ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు తెలిపారు.
  • తెలంగాణలో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకున్నది. డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు మాస్టర్‌ కార్డుతో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామి కానున్నది.
  • అంతర్జాతీయ కంపెనీ జిఎంఎం ఫాడులర్‌ హైదరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే గ్లాస్‌ రియాక్టర్‌, ట్యాంక్‌, కాలమ్‌లను తయారు చేసే జిఎంఎం ఫాడులర్‌ హైదరాబాద్‌ తయారీ కేంద్రంపై అదనంగా 3.7 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుంది.
  • క్షయవ్యాధి (టిబి) డయాగ్నస్టిక్‌ కిట్లను తయారుచేసే గ్లోబల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఈఎంపిఈ డయాగ్నోస్టిక్స్‌ ప్రకటించింది. జీనోమ్‌ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్దారణ కిట్‌లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. రూ. 50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కంపెనీ కల్పించబోతుంది.
  • హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ప్రపంచ ఫార్మా దిగ్గజం డీఎఫ్‌ఈ ఫార్మా తన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. డీఎఫ్‌ఈ ఫార్మా ఏర్పాటు చేయనున్న కేంద్రం క్లోజర్‌ టూ ఫార్ములేటర్‌ (సీ2ఎఫ్‌) ప్రాతిపదికన పని చేయనుంది.

లండన్‌ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలు

  • ప్రముఖ యుకె ఫార్మా కంపెనీ ‘‘సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌’’ హైదరాబాద్‌లో తమ పార్టికల్‌ క్యారెక్టరైజేషన్‌ లాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏడువేల చదరపు మీటర్ల వైశాల్యంలో హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయబోయే ఈ ల్యాబ్‌ లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాసుటికల్‌ పౌడర్‌ క్యారెక్టరైజేషన్‌ పై పరిశోధనలు జరుగుతాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. రాబో యే రెండు సంవత్సరాల్లో ఈ ల్యాబ్‌ను మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌ ప్రకటించింది.
  • ప్రతిష్ఠాత్మక లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకాడమిక్‌ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కింగ్‌ కాలేజ్‌ పనిచేస్తుంది. ఫార్మారంగ ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్‌ కాలేజ్‌ తన సహకారాన్ని అందిస్తుంది.
  • ఎలక్ట్రిక్‌ బస్సులు, వ్యాన్లు, వాణిజ్య వ్యాన్ల తయారీ సంస్థ అరైవల్‌ యూకే లిమిటెడ్‌ను సందర్శించి కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు. తెలంగాణతో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యాపారాన్ని విస్తరిం చుకునేందుకు అలాక్స్‌ రిసోర్సెస్‌ ఎల్‌ఎల్పీతో అరైవల్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకున్నది.