ఇది కెసీఆర్‌ మార్క్‌ బడ్జెట్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే అనేక రంగాలలో దేశంలోకెల్లా అగ్రగామిగా రూపుదాల్చింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్‌ రావు శాసన సభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌లో 2,56,958.51 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,89,274.82 కోట్ల రూపాయలుగా, క్యాపిటల్‌ వ్యయం 29,728.44 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు.

ఇప్పటికే వందల సంఖ్యలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం మరికొన్ని వినూత్న పథకాలను కూడా ఈ బడ్జెట్‌ లో ప్రకటించింది. పేదలకు స్థలం ఉంటే రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు, మొదటి దశలో లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిళ్ళు, ఆసరా పెన్షన్ల అర్హత వయస్సు తగ్గించి, 57 ఏళ్ళకే ఆసరా పెన్షన్లు, రైతన్నల మాదిరిగానే, నేతన్నలకు కూడా రూ.5 లక్షల బీమా సౌకర్యం, గీత కార్మికులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో పథకం, రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం, అటవీ యూనివర్సిటీ ఏర్పాటు, బాలింతల్లో రక్త హీనత సమస్య పరిష్కారానికి కేసీఆర్‌ పోషకాహార కిట్‌, 7 నుంచి 12వ తరగతి చదివే 7 లక్షల మంది విద్యార్థినులకోసం ఆరోగ్య సంరక్షణ కిట్‌ వంటి వినూత్న పథకాలను ఈ బడ్జెట్‌ లో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన రీతిలో ప్రోత్సాహం లభించకపోవడం, కరోనా మహమ్మారి వల్ల రావాల్సి నంతగా ఆదాయం రాకపోయినా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమర్థ నాయకత్వంలో ఈ అవరోధాలు అన్నింటిని అధిగమించి రాష్ట్రం సాధించిన ప్రగతిని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌ రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో సవివరంగా వివరించారు.

‘కాళ్లల్ల కట్టెపెట్టినట్టు’ కేంద్రం వైఖరి

బడ్జెట్‌లోని వివిధ పద్దుల వివరాల్లోకి వెళ్లే ముందు ఒక కఠోర వాస్తవాన్ని నేను ప్రస్తావించక తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే. స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కేంద్రం వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే ‘కాళ్లల్ల కట్టె పెట్టినట్టు’ ఉంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోకముందే, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. తెలంగాణ తొలి అడుగులోనే కేంద్రం అప్రజాస్వామిక చర్యను నిరసిస్తూ బంద్‌ను పాటించాల్సి వచ్చింది. ఏడు మండలాల అక్రమ బదలాయింపుతో మన రాష్ట్రం లోయర్‌ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును కోల్పోయింది. ఐదేళ్ళ పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం అనవసరంగా తాత్సారం చేసింది.

విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఇప్పటికీ అమలు చేయటం లేదు. ఇవి చాలవన్నట్టు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి చర్చ జరిగిన ప్రతీసారి ‘‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’’ అని పదే పదే వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బ తీస్తున్నారు. తెలంగాణలో అమలు పరుచవలసిన ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించేది. కేంద్రం ఆ అవకాశం కూడా లేకుండా చేసింది.

కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ, ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో అనవసర జాప్యం చేస్తోంది. ఒకవైపు కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం అని గొప్పగా చెప్తూ రెండో వైపు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను కబళిస్తోంది.

కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరుతూ, ఎంతో ఆశతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుకు ఎన్నో ప్రతిపాదనలు సమర్పించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని, ప్రధాన మంత్రికి వినయంగా విన్నవించారు. కానీ లాభం లేకపోయింది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చేసిన సిఫారసులనూ కేంద్రం బుట్టదాఖలు చేసింది. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటూ ఇతర ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఏ.పి. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(1) పేర్కొంది. కానీ, చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ కేంద్రం ఇవ్వలేదు. విభజన చట్టంలోని హమీలైన బయ్యారం స్టీల్‌ ప్లాంటు, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీలేదు. రైల్‌ కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు పెండింగ్ లోనే పెడుతున్నది. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కంటితుడుపుగా కేవలం 20 కోట్లను విదిల్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన 495 కోట్ల మొత్తాన్ని పొరపాటుగా ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో జమచేసింది. ఏడేళ్ల నుంచి అడుగుతున్నా ఇప్పటికీ మన రాష్ట్ర నిధులను తిరిగి ఇవ్వలేదు. దీన్ని బట్టి కేంద్ర నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకోపక్క జహీరాబాద్‌ లోని ‘నిమ్జ్‌’(NIMZ)కు సంబంధించి కేంద్రం వాటా 500 కోట్ల రూపాయలను ఇప్పటికీ ఇవ్వలేదు.

ఆర్థిక సంఘాల సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం ఆనవాయితీ. 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి 2020-21 సంవత్సరానికి 723 కోట్ల రూపాయలను ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని సిఫార్సు చేసింది. రాష్ట్రానికి ఇచ్చే నిర్దిష్ట గ్రాంట్లు 2362 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు. అదే విధంగా సెక్టార్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్లు 3,024 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఈ మొత్తం గ్రాంట్లు కలిపి 5,386 కోట్ల రూపాయల నిధులను తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం తొక్కిపెట్టింది.

కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయ సమ్మతంగా దక్కాల్సిన నిధులలో కోతలు విధించింది. కంటితుడుపుగా రుణపరిమితి పెంచుతూ దానికి షరతులు విధించింది. ఎఫ్‌.ఆర్‌.బి.ఎం. పెంపుదలకు, విద్యుత్తు సంస్కరణలకు లంకెపెడుతూ కేంద్రం రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టింది. రైతు వ్యతిరేక విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఏటా 5 వేల కోట్లు సమకూర్చుకునే అవకాశం కోల్పోయింది. మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కోసం చూస్తే బాయిలకాడ మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలి. అది మా విధానమే కాదు. “కంఠంలో ప్రాణం ఉండగా విద్యుత్తు సంస్కరణలకు ఒప్పుకోము” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి తెగేసి చెప్పారు. నాలుగు కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం 25 వేల కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌ లోనూ రాష్ట్రానికి అన్యాయమే జరిగింది. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక్క పథకానికీ డబ్బులు ఇవ్వలేదు. అంతా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. పోనీ మనకు మనం రుణం తెచ్చుకోనైనా అభివృద్ధి చేసుకుందామనుకుంటే దానికీ మోకాలడ్డుతోంది.

కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్దంగా 41 శాతం రాష్ట్రాలకు రావాలి. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఈ వాటాను కుదించడానికి కేంద్రం సెస్సుల రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. సెస్సుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి కేంద్రం గండి కొడుతోంది. రాష్ట్రాలకు 41 శాతం రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తోంది. కేంద్రం చేస్తున్న ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం తప్పు పట్టింది.

ఇన్ని రకాల ప్రతికూలతలు, పరిమితుల మధ్య తెలంగాణ రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీనికి కారణం ముఖ్యమంత్రి దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్టమైన ఆర్థిక విధానాలు.

నేడు తెలంగాణ కరువు కాటకాల నుంచి సాగునీటి సమృద్ధిని సాధించింది. కరెంటు కోతల నుంచి 24 గంటల విద్యుత్తు కాంతులలోకి పయనించింది. సంక్షోభకాలం నుంచి సంక్షేమ యుగంలోకి ప్రవేశించింది. అవమాన పరంపర నుంచి ఆత్మగౌరవ చైతన్యంలోకి అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రజాస్వామ్య భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం ఒక అద్భుతం.

Today Telangana is a Torch Bearer. “నేడు తెలంగాణ ఆచరించింది, రేపు దేశం అనుసరిస్తుంది.” ఈ మాట అక్షర సత్యం. ఈ ఏడున్నర సంవత్సరాల చరిత్రే దానికి సాక్ష్యం. ఈ ప్రగతి యాత్రకు కొనసాగింపే నేడు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్‌. 2022- 23 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఖజానాకు ఎంత ధనం వచ్చి చేరిందన్నది కాదు… ఆ ధనం ప్రజల జీవితాల్లో ప్రతి ఫలించిందా? లేదా? అన్నదే ముఖ్యం. బడ్జెట్‌ అంటే అంకెల సముదాయం కాదు.. ప్రజల ఆశల, ఆకాంక్షల వ్యక్తీకరణ.

సంపన్నులు మరింత సంపన్ను లైతే ఆ సంపద వారి నుంచి పేదల వైపు ప్రవహిస్తుందని చెప్పే టికిల్‌ డౌన్‌ థియరీ బడ్జెట్‌ కాదు మాది. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్‌ ! ఇది ముమ్మాటికీ, కేసీఆర్‌ మార్కు బడ్జెట్‌ !!

ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ

2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాడు రాష్ట్ర జీ.ఎస్‌.డి.పి. 4,51,580 కోట్ల రూపాయలు. అది 2021-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది. 2015-16 నుంచి రాష్ట్ర జి.ఎస్‌.డి.పి వృద్ధి రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నది. పైగా ఏటికేడు వృద్ధి రేటు మధ్య వ్యత్యాసం పెరుగుతూ వస్తున్నది. కరోనా విపత్తు నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు మైనస్‌ 1.4 శాతం నమోదైంది. అనేక రాష్ట్రాలు కూడా నెగెటివ్‌ గ్రోత్‌ రేటును నమోదు చేశాయి. కానీ తెలంగాణ మాత్రం 2.2 శాతం పాజిటివ్‌ వృద్ధి రేటు సాధించింది. ఇది వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది.

రాష్ట్రం స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నదని చెప్పడానికి కరోనా విపత్తు సందర్భంలోను పెరిగిన ఆర్థిక వృద్ధి రేటు సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధిని సాధించింది. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రగామిగా నిలిచింది.

ముందస్తు అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ తెలంగాణ జి.ఎస్‌.డి.పి వృద్ధి రేటు స్థిర ధరల వద్ద 11.2 శాతం ఉంటుందని అంచనా. అదే సమయంలో దేశ జి.డి.పి వృద్ధి రేటు 8.9 శాతంగా అంచనా వేశారు. ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర జి.ఎస్‌.డి.పి వృద్ధి రేటు 19.1 శాతంగా అంచనా వేస్తే.. దేశ జి.డి.పి వృద్ధి 19.4 శాతంగా ఉండనుంది. దీనిని బట్టి తెలంగాణ అత్యంత వేగంగా కొవిడ్‌ విపత్తు నుంచి కోలుకున్నట్టు అర్థమవుతుంది.

తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి దేశ జి.డి.పి వృద్ధికి కూడా కీలకంగా మారింది. దేశ జి.డి.పి లో తెలంగాణ వాటా 2014-15 లో 4.06 శాతంగా ఉంటే 2021-22 నాటికి 4.97 శాతానికి పెరిగింది. ఏడేళ్లలో దేశ జీ.డి.పి.కి ఒక శాతం అదనపు వాటా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ.

2020-21లో పారిశ్రామిక, సేవా రంగాలు అద్భుతమైన వృద్ధిరేటు నమోదు చేశాయి. ఉత్పత్తి, నిర్మాణ రంగాలు కలిగి ఉన్న ద్వితీయ రంగం ప్రస్తుత ధరల వద్ద 21.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది వృద్ధి -0.3 శాతంగా ఉంది. సేవా రంగం సైతం 18.3 శాతం వృద్ధి రేటు సాధించింది. అంతకుముందు ఏడాది వృద్ధి 0.9 శాతం మాత్రమే.

తలసరి ఆదాయం

తలసరి ఆదాయం పెరుగుదల కోణంలో చూసినప్పుడు 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు. ఇది ఆనాటి దేశ తలసరి ఆదాయమైన 86,647 రూపాయలకంటే 43శాతం ఎక్కువ. 2021-22 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 2,78,833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1,49,848 రూపాయలకంటే ఇది 86 శాతం అధికం.

జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధిరేటులో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది.

2021-22 లో రాష్ట్ర తలసరి ఆదాయం 18.8 శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ వృద్ధి 18.1 శాతంగా నమోదైంది. 2014-15లో దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ.. 2020-21 వచ్చే సరికి అగ్రస్థానానికి చేరింది. ఇది తెలంగాణ ప్రజల విజయం.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

పేదల జీవితాలు మెరుగుపడినప్పుడే సాధించిన ఆర్థిక వృద్ధికి సార్ధకత అని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధితో సంక్షేమాన్ని అనుసంధానించారు.

దళిత బంధుకు 17,700 కోట్లు

75 ఏళ్ల స్వాతంత్య్రం సాక్షిగా దళిత జాతి సాధికారికత అనేది కలగానే మిగిలి పోయింది. దేశాన్ని ఏలిన పాలకపక్షాలు కొన్ని పథకాలు చేపట్టినా అవి అసంపూర్ణ ఫలితాలనే ఇచ్చాయి. నిజమైన అభివృద్ది దళితుల జీవితాల్లో నేటికీ కనిపించడంలేదు. రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ల ఫలితంగా దళితులు విద్యను, ఉపాధిని పొందగలిగారు. అయినా దళితవాడలు పేదరికానికి ఆనవాళ్లుగానే మిగిలిపోయాయి. మెజారిటీ దళిత జనం ఇంకా రెక్కల కష్టం మీదనే ఆధారపడి బతుకుతున్నారనేది అంగీకరించాల్సిన చేదు నిజం.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఆ నిధులు తరువాతి ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా చట్టంలో నిబంధన పెట్టింది. ఈ విధమైన చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ.

భారత రత్న డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో, దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ “దళిత బంధు” అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దళిత జాతి తర తరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని, సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధం “తెలంగాణ దళిత బంధు”. ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. దళితబంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదు. దళితులకు ఉపాధిని, ఆత్మ గౌరవాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని చేకూర్చే ఒక దృక్పథం. ఒక సమర్థవంతమైన విధానం.

రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం 10 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సహాయం అందించడం దళిత బంధులో ఒక భాగం. దేశంలో ఇంత పెద్ద నగదు మొత్తాన్ని ఏ పథకం ద్వారా ఎన్నడూ ఇవ్వలేదు. దళిత కుటుంబానికి ఇంతటి భారీ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తున్న అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దళిత బంధు చరిత్రకెక్కింది.

దళిత బంధు పథకానికి బ్యాంకు లింకేజీ లేదు, సెక్యూరిటీలతో నిమిత్తం లేదు. అంతేకాకుండా లబ్ధిదారులు వారికి వచ్చిన పనిని, నచ్చిన పనిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందివ్వడం తెలంగాణ దళిత బంధు పథకం గొప్పతనం.

దళిత రక్షణ నిధి..

దళిత బంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురయ్యినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా దిగజారిపో కూడదు. ఇందుకోసం దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపద సమయంలో ఈ నిధి వారికి కవచంగా నిలుస్తుంది.

వివిధ వ్యాపారాల్లో దళితులకు రిజర్వేషన్లు…

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల నియామకంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీని వల్ల ఎంతో మంది దళితులు బడుగు బలహీన వర్గాల వారు, స్త్రీలు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు అయ్యే అవకాశం కలిగింది. దళితబంధు పథకంలో భాగంగా దళితులు వివిధ వ్యాపార రంగాల్లో పైకి ఎదగడానికి ప్రత్యేక రిజర్వేషన్లను అమలులోకి తీసుకువచ్చింది.

ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకునే వైన్‌ షాపులు, బార్‌ షాపులు, వివిధ రకాల కాంట్రాక్టులు మొదలైన వాటిలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్‌ షాపుల్లో 261 వైన్‌ షాపులు దళితులకు కేటాయించింది.

దళిత బంధు పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 4వేల కోట్ల రూపాయలతో దాదాపు 40 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022-2023 వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది.

పల్లెలెట్లా మారుతున్నవంటే…

తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతి ప్రమాణాలతో పోల్చితే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో కూడా లేదు. ఇంత గుణాత్మకమైన మార్పుకు ప్రేరణగా నిలిచిన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. పల్లె ప్రగతి అనే పేరుతో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. 1994 లో రూపొందించిన పంచాయతీరాజ్‌ చట్టం అనేక లోపాలతో అసమగ్రంగా ఉన్న కారణంగా నూతన పంచాయతీ రాజ్‌ చట్టం అవసరమని ముఖ్యమంత్రి భావించారు. 2018 నూతన పంచాయతీ రాజ్‌ చట్టానికి రూపకల్పన చేసి అమలులోకి తెచ్చారు.

పంచాయతీ కార్యదర్శుల నియామకం

తెలంగాణ ప్రభుత్వం పెరిగిన జనాభాకు అనుగుణంగా గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769 కి పెంచింది. పరిపాలన సమర్థవంతంగా జరగడం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండే విధంగా 9,355 పోస్టులను కొత్తగా మంజూరు చేసి నియమించింది. గతంలో గ్రామ పారిశుధ్యాన్ని నిర్వహించడానికి కావాల్సిన సాధనాలు పంచాయతీల వద్ద లేకపోయేవి. తెలంగాణ ప్రభుత్వం పట్టుపట్టి పల్లెల స్వరూపాన్ని మార్చేసింది. యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయల కల్పన చేసింది. ఇందులో భాగంగా చెత్త సేకరణతో పాటు వ్యర్థాల నిర్వహణ కోసం ప్రతి ఊరికి ఒక డంపు యార్డును ఏర్పాటు చేసింది. 330 కోట్ల ఖర్చుతో కొత్త విద్యుత్‌ స్తంభాలను అమర్చింది. అన్ని గ్రామాల్లో ఎల్‌. ఈ. డీ వీధి దీపాలు ఏర్పాటు చేసింది.

మొక్కల పెంపకం కోసం ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా నర్సరీలను ఏర్పాటు చేసింది. ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పారిశుధ్య నిర్వహణ కోసం గతంలో రాష్ట్రవ్యాప్తంగా 84 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. ఈరోజు రాష్ట్రంలో 12,769 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతీ గ్రామం ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీలను కలిగి ఉన్నది. పరిశుభ్రత పెరగడంతో ప్రజారోగ్యం మెరుగుపడిరది. దోమలబాధ తగ్గింది. మలేరియా వ్యాప్తి తగ్గింది.

మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేందుకు ప్రభుత్వం 1547 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించింది. ప్రతి నెలా గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ప్రభుత్వం నేరుగా 227.5 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నది. ‘సన్సద్‌ ఆదర్శ గ్రామ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ప్రకటించిన తొలి పది ర్యాంకుల్లో ఏడు ర్యాంకులు తెలంగాణ గ్రామ పంచాయతీలే కైవసం చేసుకున్నాయి. ఇది పల్లె ప్రగతి సాధించిన అద్భుతమైన అభివృద్ధికి తార్కాణం. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ సశక్తీకరణ్‌ అవార్డుల్లో సంగారెడ్డి జిల్లా పరిషత్తుతోపాటు కోరుట్ల, ధర్మారం మండల పరిషత్తులు, ఆరు గ్రామపంచాయతీలూ అవార్డులు అందుకున్నాయి. ఈ వార్షిక బడ్జెట్లో పల్లె ప్రగతి ప్రణాళిక కోసం 3330 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది.

మన ఊరు – మన బడి

గురుకుల విద్యకు మొదటి దశలో పెద్ద పీట వేసిన ప్రభుత్వం, రెండో దశలో ఇతర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మన ఊరు- మన బడి అనే బృహత్తర పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తయారవుతుందని కొఠారీ కమిషన్‌ పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల తరగతి గదులను ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు డిజిటల్‌ విద్యను ప్రోత్సహిస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతున్నది. ఇది గ్రామ స్థాయిలో అయితే మన ఊరు – మన బడి అనే పేరుతో, పట్టణాల్లో అయితే మన బస్తీ- మన బడి అనే పేరుతో అమలవుతుంది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌ గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో తొలిదశ కార్యక్రమం అమలవుతుంది. అది అధికారపక్షానికి చెందిన నియోజకవర్గమా.. లేక ప్రతిపక్షానికి చెందిన నియోజకవర్గమా.. అనే వివక్ష చూపకుండా అన్ని మండలాల్లో, సమాన దృష్టితో మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

పన్నెండు రకాల మౌలిక సదూపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. 1. డిజిటల్‌ విద్య అమలు, 2. విద్యుదీకరణ, 3.తాగునీటి సరఫరా, 4. సరిపడా ఫర్నీచర్‌, 5. పాఠశాలలకు మరమ్మతులు, 6. పాఠశాలలకు రంగులు వేయడం 7. గ్రీన్‌ చాక్‌ బోర్డుల ఏర్పాటు 8. ప్రహారీ గోడల నిర్మాణం 9. కిచెన్‌ షెడ్డుల నిర్మాణం 10. అదనపు తరగతుల నిర్మాణం 11. ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాళ్ల నిర్మాణం 12. నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం. వీటితో పాటు అనేక రకాల సదుపాయాలను మన ఊరు- మన బడి ద్వారా ప్రభుత్వం కల్పిస్తుంది.

ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని శాసనసభకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో ఒక్క ఫారెస్ట్‌ కాలేజీ కూడా లేదు. ఈ లోటును గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ములుగులో ఫారెస్ట్‌ కాలేజీని ఏర్పాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌ నలుదిక్కులా సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలు..

రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. టిమ్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరం నలుదిక్కులా సూపర్‌ స్పెషాల్టీ హస్పిటళ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, అల్వాల్‌, ఎర్రగడ్డలలో ఏర్పాటు చేయనుంది. ప్రతి హాస్పిటల్‌ లో వెయ్యి పడకల చొప్పున నాలుగు వేల పడకలతో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేయబోతున్నది. అదే విధంగా నిమ్స్‌ హస్పిటల్‌ లో మరో రెండు వేల పడకలను ప్రభుత్వం పెంచబోతున్నది. దీంతో నిమ్స్‌ లో మొత్తం 3489 పడకలు అందుబాటులోకి వస్తాయి.

వరంగల్‌ లో హెల్త్‌ సిటీ..

వరంగల్‌లో హెల్త్‌ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్‌ నగరంలో అధునాతనమైన వసతులతో కొత్తగా రెండు వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 24 అంతస్తులతో నిర్మించబోయే ఈ ఆసుపత్రి కోసం 11 వందల కోట్లు వెచ్చించనుంది. ఇందులో 35 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి. గుండె, కిడ్నీ, కాలేయం తదితర అవయవ మార్పిడి ఆపరేషన్లతోపాటు క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ, రేడియేషన్‌ వంటి అత్యాధునిక చికిత్సలూ ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి.

ప్రతి జిల్లాకో వైద్య కళాశాల

60 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఏర్పాటయిన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం మూడంటే మూడే. ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేకన్నా ముందు నుంచే ఉన్నాయి. టి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం ఏడున్నర ఏళ్లలో పన్నెండు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించింది.

రాష్ట్రం ఏర్పడగానే మొదటివిడతగా ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్‌నగర్‌, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేటలో ప్రారంభించింది. ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది. వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డి లకు ప్రభుత్వం మంజూరు చేసింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నది. శరవేగంగా భవనాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతున్నది.

రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్యకళాశాలలను, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్‌ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్‌ లో వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

దవాఖానాల్లో మౌలిక వసతుల అభివృద్ధి..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని దవాఖానలన్నింటిలో మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ‘తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు’ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు 57 కు పైగా పరీక్షలను ఉచితంగా చేస్తున్నాయి. కిడ్నీ రోగులకు వైద్యం కోసం రాష్ట్రంలో 42 ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను, వాటిలో 313 డయాలసిస్‌ మిషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మిషన్ల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డయాలసిస్‌ కేంద్రాలకు రోగులు వచ్చిపోవడానికి ఆర్టీసీ ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 14 చోట్ల సీటీ స్కాన్‌, ఎం.ఆర్‌.ఐ. పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ లలో ‘క్యాథ్‌ ల్యాబ్‌’ సేవలు అందుబాటులో వచ్చాయి. ఈ ల్యాబ్‌లలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతోపాటు పోషకాహారాన్ని అందించాలనీ, ఇందుకోసం డైట్‌ చార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీ.బి., క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్‌ ఒక్కింటికి ఇచ్చే డైట్‌ చార్జీలను 56 రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచాలనీ, సాధారణ రోగులకు ఇచ్చే డైట్‌ చార్జీలు బెడ్‌ ఒక్కింటికి 40 రూపాయల నుండి 80 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతీ ఏటా 43.5 కోట్ల రూపాయలను ఖర్చుచేయనున్నది.

హైదరాబాద్ లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగయితో వుండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతి రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తుంది. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చు అవుతాయి. హాస్పిటళ్లలో పారిశుద్ధ్య ప్రమాణాలు పెంచడం కోసం పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి సహృదయంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బెడ్ ఒక్కoటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ప్రభుత్వం 338 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వెచ్చించనున్నది.

పట్టణ ప్రగతి

తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభాలో అత్యధిక పెరుగుదల నమోదవుతున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్‌ అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకొని కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చింది. పట్టణాలలో అభివృద్ధి కోసం “పట్టణ ప్రగతి” అనే కార్యక్రమం చేపట్టింది. మున్సిపాలి టీలకు ప్రతి నెల ఠంచన్‌గా నిధులు విడుదలవుతున్నాయి. ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించేందుకు అర్బన్‌ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పచ్చదనం పెంపుదల కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కోసం కేటాయిస్తున్నది.

టీఎస్‌ బీపాస్‌ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరం అయింది. స్థల విస్తీర్ణం 75 చదరపు గజాల వరకు ఉంటే, ఆ ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరంలేదు. 500 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న వారు స్వీయ ధృవీకరణతో సింగిల్‌ విండో ద్వారా ఆన్‌ లైన్‌ లో అనుమతులు పొందవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో వెజ్‌ – నాన్‌ వెజ్‌ సమీకృత మార్కెట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు టీ. యూ. ఎఫ్‌. ఐ. డీ. సీ. నిధులు 3 వేలకోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పట్టణాల్లో పేరుకుపోయిన లెగసీ వేస్టును బయో మైనింగ్‌ ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియను 123 మున్సిపాలిటీల్లో 276 కోట్లతో చేపట్టింది. గ్రామాలలో నిర్మించినట్టుగానే పట్టణాల్లో సైతం వైకుంఠధామాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచేందుకు 1602 నర్సరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఎల్‌.ఈ.డీ వీధి దీపాలను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం 2021 లో ప్రదానం చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులలో తెలంగాణ మున్సిపాలిటీలు 12 అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఈ వార్షిక బడ్జెట్లో పట్టణ ప్రగతి ప్రణాళికల కోసం 1394 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది.

10 లక్షలు దాటిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వారా 10లక్షల మంది పేద ఆడపిల్లలకు పెళ్లి ఖర్చులు అందించిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం . ఆడబిడ్డ పెళ్లికి ఒక లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కన్న తల్లి చేతుల్లో పెడుతున్నది. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ ప్రయోజనం పొందిన పేద ఆడపిల్లల కుటుంబాలవారు ప్రభుత్వానికి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

కళ్యాణ లక్ష్మి ప్రయోజనం పొందడానికి వయోపరిమితి 18 ఏళ్లు కావడంతో బాల్య వివాహాలు జరగడం లేదని స్వచ్ఛంద సంస్థల పరిశోధనల్లో వెల్లడయ్యింది. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ కు వార్షిక బడ్జెట్లో 2,750 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది.

వ్యవసాయ సమృద్ధితో అన్నపూర్ణగా తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషితో వ్యవసాయ రంగం కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రగతిని సాధించింది. సస్యశ్యామల తెలంగాణ సాకారం అయ్యింది. నేడు రాష్ట్రంలో ఊహకందని రీతిలో వ్యవసాయోత్పత్తి పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన నిధుల మొత్తం 7,994 కోట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 83,989 కోట్లు ఖర్చు చేసింది.

మిషన్‌ కాకతీయ…

శతాబ్దాలుగా తెలంగాణ వ్యవసాయానికి ఆదరవుగా ఉన్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున చేపట్టింది. 5,350 కోట్లు వెచ్చించి చెరువులను, చెక్‌ డ్యాంలను పునరుద్ధరించింది. వీటి కింద 15.05 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. చెరువుల్లో నిలువ సామర్థ్యం పెరిగింది. దీంతో చేపల పెంపకం ఉపందుకుంది. ఈ చెరువులన్నింటిని ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసింది.

నదులపై, వాగులపై రెండు దశలలో, 3,825 కోట్లతో 1200 చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టింది. మొదటిదశలో చేపట్టిన 650 చెక్‌ డ్యాంల పనులు పూర్తి కావస్తున్నాయి. రెండో దశ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, దేవాదుల తదితర పెండిరగ్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చింది. వీటి ద్వారా దాదాపు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడంతో పాలమూరుతో పాటు ఎన్నో ప్రాంతాలు పచ్చబడ్డాయి. వలసలు ఆగిపోయాయి.

పాలమూరు రంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 35వేల 200కోట్లతో చేపట్టింది. 70 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత రాకుండా ఉండేందుకు కాళేశ్వరం కార్పొరేషన్‌తో అనుసంధానం చేసింది. ఇప్పటి వరకు దాదాపు 18,500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌, ఏదుల, వట్టిం, కరివెన, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్ల, పంపుహౌజుల పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పడుతున్న అవరోధాలను అధిగమించి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయిదు లక్షల ఎకరాలకు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30వేల ఎకరాలకు మొత్తం 12.30 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి తీరుతుంది. దారిపొడుగునా ఉండే సుమారు వెయ్యికి పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తుంది.

నల్గొండ జిల్లాలో కరవు ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండలతో పాటు అచ్చంపేట, కల్వకుర్తిల్లోని అయిదు మండలాల్లో 3.41 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు 6,190 కోట్లతో ఆర్‌.విద్యాసాగర్‌ రావు – డిరడి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ప్రతిఘాతక శక్తులు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేయడం వల్ల ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిరది. ఏది ఏమైనా ఈ ఏడాదిలోనే పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నది.

దేవాదుల, సీతారామ, సీతమ్మ సాగర్‌, చనాక – కొరాట ఎత్తిపోతల పథకాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వార్ధా బ్యారేజీ, కుప్టి, చెన్నూరు ఎత్తిపోతల పథకాలు, నల్లగొండ ఎత్తిపోతల పథకాలు, గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకం, వికారాబాద్‌ రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించబోతున్నాం.

సమ్మక్క సారక్క బ్యారేజీ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. దీంతో దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సమృద్ధిగా సాగు, తాగునీరు లభిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యింది. వాటితో ఆయా ప్రాంతాలకు సాగునీరు లభిస్తోంది. సాధారణంగా రిజర్వాయర్ల నిర్మాణం నదీ మార్గంలో జరుగుతుంది. కానీ, దీనికి భిన్నంగా నదీ, వాగు ఏదీ లేని చోట అతి పెద్ద రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌ నిర్మాణం కావడం సాగునీటి రంగ చరిత్రలోనే ఒక అద్భుతం.

ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో దేశంలోకెల్లా అతిపెద్దదైన రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌ను ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి స్వహస్తాలతో ప్రారంభించారు. 50 టీ.ఎం.సీ.ల నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్‌, గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్‌ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్‌ కావడం విశేషం. దీని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రతిఘాతక శక్తులు అనేక ఆటంకాలు సృష్టించాయి. నిర్మాణం కానే కాదన్నారు.. నీళ్లు రానే రావన్నారు. కోర్టుల్లో 350కి పైగా కేసులు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్ప బలం ముందు ఈ కుట్రలు నిలువలేకపోయాయి. ఉప్పొంగి వచ్చిన గోదావరి జలాలు మల్లన్న సాగర్‌లోకి ప్రవేశించాయి. మల్లన్న సాగర్‌ గోదావరి జలాలతో కొమురెల్లి మల్లన్న పాదాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిషేకించారు.

సంగారెడ్డి జిల్లాలో మూడు లక్షల తొంభై వేల ఎకరాలకు సాగు నీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ఈ మధ్యనే శంకుస్థాపన చేసింది. దీనివల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, ఆందోల్‌ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయి.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో పాటూ, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, యాదాద్రిభువనగిరి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని ప్యాకేజీ పనులను ప్రభుత్వం త్వరితగతిన జరుపుతోంది.

మల్లన్నకు గోదావరి జలాలతో అభిషేకం

మట్టికైనా.. మానుకైనా.. మనిషికైనా జీవం పోసేది నీళ్లే. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నీళ్ల కోసం అనుభవించిన గోస మాటలకు అందనిది. మలి దశ తెలంగాణ పోరాట నినాదమే ‘నీళ్లు-నిధులు- నియామకాలు’.ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ నీటి ఆర్తిని తీర్చడాన్ని ఒక తపస్సులా భావించారు. సాగు నీటి రంగ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించారు.

తెలంగాణాలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం 85.89 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించింది. చిత్తశుద్ధి, పట్టుదల ఉంటే కానిది లేదు అని అనడానికి సాగు నీటి రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్దే నిదర్శనం.

రాష్ట్రంలోని అన్ని సాగు నీటి వ్యవస్థలు – ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్‌ డ్యాంలు, ఆనకట్టలు, కత్వలు, చిన్న, పెద్ద లిఫ్ట్‌ స్కీంలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగు నీటి శాఖను పునర్‌ వ్యవస్థీకరించారు. ప్రాజెక్టుల నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటి నిర్వహణాపరమైన అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది.

సింగరేణి కార్మికుల సంక్షేమం- లాభాల్లో వాటా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సింగరేణి కార్మికులకు కంపెనీ లాభాల్లో ఇచ్చే వాటాను రాష్ట్ర ప్రభుత్వం 18 నుంచి 29 శాతం వరకు పెంచుకుంటూ వచ్చింది. తద్వారా 2014 నుంచి 2020 వరకు సింగరేణి కార్మికులకు రూ. 1546.59 కోట్ల లబ్ధి జరిగింది. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.

డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీం విధి విధానాలను సరళీకృతం చేయడం ద్వారా 11 వేల 888 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణం కోసం పది లక్షలు రూపాయలు వడ్డీలేని రుణం ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది.

సమర్థవంతంగా కరోనా కట్టడి.

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసించింది. దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలోని అన్ని పడకలను ఆక్సిజన్‌ పడకలుగా మార్చింది. పీడియాట్రిక్‌ ఐ.సి.యు.లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 135 టన్నుల నుంచి 550 టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకున్నది.

రాష్ట్రంలో నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వ సిబ్బంది ప్రజల ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలను నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారికి కరోనా కిట్లను అందించారు. అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించి వైద్యం చేయించారు. నీతి ఆయోగ్‌ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో జ్వర సర్వేను బెస్ట్‌ ప్రాక్టీసుగా ప్రకటించింది. వైరస్‌ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే కట్టడి చేసేందుకు ఇది సరైన పద్ధతి అని పేర్కొన్నది. దీనివల్ల ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గిందని ప్రశంసించింది.

వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కోవడంలో పటిష్టమైన కార్యాచరణను అమలు చేసిన మూడో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణాను ఎకనమిక్‌ సర్వే గుర్తించింది. కరోనా వాక్సినేషన్‌ ప్రక్రియలో సైతం తెలంగాణ జాతీయ సగటు కన్నా ముందుంది.

బస్తీ దవాఖానాలు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం 256 బస్తీ దవాఖానాలు సేవలందిస్తున్నాయి. వీటిలో వైద్య సేవలతో పాటు 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలను కొత్తగా ప్రారంభించనున్నది. బస్తీ దవాఖానాలు అందిస్తున్న సేవలను గుర్తించిన పదిహేనో ఆర్థిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ తరహా దవాఖానలు ఇతర రాష్ట్రాలలోను ఏర్పాటు చేయాలని సూచించింది.

ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వెల్లడిరచింది. వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు 1698 రూపాయలు. ఆరోగ్య రంగంలో అత్యధికంగా తలసరి ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది.