పాలంపేట బిడ్డగా గర్విస్తున్నా
By: వి. ప్రకాశ్

రామప్ప దేవాలయం వున్న పాలంపేట నాజన్మ స్థలం. ఊహ తెలియకముందునుంచి రామప్ప గుడితో నా అనుబంధం. నాలుగేళ్ళ వయస్సు నుండే నా తండ్రితో రామప్ప గుడి హద్దుగా వున్న మా పొలానికి పోతుండేవాణ్ణి. గుడి ప్రహరీ గోడ నా అడ్డా. విశాలంగా ఉండే ప్రహరీ గోడపై కూర్చొని పర్యాటకులను గమనిస్తుండేవాణ్ణి. ఆ రోజుల్లో రామప్ప గుళ్ళో గైడ్లు లేరు. పాలంపేటకు అస్సల్ దార్ మాలీ పటేల్‌గా వున్న నా తండ్రి వీరమల్ల రాజనర్సింగారావు పర్యాటకులకు, అధికారులకు రామప్ప శిల్పకళా విశేషాలు వివరిస్తుంటే నేను వింటుండే వాణ్ణి. అప్పట్లో పర్యాటకులు రాత్రిపూట రామప్పలో వుండాలనుకుంటే మా ఇళ్ళే ఏకైక దిక్కు.
1965 లో రామప్ప గుళ్ళో తొలిసారి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆత్మ గౌరవం ‘సినిమా షూటింగ్ మూడు రోజుల పాటు జరిగింది. నాగేశ్వరరావు, కాంచన, నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, కె.విశ్వనాధ్ మిగతా యూనిట్ సభ్యులకు అవసరమైన ఏర్పాటు నా తండ్రి గారే చేశారు. ఆరవ తరగతి చదువుతున్న నేను ఆనాటి వరకు సినిమా చూడలేదు. సినిమా అంటే ఏమిటో తెలియక ముందే హీరో, హీరోయిన్లతో క్లోజ్‌గా గడిపే అవకాశం ‘రామప్ప’ వల్ల నాకు కలిగింది.

‘ఒక పూల బాణం తగిలింది మదిలో’ పాట మొత్తం, రామప్ప గుడి, చెరువు వద్దే షూట్ చేశారు. నాకు కొద్దిగా ఇంగ్లీషు మాట్లాడటం వచ్చాక రామప్పకు ఏ విదేశీ యాత్రికుడొచ్చినా గుడి వాచ్మెన్ వచ్చి నన్ను తీసికెళ్ళి ఆంగ్ల భాషలో విశేషాలు చెప్పించేవాడు. నేను లేనప్పుడు చర్చిలో వుండే ఫాదర్‌ను తీసికెళ్ళేవాడు. ఒక రోజు ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ రామప్పకు వచ్చారు. చాలా కాలం ఆయన మా ఊళ్ళోనే వున్నారు. శిల్ప భంగిమలను తదేకంగా చూస్తూ పెన్సిల్‌తో డైరీలో బొమ్మలు గీస్తుంటే నాకర్థం కాకపోయేది. రోజుల కొద్దీ ఆయనతో గడిపే అదృష్టం చిన్నప్పుడే కలిగింది. నటరాజ రామకృష్ణ పేరిణీ శివతాండవం నాట్యానికి, రామప్ప శిల్ప కళే ఆధారమైంది. 1రామప్ప గుళ్ళో నల్లరాతితో చెక్కిన పెద్ద నంది విగ్రహం ఉన్నది. చాలా ఏళ్ళు నంది ప్రధాన దేవాలయం తూర్పు ద్వారం వద్దే ఉండేది. 1990 తర్వాత నందిని రామప్ప గుళ్ళో నుండి తూర్పున పునర్నిర్మించిన గుళ్ళోకి మార్చారు.

నేను హైస్కూళ్ళో చదువుతున్నప్పుడు నంది ముందు నిలబడి అద్దంలో ప్రతిబింబం వలె నన్ను నేను చూసుకునేవాణ్ణి. దువ్వెనతో తల దువ్వుకునేవాణ్ణి. ప్రధాన గుళ్ళో నుండి నందిని తరలించి దానిపై కప్పును నిర్మించకుండా వదిలేసింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI). దీంతో ముప్పయేళ్ళుగా నంది ఎండకు ఎండి, వానకు తడిసి దాని సహజత్వాన్ని పోగొట్టుకుంది. ఇపుడు నంది ముందు నిల్చుంటే మన ప్రతిబింబం దానిలో కనపడదు. కళ తప్పింది.
సమైక్య రాష్ట్రంలో రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం కొన్ని కాటేజీలు నిర్మించినా వాటి నిర్వహణ లోపం వల్ల అవి నిరుపయోగంగా వుండేవి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే పర్యాటకుల సంఖ్య పెరిగింది.
2018 అప్పటి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్రొ. సీతారాం నాయక్ లోకసభలో రామప్పను యునెస్కో చారిత్రిక వారసత్వ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరినారు.
రామప్పను యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చాలని ఎంత ప్రయత్నించినా సమైక్య రాష్ట్ర పాలకులు పట్టించుకోలేదు. 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఈనాడు రామప్పకు యునెస్కో జాబితాలో చోటు దక్కింది.