జల జలహే తెలంగాణ!

రాష్ట్ర జల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 50 టి.ఎం.సి ల సామర్ధ్యంగలిగిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌ జాతికి అంకితమైంది. పంప్‌ హౌజ్‌లో మోటార్లు పనిచేయడం ప్రారంభించగానే జలాశయంలోకి గోదారమ్మ ఎగసిపడింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన రైతన్నలు, ఇతర ప్రజానీకం హర్ష ధ్వానాలతో ఆ ప్రాంతం మారుమోగింది.

‘‘చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.మనం కలలుగన్న తెలంగాణతోపాటు సస్యశ్యామల తెలంగాణను చూడాలన్న కోరిక నెరవేరింది.నూతన తెలంగాణాలో నిర్మాణమైన అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టం.ఈ కల సాకారం కావడానికి, ఈ మహా యజ్ఞంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రజల పక్షాన శిరస్సువంచి వినయపూర్వకంగా ప్రణామాలు చేస్తున్నా’’ మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆనందోత్సాహాల మధ్య అన్న మాటలివి.మల్లన్న సాగర్‌ నిర్మించి, గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్నకు పాదాభిషేకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ సందర్భంగా తన మొక్కుతీర్చుకొని మాట నిలుపుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు లేక రైతులు, ప్రజలు పడ్డపాట్లు మనకు తెలియంది కాదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపట్టిన వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు సంతృప్తినిస్తున్నాయి. తెలంగాణకే తలమానికంగా, రికార్డు సమయంలో ఓ అద్భుత కట్టడంగా నిర్మితమై, ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న మల్లన్న సాగర్‌ నిర్మాణంపై అనేక మంది పలు సందేహాలు వ్యక్తంచేశారు. మరి కొంతమంది వందలాది కేసులు వేసి దీనిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ, ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ సంకల్పబలం ముందు ఆ ప్రయత్నాలన్నీ విఫలం కాక తప్పలేదు.

సముద్ర మట్టానికి 557 మీటర్ల ఎత్తులో , 50 టిఎం.సి.ల సామర్ధ్యంతో నిర్మించిన ఈ జలాశయం వల్ల తొమ్మిది జిల్లాలలోని 11.30 లక్షల ఎకరాలు సస్యశ్యామల మవుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌ మహానగరానికి 30 టి.ఎం.సి ల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 16 టి.ఎం.సిల నీటిని అందిస్తుంది. ఈ బహుళార్ధ సాధక రిజర్వాయర్‌లో ఎల్లవేళలా నీరు ఉండేలా ప్రణాళికలు రచించారు. దీంతో కరవు కాటకాలు ఏవైనా, ఎప్పుడైనా ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతాం.

రాష్ట్రంలోని రిజర్వాయర్లు టూరిస్టు కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని, అందుకు 1500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించడం కూడా రాష్ట్రానికి మరో శుభవార్తే.