|

కొలువుల నెలవు

By: యశోద

ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం అక్షరాస్యత సాధిస్తుంది అన్నది అందరూ అంగీకరించే విషయమే. అయితే అక్షరాస్యతతో పాటు ఆర్థిక స్వావలంబన సాధిస్తే ఆ అమ్మాయి కారణంగా రెండు తరాల వారు ఆర్థికంగా నిలబడతారు. వారి కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆలోచనతో ఉద్యోగ సాధనే లక్ష్యంగా బిసి వెల్పేర్‌ సోసైటీ రెసిడెన్షియల్‌ కాలేజీ విద్యార్థినులను తీర్చిదిద్దుతున్నారు. కాగ్నిజెంట్‌, గూగుల్‌ వంటి కార్పోరెట్‌ సంస్ధలు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ ఇప్పటివరకు 30మందికి పైగా ఉద్యోగాలు కల్పించారు. ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో మరో 20మంది రాత పరీక్షలో అర్హత సాధించారు. వీరిని రెండు దశల్లో ఇంటర్వ్యూ ల తర్వాత ఫైనల్‌ చేస్తారు. దీంతో రానున్న రోజుల్లో మరింత మందికి ఉద్యోగులు వచ్చే అవకాశం వుంది.

వెనుకబడిన తరగతులకు విద్యను అందించే లక్ష్యంతో 2012లో మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో సంక్షేమ హాస్టల్స్‌ను బిసీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విద్యరంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉచిత విద్యను అందించేలా కేజీ టూ పిజీ విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు. మహిళ కోసం ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీని ఏర్పాటుచేశారు. విద్యార్థులకు మెరుగైన పోషకాలతో కూడిన ఆహారం, నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఈ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి.

సాధికారత దిశగా..

ఆడపిల్లలకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీలో తొమ్మిది కోర్సులు ఉండగా ఈ విద్యా సంవత్సరం నుంచి మరో రెండు కొత్త కోర్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ కాలేజీలో చదివిన విద్యార్థినులకు ఉద్యోగాలు కూడా కల్పించేలా వివిధ కార్సోరెట్‌ సంస్థలు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 50మంది డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయిలు  కాగ్నిజెంట్‌, గూగుల్‌ వంటి  ప్రముఖ సంస్థల్లో మంచి ప్యాకేజీల్లో ఉద్యోగాలు సాధించారు. కరోనా కష్టకాలంలో ఉన్న 

ఉద్యోగాలపై వేటు పడుతున్న నేపథ్యంలో,  ప్రొఫెషనల్‌ విద్యాసంస్థల్లో  సైతం ప్లేస్‌ మెంట్స్‌ జరగకపోయినా సొసైటీ అధికారులు, అధ్యాపకులు తీసుకుంటున్న చొరవతో ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలు డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.

ప్రత్యేక శ్రద్ధతో..

ఆడపిల్లలు అక్షరాస్యతతో పాటు ఆర్థిక స్వావలంబన సాధిస్తే ఆ అమ్మాయి కారణంగా రెండు తరాల వారు ఆర్థికంగా నిలబడతారు. వారి కుటుంబ పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆలోచనతో ఉన్నత చదువుతోపాటు ఉద్యోగ సాధనే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దు తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో వుంచారు. ఇంటర్వ్యూలల్లో విజయం సాధించడానికి వీలుగా మోటివేషన్‌ క్లాసులు నిర్వ హిస్తున్నారు. వివిధ కార్పోరేట్‌ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అనువుగా కంప్యూటర్‌ లాబ్‌ను, వెబ్‌ కెమెరాలను కాలేజీ క్యాంపస్‌లో సమకూర్చారు. డిగ్రీ పూర్తి చేసి కాలేజీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థి ఉద్యోగాలతో, ఉన్నతవిద్యా కోర్సుల్లో సీట్లతో ఇంటికి వెళ్లేలా వారిని ప్రోత్సహిస్తున్నారు సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు. 

అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తూ..

విద్యార్థులకు కేవలం తరగతి గదుల్లోనే విద్యాబోధనకే పరిమితం కాకుండా వారికి విశాలమైన క్రీడామైదానం అందుబాటులో ఉంది. ఆధునిక వసతులతో జిమ్‌ కూడా ఏర్పాటుచేశారు. క్రీడల్లోనూ రాణిస్తున్న అమ్మాయిలు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్‌ సాధిస్తున్నారు.

 సివిల్స్‌ రాయాలన్నది నా లక్ష్యం 

మాది రంగారెడ్డి జిల్లా మాలపల్లి, ఆమనగల్‌ మండలం. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. అమ్మ పొలం పనులు చేస్తూ మమ్మల్ని పెంచారు. చదువు వల్ల మా జీవితాల్లో మార్పు వస్తుందన్న నమ్మకంతో అమ్మ ఎంతో కష్టపడి గురుకుల స్కూల్లో జాయిన్‌ చేశారు. ఇక్కడ రోజు కడుపునిండా తిండి, స్కూల్‌ డ్రెస్సులు, పుస్తకాలతో పాటుగా ఎంతో విజ్ఞానాన్ని అందించారు. సెలవులు వచ్చిన కూడా మాకు ఇంటికి వెళ్లడానికి ఇష్టం అనిపించదు.  ఇక్కడ ఉన్న పుస్తకాలు సివిల్స్‌ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ పుస్తకాలు చదివి అనేక పోటీ పరీక్షలకు మేము సిద్ధం అవుతున్నాము. చదువు వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ఈ చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించుకోగల మానసిక వికాసం చదువు వల్ల కలుగుతుంది. నా స్నేహితులని, మా బంధువులు పిల్లలని కూడా గురుకులంలో చేరి చదువుకోమని చెప్తున్నాను. ఎమ్మే ఎకనామిక్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పిజి ఎంట్రన్స్‌ పరీక్షల్లో ఆరో ర్యాంక్‌ వచ్చింది. ఇప్పుడు పీజీ చేస్తున్నాను. సివిల్స్‌ రాయాలన్నది నా లక్ష్యం.

– జీ. మోనిక, ఎంఎ (ఎకనామిక్స్‌) ఓయూ

నేనే మొదటిదాన్ని..

మా కుటుంబంలో చదువుతున్న మొదటి తరం నాతోనే ప్రారంభమైంది. నాన్న చిన్నరైతు. అమ్మనాన్న ఇద్దరూ నిరక్ష్యరాస్యులు. అయినా మా ఐదుగురినీ బడికి పంపించారు. మా కుటుంబాల్లో చిన్నతనంలోనే పెండ్లి చేస్తారు. కానీ, మా నాన్న అందరినీ ఎదిరించి మమ్మల్ని బడికి పంపించారు. బంజారా సోషల్‌ వెల్పేర్‌ స్కూల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్‌, డిగ్రీ బిసీ వెల్పేర్‌ సోసైటీ రెసిడెన్షియల్‌లోనే చదివాను. బిఎస్సీ(ఎంఎస్‌ సిఎస్‌) 2020లో పాస్‌ అయ్యాను. అదే సంవత్సరం అజోమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీలో పిజీలో సీట్‌ వచ్చింది. ఎంఏ ఎడ్యుకేషన్‌ కోర్సులో చేరాను. భవిష్యత్‌లో బోధనారంగంలోకి రావాలన్నదే నా లక్ష్యం. సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఇక్కడ వుంది. అందరితో కలిసి వుండే స్వభావం అలవడుతుంది. ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. కరిక్యులంతో పాటు కో కరిక్యులం అంశాలతో సృజనాత్మకత పెరుగుతుంది. ఇండోర్‌ గేమ్స్‌ లోనూ మంచి ప్రోత్సాహం ఇక్కడ లభిస్తోంది. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో చెస్‌ లో అనేక బహుమతులు గెలుచుకున్నాను. ఇంటర్‌ కాలేజీ స్టాయిలో  నిర్వహించిన యూత్‌ పార్లమెంట్‌ లో పాల్గొన్నాను. మ్యాథ్స్‌ డే రోజు నేను ఇచ్చిన ప్రజెంటేషన్‌ కు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఉపాధ్యాయులు ఇక్కడ ఉండటం మా అదృష్టం.

– శిరీష మలోతు, బిఎస్సీ(ఎంఎస్‌ సిఎస్‌)

(కాగ్నిజెంట్‌ ప్లేస్‌ మెంట్‌ డ్రైవ్‌లో జాబ్‌ వచ్చింది)

గురుకులమే దారి చూపింది.

 నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. అమ్మ  టైలర్‌.  ఇద్దరు అక్కలు, తమ్ముడు మొత్తం నలుగురం. అమ్మే కష్టపడి మమ్మల్ని పెంచింది. మేం చదువుకోవాలన్న లక్ష్యంతో సోషల్‌ వెల్పేర్‌ హాస్టల్‌లో చేర్చింది. స్కూల్‌ స్థాయి నుంచి సోషల్‌ వెల్పేర్‌ లోనే చదువుకున్నాను. రెసిడెన్షియల్‌లో విద్య, భోజన, వసతి సదుపాయాలతో పాటు విజ్ఞాన్నాన్ని పెంచుకునే ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ లైబరీలో ఉంటే పుస్తకాలు అనేక పోటీ పరీక్షలకు ఉపయోగపడుతాయి. ఉన్నత విద్య అభ్యసించడానికి ఇంకా ఏమైనా పుస్తకాలు కావాలా అంటూ అడిగి మరీ మేం కోరిన పుస్తకాలు తెప్పిస్తారు. ఆ పుస్తకాలు చదివే చాలామందిమి సెంట్రల్‌ యూనివర్సిటీలలో పిజీ సీట్లు సాధించాం. నేను పాండిచ్చేరీ యూనివర్సిటీలో ఎంఎస్సీలో 26ర్యాంక్‌ సాధించాను. నాలాంటి వారికి పదివేల రూపాయలు, ఫీజుల కోసం అందించారు. ఇక్కడ నేర్చుకున్న చదువు, విజ్ఞానం సమాజంలో తలెత్తుకుని బతికేలా చేస్తుంది.

– శ్వేత, బిఎస్సీ(ఎంఎస్‌ సి ఎస్‌), ఎంఎస్సీ(సాటిస్టిక్స్‌)

(కాగ్నిజెంట్‌ ప్లేస్‌ మెంట్‌ డ్రైవ్‌ లో జాబ్‌ వచ్చింది)