|

కాలంతో మనం

By: కొమురవెల్లి అంజయ్య

కాలం ముంగిట అందరూ గులాములే
తొడగొట్టి సవాల్‌ చేస్తే
గుడ్లురిమి గూబ పగలగొడతామంటే
అలెగ్జాండర్‌ లే మట్టి కరిచారు
కాలగతిలో మనదైన గుర్తింపుతో చలించాల్సిందే
కాలం నేలమాళిగలో మన చరిత్ర దాచుకోవాలంతే

వృద్ధి చెందిన విజ్ఞానం అందిస్తుంది
కాలం మార్పులను కనిపెడుతుంది కొంత
జాగరూకత నేర్పిస్తుంది

గాలికి కొట్టుకుపోయే మబ్బులనే అడ్డుకోలేం
సుడిగాలి సొరబడితే కంటితో చూడలేం
కళ్ళు మూసుకోవాల్సిందే గబుక్కున
అగ్గికి గాలి తోడైతే అబ్బతరం కాదు మంటలార్పడం
ఎండ సురుకులు పెడుతుంటే
వడగాలి వదురుబోతై వస్తే
చల్లదనం నీడ కోసం తపన, తంటాలు
చలి గాలి ఇసిరిసిరి కొడితే
కాపుకోవడం, కప్పు కోవడమే

వానలు సెలవులు తీసుకుంటే
చెరువులు, నదులే వేస్తాయి బిక్క మొఖం
చినుకుల్ని ముత్యాల్లా కాపాడుకోవడం ముందుచూపు
వరదలకు ఎన్ని చరిత్రలు నేలమట్టమయ్యాయో
కాలం కన్నెర్ర చేస్తే ప్రకృతి వైపరీత్యాలు
గత్తరలు, వైరస్‌ లు గట్రా గట్రా

ఆరు ఋతువుల గమనం అంతటా ఉండదు
భౌగోళిక స్థితిలోనే కాలం మార్పు
గమనించాలి, పయనించాలి
కాలం విలువ తెలుసుకో, వాడుకో పదిలంగా
గడిచే కాలానికి ప్రత్యక్ష సాక్షులం
రాబోయే కాలానికి నాటాలి హెచ్చరిక బోర్డులు