కవితా నివేదన

tsmagazineఆధ్యాత్మిక భావనకు వయసుతో పనిలేదు. మనసే ముఖ్యం. విశ్వవ్యాప్తమైన భగవంతుని దర్శించాలనే తపన హృదయాంత రాలలో నిండి,ఆ అద్భుత భావుకత కు భాష తోడైతే పరుచుకున్న కవిత్వమంతా ”నివేదన” అవుతుంది. రచయిత్రిగా, సంపాదకు రాలిగా, గాయనిగా అపార అనుభవం ఉన్న కవితా చక్ర మది లోని ప్రేమ,విరహం,భక్తి తదితర భావనలకు అక్షర రూపమే ఈ ”నివేదన”.

డెబ్బై కవితల సమాహారం ఈ నివేదన కవితా సంపుటి. ప్రతికవితలోనూ కవయిత్రి ఆవేదన,ఆర్ద్రత, విశ్వాత్మకై పరితపి స్తున్న హృదయ వేదన పాఠకులను కూడా ఆధ్యాత్మికానంద లోకంలోకి తీసుక పోతాయి.

”దోసిట నిండిన ఆశల పూలతో నిన్ను ఆరాధించాలని ఎదురు చూస్తున్నాను” అని మొదలుపెట్టి..

”నిను గాంచక మునుపే ఈ ప్రమిదను చేజారనీకు ప్రభూ.”. అంటూ తన కవితా నివేదనను ముగించడంలో కవయిత్రి ఆ భగవంతుడికి అర్పించాలనుకున్న కుసుమములేమిటో, నివేదించా లనుకున్న ఆశలేమిటో తేటతెల్లం చేసింది.

”ఒక్కో నివేదనా పుష్పాన్ని పొగుజేసి మనో దోసిట్లో దాచాను’

”మది మందిరాన్ని ధూపదీపాలతో అలంకరించాను” లాంటి కవితా పంక్తులు రవీంద్రుని గీతాంజలి ని గుర్తుతెస్తే..

”విశ్వైక ప్రేమ దర్బారులో గీతమాలపించడానికి సిద్ధంగా ఉన్నాను”..

”స్వరసోపానాలు అమర్చాను”.. లాంటి కవితలు మీరా బాయిని గుర్తుకు తెస్తాయి.

ఆర్తితో, సంవేదనతో తన భక్తిపూర్వక హృదయావిష్కరణ గావించిన కవితాచక్ర కావితా నివేదనను భగవంతుడు ప్రేమగా స్వీకరించే తాత్విక శక్తి ఆమె కవితలకుంది. అక్షరాలకు తగిన చిత్రాలను ఆవిష్కరించిన కృష్ణ అశోక్‌ చిత్రాలకుంది.

– గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ