జలస్వప్నం సాకారం చేసిన భగీరథుడు కే.సీ.ఆర్‌

By: కొండపల్లి వేణుగోపాల రావు

నాయకత్వం వేరే రాజకీయం వేరే అని గోదావరి నదిపై కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌, ఇతర ప్రాజెక్టులైన సీతారామప్రాజెక్టు. దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ ప్రాజెక్టు, సీతారామ బహుళార్థక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నివృత్తి చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ప్రత్యేక అభినందలు, నాయకుడు ఎప్పుడైనా భావి తరాలకు ప్రయోజనాలు కలగాలని భావిస్తాడు. అదే రాజకీయ నాయకుడు తన అధినేతల కోసం ప్రయత్నిస్తాడు. నాయకుడు శక్తివంతమైన రాష్ట్రాన్ని తయారుచేస్తాడు.

ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ఒక మెరుగైన సమర్థత, సూక్ష్మదృష్టి, సరళతరంతో కూడిన స్పష్టమైన లక్ష్యం, ప్రత్యేక ఆలోచనా విధానం గల నాయకుడు. అందువల్లే నదీ జలాలపై అధికారంలోకి రాగానే అతి త్వరితంగా నిర్ణయం తీసుకోవడమే కాక దానిని అమలు చేయడం వలన మన దేశంలో తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఏర్పడిరది. మన రాష్ట్రానికి గల రెండు ప్రధాన నదులు కృష్ణా, గోదావరిలు అని అందరికీ తెలిసిందే.  కృష్ణానది నీటి లభ్యత విషయంలో రాష్ట్రం ఏర్పడే నాటికే ట్రిబ్యునల్‌/ సుప్రీంకోర్టులో పోరాటం జరుగుతోంది. అక్కడ ప్రాజెక్టులు చేపట్టడం అంత సులభం కాదు. అంతర్‌ రాష్ట్ర జలవివాదాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల మధ్య నీటి సమస్య ఉండడం వలన నికర జలాల ఆధారిత ప్రాజెక్టులు చేపట్టడం అంత సులభం కాదు.

అదే గోదావరి నదిలో పుష్కలమైన నికర జలాల లభ్యత ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టకపోవడం, నదీ జలాలు సముద్రం పాలు అవడం అందరికీ తెలిసిన విషయమే.

నికర జలాలపై ఎలాంటి గొడవలు లేని గోదావరిపై కాళేశ్వరం బహుళార్ధక సాధక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు తేవడం ప్రశంసనీయం. నిధుల కొరత రాకుండా ‘‘కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌’’ను ప్రత్యేక ప్రయోజనం (special purpose Vehicle) క్రింద స్థాపించి దానికి సమగ్ర రూపం కల్పించి, సమర్థవంతంగా నిర్వర్తించి నవరత్న హోద కలిగిన కేంద్రసంస్థ ‘Rural Electrification Corporation Ltd’. ద్వారా ‘A’ గ్రేడ్‌ సర్టిఫికేట్‌ పొందడం తెలంగాణ ప్రజలకు, తెలంగాణా రాష్ట్రానికి యావత్‌ దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు రావడం గర్వకారణం.

ఏ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును చేపట్టిన, లక్ష్యానికి కావలసిన నీటిలో 75 శాతం నిల్వ చేసుకొనే మధ్యంతర రిజర్వాయర్లు ఉంటేనే ఆ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం తో పనిచేస్తుంది. ముఖ్యమంత్రి దూరదృష్టితో తెలంగాణాలోని 13 జిల్లాల్లో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 20 జిల్లాల్లో విస్తరించి ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు, 194 TMC ల లిఫ్టింగ్‌ సామర్థ్యంతో,  20 లిఫ్ట్‌లు, 19 పంప్‌ హౌజ్‌లతో, 141 tmc ల నీటి సామర్ధ్యం గల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మిడ్‌ మానేర్‌, అనంతసాగర్‌, రంగనాయక్‌ సాగర్‌, మల్లన్నసాగర్‌, గంథమల్ల, కొండపోచమ్మసాగర్‌, బస్వాపూర్‌ మధ్యంతర రిజర్వాయర్లతో, త్రాగు, సాగు నీరు అందించడానికి 2016లో చేపట్టి, జూన్‌ 2019 నాటికి ప్రారంభించడం వారి లక్ష్యానికి, సమర్థతలకు నిదర్శనం.

కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (KIPCL), ప్రాజెక్టు యొక్క అభివృద్ధి, నిధుల సమీకరణ, నిర్వహణను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసింది. ఈ కార్పోరేషన్‌ నిధులన్నీ సక్రమంగా ఖర్చు చేసిందనీ, లక్ష్యాలను కూడా సాధించిందని, రుణవాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి చెందిన REC Ltd  ‘A’  సర్టిఫికేట్‌ ఇవ్వడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ పరపతిని తారాస్థాయికి పెంచినట్లే కాకుండా, ప్రాజెక్టుపై విమర్శలన్నింటికీ చెక్‌ పెట్టినట్లే. అలాగే భవిష్యత్తులో ప్రాజెక్టుల కోసం చేపట్టే రుణ సమీణకరణ సులభమే కాకుండా ఉత్సాహాన్ని, అవకాశాలను కల్పిస్తున్నది.

అంతేకాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో 1480 tmc లు నికర జలాల లభ్యత ఉన్నదని లెక్కకట్టిన విషయం అందరికీ తెలిసిందే. గోదావరి అవార్డులో ప్రధానంగా సింగూర్‌, నిజాంసాగర్‌, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నీటి పరిమాణాలు పేర్కొన్నారు కానీ, ఏ ఇతర భారీ ప్రాజెక్టుల నీటి వినియోగం నిర్దేశింపబడలేదు. జన బాహుళ్యంలో ఉన్న 1480 TMCల ఈ అవార్డులో ఎక్కడా పేర్కొనలేదు. అయినాగాని, ఉమ్మడి జిల్లాలోనే 1480 tmc లలో తెలంగాణకు 968tmcలు అని లెక్క కట్టారు. ఈ 968 tmc లనే సమగ్రంగా వాడుకోవడానికి మన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, బహుళార్థక సాధక ప్రాజెక్టు, సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ ప్రాజెక్టు, సీతారామ బహుళార్థక సాధక ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. వీటికోసం తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (TSWRIDCL)  ను 2018లో ప్రత్యేక ప్రయోజనం (special purpose Vehicle పొందడానికి స్థాపించడం జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 11.18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు 10.47 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఈ కార్పోరేషన్‌ ఆయా ప్రాజెక్టుల డిజైనింగ్‌, నిర్మాణం, నిధులు, రుణాల సేకరణ, ప్రాజెక్టుల ద్వారా లభించే ఫలితాల వరకు అన్ని కీలక బాధ్యతలను పర్యవేక్షిస్తుంది.

కేంద్ర విద్వుత్తు శాఖ పరిధిలోని REC Ltd., వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణాల కోసం తీసుకున్న నిధులు, వాటి వినియోగం, చెల్లింపుల ఫలితాలు తదితర అంశాలను అధ్యయనం చేసి గ్రేడింగ్‌లను ప్రకటిస్తుంది. TSWR IDL.,  కు ‘A+’ గ్రేడ్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. తెలంగాణ ప్రాంత ప్రజల తర తరాల జల స్వప్నాలను అతికొద్ది కాలంలో స్ఫుర దృష్టితో తీరుస్తున్న కేసీఆర్‌ తీరును అభినందిచాల్సిందే.