కొనగట్టు పల్లికి ప్రథమస్థానం
By:- ఉప్పర వెంకటేశ్వర్లు

చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్య, గట్టు అంచున ఉంది కొనగట్టుపల్లి గ్రామం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, హన్వాడ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం వంద శాతం సామాజిక భద్రతను సాధించి జాతీయ స్థాయి అవార్డ్ ను సొంతం చేసుకుంది. 1665 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 421 కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చేవరకు గ్రామంలో నిరక్షరాస్యత, పేదరికం, సామాజిక అంశాల పట్ల అవగాహన లేకపోవటం, బాలికలలో రక్తహీనత, పిల్లలలో పౌష్టికాహార లోపం, నిరుద్యోగం, యువతకు ఉపాధి లేకపోవడం వంటి ఎన్నో సామాజిక రుగ్మతలను ఎదుర్కొంది.
వీటన్నిటిని అదిగమించేందుకు గ్రామపంచాయతీ సర్పంచ్ మానస ఆధ్వర్యంలో గడచిన 4 ఏళ్లలో వార్డ్ కమిటీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, ప్రజల భాగస్వామ్యంతో సమ్మిళిత అభివృద్ధిని సాధించేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. వంద శాతం సామాజిక భద్రత సాధించేందుకు పక్కాగా ప్రణాళిక రూపొందించుకోవడమే కాకుండా, గ్రామ సభల ద్వారా ప్రజలలో ముందుగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. గ్రామ అభివృద్ధికి వివిధ కమిటీల ఏర్పాటు, ప్రతినెలా పౌర హక్కుల దినం నిర్వహణ, పిల్లలు, మహిళలు, గర్భిణీలు, యుక్త వయసు బాలికలకు పౌష్టికాహార పంపిణీ, ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కార్డులు, ప్రాథమిక విద్య, ఉపాధి కల్పన వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రజలకు సామాజిక భద్రతను కల్పించడంలో కొనగట్టుపల్లి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుని వంద శాతం సామాజిక భద్రత సాధించిన గ్రామంగా మార్చ్ 31, 2023న హైదరాబాద్ లో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీిఆర్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల చేతుల మీదుగా ముందుగా రాష్ట్ర స్థాయి అవార్డ్ అందుకోగా, ఏప్రిల్ 7న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులలో వంద శాతం సామాజిక భద్రతను సాధించిన గ్రామ పంచాయతీగా కొనగట్టు పల్లి మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం కొనగట్టుపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, 2 అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీతో పాటు, రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కులు ఇలా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. గ్రామ జనాభాలో 162 మందికి ఆసరా పింఛన్లు, 9 మంది వికలాంగులను సదరం క్యాంప్‌లో నమోదు చేయించడం, 1340 మంది ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ కింద నమోదు, 144 మంది మహిళలు, గర్భిణీలు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీ, ఉపాధి హామీ పథకం కింద 248 మందికి ఉపాధి కల్పించడం, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కింద గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధులను ఖర్చు చేయడం జరిగింది.
ఇప్పుడు కొనగట్టుపల్లిలో సంవత్సరం నుండి ఆరు సంవత్సరాల వయసున్న పిల్లలు మొదలుకొని, మహిళలు, యుక్త వయసు బాలికలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు నూటికి నూరు శాతం సామాజిక భద్రతా ఫలితాలను అనుభవిస్తున్నారు.కొనగట్టు పల్లి గ్రామ పంచాయతీ వంద శాతం సామాజిక భద్రత సాధించిన గ్రామ పంచాయతీగా జాతీయ స్థాయి అవార్డ్ సాధించినందుకు గాను మహబూబ్‌నగర్ శాసన సభ్యులు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గ్రామ సర్పంచ్ మానసను, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఎంపిడిఓ ధనుంజయ గౌడ్, మొత్తం మండల బృందాన్ని, అలాగే జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్‌ను, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె.సీతారామారావును, మొత్తం జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు కొనగట్టు పల్లిలా ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలవాలని పిలుపునిచ్చారు.