|

కోయ సంగీతం – రేలా నృత్యం

By:-డా. ద్యావనపల్లి సత్యనారాయణ

కోయలు సామూహికంగా జరుపుకొనే భూమి పండుగ, ముత్యాలమ్మ పండుగ, కొలుపు, తాటిచెట్ల పండుగ, లేలే పండుగ, వేల్పుల పండుగతో పాటు వివాహాది కార్యక్రమాలలో సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. కోయలు ఇప్ప సారాయితో పాటు తాటి, జీలుగు చెట్ల నుండి కూడా కల్లు తీసి స్త్రీ పురుషులందరు సేవించి ఆ నిషాలో అందరూ కలిసి కేరింతల మధ్య ఆనందంగా నృత్యాలు చేస్తారు.

సంగీత వాయిద్యాలు:

ఆదిమ కోయ జాతులు పూర్వం రాళ్లతో, కర్రలతో శబ్దాలు చేసేవారు. ఒక గుంపు నుండి మరో గుంపుకు సందేశాలు అందించడం లాంటివి, తమను రక్షించుకోనే క్రమాలలో శబ్ద తరంగిణులను చేసుకునేవారు. క్రమంగా జంతువుల చర్మాలు ఒలిచి ఎండపెట్టి వాటిని డోలు, డప్పులుగా చేసి శబ్ద తరంగిణులు చేసుకునేవారు. వారు ఏదైనా విజయం సాధించినప్పుడు ఈ శబ్దాలు చేసుకుంటూ గంతులు వేసుకుంటూ వినోద కార్యక్రమాలు జరుపుకునేవారు. కాలక్రమంలో కోయజాతుల సాంప్రదాయం అభివృద్ధిలోకి వచ్చాక ఏ సందర్భంలో ఏ శబ్ద తరంగిణులు కావాలో, ఎలాంటి సంగీత వాయిద్యాలు వాడాలో, సహజ సిద్ధంగా వారి పరిసరాలలో లభించే వస్తువులతో సంగీత వాయిద్యాలను వారే స్వతహాగా కళాత్మకంగా తయారు చేసుకున్నారు, వీటిని పండుగలలో పెళ్ళిళ్లలో, చావులలో, దినాలల్లో, జాతర్లలో, వేటలో, కొలుపుల్లో, విందులు-వినోదాలలో ఈ సంగీత వాయిద్యాలు ఉపయోగిస్తున్నారు.

అందె: దీన్ని ఇనుముతో చేసి, లోపల చిన్న చిన్న గట్టివి గుండ్రనివి రాళ్ళ ముక్కలు లేదా ఇనుప ముక్కలు వేస్తారు. వీటితో అడుగు కదిలినప్పుడు శబ్దం వస్తుంది, దీన్ని మగవారు కాలికి తొడుక్కొని నృత్యాలు చేస్తారు. అడుగుకు అందె సవ్వడితో ఆ నృత్యం కొనసాగుతుంది.

డోలు కొయ్య: సుమారు మూడు అడుగుల పొడవు కలిగి, కుడి ప్రక్క అడుగు, ఎడమ వారం కలిగి ఉండే శబ్ద తరంగిణి. దీన్ని వేగిస చెట్టు గుల్లను చెక్కి, డోలుగా చేసి దీన్ని రెండు వైపులా మేక చర్మం కుడి వైపు, గొడ్డు చర్మం ఎడమ వైపుతో మూస్తారు. ఈ డోలును చర్మం తాడుతో బిగించి కడతారు. ఈ డోలును నృత్యం చేసేటప్పుడు మగవారు మెడలో వేసుకొని కుడివైపు చేతితో, ఎడమవైపు సిర్ల కర్రతో వాయిస్తారు. దీన్ని ఆయా సందర్భాలలో ఉపయోగించే ప్రధాన సాంప్రదాయ సంగీత వాయిద్యం.

తూత కొమ్ము – అక్కుం : దీన్ని అడవి దున్న కొమ్ము తో తయారు చేసుకుంటారు. అడుగున్నర పొడవు కలిగి ఉండి అర్ధ చంద్రాకారంలో ఉంటుంది, ఊదేవైపు సన్నగాను మరోవైపు వెడల్పుగాను ఉంటుంది. దీన్ని ఊదినప్పుడు శబ్ధ సంగీతం వస్తుంది. దీన్ని సాంప్రదాయ నృత్యాలు, వేట మొదలైన సందర్భాలలో ఉపయోగిస్తారు. వీటిని తాటాకులతో కూడా తయారు చేసుకుంటారు. అక్కుంను ఇత్తడి లేదా ‘డాక్రామెటల్‌’తో తయారు చేస్తారు. సాధారణంగా ఇది తూత కొమ్ము ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని ఎడమవైపు సన్నగ ఉండి ఆ భాగంలో ఊదటానికి అనుకూలంగా రంధ్రం చేస్తారు. దీని క్రింది భాగం చివరి వరకు చూడటానికి కళాత్మకంగా గజ్జెలు అమర్చుతారు. దీని రంధ్రం నుండి ఊదితే అద్భుతమైన శబ్ద తరంగం వస్తుంది. కోయ జాతులు దీన్ని ప్రత్యేకంగా వేల్పులు-కొల్పులలో మాత్రమే ఉపయోగిస్తారు. కోయవారి సాంప్రదాయంలో అక్కుం ప్రత్యేక చారిత్రక సంస్కృతికి స్థానం పొందిన సంగీత వాయిద్యం. దీన్ని పూజ వస్తువుగా వినియోగిస్తారు.

కోయలు ప్రధానంగా ఐదు రకాల సాంప్రదాయ నృత్యాలు చేయడం కనిపిస్తుంది. అవి:

  1. రేలా నృత్యం
  2. డోలి / మేళం నృత్యం
  3. కొమ్ము నృత్యం
  4. కురై నృత్యం
  5. కోలాటం

1.రేలా నృత్యం:

కోయలు మూడు రకాల రేల నృత్యాలు చేస్తారు. ఈ రేల నృత్యాలలో 30 నుండి 40 మంది వరకు స్త్రీ పురుషులు పాల్గొంటారు. స్త్రీ జట్టుకు ఒక నాయకురాలు, పురుషుల జట్టుకు ఒక నాయకుడు ముందు ఉండి ఈ నృత్యాలను చేస్తుంటారు. ఒక రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు పాటలు పాడుతూ ఒకరి నడుముపై ఒకరు చేతులు వేసి పాటకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ వలయాకారంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇంకో రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు విడివిడిగా వలయాకారంగా నిలబడి, ఎవరి చేతులతో వారే చప్పట్లు కొడుతూ ముందుకు మూడు అడుగులు వేసి, వెనుకకు మూడు అడుగులు వేస్తూ పాటకు అనుగుణంగా నృత్యం చేస్తారు. మరో రకమైన పద్ధతిలో వలయాకారంగా విడివిడిగా నిలబడి అడుగులు వేస్తూ నృత్యం చేస్తూ తమ చేతులను ఇరు ప్రక్కలకు మార్చి మార్చి చప్పట్లు కొడతారు. ఈ ఆట కోలాటం మాదిరిగా ఉంటుంది.

భూమి పండుగ సమయంలో గ్రామంలోని పురుషులందరు సామూహికంగా వేటకు వెళ్ళి ఏదో ఒక అడవి జంతువును వేటాడి తీసుకు వస్తారు. పురుషులు అడవి నుండి తిరిగి వచ్చేంత వరకు గ్రామంలోని స్త్రీలు రేల పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. స్త్రీలు ఒకరి భుజాలు ఒకరు పట్టుకొని వలయాకారంగా తిరుగుతూ రేల నాట్యం చేస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. అడ్డ కట్టుగా మోకాళ్ళ వరకు చీర కట్టి కుడివైపు పైట వేసుకుంటారు. శిరోజాలను అందమైన కొప్పులుగా (కూపారు ముడి) ముడుస్తారు. తలపై పక్షుల ఈకలను ధరిస్తారు. పండుగ, వివాహము, జాతర్లు, వెన్నెల రోజుల్లో ఆనందంగా మైమరచి చేసే కోయ యువతుల నృత్య భంగిమలు బహు ఆకర్షణీయంగా ఉంటాయి. వారు పాడే రేల పాటలలో రేల అంటే ‘‘వెన్నెల’’ అని అర్ధం. వారి జాతి కూడా రేల చెట్టు క్రిందనే జన్మించిందనే భావం కూడ ఉంది.

ఒక రేల పాట:

రేలా రేలయ్యో రేలా రేలా రేరేలా
సన్నబాదు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
వీరలరాజు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
అద్దమన్నా నత్థింకే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారీదాదా
దాని లేబరేయ్యానో లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
దానితోడు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
ముత్త లచ్చు చెల్లెలే లారిదాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
ముత్తల జానకి చెల్లెలే లారి దాదా
ఎలో చెలో బొలో చెలే లారిదాదా
॥ రేలా రేలా రేరేలా ॥
॥ రేలా రేలా రేరేలా ॥
॥ రేలా రేలా రేరేలా ॥
॥ రేలా రేలా రేరేలా ॥
॥ రేలా రేలా రేరేలా ॥
॥ రేలా రేలా రేరేలా ॥
॥ రేలా రేలా రేరేలా ॥
లచ్చల నీరు చెల్లెలే లారీదాదా
ఎలో చెలో బొలో చెలే లారీదాదా
లచ్చల రాజు చెల్లెలే లారీదాబా
ఎలో చెలో లొలో చెలే లారీదారా
? రేలా రేలా రేరేలా ?
? రేలా రేలా రేరేలా ?

  1. డోలి నృత్యం:

కోయ సంఘ వ్యవస్థను ఐదుగురు వ్యక్తులు నడిపిస్తారు. వారు: దొర, పటేల్‌, వడ్డె, అడితి బిడ్డ, తలపతి. దొర, పటేల్‌ అనుమతి మేరకు తలపతి ఆధ్వర్యంలో వడ్డె ఇలవేలుపు (దేవత) కొలుపును నిర్వహించగా అడితి బిడ్డ డోలి అనే వాయిద్యాన్ని వాయిస్తూ, పాటలు పాడుతూ పడిగె (చిత్రపటం) ఆధారంగా కోయల చారిత్రక గాథలను వల్లిస్తాడు. ఇలవేల్పును గుట్టపై నుండి జాతర స్థలానికి ఎదుర్కోవడానికి, మళ్ళీ తిరిగి సాగనంపడానికి డోలి కోయలే ముందుండి వాయిస్తారు. ఈ సందర్భంగా వీరు పాటలు పాడుతూ వాద్య శబ్దానికి అనుగుణంగా వలయాకారంలో తిరుగుతూ నృత్యం కూడా చేస్తారు. 2020 సంవత్సరపు మేడారం జాతర నుండి డోలి కోయలది ఒక ప్రత్యేక నృత్యంగా పేరు సంపాదించుకుంది. ఇలాంటి డోలి కోయ కళాకారుడు సకినె రామచంద్రయ్యకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది.

  1. కొమ్ము నృత్యం:

కోయలు అడవి దున్నపోతు (గొర్రపోతు) కొమ్ములతో తయారు చేసుకున్న ‘సింగ’ అను శిరస్త్రాణము (టోపి) ధరిస్తారు. తాటాకులతో తలపైన బోర్లించుకునే పరిమాణంతో సింగ తయారు చేస్తారు. దాని పై మధ్య భాగంలో జానెడు ఎత్తు ఉండేటట్లు తుంచిన నెమలి ఈకలను చెక్కుతారు. సింగకు కుడి, ఎడమ వైపుల కొమ్ములను అమర్చుతారు. తాటాకులు కనపడకుండా ముదురు రంగు (పచ్చ లేదా ఎరుపు) చీరను (పెర్మ కోక) చుట్టుతారు. నెమలి పురికట్ట, కొమ్ముల చుట్టూ చుట్టగా మిగిలిన చీరను సింగ వెనుక వైపుకు వదులుతారు. ఇలా తయారైన సింగను నర్తకుడు ధరించినప్పుడు అతని తలపై నెమలి ఈకల కట్ట, కొమ్ముల జత, నర్తకుని వెనుక తల వెనుక వీపు మీదుగా కొంకులపై వేళ్ళాడుతున్న చీర మడత మాత్రమే కనిపిస్తాయి – అందంగా. ఇలా పెద్ద కోక ధరించిన నర్తకులు చేసే నర్తనం కాబట్టి దీనిని పెర్మ కోక ఆట అని కూడా పిలుస్తారేమో. ఈ నర్తకులు పూర్వ కాలంలో కేవలం ధోతిని మాత్రమే ధరించేవారనిపిస్తుంది. కాని గత రెండు, మూడు దశాబ్దాల కాలంలో వీరు చేతులు లేని బనియన్‌ లేదా టీ-షర్ట్‌, నడుము భాగం నుంచి కిందికేమో గీతల లంగాను ధరించడం అలవాటు చేసుకున్నారు. ప్రతీ పురుష నర్తకుడు తన ఎడమ భుజం మీదుగా కుడి కాలుపై వేలాడే విధంగా నాలుగు అడుగుల పొడవైన డోలకొయ్య (గండ్జ)ను ధరిస్తాడు. గండ్జను గుమ్ముడు చెట్టు దుంగతో తయారు చేస్తారు. దుంగ మధ్యలో ఫీటు, ఫీటున్నర వ్యాసంతో బోలు చేసి, ఆ బోలును ఒక వైపు ఆవు తోలుతోన, మరో వైపు హన్మబండ (అలబండ) తోలుతో మూస్తారు. ఆవు తోలుతో మూసిన వైపు అడుగు పొడవుండే చిర్ర (కట్టె) తో వాయిస్తారు, హన్మబండ తోలుతో మూసిన వైపు ఎడమ చేతితో వాయిస్తారు. చిర్ర మొదట్లో చిన్న రంధ్రం చేసి, దాని గుండా ఒక ఇనుప రింగును దూర్చి, దానికి మువ్వలు కూర్చుతారు – వాయిస్తున్నప్పుడు వినసొంపైన శబ్దం రావడానికి. అందరూ కాళ్ళకు అందెలు ధరిస్తారు.

నర్తకుల మధ్యలో ప్రధాన పాటగాడు (మేస్త్రీ) ఉండి రేల పాటలు పాడుతూ నృత్యానికి నాయకత్వం వహిస్తాడు. పాటగాడు చిర్రతో బీటు మారిస్తే మిగతా నర్తకులు కూడా బీటు మార్చి, నృత్యాన్ని మారుస్తూ అనుసరిస్తారు. మధ్య మధ్య ముసారి కొమ్ము (తూత కొమ్ము /అడవిదున్న కొమ్ము) ను ఊదుతూ హుషారు గొలిపే శబ్దాలు చేస్తారు. నాట్యం చేసే సమయంలో ఈ ముసారి కొమ్మును భుజానికి తగిలించుకుంటారు. వారి నాట్యంలో భాగంగా అడవి దున్నపోతుల పోరాటం (పెర్మాం) ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు భూమి మీద వేసిన రూపాయల నోట్లను లేదా కాగితపు ముక్కలను తాము ధరించిన అడవి దున్న కొమ్ము కొనలతో గుచ్చి పైకి తీయడం వంటి చిత్ర విచిత్రమైన కళలను ప్రదర్శిస్తారు.

ఇలాంటి నృత్యాలు పూర్వ కాలంలో మనుగడ సాగించినా మధ్యలో కోయల ఆర్థిక స్థితి దిగజారిన కాలంలో కనుమరుగయ్యాయి. కాబట్టి ఇలాంటి నృత్యం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలంలోని పండ్రపోల పంచాయితీలోని కోయదొర కులస్థులకు మాత్రమే వచ్చు అని 2016 లో మైపతి అరుణ్‌ కుమార్‌ రాశాడు. కాని ఆ తరువాత తెలంగాణలోని అశ్వాపురం మండలం కోయ రంగాపురం, ఏటూరునాగారం దగ్గరి చినబోయినపల్లి మొదలైన గ్రామాల కోయలు ఈ నృత్యాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ నృత్యాన్ని మేడారం జాతరతో పాటు గంగాలమ్మ, కొండరాజులు, పసరుబోలి, పప్పుకొత్త, పలకం, బడ్డి మొదలైన పండుగలు, వివాహాది శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శిస్తున్నారు.

  1. కుర్రె నృత్యం:

సందర్భాన్ని బట్టి 20 నుండి 30 మంది పురుషుల వరకు కుర్రె నృత్యంలో పాల్గొంటారు. రెండు సన్నాయిలు, మూడు మేళాలు ఈ నృత్యంలో ప్రధాన సంగీత వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. పంచ, బనీను ధరించి తలకట్టు కట్టుకొని, చేతిలో తువ్వాలు పట్టుకొని కాళ్లకు గజ్జలు ధరించి వలయాకారంగా సంగీత వాద్య శబ్దాలు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి బృంద నాయకుని సైగలను అనుసరించి ఈ నృత్యాలు చేస్తారు.

  1. కోలాటం:

గ్రామాలలో పురుషులు రెండు చేతుల్లో రెండు కోలలు ధరించి పరస్పరం ఒకరి కోలలను ఒకరు కొట్టుకుంటూ పాటలు పాడుతూ వలయా కారంలో నృత్యం చేసే కోలాటం ఆట కోయలలో కూడా ఉంది. అలాగే కోయ స్త్రీలు కూడా ఈ ఆటను ఆడుతుంటారు.