నిధుల మంజూరులో కేంద్రం జాప్యం…కేంద్రానికి కెటిఆర్‌ లేఖ

రాష్ట్ర ఆర్థిక అవసరాలు, కేంద్రం నుంచి రావలసిన నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావాల్సిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు.

15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని మిలియన్‌ ప్లస్‌ నగరాల కేటగిరిలో ఉన్న హైదరాబాద్‌కి 468 కోట్ల రూపాయలను, ఇతర పట్టణాలకు 421 కోట్ల రూపాయలు మొత్తం నిధులను కేటాయించిందని, వీటిని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నిధుల కేటాయింపుని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ని పార్లమెంటులో సైతం ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. ఇందులో హైదరాబాద్‌కి రావాల్సిన నిధుల్లో ఇప్పటిదాకా ఒక్క రూపాయి విడుదల కాలేదని, మిగిలిన నగరాలకు సంబంధించి కేవలం 105 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా విడుదలయ్యాయి అని గుర్తు చేశారు.

కరోనా సంక్షోభంలో రాష్ట్రాలు కూడా ముందువరుసలో ఉండి పోరాడుతున్నాయని, దీంతోపాటు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నదని, వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ ను కూడా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందని తెలిపారు. అయితే ఆయా పథకాలకు సంబంధించి కేంద్రం యొక్క నిధులు రాకపోవడంతో ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమాలను వేగంగా కొనసాగించడం కొంత ఇబ్బందిగా మారింది అన్నారు.

గతంలో 14వ ఆర్థిక సంఘం సూచించిన 2714 కోట్ల రూపాయలకు బేసిక్‌ గ్రాంట్‌ కి గానూ కేంద్రం కేవలం 2502 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, అప్పుడు కూడా 208 కోట్ల రూపాయల నిధులను కేంద్రం రాష్ట్రానికి చెల్లించలేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నా కేంద్ర నిధులు రాకలో జాప్యం జరిగిందన్నారు. దీంతో పాటు 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి పర్ఫామెన్స్‌ గ్రాంట్‌ కింద రావాల్సిన నిధుల్లో 441 కోట్ల రూపాయల బాకీ ఉన్నాయని అన్నారు. ఇలా మొత్తం 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి 650 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. అయితే స్థానిక పట్టణ సంస్థలకు రావాల్సిన ఈ గ్రాంట్లను ఇతర రాష్ట్రాలకు పూర్తిగా చెల్లించిన విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు.

ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన హైదరాబాద్‌ కి రావాల్సిన 468 కోట్లు, ఇతర పట్టణాలకు రావాల్సిన 315 కోట్లు,14వ ఆర్థిక సంఘానికి సంబంధించి 650 కోట్ల రూపాయలు మొత్తంగా సుమారు 1,434 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. మంత్రి తన లేఖను కేంద్ర పట్టణాభివృద్ధి హౌసింగ్‌ శాఖ మంత్రి హరీదీప్‌ సింగ్‌ పూరికి కూడా పంపించారు.