అమలులోకి వచ్చిన సీఎం మరో హామీ… పేదలకు జీరో వాటర్‌ బిల్‌

By: ఎం. దాన కిషోర్‌, IAS

నీరు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం. ఈ ప్రసాదాన్ని పేదలకు ఉచితంగా పంచిద్దాం. పేద, మధ్య తరగతి ప్రజలు ఇక నుంచి వాటర్‌ బిల్లులు ప్రభుత్వానికి చెల్లించవలసిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇదే ఆశయంతో హైదరాబాద్‌ నగర పరిధిలోని అర్హులైన గృహ వినియోగదారులకు ఇరవై వేల లీటర్ల త్రాగు నీటిని ప్రతి నెల ఉచితంగా సరఫరా చేసే పథకాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు బొరబండలోని ఎస్పీఆర్‌ హిల్స్‌, రెహమత్‌ నగర్‌లో పలువురు ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌ ప్రజలకు రెండు రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని ఈ సందర్బంగా ప్రజల నుద్దేశించి మంత్రి అన్నారు.

ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నగర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు… హైదరాబాద్‌ వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించడం వలన నగరంలో నివసిస్తున్న 97శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని ముఖ్యంగా, స్లమ్‌ ఏరియాల్లో నివసిస్తున్న లక్షలాది మందికి ఈ పథకం ఎంతో మేలు చేకూరుస్తుందనడంలో సందేహం లేదని మంత్రి కేటిఆర్‌ అన్నారు. డిసెంబర్‌ 2020 నుండి ఈ ఉచిత త్రాగు నీటి పథకం అమల్లోకి వచ్చింది. డిసెంబర్‌ 2020 మాసానికి సంబంధించి 20 వేల లీటర్ల వరకు నీటిని వాడుకున్నవారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ ఉచిత తాగునీటి సౌకర్యాన్ని ప్రతి వినియోగదారులు పొందాలంటే.. వారు తమ కనెక్షన్లకు తప్పనిసరిగా వాటర్‌ మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వుందని, కాగా స్లమ్స్‌లో నివసించే వారికి ఎలాంటి మీటరు అమర్చుకోవాల్సిన అవసరం లేదని. ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకం వలన పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

మనదేశంలోని ఇతర మెట్రో నగరాల్లో నీటి కొరత అధికంగా ఉందంటూ, చెన్నై నగరంలో అయితే  తాగునీటిని రైళ్ళల్లో తరలిస్తున్న దుస్థితి ఉందని, అదే మన రాష్ట్రం లోని హైదరాబాద్‌లో దాదాపు 9.5 లక్షల కుటుంబాలకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరానికి తాగునీటిని అందించేందుకు జలమండలి సుదూర ప్రాంతంలో ఉన్న గోదావరి, కృష్ణా నదుల నుండి నీటిని ఎంతో వ్యయ ప్రయాసలతో తరలిస్తున్నదని, అయినా ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం ముందు ప్రభుత్వానికి జరిగే వ్యయం లెక్కలోకి  రాదన్నారు. భవిష్యత్తు లోనూ నగర ప్రజలకు త్రాగు నీటి కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేశవాపురం ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్‌ చుట్టూ ఉన్న  ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ రింగ్‌ మెయిన్‌ ప్రాజెక్టును చేపట్టడం వలన 2050 వరకు తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన విధంగా జనవరిలో జారీ చేసే డిసెంబర్‌ బిల్లు నుంచే ఈ ఉచిత పథకం అమల్లోకి వస్తుంది. డిసెంబర్‌ 2020 మాసానికి సంబంధించి 20 వేల లీటర్ల వరకు నీటిని వాడుకున్నవారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, 20 వేల లీటర్ల పైన నీటిని వినియోగించిన వారు మాత్రం ఆ మేరకు నల్లా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉచిత తాగునీటి సౌకర్యాన్ని మురికి వాడలలో నివసిస్తున్న పేదవారు కాకుండా, మిగతా వినియోగదారులు పొందాలంటే.. వారు తమ కనెక్షన్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి.

మార్గ దర్శకాలు:

డొమెస్టిక్‌ స్లమ్‌ వినియోగదారులు: డొమెస్టిక్‌ స్లమ్‌ వినియోగదారులకు జీరో బిల్‌ జారీ చేస్తారు. వీరికి స్లమ్‌ డాకెట్‌ వారిగా నీటి వాడకాన్ని లెక్కిస్తారు. వీరు తమ నల్లా కనెక్షన్లకు వాటర్‌ మీటర్ల ను బిగించుకోవాల్సిన అవసరం లేదు.

డొమెస్టిక్‌ వినియోగదారులు: డొమెస్టిక్‌ వినియోగ దారులకు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అయితే వీరు తమ సొంత ఖర్చుతో జలమండలి సూచించిన ఏజెన్సీల ద్వారా వాటర్‌ మీటర్ల ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఏజెన్సీల వివరాలు జలమండలి వెబ్‌ సైట్‌ లో పొందుపరిచారు. వీరికి నెలకు 20 వేల లీటర్లలోపు వినియోగించిన నీటికి ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 20 వేల లీటర్ల పైన నీటి వాడకానికి మీటర్‌ రీడిరగ్‌ ప్రకారం బోర్డు టారిఫ్‌ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. 

డొమెస్టిక్‌ అపార్ట్‌ మెంట్‌: వీరు కూడా తమ సొంత ఖర్చుతో మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్‌మెంట్‌ లలో నివసించే వారికి ఒక ఫ్లాటుకి లేదా గృహానికి 20 వేల లీటర్ల చొప్పున ఉచితం. అంతకుమించి వాడితే.. బోర్డు టారిఫ్‌ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీరు కూడా బోర్డు సూచించిన ఏజెన్సీల ద్వారా వాటర్‌ మీటర్లను బిగించుకోవాలి.

ఆధార్‌ లింక్‌: ఈ పథకానికి అర్హులైన వినియోగదారులందరూ.. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్‌.నం. 211 తేదీ: 02.12.2020 ప్రకారం తమ క్యాన్‌ (CAN) నెంబర్ల కు తమ ఆధార్‌ కార్డు ను  లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా మీ సేవ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. 

వినియోగదారులందరికీ మార్చి 31, 2021 వరకు మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలోపు మీటర్ల ఏర్పాటు మరియు ఆధార్‌ కార్డు లింక్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరికీ  ఏప్రిల్‌ మొదటి తేదీ నుండి డిసెంబర్‌ నెల నుండే ఈ పథకం వర్తించే విధంగా బిల్లులు జారీ చేయబడతాయి.

ఈ పథకం క్షేత్ర స్థాయిలో అమలుకు జలమండలి కస్టమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌ మెంట్‌ (CRM) కేంద్రాలను ఏర్పాటు చేసింది.

  • ఈ పథకం కేవలం పైన పేర్కొన్న డొమెస్టిక్‌ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయి. మిగతా కేటగిరి వారు బోర్డు టారిఫ్‌ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
  • వినియోగదారులు తమ క్యాన్‌ నెంబర్లతో ఆధార్‌ ను లింక్‌ చేసుకోవడానికి www.hyderabadwater.gov.in వెబ్‌ సైట్‌ ను సంప్రదించాలి లేదా వారి దగ్గర్లోని మీ సేవ సెంటర్‌ లో ఆధార్‌ కార్డును క్యాన్‌ నెంబర్‌ కు లింక్‌ చేసుకోవచ్చు.
  • వినియోగదారులు తమ సందేహాలను కన్స్యూమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌ మెంట్‌ ను సంప్రదించి గానీ, లేదా కష్టమర్‌ కేర్‌ నెంబర్‌ 155313, ఫోన్‌ : 040-2343 3933కు గానీ ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, సి.హెచ్‌. మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పార్లమెంట్‌ సభ్యులు రంజిత్‌ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఎగ్గె మల్లేశం, శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, దానం నాగేందర్‌, కే. వివేకానందలతో పాటుగా నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.