పోతనను తెలుసుకుందాం
By: శ్రీపాద రమణ
కొత్త తరం తెలుగు సాహిత్యానికి దూరమవుతోందనే ఆవేదన చాలామంది తల్లి దండ్రులు, భాషాభిమానులు, కవుల్లోనూ ఉంది, దానికి అనేక కారణాలున్నాయి. ‘‘కలమున్న ప్రతి వ్యక్తి కవేనంటాడని’’ ఓ పెద్దాయన ఆవేదన. కవుల సంఖ్య పెరిగినా కవిత్వంలో నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి. కవిత్వం కులం, మతం, వర్గం ప్రాతిపదికగా కొంత పక్కదారి పట్టడం, అదే కవిత్వం అనే భ్రమను కల్పించడం వల్ల విద్యార్థులు, యువత సాహిత్యానికి దూరం అయ్యారు. ఈ దూరాన్ని చెరిపి అసలైన కవిత్వానికి అశేషమైన ప్రజల్ని దగ్గర చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తిత్వ వికాసానికి పీఠం వేస్తున్న ఈ మిలీనియల్ తరానికి మహాకవుల రచనల్లో దాగిన అద్భుతమైన ఆలోచన ప్రపంచాన్ని చూపించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై పుట్టి వ్యాసుని భారతాన్ని తెలుగీకరించిన మన వరంగల్ ముద్దుబిడ్డ బమ్మెర పోతనను, ఆయన సాహిత్యాన్ని అందులోని అపురూపమైన భావనలను ప్రతి ఒక్కరి మదికి చేర్చవలసి ఉంది.
బమ్మెర పోతన తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, బమ్మెర అనే గ్రామంలో జన్మించారు. చతుర్వేద సారమైన వ్యాసభారతం నన్నయ్య, తిక్కన్న, ఎర్రన రచిస్తే.. వాల్మీకి విరచిత రామాయణం భాస్కరాదుల ద్వారా తెలుగు రూపు సంతరించుకోగా, మిగిలిన వ్యాస భాగవతం జోలికి చాలా రోజులు ఏ కవి పోలేదు. కారణం, వ్యాస రచనను అనువదించడం అంటే మాటలతో అయ్యే పనికాదు, ఉత్కృష్ట, సంక్లిష్ట పదాల సమ్మేళనం వ్యాసుడి రచనలు. కానీ, బమ్మెర పోతన ఆ మహాకావ్యాన్ని తెలుగీకరించారు. రుజుగ్రంథంలో ఉన్న సౌందర్యాన్ని, వర్ణనలను ఏ మాత్రం కోల్పోకుండా భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహా కవి మన పోతన. పోతన భాగవతానికి ముందు ‘‘భోగినీ దండకం’’, ‘‘వీరభద్ర విజయం’’ అనే కావ్యాల్ని రచించారు. ఆయన మన తెలంగాణ బిడ్డకావడం మనమంతా గర్వించాల్సిందే. అందుకే తెలుగు మహాసభల్లో బమ్మెర పోతనను స్మరించుకుంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
‘‘పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట
పలికెద వేఱొండుగాథ బలుకగ నేలా?’’
అంటూ పోతన పద్యం చదివి తన ప్రేమను వ్యక్తంచేశారు. తెలుగు సాహిత్యానికి బమ్మెరపోతన చేసిన సేవలు అనితరసాధ్యం. రామాయణం, భారతం, భాగవతం గురించి తెలిసిన ఎవ్వరికైన భాగవతం అనగానే బమ్మెర పోతన మదిలో తిరగాడుతాడు. పోతన భాగవతం గురించి ఆలోచన వస్తే చాలు భక్తిలో తడిసిన గాథలు అలలుగా పొంగివస్తాయి, గజేంద్ర మోక్షం, ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, రుక్మిణీ కళ్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామిళోపాఖ్యానం లాంటి అద్భుతమైన ఉపాఖ్యానాలన్నీ గుర్తుకు వస్తాయి. మాటలకందని కవిత్వ వర్ణనలు కళ్లముందు కదలాడుతాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుని గురించి పోతన చేసిన వర్ణనలు అద్వితీయమైనవి.
నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పై
జల్లెవాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో !
మల్లియలార ! మీ పొదలమాటున లేడు గదమ్మ ! చెప్పరే!
గోపికలే మన దగ్గరికి వచ్చి చిన్ని కృష్ణుని చిరునామా అడిగినట్టు ఉంటుందీ పద్యం. వాడుక పదాలతోనే విశిష్టమైన పద్యరచన చేయగలిగిన భాషానైపుణ్యం ఒక్క బమ్మెర పోతనకే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. ప్రకృతితో మనిషి మాట్లాడే పోతన భావుకత చదువరులను మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఇక మనిషి ఎట్లా ఉండాలి, ఎంత నిర్భయత్వంతో, ఎంత నిజాయితీతో బతకాలో కూడా తన పద్యాల ద్వారా హితబోధ చేశారు పోతన. మనం పూజించే దేవుడు అద్భుతమైన శక్తియుక్తులు కలవాడై ఉండాలని, మనం గౌరవించే వ్యక్తులు ప్రత్యేకమైన గుణగణాలు కలిగియుండాలంటాడు పోతన. అందుకే.
‘‘లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్’’
గొప్పవాళ్లు మాత్రమే కష్టాలు, నష్టాలు వచ్చినా భూమి బద్ధలయ్యేంత సమస్యలు వచ్చినా నిశ్చింతగా నిలబడి ఉంటారు.. వారు మాత్రమే సాటి మనిషికి దైవత్వం పంచగలరు. వారే భగవంతుడు, అలాంటి వారినే నేను సేవిస్తాను, పూజిస్తాను అంటూ ప్రకటించారు. అంతేకాదు, సాహిత్యం అంటే ఆత్మగౌరవం, సాహిత్యం అంటే దేవీ కటాక్షమని సగర్వంగా ప్రకటించిన తిరుగుబాటుకవి పోతన. కవిత్వాన్ని అమ్ముకోవడం కంటే వ్యవసాయం చేసుకొని బుద్ధిగా బతకడం మంచిది అంటూ ఆత్మ గౌరవ జెండాను రెపరెప లాండిరచిన అక్షరశిల్పి. మనిషి ఏ పని చేసినా దాన్నుంచి ఏది ఆశించకుండా, నూటికి నూరు శాతం ప్రేమతో, సమాజం కోసం, ఆత్మతృప్తి కోసం చేయాలని తెగేసి చెప్పిన విప్లవకవి పోతన. అందుకే..
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుగూడు భుజించుటకంటే సత్కవుల్
హాలికులైన నేమి? గుహనాంతర సీమల గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
అంటూ అక్షరానికి, కవిత్వానికి ఉన్న పవిత్రతను నగ్నంగా ఎలుగెత్తాడు పోతన. అందుకే పోతన అంటే వినమ్రుడైన, నిరాడంబరుడై భక్తి తన్మయత్వంతో పొంగిపొరలే రూపం సాక్షాత్కరిస్తుంది. తన కవితల్ని నరులకు అంకితం ఇవ్వాల్సి వస్తుందేమోనని కన్నీరు పెట్టి సరస్వతీ దేవిని ఓదార్చే పవిత్రమూర్తి గోచరిస్తుంది. ఆడంబరాలు లేని ఒక ధ్యానజీవి, ధన్యజీవి, గుర్తుకు వస్తుంది. భక్తితో నిండిన కవిత్వాన్ని తనువంత నింపుకొని జీవితమే కవిత్వం – కవిత్వమే జీవితంగా బ్రతికిన ఒక విలువల శిల్పం మదిలో మెదలాడుతుంది. అందుకే కాబోలు.. పోతన భక్తిని, తత్వాన్ని, కవిత్వాన్ని అవపోసన పట్టిన.. తెలుగు సినీ హాస్యనటుడు, బ్రహ్మానందం కొప్పరపు కవుల సంస్మరణ సభా వేదిక మీద ప్రసంగిస్తూ.. ‘‘తెలుగు సాహిత్యంలో సరస్వతీదేవీ సాక్షాత్కారం పొందిన ఏకైక తెలుగు కవి బమ్మెర పోతన’’ మాత్రమేనంటాడు. అది అక్షర సత్యం. మన పోతనను తెలుసుకుందాం, భవిష్యత్ తరాలకు పోతన తత్వాన్ని అందిద్దాం.