లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధే లక్ష్యం: కేటీఆర్
హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజులపాటు నిర్వహించిన 18వ బయో ఏసియా వర్చువల్ సదస్సు విజయవంతమయ్యింది. పలు అంశాలపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు విఫులంగా చర్చించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సదస్సును ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 30వేల మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి కేటీఆర్ వివరించారు.

మొదటిరోజు సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని వంద బిలియన్ డాలర్ల (రూ. 7.24 లక్షల కోట్లు) స్థాయికి చేర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ విశ్వ విద్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ రంగంలో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయని, సంస్థలు పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. గత ఏడాది సింజెన్ సంస్థ క్యాంపస్ ప్రారంభించగా 100 మంది శాస్త్రవేత్తలు ఉండే వారని, ఈ సారి ఆ సంఖ్య 225కు చేరిందని తెలిపారు. ఇది పరిశోధనల ప్రాధాన్యతను తెలియచేస్తున్నదన్నారు.
దేశంలోనే అతిపెద్ద నేషనల్ యానిమల్ రిసోర్స్ సెం టర్ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) జీనోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నదన్నారు. శాస్త్ర పరిశోధనలో మనకు ఎదురులేదని చెప్పేందుకు ఇవన్నీ నిదర్శనాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైటివా సంస్థ భాగస్వా మ్యంతో జీనోమ్‌వ్యాలీలో బీ`హబ్ బయోఫార్మా స్కేల్అప్ సెంటర్‌ను ఏర్పాటు చేయను న్నదని తెలిపారు. భారతదేశ బయో ఫార్మాస్యూటికల్ రాజధానిగా తెలంగాణ ఆవిర్భవి స్తుందనే నమ్మకం ఉందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. వీటివల్ల ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పారు.గత సంవత్సరం సుమారు 14వేల మందికి రాష్ట్రంలో ఉపాధి లభించిందని, దాదాపు 3,700 రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కోవిడ్ వ్యాక్సీన్ తయారుచేసిన సంస్థ భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణాఎల్లా, జేఎండీ సుచిత్రాఎల్లాకు జీనోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును మంత్రి కేటీఆర్ అందచేశారు.
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణాఎల్లా మాట్లాడుతూ, భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారి వ్యాధులకైనా వ్యాక్సీన్లు హైదరాబాద్‌లోనే తయారవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జీనోమ్‌వ్యాలీ ప్రపంచానికి గొప్ప ఔషధ కేంద్రంగా మారనున్నదని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేష్రంజన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
రెండవరోజు సదస్సులో ‘హెల్త్‌కేర్ టూ హిట్ రిఫ్రెష్’ అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తలు వర్చువల్‌గా పాల్గొని తమ అభిప్రాయాలను తెలియ చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అయినా సామాన్యునికి ఉపయోగపడ్డపుడే సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు చెబుతారన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సామాన్యుడి మనుగడను దృష్టిలో పెట్టుకుని సాంకేతిక విధానాలను, పాలసీలను అమలు చేస్తున్నదని అన్నారు. మెడ్‌టెక్, కాంప్లెక్స్ జెనరిక్స్, బయో జనరిక్స్, పర్సనలైజ్డ్ మెడిసిన్ తదితర రంగాల్లో లోతుగా పరిశోధనలు జరగాల్సిఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఆర్ అండ్ డీతోపాటు స్టార్టప్‌లను ప్రోత్స హించేందుకు జీనోమ్‌వ్యాలీలో ‘బీహబ్’ (బయోఫార్మా స్యూటికల్ హబ్) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ, కరోనా కారణంగా వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైద్య సేవలలో ప్రవేశపెట్టబడిందన్నారు. పలు విషయాలపై ఆయన మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ దేశంలోని ఫార్మా సంస్థలు పరి శోధనలపై దృష్టి సారించాలని అన్నారు. దీనికి ప్రైవేట్ రంగం నేతృత్వం వహించాలన్నారు. ఇన్నొవేషన్, ఆర్ అండ్ డీ సెక్టార్లో మరిన్ని పెట్టుబడులు రావాలన్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇప్పటికే మెడికల్ డివైజ్ పార్క్, డ్రగ్స్పార్క్, ఫార్మాపార్క్ల వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరిం చారు. ఇన్సెంటివ్స్లు ప్రకటిస్తున్నామని, త్వరలో మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరితోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.