మాటల కాలువ

అప్పుడప్పుడు మాటల కాలువ
మనసుల్ని ఒరగోస్తూ…
మనుషుల్ని విడగొడుతూ…
పాయలు పాయలుగా పారుతుంది.

నిన్ను నానుండి, నన్ను నీనుండి వేరు చేస్తూ
ఆవేశం పొంగిన ప్రతిసారి
అజ్ఞానపు తలుపు తెరుచుకుని
వివేచన కోల్పోయి ప్రవహిస్తుంది

మదిలోని భావాల్ని, అభిప్రాయాల్ని,
ఆలోచనల్ని…
మంచి చెడులను, సమన్వయ పరచలేక
ఒక్కోసారి నోరు మోరీలా
దుర్గంధం వెదజల్లే మురికి కాలువలా
జాలువారుతుంది

నమ్మకం నాటుకుంటున్న కొద్ది
విశ్వాసం అల్లుకుంటున్న కొద్ది
మనుషుల మధ్య అపార్థాల ఆనకట్ట కట్టి
ప్రేమానుబంధాల గట్లు తెంచి
ఈ కాలువ జీవిత కమతాన్నే ముంచేస్తుంది.

అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి
నీ అంతర్‌ బోధకుడిని అడుగు
తీపేదో,చేదేదో తెలిపే రుచికణికలు
తుప్పు పట్టిపోలేదు కదా ?
సజీవంగానే ఉన్నాయి కదా …?
లెక్కచేయకపోతే ముందుగా నువ్వే నష్టపోతావు
పొర్లిన ప్రతిమాటకి ఒక లెక్క ఉంటుంది
తస్మాత్‌ జాగ్రత్త మిత్రమా …!

- శ్రీతరం కొప్పునూర్‌