మహాత్మా !

maga

పండ్లున్న చెట్టుకే
రాళ్లదెబ్బలని నీకు తెలియంది కాదు
చెట్టు పేరుజెప్పుకుని
కాయలమ్ముకోవడం మాత్రం
నీ తదనంతరమే సురువైట్కంది

బక్కపలుచని శరీరం
కళ్లజోడు..గడియారం
అర్ధనగ్న ప్రదర్శనలిస్తూ
చేతికర్రతో…బోసినవ్వుతో
ఎలా బతికినవో..ఊహిస్తే
మాకెప్పటికీ…ఆశ్చర్యమే !

సత్యాగ్రహమనే ఆయుధంంతో
సత్యం..అహింస లనే సూత్రాలతో
ఎక్కుపెట్టిన జాతీయోద్యమం
బానిస సంకెళ్లను తెంపి
బాధల్ని దూదిపింజల్లా చేసి
జాతీయపతాకాన్ని స్వేఛగా ఎగరేసిన
నీ ఘనచరిత్ర విన్నప్పుడల్లా రోమాంచితమే !

స్వార్ధ కుళ్లు రాజకీయ బురదగుంటలో
పూర్తిగా మునిగిన లౌకికత్వాన్ని
వెలికితీసే క్రమంలో అంటిన మరకల్ని
నీ రక్తపుచారికల్తో కడిగేసుకున్నవు !

మా బతుక్కి నిప్పెట్టానికి పేటెంట్‌ హక్కులు
వాడి చేతిలో పెట్టి చితిపేర్చినందుకు
కూలీడబ్బులకోసం వాడి దగ్గరే చేయిచాపినప్పుడు
ఓటు విలువకు నీళ్లొదిలినమని
రేపటికైనా మాకర్ధంకాదని
నువ్వెంత మొత్తుకున్నా..విననందుకు
తరతరాలుగా తగినశాస్తే జరుగుతుందిలే !

అదిలించడానికి….దారిమళ్లించడానికి
మాకిప్పుడు నీ భావజాలపు ఊతకర్ర లేనందుకేనేమో
ఇంంకా గుడ్డిగా అనుకరిస్తూ..
గొర్రెల్లా ..తోకలూపుతూ
అభివృద్ధి చెందుతూ…..నే వున్నామనే పరుగుపందెంలో
రైతన్నలను…నేతన్నలను బలితీసుకుంటూ
ప్రపంచీకరణలో పావులమై మిగిలినం!

అంతర్జాతీయ ఆకాశపువీధిలో తారవై నువ్వు
సంక్షుభిత జాతీయవాద మారకపు విలువతో మేము
సజాతిధృవాలు వికర్షించుకున్నట్లు
నీ వారసత్వపు భావజాలానికి దూరంగా విసిరేయబడుతూ మేము
నీ సత్యాగ్రహపు పాదముద్రల దిశగా
మా అడుగుల్ని కదిలించు ఇకనైనా !!

బండారి రాజ్‌ కుమార్‌