మనసుంటే….

చిత్తశుద్ధి, కార్యదక్షత, కొంచెం చొరవ వుంటే పరిష్కారం కాని సమస్య ఏదైనా వుంటుందా? ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం తప్పక వుంటుంది.

సమస్యను భూతద్దంలో చూపి, దానికి మరిన్ని చిక్కుముడులువేసి చోద్యం చూడటం, కాలం వెళ్ళదీయటం ఇంతకాలం మనం చూస్తూనే వున్నాం. కానీ, ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అటు కేంద్రంతోనూ, ఇటు ఇరుగు పొరుగు రాష్ట్రాలతోనూ ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపించడం శుభ పరిణామం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫిబ్రవరి 17న తన జన్మదిన వేడుకలను కూడా సొంతగడ్డపై జరుపుకోకుండా, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, పొరుగు రాష్ట్రమైన మహరాష్ట్ర వెళ్ళారు. ఇరు రాష్ట్రాలమధ్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చలు జరిపారు.

వీటిలో ‘లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు’కు సంబంధించి ఇరు రాష్ట్రాలమధ్య 1975లో ఒప్పందం కుదిరింది. దీనివల్ల ఆదిలాబాద్‌ జిల్లాలోని 47వేల ఎకరాలకుపైగా సాగు నీరు, త్రాగునీరు లభిస్తుంది. ‘లెండి ప్రాజెక్టు’కు సంబంధించి 2003లో ఒప్పందం కుదిరింది. దీనివల్ల తెలంగాణలో 22వేల ఎకరాలకు నికర జలాలు లభిస్తాయి.

‘ప్రాణహిత`చేవెళ్ళ ప్రాజెక్టు’కు సంబంధించి 2012లో రెండు రాష్ట్రాలమధ్య ఒప్పందం జరిగింది. దశాబ్దాలుగా మోక్షం లభించని ఈ ప్రాజెక్టులపై మన ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ అంతర్రాష్ట ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చారు.

‘‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆకాంక్షలు, అవసరాలు వున్నాయి. వాటికి అనుగుణంగా, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సంబంధాలను మెరుగు పర్చుకుంటాం. నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం. పొరుగు రాష్ట్రాలతో ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణపూరిత వాతావరణం కొనసాగించం’’ అని ఈ సందర్భంగా ముంబయిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పిన మాటలు గమనార్హం.
అందుకే, మనసుంటే మార్గం వుండకపోదు. సమస్యలకు పరిష్కారమూ లభించకపోదు.