మానవాళి మహాత్ముడు

– దేవులపల్లి ప్రభాకరరావు

స్వతంత్ర భారతదేశం ‘జాతిపిత’ గాంధీజీ (మోహన్‌ దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ). ఆయన కేవలం ‘జాతిపిత’ గానె ఈ దేశంలో గౌరవం పొందడం లేదు-నాడు, నేడు గాంధీజీ సకల భారత జన కోటికి ‘మహాత్ముడు’గా సర్వదా ఆరాధనీయుడు. నిజానికి, గాంధీజీ భారత ప్రజలకే గాక అఖిల ప్రపంచానికి, మానవాళికంతటికి మహాత్ముడు. స్వదేశానికి మాత్రమే ఆయన సేవలు పరిమితం కాలేదు. గాంధీజీ మానవాళి విముక్తిని, అభ్యున్నతిని, శ్రేయస్సును ఆకాంక్షించారు. లోకకల్యాణానికి ఆయన అమూల్య జీవితం అంకితమయింది.
tsmagazine

ఒక కంపెనీ కేసులలో న్యాయవాదిగా సహాయపడడానికి 1893లో(1891లో లండన్‌ విశ్వవిద్యాలయం నుంచి బారిస్టర్‌ డిగ్రీ పొంది ఇండియాకు తిరిగి వచ్చిన పిదప) దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ అక్కడి నల్లజాతి ప్రజలు, ఎంతో కాలం నుంచి అక్కడే స్థిరపడిన భారతీయులు శ్వేతజాతి పాలనలో ఎదుర్కొంటున్న జాతి వివక్షతకు, అన్యాయాలకు, అవమానాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా గొంతు విప్పి, శాంతియుత పోరాటాలను అపూర్వ రీతిలో నిర్వహిస్తూ తాడితులు, పీడితులు, అనాధుల పక్షాన న్యాయవాదిగా నిలువవలసి వచ్చింది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టినప్పుడు తన భుజాలమీద ఇంతటి మహత్తర బాధ్యత పడుతుందని ఊహించలేదు. దక్షిణాఫ్రికాలో, తెల్లదొరల పాలనలో శ్వేతజాతికి చెందనివారు అడుగడుగున ఎంతటి అమానుషత్వానికి, అవమానాలకు గురి అవుతున్నారో స్వీయ అనుభవంతో తెలుసుకోగలిగారు.

మొదటి తరగతి టికెటు కొని 1893 మే నెలలో ఒక రోజు గాంధీజీ దర్బాన్‌ నుంచి ప్రెటోరియాకు ప్రయాణిస్తున్నారు. పీటర్‌ మాంట్స్‌ బర్గ్‌ స్టేషన్‌ లో శ్వేత అధికారులు గాంధీజీ కూర్చున్న పెట్టెలో ప్రవేశించి ఆయనపై దౌర్జన్యం జరిపారు. తన టికెట్టు చూపినా వినకుండా ఆయనను పెట్టె నుంచి బయటికి గెంటేసారు-నల్లజాతీయులు, భారతీయులు మొదటి తరగతి పెట్టెలో కూర్చోవడానికి అర్హులు కాదని శ్వేత అధికారులు దురహంకారంతో మాట్లాడారు. ఆ రాత్రంతా గాంధీజీ వణికించే చలిలో స్టేషన్‌ ప్లాట్‌ ఫామ్‌ పై గడిపారు. జోహన్స్‌ బర్గ్‌ నగరంలోని గ్రాండ్‌ నేషనల్‌ హోటల్‌లో గాంధీజీని ప్రవేశించనివ్వలేదు. తనపై దౌర్జన్యం, తనకు ఘోర అవమానం జరిగిన ఆ క్షణాలలో గాంధీజీ దక్షిణాఫ్రికా నల్లజాతీయుల, అక్కడి భారతీయుల విముక్తి, హక్కుల పరిరక్షణ కోసం కంకణధారణ చేశారు, శాంతియుత పోరాటానికి నడుంబిగించారు. భారత దేశంతో సహా వివిధ దేశాలలో మానవహక్కులను, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను సైతం కోల్పోయి దాస్యశృంఖలాలలో మగ్గుతున్న కోట్లాది ప్రజలు దీనులై, దిక్కులేని వారయి గాంధీజీ కళ్లముందు కన్పించారు. గాంధీజీ దాస్యశృంఖలాలను ఛేదించే మహానాయకుడుగా, స్వాతంత్య్ర ప్రదాతగా, మహాత్ముడుగా, అహింసా మూర్తిగా, శాంతిదూతగా అవతరించడానికి ప్రేరణ కల్గించిన, స్ఫూర్తినిచ్చిన క్షణాలివి!

ఆ క్షణాలు, ఆ క్షణాలలో గాంధీజీకి కలిగిన సంకల్పం చరిత్రాత్మకమయినవి, మహత్తరమయినవి. ఆధునిక మానవ చరిత్రలో అవి విస్మరించరాని క్షణాలు. శ్వేతజాతి పాలకుల జాతి వివక్షత విధానాలతో, జాత్యహంకార ధోరణితో ప్రాథమిక మానవ హక్కులను కోల్పోయి బానిసలుగా బతుకుతున్న నల్లజాతీయులకు, ఆదేశంలో స్థిరపడిన భారతీయులకు విముక్తి కల్గించడానికి గాంధీజీ చట్టబద్ధ, శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభించారు. మరోవంక గాంధీజీ స్వదేశంలో కొనసాగుతున్న జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాల సరళిని, తీరు తెన్నులను గమనించేవారు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు, ఇరవయిరెండు సంవత్సరాల కాలంలో, ఒకవంక అక్కడ ప్రజలను సమీకరిస్తూ, సంఘటితపరుస్తూ, న్యాయస్థానాలలో, బయట ఉధృత, శాంతియుత పోరాటాలు నిర్వహిస్తూ గాంధీజీ భారతదేశం వచ్చి భారతజాతీయ కాంగ్రెస్‌ మహాసభలలో పాల్గొనేవాడు. లోక్‌ మాన్యబాలగంగాధరతిలక్‌, గోపాలకృష్ణ గోఖలే తదితర భారతజాతీయ నాయకులతో గాంధీజీకి సన్నిహిత సంబంధాలుండేవి. గోపాలకృష్ణగోఖలేను గాంధీజీ తన రాజకీయ గురువుగా పరిగణించి గౌరవించారు. గాంధీజీ ఆహ్వానాన్ని అంగీక రించి గోపాలకృష్ణగోఖలే ఒకసారి దక్షిణాఫ్రికాలో పర్య టించారు. గాంధీజీ నాయ కత్వంలో దక్షిణాఫ్రికాలో కొన సాగుతున్న స్వాతంత్య్ర సమరాన్ని శ్లాఘిస్తూ భారతజాతీయ కాంగ్రెస్‌ మహాసభ 1909లో తీర్మానించింది. మొదటిసారి గాంధీజీ 1909 మార్చి నెలలో దక్షిణాఫ్రికాలోనె సత్యాగ్రహ సమరశంఖారావాన్ని పూరించారు-సత్యాగ్రహ సమరాన్ని గాంధీజీ మొదటిసారి ప్రారంభించింది దక్షిణాఫ్రికాలోనె. గాంధీజీ మొదటిసారి నిరాహారదీక్ష జరిపింది (1913లో ఒక కారాగారంలో) దక్షిణాఫ్రికాలోనె. గాంధీజీ సత్యాగ్రహ సమరానికి దక్షిణాఫ్రికా ఒక ప్రయోగశాలగా ఉపయోగపడింది.

ఇరవయిరెండేండ్లు దక్షిణాఫ్రికాలో గడపిన తరువాత గాంధీజీకి స్వదేశం వెళ్లి తన దేశ ప్రజల స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామి కావాలన్న ఆలోచన 1914లో వచ్చింది. 1914 జూలైలో ఆయన దక్షిణాఫ్రికాకు వీడ్కోలు పలికి లండన్‌ వెళ్లి అక్కడి నుంచి భారతదేశం బయలుదేరారు. 1913 జనవరి 13 నుంచి(అప్పుడు దక్షిణాఫ్రికాలో) 1948 జనవరి వరకు గాంధీజీ స్వాతంత్య్రం కోసం, మత సామరస్యం కోరుతూ మొత్తం పదిహేడు పర్యాయాలు చరిత్రాత్మక నిరాహారదీక్షలు నిర్వహించారు. 1908 జనవరి నుంచి(దక్షిణాఫ్రికాలో) 1942 ఆగస్టు 9వరకు(బొంబాయిలో క్విట్‌ ఇండియా తీర్మానం తరువాత) గాంధీజీ స్వాతంత్య్ర ఉద్యమాలలో పదిహేను పర్యాయాలు అరెస్టయి కారాగార శిక్షలు అనుభవించారు. గాంధీజీ 1915 జనవరి 9వ తేదీన బొంబాయిలో నౌకదిగి మాతృ భూమి నేలపై అడుగుపెట్టారు. ఒక సంవత్సరం ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా దేశమంతట పర్యటించి దేశప్రజల పరిస్థితిని పరికించాలని, పరిశీలించాలని గాంధీజీకి గోపాలకష్ణగోఖలే సలహా ఇచ్చారు. మోకాళ్ల మీదికి ధోవతితో, చొక్కాలేకుండా కాలినడకన, మూడవ తరగతి రైలు పెట్టెలో ప్రయాణిస్తూ గాంధీజీ ఒక సంవత్సరం కాలం దేశమంతట విస్తతంగా పర్యటించారు.

తన దేశంలోని కోట్లాది సామాన్యుల, నిరుపేదల దారిద్య్రాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అమాయకత్వాన్ని గాంధీజీ స్వయంగా గుర్తించారు. ఆయనకు దరిద్రనారాయణుల దర్శనమయింది. మానవసేవే మాధవసేవ అన్న సూక్తికి ఆయన త్రికరణశుద్ధితో అంకితమయినారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ ఆ సందర్భాన గాంధీజీ గురించి అన్న మాటలు- ”… వేలాది దరిద్రుల, నిరుపేదల గుడిసెల వాకిళ్లలో గాంధీజీ వారిలో ఒకడుగా నిలిచి కన్పించాడు. ఆ పేదప్రజల భాషలో ఆయన మాట్లాడినారు. సజీవ సత్యంగా ఆయన కన్పించాడు వారికి. దేశప్రజలకు ఆయన మహనీయుడుగా, మహాపురుషుడుగా కన్పించాడు… భారతీయులందరు తన వారని భావించిన వాడు గాంధీజీ ఒక్కడే…” తాను ప్రారంభించదలచిన స్వాతంత్రోద్యమ కార్యక్రమాలకు కేంద్రంగా గాంధీజీ 1915 మే నెలలో అహమదాబాద్‌లో(గుజరాత్‌)సబర్మతీ నదీతీరాన సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. సబర్మతి ఆశ్రమానికి వచ్చిన గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ టాగోర్‌(టాగోర్‌ ను గాంధీజీ ‘గురుదేవ్‌’ అని సంబోధించేవాడు) ఒక ఉపనిషత్‌ శ్లోకం చదువుతూ గాంధీజీని ‘మహాత్మా’ అని సంబోధించాడు. అప్పటి నుంచి ఆయన ప్రపంచమంతట, సకల మానవాళికి మహాత్ముడయినాడు. సైద్ధాంతిక విభేదాలు ఎన్ని ఉన్నప్పటికి గాంధీజీ, టాగోర్‌ అత్యంత సన్నిహితులయినారు. వారిద్దరిది ఆత్మీయ అనుబంధం.

మానవత్వాన్ని ఆరాధించిన మహాపురుషుడు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పట్టాభిషేకం చేసిన మహానాయకుడు గాంధీజీ. తన ప్రవచనాలను, సత్యం, అహింస బోధనలను, తన విశ్వాసాలను, సిద్ధాంతాలను అందరికంటె ముందు తానే ఆచరించిన, చెప్పిందే చేసిన, చేసిందే చెప్పిన కపటర హితుడు, కారుణ్యమూర్తి, అసాధారణ ఋషిపుంగవుడు గాంధీమహాత్ముడు. మేరునగ సమాన ధీరత్వంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఆ మహాత్ముడు ”నా జీవితమే నా సందేశం” అని అనగలిగాడు. ఆధునిక యుగంలో సామ్రాజ్యవాదం, వలసతత్వం, జాతివివక్షత, మతవిద్వేషం భయంకర స్వరూపం ధరించి ప్రపంచమంతట మానవజాతిని ఒక బానిస జాతిగా మార్చే ప్రమాదం ముంచుకొచ్చిన అత్యంత క్లిష్ట పరిస్థితిలో గాంధీజీ ఒక మహాత్ముడుగా అవతరించాడు-”యదాయదాహిధర్మస్య గ్లానిర్భవతిభారత! అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానంసజా మ్యహమ్‌, పరిత్రాణా యసాధూనాం, వినాశాయచ దుష్కతామ్‌, ధర్మసంస్థాపనా ర్ధాయ సంభవామి యుగే యుగే!….” గీతాచార్యుని ఈ పసిడి పలుకులు నిజమని తేల్చడానికే గాంధీ మహాత్ముడు అవతరించాడని భారతస్వాతంత్రోద్యమ ఉజ్వల చరిత్ర ఉద్ఘాటిస్తుంది. దక్షిణాఫ్రికాలో తన కర్తవ్యాన్ని నిర్వహించి మాతభూమిలో అడుగుపెట్టిన పిదప చంపారన్‌, బార్డోలి, దండి శాసనోల్లంఘన, సహాయనిరాకరణ ఉద్యమాలనుంచి క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు గాంధీజీ మార్గదర్శకత్వం సకల భారతావనిని సంఘటితం కావించి స్వాతంత్య్రసాధనకు మార్గం వేసింది. భారతస్వాతంత్య్రంతో మానవాళిలో అయిదోవంతు ప్రజ విముక్తి పొందింది. గాంధీమహాత్ముని అహింసాబోధనలు, ఆయన చూపిన సత్యాగ్రహసమర మార్గం అనేక దేశాలలో స్వాతంత్య్ర సమరాలకు, విశ్వశాంతికి విజయపథం చూపింది.

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌ అన్నారు. ”Generations to come, it may be, will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth” నిజం, గాంధీమహాత్ముడు మన మధ్య ఉండేవాడని రానున్న తరాలు నమ్మడం కష్టమే! గాంధీజీ జీవితమంతా మతోన్మాదానికి, అసహనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. 1915 నుంచి 1947 వరకు ముప్పయి రెండు సంవత్సరాలు గాంధీజీ ఏ పదవి లేకుండా(బెల్గామ్‌ కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షత మినహా)భారత స్వాతంత్రోద్యమానికి విజయవంతంగా సారథ్యం వహించారు. 1947 ఆగస్టులో భారత ఉపఖండ విభజన, చెలరేగిన మతోన్మాదం గాంధీజీకి అమిత మానసిక క్షోభ కల్గించాయి. ఆయన స్వాతంత్య్ర సంబరాలలో పాల్గొనలేదు. 1948 జనవరి 30వ తేదీన సాయంత్రం ఒక మతోన్మాది పిస్టల్‌ గుండ్లకు ఆయన బలి అయినారు. ఆయన అవతార సమాప్తి వార్త విని ప్రపంచమంతా విలపించింది. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దీపం ఆరిపోయిందని శోకసముద్రంలో మునిగారు. నిజానికి ఆమహాత్ముని జ్యోతి ఆరిపోలేదు. అది మానవజాతి ఉన్నంత వరకు వెలిగే అఖండజ్యోతి!