అంగరంగ వైభవంగా యాదాద్రీశుని కళ్యాణం 

యాదాద్రీశుని కళ్యాణం నిర్మల్‌జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు నిర్మల్‌ పట్టణ ప్రజలే కాకుండా జిల్లా సమీప గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుకలను తిలకించారు. యాదాద్రి క్షేత్ర వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ కళ్యాణ వేడుకలు కమనీయంగా సాగాయి. 

ముందుగా యాదగిరిగుట్ట ఆలయం నుండి ఇక్కడికి తీసుకువచ్చిన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవ విగ్రహాలను రాష్ట్ర అటవీ, న్యాయ, పర్యావరణ, దేవదాయ శాఖామాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శాస్త్రీనగర్‌లోని నివాసానికి తీసుకురాగా, మంత్రి దంపతులు కుటుంబ సభ్యులు మంగళహారతులతో, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నివాసంలో పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఎన్టీఆర్‌ మినీస్టేడియంకు తీసుకువచ్చారు. స్వామివారికి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి దంపతులతోపాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు రేఖానాయక్‌, విఠల్‌ రెడ్డి, బాపురావు, దివాకర్‌రావు, నల్లాల ఓదేలు, జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖి, అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, ఇన్ఛార్జి ఎస్పీ సిహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌, గండ్రత్‌ ఈశ్వర్‌, డిసిసిబి ఛైర్మన్‌ రఘనందన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటి ఛైర్మన్‌ నర్మద ముత్యంరెడ్డి, నిర్మల్‌ మండల అధ్యక్షులు కె.రామేశ్వర్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

యాదాద్రి ఆలయానికి 2 కిలోల బంగారం వితరణ

యాదాద్రిలో నిర్వహిస్తున్న నూతన ఆలయం విమాన గోపురం నిర్మాణానికి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబం కిలో బంగారం వితరణ చేశారు. అలాగే నియోజక వర్గం నుండి పలువురు దాతలు మరో కిలో బంగారం తాపడం కోసం వితరణ చేశారు.