ధిక్కార స్వరం.. మేడారం జాతర

madaramBy: గన్నమరాజు గిరిజామనోహర బాబు

మనిషి అస్తిత్వాన్ని, మనిషి మనుగడను అణచివెయ్యాలనుకునే అధికారానికి తమ ధిక్కార స్వరాన్ని వినిపించడమే గాక పోరాటం చేసి అమరత్వాన్ని కూడా సాధించిన ఘనత సమ్మక్క జాతరకు మాత్రమే ఉంది. ప్రపంచస్థాయి ఉత్సవంగా ప్రజలు నిర్వహించుకుంటున్న ఈ స్థాయి జాతర ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఉత్తర దేశంలో జరిగే కుంభమేళాకు దీటుగా జరిగే ఈ జాతరకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.

కుంభమేళా వేలం భక్తితాత్పర్యాల సమాహారంతో జరిగే దైవభావ సమన్వితమైన ఉత్సవం. కాని ఈ జాతర నేపథ్యంలో తన వాళ్ళ కొరకు జరిపిన పోరాటపు ఆనవాళ్ళు ఉన్నాయి. అవసరమైనప్పుడు అధికారాన్ని కూడా ఎదురించే పటుత్వం దీనికి భూమిక. పైగా ఆటవికులు అని నిరాదరింపబడే ప్రజల పక్షాన నిలిచిన పోరాటం. పోరాడింది గిరిజనులు. ఇది ఈ జాతరకు మాత్రమే ప్రత్యేకం. దేశాన్ని సమర్థంగా పాలించి అనేక పోరాటాల్లో విజయాల్ని పొందిన రాణీ రుద్రమదేవికి ూడా లభించని దైవత్వం సమ్మక్క, సారలమ్మలకు దక్కడం ధిక్కార స్వర ఫలితమే. ప్రజల పక్షాన నిలచి పోరాడిన వీరులను దైవాలుగా భావించి ఆరాధించే సంప్రదాయం ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ధిక్కార స్వరం దాదాపు నాటి నుండే సంక్రమించినట్టు భావించవచ్చు. ఒక పోతన్న, ఒక కాళోజీ వంటి వారు వినిపించిన వారి కవిత్వంలోని ధిక్కార స్వరాలకు మూలం ఇక్కడే ఉంది. పాలకులు ఎంత శక్తివంతులైనా, రాజ్యం ఎంత పటిష్టమైనదైనా, జయించడం అసాధ్యం అని తెలిసినా అస్తిత్వ పోరాటాన్ని ఆశ్రయించడమే కర్తవ్యంగా భావించిన సందర్భం నేటికీ జాతర రూపంలో కొనసాగివస్తున్నది.

అప్రతిహతమౌ కాకతీయ ప్రతాప
రుద్రసేనల రణమున రోషమూని
ప్రతిఘటించుచు వీరమరణమునంది
వీర రుద్రమ సైదోడు వారసులుగ
చరితలో నిల్చి సమ్మక్క సారలక్క
లధిపురాలయ్యు రుద్రమ కందనట్టి
పూజలందుట నేడు అబ్బురము గాదె!
సాహసాలకు వీరిట్లు సాలువోయ
వీరులకు పుట్టినిల్లయ్యె ఓరుగల్లు (యాదగిరి)

దాదాపు ఎనిమిది శతాబ్దాలకు పూర్వం బలమైన రాజ్యపాలకులనే ఎదిరించి నిలిచిన సమ్మక్క, సారలమ్మల దృఢ నిర్ణయాలే నేటి సమాజానికి పోరాట స్ఫూర్తినిస్తాయి. ఈ నాటికీ అవే మన స్ఫూర్తి ంద్రాలు. ఆ పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాకారం.

నిజాం వ్యతిరేక పోరాట సమయంలోనూ, సాయుధ రైతాంగ పోరాటంలోనూ, ప్రత్యేక రాష్ట్ర పోరాట విషయంలోనూ మన నరనరాల్లో జీర్ణించుకున్న ధిక్కార స్వరచ్ఛాయలు అడుగడుగునా కనిపిస్తాయి. ఈ సమ్మక్క, సారలమ్మలు ఎవరు? వారెందుకు పోరాడారు? ఎవరెవరు ప్రాణాలర్పించారు? అని ప్రశ్నించుకున్నప్పుడు అప్పటి చరిత్రను కొంత తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది.

నాటి కాకతీయ సామ్రాజ్యంలోని ఒక చిన్న గ్రామం మేడారం. అక్కడి గిరిజనుల హక్కులను కాపాడటాని ఈ పో రాటం జరిగింది. కాకతీయ సామ్రాజ్యాధిపతియైన ప్రతాపరుద్రు డు ‘పొలవాస’ (నేటి కరీంనగర్‌ జిల్లాలోనిది)ను, దాని పరిసర ప్రాంతాలను జయించాడు. అక్కడి రాజైన మేడరాజు తన ఏకైక కుమర్తెయైన సమ్మక్కను, మేడారాన్ని పరిపాలిస్తున్న పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేశాడు. అందువల్ల ఓటమి పొందిన మేడరాజు ూతురు రాజ్యానికి వచ్చి ఆశ్రయం పొందాడు. అయితే ఆ కాలంలో ఈ ప్రాంతంలో కరువు తాండవం చేయడం వల్ల ఇక్కడి పాలకుడు పగిడిద్దరాజు కాకతీయ రాజులకు కప్పం కట్టడానికి తన అశక్తతను నిస్సహాయతను ప్రకటిస్తాడు. కాని కాకతీయ గూఢచారి మాత్రం మేడరాజే వచ్చి తన అల్లుణ్ణి కప్పం చెల్లించకుండా ఉండటానికి ప్రేరేపించాడని సమాచారం పంపాడు. దానితో అగ్ర¬దగ్రుడైన ప్రతాపరుద్రుడు విశాలమైన తన సైన్యంతో గిరిజనులపై యుద్ధం ప్రకటిస్తాడు.

అమాయకులైన ఆ గిరిజనులు అతిపురాతనమైన తమ సాంప్రదాయిక ఆయుధాలైన విల్లమ్ములు, బల్లాల వంటి వాటితో శక్తివంతమైన కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనే యత్నం చేస్తారు. ఆ యుద్ధó్దంలోనే సమ్మక్క భర్తయైన పగిడిద్దరాజు, ఆమె కుమారుడైన జంపన్న మాత్రమే గాక ఇతర బంధువులెందరో వీరమరణం పొందుతారు. చివరకు సమ్మక్క, ఆమె ూతురు సారలమ్మలు తమ జీవితాలను త్యాగం చేస్తూ సైన్యానికి చిక్కక ఆత్మార్పణ చేసుకుంటారు. ఈ గిరిజన స్త్రీ మూర్తుల సాహసానికి ప్రకృతి సైతం అచ్చెరువంది వర్షాలను, వరాలను కురిపించినట్లు జనశ్రుతి. నాటి నుండే ఈ ప్రాంత గిరిజనులు సమృద్ధమైన పాడిపంటలతో వర్దిల్లుతూ, తమ కోసం త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను కొనియాడుతూ వారిని భక్తి శ్రద్ధలతో పూజించే సంప్రదాయం నెలకొంది.

ఈ ప్రత్యేక గిరిజన పర్వదినానికి రోజు రోజుూ ఆదరణ పెరుగుతున్నది. దీన్ని గమనించిన ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పర్వదినంగా గుర్తించి గౌరవించింది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే గాక, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి సమ్మక్క సారలమ్మలను సేవించుకుంటుంటారు.

వరంగల్లు నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఒక కీకారణ్యంలో వెలసిన కుగ్రామం మేడారానికి ప్రతి యేటా సుమారు 80 లక్షలకు పైగా గిరిజనులు, గిరిజనేతరులు వచ్చి నాటి ఆ తల్లుల త్యాగబుద్ధిని, ఆ గిరిజనుల పోరాట స్ఫూర్తిని స్మరించి తరిస్తారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా లక్షలాది భక్త సమూహం దర్శించడమేగాక తమ తమ సంతానానికి సమ్మక్క, సారలమ్మ, జంపన్న మొదలైన వీరుల పేర్లు పెట్టకొని తాము పవిత్రులమైనట్టు భావిస్తుంటారు.

తాము నివసించే ప్రాంతం కొరకు, తమ యేలుబడిలోని ప్రజల కొరకు ఎంతటి సామ్రాజ్యాన్నైనా ఎదిరించి ధిక్కార స్వరాన్ని వినిపించి పోరాటం చేసినప్పుడు, అక్కడి ప్రజలు తరతరాలుగా వారిని దైవభావంతో పూజించి, దానికి దివ్యత్వాన్ని కలిగిస్తారనడానికి రెండేళ్ళకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే ఈ జాతరే నిదర్శనం.