ఎదుగుతున్న నగరానికి పెరుగుతున్న వసతులు… 499.96 కోట్లతో పలు అభివృద్ధిపనులు

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ నగరంతో పాటుగా శివారు ప్రాంతాలు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కనీస అవసరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పుర పాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రూ. 499.96 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో తాగునీరు అందించేందుకు రూ. 2వేల కోట్లతో ఓ.ఆర్‌.ఆర్‌ పరిధి లోపల నివసిస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలతో పాటు అన్ని కాలనీలకు త్రాగు నీరు అందించేందుకు రూ. 850 కోట్లు ఖర్చు చేసి అందించడం జరిగిందన్నారు. మరో రూ. 1200 కోట్ల వ్యయంతో మిగిలిపోయిన కాలనీలకు త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్‌ ఇతర జిల్లాల నుండి ఉపాధి, విద్య అవకాశాల కోసం వచ్చి స్థిరపడుతున్నారు. రీజనల్‌ రింగు రోడ్డు వస్తున్న నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ బయట కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటి వరకు రూ.2800 కోట్లు వ్యయం చేసి త్రాగునీరుకి ఖర్చు చేసినట్లు మరో రూ. 1200 కోట్లు మిగిలిపోయిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు 600 ఎం.ఎల్‌.డి సరఫరా చేస్తున్నారు రాబోయే 2051 వరకు మరో 400 ఎం.ఎల్‌.డి నీటి సరఫరాను భవిష్యత్తు తరాల వరకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి అన్నారు. త్రాగు నీటి శాశ్వత పరిష్కారం కోసం కృష్ణా, గోదావరి నదుల నీటి సరఫరా చేసే ప్రక్రియలో కృష్ణా నది నీటిని సరఫరా చేసేందుకు సుంకిశాల వద్ద రూ. 1400 కోట్ల వ్యయంతో రెండో లైన్‌ చేపట్టనున్నట్టు, గోదావరి నది నీటిని కొండ పోచమ్మ రిజర్వాయర్‌ గ్రావిటీ ద్వారా తీసుకువస్తున్నారని మంత్రి వివరించారు. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతంలో గల గృహాల నుండి రోజుకు 2 కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో దాన్ని ట్రీట్మెంట్‌ చేసేందుకు రూ. 3866 కోట్ల వ్యయంతో ఎస్‌.టి.పిలను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రూ. 248.44 కోట్ల వ్యయంతో 66 ఎం.ఎల్‌.డి సామర్థ్యం గల 5 ఎస్‌టిపిలను నిర్మించనున్నారు. ఫాక్స్‌ సాగర్‌, వెన్నెల గడ్డ, గాయత్రినగర్‌, పరికి చెరువు, శివాలయ నగర్‌ ఎస్‌.టి.పిల నిర్మాణం వలన 100 శాతం శుద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లో బహిరంగ మురుగు ప్రవాహం ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఆకస్మిక భారీ వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి మేరకు వరద నీటి శాశ్వత పరిష్కారానికి మొదటి దశలో రూ. 858 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు చెప్పారు. రూ. 95 కోట్ల వ్యయంతో ఫాక్స్‌ సాగర్‌ నాలా మరమ్మత్తు పనులను ప్రారంభించినట్లు చెప్పారు అదేవిధంగా ఎల్‌.బి నగర్‌, ముషీరాబాద్‌, అంబర్‌ పేట్‌, నాలా పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చేసి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చేస్తున్నారు. ఫాక్స్‌ సాగర్‌ నాలా వలన ఎన్‌.సి.ఎల్‌ కాలనీ, కంటోన్‌మెంట్‌ పార్కు ఎస్‌.టి రోడ్డు, మీనాక్షి ఎస్టేట్‌, గోదారి హోం లకు వరద ప్రభావం తగ్గుతుంది.

పేదలకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అవసరమైతే మరో మారు జిఓ 58, 59 అమలుకు చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం సహకారం అందించడం లేదని పదే పదే కేంద్ర మంత్రులకు ఏడేళ్ల నుండి రక్షణశాఖ భూములు ఇవ్వాలని కోరుతున్నా పరిష్కారం చేయడం లేదని అట్టి భూములకు నష్టపరిహారం ఇవ్వడానికి, అదే విధంగా దానికి అనుగుణంగా భూమి కూడా ఇస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రులను కోరినప్పటికీ ఏడేళ్ల నుండి గోస పెడుతున్నట్లు మంత్రి ఆరోపించారు రాబోయే కేంద్ర బడ్జెట్‌ సెషన్‌లో టి.ఆర్‌.ఎస్‌ ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రయోజనాలు రాజీ లేకుండా పోరాటం చేస్తారన్నారు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..

  1. రూ. 138 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన
  2. రూ. 11.38 కోట్ల వ్యయంతో చేపట్టిన గాజుల రామారంలో ప్రాణ వాయువు అర్బన్‌ పార్క్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు.
  3. రూ.117 లక్షల అంచనా వ్యయంతో చింతల్‌ చెరువు అభివృద్ధికి శంకుస్థాపన
  4. రూ. 2.14 కోట్ల రూపాయల వ్యయంతో ుూIIజ కాలనీ స్పోర్ట్స్‌ థీమ్‌ పార్క్‌ ప్రారంభం
  5. రూ. 95 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫాక్స్‌ సాగర్‌ నాలా అభివృద్ధికి శంకుస్థాపన
  6. రూ. 248 .44 కోట్ల అంచనా వ్యయంతో 5 ఎస్‌.టి.పిల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

శాసన సభ్యులు వివేకానంద గౌడ్‌ మాట్లాడుతూ… కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గంలో కే.సీ.ఆర్‌, కే.టీ.ఆర్‌ అన్ని విధాలా సహకరిస్తున్నారని రక్షణ శాఖ భూములు ఇవ్వడం లేనందున సుచిత్ర వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఫాక్స్‌ సాగర్‌ నాలా పనులు వలన ఈ ప్రాంతంలో వరద నివారణ శాశ్వత పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఎన్‌.సి జియా ఉద్దీన్‌, కుకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, యు.బి.డి అడిషనల్‌ కమిషనర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, స్థానిక శాసన సభ్యులు వివేకానంద గౌడ్‌, శాసన మండలి సభ్యులు శంభీపూర్‌ రాజు, సురభి వాణీ దేవి, హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ ఎం.డి దానకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.