|

మిషన్‌ కాకతీయ.. జలవిప్లవం

waterrకాకతీయ రాజులు ఎంతోముందు చూపుతో గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఆసఫ్‌ జాహీలు, కుతుబ్‌షాహీలు కూడా హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ లాంటి పెద్ద చెరువులు నిర్మించారు. కానీ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగి, ఆ చెరువులను కూడా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఎంత నష్టం జరిగిందో, ఎంత జీవన విధ్వంసం జరిగిందో మనం చూస్తూనే ఉన్నం. గ్రామాల రూపురేఖలే మారిపోయినయ్‌. గ్రామీణుల బతుకు దుర్భరమైంది. వ్యవసాయం దండుగ అనే పరిస్థితి వచ్చింది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే చెరువుల పునరుద్ధరణ జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కోరుకున్నారు. టీఆర్‌ఎస్‌ మానిఫెస్టోలో కూడా చెరువుల పునరుద్ధరణ చేపడతామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే చెరువుల పనిమీద పడ్డరు.

తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం ఎక్కువ శాతం చెరువులమీద ఆధారపడి సాగింది. తర్వాత చెరువులు శిథిలమై పోవడంతో వ్యవసాయం కూడా దెబ్బతిన్నది. అటు ప్రాజెక్టులనీరు రాక, ఇటు చెరువులు పనికిరాక తెలంగాణ గోస అనుభవిస్తున్నది. కృష్ణా, గోదావరి నదుల్లో 265 టిఎంసీల నీటిని వాడుకునే హక్కు తెలంగాణకు ఉన్నది. కానీ ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా వంద టీఎంసీల నీరు కూడా వాడుకోలేకపోతున్నాము. చెరువులన్నీ సిద్ధమైతే, నదుల నీళ్ళను చెరువులకు తరలించడం సాధ్యమవుతుంది. ఎస్‌ఆర్‌ఎస్పీలాంటి కాలువలద్వారా గోదావరి నీటిని, నాగార్జునసాగర్‌, జూరాల`పాఖాలలాంటి ప్రాజెక్టులద్వారా కృష్ణా నీటిని మన చెరువుల్లోకి మళ్లించుకోవచ్చు. అలా మళ్ళించిన నీటిని నిల్వ చేసుకోవడానికి మన చెరువులను సిద్ధం చేయాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక లోగో తయారు చేసుకున్నాం. అందులో కాకతీయ తోరణాన్నే మనం లోగోలో పెట్టుకున్నాం. అదేదో ఆషామాషీగా చేయలేదు. ఆ తోరణాన్ని చూసిన ప్రతీసారీ మనకు కాకతీయులు గుర్తుకు రావాలి. కాకతీయుల పాలన గుర్తుకు రావాలి. వారు తవ్వించిన చెరువులు గుర్తుకు రావాలి. వాటిని మంచిగా చూసుకోవాలనే ఆలోచన కలగాలి. ప్రతి క్షణం మనకు కర్తవ్యబోధ జరగాలనే మనం కాకతీయుల తోరణాన్ని కళ్లముందు పెట్టుకున్నాం.

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కూడా మిషన్‌ కాకతీయ అనే పేరు పెట్టుకున్నది అందుకే. మన ఇండ్లల్ల ఎవరన్న పెద్దవాళ్లు చనిపోతే, వారి జ్ఞాపకార్థం పిల్లలకు వాళ్లపేర్లు పెట్టుకుంటం. ఎందుకు? వారి పేరు నిలపాలనే ఆలోచనతోనే. ఇవాళ మనం కాకతీయుల పేరు పెట్టుకుని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం తీసుకున్నం. ఇప్పుడు మనం కాకతీయుల పేరు నిలపాలి. మనకు అద్భుతమైన చెరువులు ఇచ్చిన కాకతీయులకు మనం అందించే ఘనమైన నివాళి చెరువుల పునరుద్ధరణే.

వరంగల్‌ రాజధానిగానే కాకతీయులు పాలించారు. పెద్ద చెరువులు కూడా వరంగల్‌లోనే తవ్వించారు. కాబట్టి ఇప్పుడు వరంగల్‌ జిల్లాపైనే పెద్ద బాధ్యత ఉంది. కాకతీయుల వారసులుగా వరంగల్‌ వాసులు నిరూపించుకోవాలి. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రతీ గ్రామంలో విజయవంతంగా నిర్వహించి రాష్ట్రానికి ఆదర్శం కావాలి. చెరువుల పునరుద్ధరణ ఆషామాషీగా జరగొద్దు. ఇది ఓ జలవిప్లవం సృష్టించాలి. చరిత్రలో నిలిచిపోవాలి. తెలంగాణ సాధనకోసం మనం సకల జనుల సమ్మె చేసినం. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరూ సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి చూపించాలి. నాడు సకల జనుల సమ్మె చేసినం. నేడు సకల జనుల శ్రమ చూపించాలి. చెరువు గ్రామానికి తల్లిలాంటిది. తల్లిని కాపాడుకోవడానికి పిల్లలంతా ఏకమైనట్లు చెరువులు కాపాడుకోవడానికి ఊరంతా ఒక్కటి కావాలి.

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంది అని మనం ఆలోచించాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా, పట్టణాలకు వలసలు ఆగిపోవాలన్నా అది చెరువులపైనే ఆధారపడి ఉంది.

భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తుంది అని మహాత్మాగాంధీ చెప్పేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే 30 శాతం మంది నగరాలకు వలసపోయారు. త్వరలో 50శాతం మంది పట్టణాలు, నగరాల్లోనే ఉంటారని అంచనా. తెలంగాణ జనాభా నాలుగు కోట్లయితే, హైదరాబాద్లోనే కోటి మంది ఉన్నరు. నగరాలు ఏమన్న స్వర్గమా? అక్కడ మురికి, కాలుష్యం, ట్రాఫిక్‌, అనారోగ్యం… అన్నీ అవస్థలే. కానీ ఎందుకు పోతున్నారు. కన్నతల్లిలాంటి ఉన్న ఊరును వదలి ఎందుకు పోతున్నారు. ఊళ్లో పని దొరకకపోవడంవల్లే, చెరువే బాగుంటే, వ్యవసాయం బాగుండేది. అందరికీ వ్యవసాయం బాగుంది. అందరికీ పనిదొరికేది. పచ్చని ఊళ్లను వదిలిపోయే ఖర్మ పట్టేదికాదు. ఒక్కసారి ఆలోచించండి. చెరువు బాగుంటే ఊరంతా బాగుంటుంది. రైతులు సాలుకు రెండు పంటలు పండిస్తే ఊరు రూపురేఖలే మారిపోతాయ్‌.

చెరువు నిండా నీళ్లుంటే ఊరి జనాలందరికీ చేతినిండా పని దొరుకుతుంది. వ్యవసాయం బాగా సాగితే.. ఎడ్లబండ్లు, నాగళ్ళు, కర్రలు తయారుచేసే వడ్లోళ్లకు పని దొరుకుతుంది. చెరువుల నల్లమట్టితోని కుమ్మరోళ్ళు కుండలు చేసుకుంటరు. వ్యవసాయ పనిముట్లు చేసే కమ్మరోళ్లకు ఉపాధి దొరుకుతది. చెరువుగట్లమీద ఈతచెట్లు బాగుంటే గౌండ్లోళ్లకు కల్లు దొరుకుతది. రజకులు బట్టలు ఉతుక్కుంటరు. అందరికీ తిండికి ఢోకా లేకుంటే, మంచిగ బతికితే ఇంత బంగారం చేయించుకుంటరు. ఔసులోళ్లకు పనిదొరుకుతది. బట్టలు కొనుక్కుంటరు. శాలోళ్లకు పని ఉంటది. దుకాన్లకుపోయి సామాన్లు కొనుక్కుంటరు. కోమటోళ్లకు బేరమయితది. మనుషులకు తిండి పెట్టుడే కాదు.

పశువులకు కూడా మేత దొరుకుతది. గొర్లు మేపే గొల్ల కుర్మలు కూడా బాగుంటయ్‌. పచ్చని గడ్డి ఉంటే మంచి పాలు వస్తయ్‌. ప్రతీ ఇంట్ల పాడి పశువులు కనిపిస్తయి. ప్యాకెట్ల పాలు, డబ్బా పాలు తాగే కర్మ తప్పుతది.

చెరువు నిండా నీళ్లుంటే భూగర్భ జలాలుంటయ్‌. మోట బావులల్ల, చేద బావులల్ల నీళ్లుంటయ్‌. మూడునాలుగు వందల ఫీట్లకు పోయి బోరు వేసుకునే కర్మ తప్పుతది. ఇదంతా గతంలో మనం మన కండ్లతోనే చూసినం. మళ్లీ మన కండ్లతోనే మనం ఇలాంటి ఊర్లను చూడాలి. చెరువుల పునరుద్ధరణతోనే ఇది సాధ్యం.

ఇప్పుడు చెరువులన్నీ ఎండిపోయి ఎంత గోసపడుతున్నం. ఎంత బాధపడుతున్నం. వినాయక చవితినాడు నిమజ్జనం చేస్తే పాపం దేవుడు కూడా నిండా మునుగుతలేడు. బతుకమ్మలు వేయడానికి కూడా నీళ్లు లేవు. ఊళ్ళె ఎవరన్న సచ్చిపోతే ఊరంతా చెరువు కు వెళ్లి స్నానం చేసి వచ్చేది. ఇప్పుడు నెత్తిన నీళ్లు సల్లుకుని వస్తున్నయ్‌. చెరువులు బాగుంటేనే, వాటిని ఆధారంగా చేసుకుని జరుపుకునే బతుకమ్మ, కట్టమైసమ్మ, బోనాలు, తీజ్‌ పండుగలు, గంగ జాతరలు, వన భోజనాలు లాంటి ఉత్సవాలు సంబురంగా నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది. ఎండిపోయిన చెరువులో ఈ ఉత్సవాలు కూడా కళావిహీనంగా మారాయి. ఈ పరిస్థితిని ప్రతీ పౌరుడికి వివరించాలి. చెరువుల పునరుద్ధరణకు అందరినీ భాగస్వాములుగా చేయాలి. బాధ్యత పెరగాలి.

చెరువుల పునరుద్ధరణ అంటే ఏమిటి?

తెలంగాణలో నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్‌, అటవీశాఖ,ప్రైవేటు కుంటలు అన్నీ కలిపి మొత్తం 46,531 చెరువులున్నయ్‌. ప్రతీ ఏటా 20 శాతం చొప్పున చెరువులను పునరుద్ధరించుకుంటూ ఐదేళ్ళలో వందశాతం చెరువుల పని పూర్తి చేస్తారు. మొదటి ఏడాది 9306 చెరువులను పునరు ద్ధరిస్తారు. 2015 జనవరిలో చెరువుల్లో నీరు ఖాళీ కాగానే పనులు ప్రారంభం అవుతాయి. వర్షాకాలం మొదలయ్యే వరకు అంటే, మే చివరి వరకు పనులు జరుగుతాయి. పూడిక తీత, చెరువుకట్ట మరమ్మత్తులు, తూముల మరమ్మత్తులు, మత్తడి మరమ్మత్తులు, అలుగు మరమ్మత్తులు చేస్తారు. చెరువులోకి నీరొచ్చే కట్టుకాలువలు, చెరువులనుంచి పంట పొలాలకు నీరందించే కాలువలను కూడా పూర్తిస్థాయిలో మరమ్మత్తు చేస్తారు.

చెరువు కట్టపై, చెరువులో ఉన్న పిచ్చి చెట్లను, అక్కరకు రాని చెట్లను తొలగిస్తారు. చెరువును వీలయినంత వరకు విస్తరించడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే కొంత భూమిని కొనుగోలు చేస్తారు. నియోజకవర్గంలో ఒక చెరువును ఓ మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. చెరువు శిఖం భూమిని కూడా కబ్జాలనుంచి కాపాడేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. చెరువు చుట్టూ చెట్లను పెంచాలని, చెరువు కట్టలపై కూడా ఈతచెట్లు పెంచాలని నిర్ణయించింది.

చెరువుల పునరుద్ధరణ పనులకు అవసరమైన సిఫారసులు చేయడానికి ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని కూడా నియ మించింది. ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నది. నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇప్పటికే జిల్లాలన్నీ తిరిగి ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం కూడా చేసి వచ్చారు. చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడానికి పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలని, కళాకారులతో కళాజాతాలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

క్రీడా పరిశోధనా ఫలితాలు ` చెరువు పూడిక మట్టి

చెరువుల పునరుద్దరణ కార్యక్రమంలో భాగంగా పూడిక మట్టిని పంట పొలాలకు తరలించాలని ప్రభుత్వం చెబుతోంది. ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నది. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్‌ (క్రీడా) చెరువుల మట్టిపై పరిశోధనలు జరిపింది. నదులు, వాగులు మోసుకొచ్చే ఒండ్రు మట్టిలో అనేక పోషక విలువలు, తేమను ఎక్కువ కాలం నిలిపే గుణం ఉంది. అందుకే నదీతీరంలోనే వ్యవసాయాలు ఎక్కువగా సాగిన చరిత్ర మనకున్నది. నైలు నది మోసుకొచ్చిన ఒండ్రు వల్లనే నైలునదీ నాగరికత అభివృద్ధి చెందింది. ఈజిప్టు వ్యవసాయానికి నైలునది ఓ ఆధారంగా భాసిల్లుతున్నది. భారతదేశంలోకూడా సింధునదీలోయలో సింధు నాగరికత, ఇరాక్‌లో మెసపటేమియా నాగరికత, చైనాలో హోయాంగ్‌ హో నాగరికత… వీటన్నింటి వెనుక ఉన్నది ఒండ్రు మట్టితో సాధించిన విజయాలే. మన దగ్గర కూడా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, కావేరి డెల్టా ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధికి, గంగా యమునా మైదాన ప్రాంతాల్లో వ్యవసాయ విస్తరణకు నదులు మోసుకువచ్చిన ఒండ్రు మట్టి కారణం. చెరువులు ప్రకృతి వనరులను కూడా రక్షిస్తాయి. ఎక్కడపడినవాన నీటిని అక్కడనే ఒడిసిపట్టి ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి. పోషక విలువలు కలిగిన ఒండ్రు మట్టిని తనలోనే నిలువ చేసుకుని తిరిగి వినియోగించుకుంటాయి.

పూడిక మట్టిలో పోషక విలువలు

ఇప్పుడు మనం వ్యవసాయ క్షేత్రాల్లో పోషక విలువలకోసం యూరియాలాంటివి వేస్తున్నాము. కానీ ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే. ప్రతీ పొలాన్ని చెరువు మట్టితో ఎండాకాలంలో నింపేవారు. దాన్నే పొలమంతా చేసేవారు. అదే పోషకంగా పనిచేసేది. పంటలకు బలం ఇచ్చేది. నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, బోరాన్‌, సేంద్రీయ కార్బన్‌ పదార్థాలు, మొక్క పెరుగుదలకు దోహదం చేసే బాక్టీరియాలు తదితర పోషకాలు తగిన నిష్పత్తిలో పూడిక మట్టిలో ఉన్నాయి.

ఉన్న ఊరు రుణం తీర్చుకునే మార్గం

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో చేయూతనందించే వారికి ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతున్నది. తెలంగాణప్రాంతంలోనే పుట్టి, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారులు, ఉద్యో గులు, గ్రామంలోనే ఉన్న స్థితిమంతులు ఇలా అందరికీ ప్రభుత్వం ఆహ్వానం . వారు చెరువు పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొని ఆర్థి కంగా చేయూతను అందిస్తే ఆ చెరువుకు వారి పేరు లేదా వారు సూ చించిన పేరు పెట్టడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనివల్ల ఊరంత టికీ మేలుచేసే చెరువు తమ పేరుమీద ఉంటుంది. ఇది ఎంతో తృప్తినిచ్చే అంశం. కాకతీయుల రాజ్యం పోయి ఇన్నేండ్లయినా, ఇప్పటికీ వారినే తలుచుకుంటున్నట్లు ఇవాళ చెరువులను దత్తత తీసుకునే వారిని కూడా తరతరాలుగా తలుచుకుంటరు. చరిత్రలో వారిపేరు చిరస్థాయిగా నిలిచిపోతది.

అధికారులకే కీలకం

చెరువుల పునరుద్ధరణ బాధ్యత ప్రధానంగా అధికారులమీదే ఉంది. ప్రభుత్వం అధికారుల డిమాండ్లన్నీ నెరవేరుస్తున్నది. అధికారులకు వాహనాలు, ఎఫ్‌.టి.ఏ. ల్యాప్‌టాప్లు అన్నీ అందిస్తున్నది. ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి కూడా సిద్ధమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. అధికారులది ఇప్పుడు చారిత్రాత్మకమైన బాధ్యత. మంచి పనులు చేస్తూ కాకతీయులు ఎట్లయితే చరిత్రలో నిలిచిపోయిండ్రో అధికారులు కూడా చెరువులను బాగు చేయించిన వారిగా చరిత్రలో నిలచిపోతరు.