|

ఐ.టి. రంగానికి మరింత జోష్‌

  • ముడుంబై మాధవ్

భారతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అప్పటి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకించి ఐటీ, అనుబంధ రంగాల స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఐసీటీ విధానం, ఇతర అనుబంధ విధానాలను 2016లో విడుదల చేసింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు దార్శనికత, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మొదలుకొని విభాగాధిపతులు, ఉద్యోగులు ఈ విధానాలను సమర్థంగా అమలు చేయడంతో గడచిన ఐదేళ్ల కాలంలో ఐటీ, ఐటీఈఎస్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాలలో ఒక ప్రబల శక్తిగా, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. 

తెలంగాణ రాష్ట్రం అయిదేళ్లలో ఐసీటీ విధానం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను మించి మెరుగైన ఫలితాలు సాధించింది. 2013-14లో 57,528 కోట్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 2020-21 సంవత్సరానికి 1,45,522 కోట్లకు చేరింది. గత ఐదేళ్లకు గాను భారతదేశపు రాష్ట్రాలలో అత్యధిక ఐటీ ఎగుమతుల వృద్ధి రేటుని తెలంగాణ నమోదు చేసింది. భారత దేశపు ఐటీ రంగం స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు గత మూడేళ్లుగా రెట్టింపుకంటే ఎక్కువగా ఉన్నది. ఇదే కాలానికి రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగాలను ఐటీ రంగం కల్పించింది. దీనికి అదనంగా 8 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పరోక్షంగా సృష్టించ బడ్డాయి. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో కొత్తగా లక్షన్నర ఉద్యోగాలు రాగా భారతదేశపు ఎలక్ట్రానిక్స్‌ రంగ ఉత్పాదకతలో తెలంగాణ 7 శాతం వాటాను కలిగియున్నది. అనేక ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక సంస్థలు తెలంగాణలో తమ కార్యకాలపాలు ప్రారంభించాయి లేదా విస్తరించాయి.

అంకుర పరిశ్రమలకు, ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చే వ్యవస్థలను మొదటి ఐసీటీ విధానం కింద తెలంగాణ ఈ అయిదేళ్లలో నిర్మించింది. దీనిద్వారా 1500 అంకుర పరిశ్రమలు లబ్ధి పొందగా 1800 కోట్ల రూపాయలు నిధులు సమీకరించబడ్డాయి. సుమారు మూడు లక్షల మంది ఉద్యోగార్థులకు, విద్యార్థులకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (TASK) నైపుణ్య శిక్షణ ఇచ్చింది. దేశంలోనే అత్యధిక ఉద్యోగ నియమకాలకు దోహదపడ్డ ప్రభుత్వ కార్యక్రమంగా టాస్క్‌ నిలిచింది. ఐదు వందలకు పైగా పౌరసేవలు మీసేవ కేంద్రాలు, వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి రాగా, 250 పౌరసేవలని T App Folio వేదిక ద్వారా మొబైల్‌ ఫోన్లలోనూ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమం ద్వారా ఐదు లక్షలమంది పౌరులను డిజిటల్‌ అక్షరాస్యులుగా మలచటం జరిగింది. సుమారు మూడు వేల ఉచిత ప్రజా వై-ఫై మండలాలను హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది.    

అయితే సాంకేతిక రంగం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. గత అయిదేళ్లలో వచ్చిన కొత్త సాంకేతికతలు, అప్పటికే ఉన్న సాంకేతికతల విషయంలో వచ్చిన మార్పులు, పరిణామాలు ముఖ్యంగా గత 18 నెలలుగా మానవాళి ఎదుర్కొంటున్న కోవిడ్‌-19 మహమ్మారి దరిమిలా వచ్చిన సాంకేతిక మార్పుల నేపథ్యంలో రెండవ ఐసీటీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. అత్యంత ప్రభావశీలమైన మొదటి ఐసీటీ విధానం ప్రేరణగా, పునాదిగా, కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతిక, ఆవిష్కరణల రంగాలలో పేరెన్నిక గన్న దేశాల సరసన నిలిపే లక్ష్యంతో పంచ సూత్రాలతో ఈ ఐసీటీ విధానం రూపుదిద్దుకున్నది.

  1. డిజిటల్‌ అవకాశాలపై పౌరులకు అవగాహన కల్పించి వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించడం.  
  2. మరింత మెరుగ్గా పౌరసేవలు అందించడానికి, పౌరులతో సంప్రదింపులని జరపడానికి సాంకేతికత, డిజిటల్‌ నైపుణ్యాలను ఉపయోగించుకోవడం  
  3. తెలంగాణ రాష్ట్రాన్ని అంకుర పరిశ్రమలకు అత్యంత అనువైన గమ్యస్థానంగా మలచడం, సాంకేతిక రంగంలో ప్రభావశీల ఉత్పత్తులను ప్రోత్సహించడం
  4. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం. సాఫ్ట్‌వేర్‌ ఉత్పాదక, ఇంజనీరింగ్‌ మరియు పరిశోధనా రంగాలలో ఉద్యోగ అవకాశాల్ని సృష్టించడం.
  5. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పరిష్కారాలని అభివృద్ధిపరచడం నిర్దేశిత లక్ష్యాల సాధనకు తెలంగాణ ఐసీటీ విధానం 12 ప్రాధాన్యతా అంశాల్ని ఎంచుకున్నది. 

‌1. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, సాఫ్ట్‌వేర్‌ ఉత్పాదకత, ఇంజనీరింగ్‌ మరియు పరిశోధన

తెలంగాణ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలకు నెలవుగా ఉన్నప్పటికీ వాటిలో సింహభాగం ఐటీ అనువర్తనాలు (Software Applications)), ఐటీ ఆధారిత సేవలను అందిస్తున్నవే. కానీ ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలన్నా సాఫ్ట్‌వేర్‌ ఉత్పాదకత (Product Development), ఇంజనీరింగ్‌ మరియు పరిశోధన కీలకంగా నిలుస్తాయి. సాఫ్ట్‌వేర్‌ ఉత్పాదకత, ఇంజనీరింగ్‌, పరిశోధన రంగానికి చెందిన 200 అగ్రగామి సంస్థల్లో కేవలం 25శాతం మాత్రమే భారత దేశంలో కార్యకాలపాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య కేవలం 12శాతంగా ఉంది. ఈ లేమిని సవరించడానికి ఐటీ, ఐటీ ఆధారిత సేవల వ్యవస్థను స్థిరీకరిస్తూనే, ఇంజనీరింగ్‌, పరిశోధన, ప్రపంచస్థాయి సామర్థ్య అభివృద్ధి కేంద్రాలు (Global Capability Centres) అనే అంశాలమీద తెలంగాణ దృష్టి సారించనున్నది. 

వచ్చే అయిదేళ్లలో ఐటీ రంగం నుండి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాల్ని 10 లక్షలకు, ఐటీ ఎగుమతుల విలువను రూ.3 లక్షల కోట్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  

అట్లే మేధా సంపత్తి (Intellectual Property) పెంపుదలకు, పరిశోధనలకు ఊతం ఇవ్వడానికి ప్రత్యేకమైన నిధిని ఐసీటీ విధానం ఏర్పాటుచేయనున్నది. ఐటీ రంగంలో ఉత్పాదకత విషయంలో 50శాతం వాటా కలిగియున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికై ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. MSME లను అభివృద్ధికై ఇప్పటికే ఐటీ, పరిశ్రమల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఒక సలహా మండలి ఏర్పాటయ్యింది.  

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే సంస్థలకు సహాయకారిగా మదుపరి కరపుస్తకాన్ని (Investor Playbook) ప్రభుత్వం వెలువరించనున్నది. ఇంకా ఏక కేంద్ర కార్యాలయం (Single-point of contact), నిపుణులతో సలహా మండలి (Advisory Committee)లను కొత్త ఐసీటీ విధానం కింద ప్రభుత్వం ప్రకటించింది.

 2. ఎలక్ట్రానిక్స్‌

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ రంగాలకు సంబంధించి ఐదు పారిశ్రామిక వాడలని ప్రకటించింది. మహేశ్వరం, రావిర్యాలలో రెండు ఎలక్ట్రానిక్స్‌ తయారీ ప్రదేశాలను (Electronics Manufacturing Clusters) ఇప్పటికే సిద్ధం చేసింది. మొత్తం 5 లక్షల చదరపు అడుగులో అన్ని హంగులతో కూడిన సర్వ సన్నద్ధ (Plug and Play) ప్రదేశాలను మొదటి దశలో, పది లక్షల చ. అడుగుల స్థలాన్ని రెండవ దశలో అభివృద్ధి చేయనున్నారు. చందన్‌ వెల్లిలో ఎలెక్ట్రిక్‌ వాహనాల పార్క్‌, దివిటిపల్లిలో పునరుత్పాదక ఇంధన పార్క్‌, శివ నగర్‌లో LED పార్క్‌ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యింది. 425 ఎకరాల విస్తీర్ణంలో గృహోపయోగ ఎలక్ట్రానిక్స్‌ (Consumer Electronics) పార్కును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. 

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 16,000 కోట్ల నుండి 2021-26 మధ్య కాలంలో 75,000 కోట్లకు, లక్షన్నరగా ఉన్న ఉద్యోగాలను మూడు లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 

3. ఆవిష్కరణలు/ పరిశ్రమల స్థాపన

తెలంగాణ ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో 8000 అంకుర పరిశ్రమలకు వ్యవస్థాగత మద్దతు (Institutional Support) ఇవ్వడానికి పూనుకున్నది. పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వం అంకుర పరిశ్రమలకు 1,300 కోట్ల నిధిని ఏర్పాటుచేయనున్నది. ఇందులో 100 కోట్లు సామాజిక అంకుర పరిశ్రమలకు కేటాయించింది. అంకుర పరిశ్రమలను ప్రభుత్వ వ్యవస్థలతో అనుసంధానం చేయడం, ప్రభుత్వ పథకాల అమలులో అక్కరకు వచ్చే అంకుర సేవలను కొనుగోలు చేయడానికి ఐసీటీ విధానం సంకల్పించింది.  

Innovation in Multimedia, Animation, Gaming and Entertainment (IMAGE), జీవశాస్త్ర రంగం, వ్యవసాయం, రక్షణ రంగాలలో కొత్త ఆవిష్కరణలకు, పరిశ్రమల స్థాపన, వ్యాపార వృద్ధికై  తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నది. 

ప్రారంభ దశ నుండి పరిణత దశ వరకు వివిధ దశల్లో ఉన్న అంకుర పరిశ్రమలకు అవస్థాపన సౌకర్యాల కల్పన, నిధుల సేకరణ, మార్గ నిర్ధేశనం, వ్యవస్థాగత మద్దతును ప్రభుత్వం అందిస్తుంది. గృహ ఆవిష్కరణలు, పాఠశాల స్థాయిలో ఆవిష్కరణలు, సామాజిక ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనున్నది.

4. వృత్తి నైపుణ్యాల పెంపు 

తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమలు, సంస్థల్లో అవసరమయ్యే మానవ వనరులలో 80శాతం నిపుణులని సమకూర్చాలని తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (TASK) లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకుగాను, ఏటా వివిధ కార్యక్రమాల ద్వారా యాభై వేలకు పైగా విద్యార్థులు, ఉద్యోగార్థులకు శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది.   

కనీస డిజిటల్‌ నైపుణ్యాలు, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ మరియు ఐటీ సేవల సహాయ నైపుణ్యాలను టాస్క్‌ అందిస్తుంది. ఉద్యోగ అవకాశాలు పెంపొందే విధంగా వ్యావహారిక నైపుణ్యాలు Soft Skills), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో (Emerging Technologies) శిక్షణను ఇవ్వనుంది. పరిశ్రమల భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌ కోర్సులు, విదేశీ భాషలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. 

5. పౌర సేవలు 

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలయిన కృత్రిమ మేధ (Artificial Intelligence), యాంత్రిక పరిజ్ఞానం (Machine Learning), Blockchain ల సహాయంతో సమాచార విశ్లేషణ, సురక్షిత గుర్తింపు ధృవీకరణ ద్వారా మరింత ఉపయుక్తంగా, వ్యక్తిగత కార్యాలయ సందర్శన, కాగితాల ప్రమేయం లేకుండా పౌరసేవలను అందించే లక్ష్యాన్ని ఐసీటీ విధానం నిర్దేశిస్తున్నది. 

మీసేవ (MeeSeva) ద్వారా ప్రస్తుతం అందిస్తున్న 600 పైచిలుకు సేవలను 1000కి పెంచాలని, ఈ పౌర సేవలన్నింటినీ T App Folio ద్వారా మొబైల్‌ ఫోన్లలో కూడా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.  

పౌరులకు ప్రభుత్వ సమాచారాన్ని, సేవలను సమర్థవంతగా చేరవేయడానికి డిజిటల్‌ మీడియా వేదికలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. పౌర సేవల విషయంలో వచ్చే ఫిర్యాదుల కోసం ‘జనహిత’ పేర ఒక వెబ్‌ మరియు మొబైలు వేదికను ఏర్పాటు చేస్తున్నది. Call centre, SMS, WhatsApp, email, Post మాధ్యమాల ద్వారా పౌరులు తమ ఫిర్యాదులను నమోదుచేసే వెసులుబాటు ఈ వేదిక ఇస్తుంది.

6. డిజిటల్‌ అవస్థాపన సౌకర్యాలు

‘డిజిటల్‌ తెలంగాణ’ కార్యక్రమం కింద పౌరలందరికీ డిజిటల్‌ అవస్థాపన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. 2026 నాటికి ప్రతిష్ఠాత్మక టీ-ఫైబర్‌ ప్రాజెక్టు ద్వారా అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ళకు నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ కల్పించబడుతుంది. దీని ద్వారా పౌరులు తమ ఇళ్ళనుండే విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య, ఈ-కామర్స్‌ సేవలను పొందవచ్చు. 

అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేలా తెలంగాణ వ్యాప్తంగా 5జీ సేవలు అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అట్లే, ప్రస్తుతం 1000 గ్రామాల్లో పౌర సేవలను అందిస్తున్న ‘డిజిటల్‌ తెలంగాణ’ కేంద్రాలను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు విస్తరించనున్నది.

7. ఐటీ రంగ వికేంద్రీకరణ

రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను రాజధాని హైదరాబాద్‌ తరహాలో ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా మార్చేవిధంగా పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం తీసుకున్నది. టాస్క్‌ (TASK), టీ హబ్‌ (T-HUB), వి హబ్‌ (WE HUB), TSIC వంటి సంస్థల ప్రాంతీయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ నగరాలలో ఐటీ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. ఈ నగరాలని పూర్తిస్థాయి స్మార్ట్‌ సిటీలుగా మలచడం జరుగుతుంది. 2026 నాటికి ఐటీ రంగంలో ఈ పట్టణాలు, నగరాలు 25,000 ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తుంది.    

ఇంకా ఇతర పట్టణాలలో కూడా అన్ని హంగులతో కూడిన సర్వ సన్నద్ధ ఐటీ భవనాలను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ప్రభుత్వం నిర్మిస్తుంది. Happening Telangana పేరిట వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, పర్యాటక కేంద్రాలు, ఇతర వినోద కార్యక్రమాల వేదికల నిర్మాణం ద్వారా పౌరులకు ఉపయోగపడే సౌకర్యాల కల్పన జరుగుతుంది. 

8. డిజిటల్‌ సామర్థ్యాల పెంపుకు కృషి 

ప్రపంచవ్యాప్తంగా జరిగిన విధంగానే డిజిటల్‌ యుగం మొదలయినప్పటి నుండి రాష్ట్రంలో వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్న సమూహాల మధ్య డిజిటల్‌ అగాధం (digital divide) పెరుగుతూ వస్తున్నది. దీనిని గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం పౌరుల డిజిటల్‌ సేవలు, వేదికలు, సాంకేతికతలపైన అవగాహన కల్పించే ప్రయత్నాలకు పూనుకున్నది. ముఖ్యంగా ఇంటర్‌నెట్‌ వినియోగం, సైబర్‌ సెక్యూరిటీ, సమాచార గోప్యత వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణను పౌరులకు ఇస్తుంది. 

కొత్త ఐసీటీ విధానం ద్వారా ప్రతి ఇంటిలో కనీసం ఒకరు  డిజిటల్‌ సాక్షరతా సాధించడం, ప్రతీ స్వయం సహాయక బృందంలో ఒకరు డిజిటల్‌ మధ్యమాలను వాడుకునే సమర్థతను కలిగిఉండడం అనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకున్నది. Pradhan Mantri Grameen Digital Saksharata Abhiyan (PMGDISHA) కార్యక్రమం కింద రోజువారీ ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌ మధ్యమాలలో నిర్వహించుకునే విధంగా 50 లక్షల మంది పౌరులకి శిక్షణ ఇవ్వబడుతుంది.

9. తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ కారిడార్‌ 

తెలంగాణ రాష్ట్రం గడచిన అయిదేళ్లలో Artificial Intelligence, Cloud Adoption, Blockchain, Cyber Security, Internet of Things, e-Waste వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు (ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌) సంబంధించి ప్రత్యేక విధానాలను తీసుకువచ్చింది. ఇంతేకాకుండా తెలంగాణ AI మిషన్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఈ-వేస్ట్‌ మేనేజ్మెంట్‌ విశిష్ట కేంద్రాలను ప్రారంభించింది. ఈ విభిన్న, విశిష్ట కేంద్రాల సమాహారంగా తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ (TET) కారిడార్‌ను ఒక ecosystem గా ప్రభుత్వం అభివృద్ధి పరుస్తుంది.  

వచ్చే అయిదేళ్లలో Additive Manufacturing, Space Technology, Robotics మరియు Digital Twins వంటి సాంకేతికతలను 75 పౌర సేవలు, విస్తృత ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే అనువర్తనాల అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ విషయమై ఐదు పరిశోధనా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.    

డాటా ఆధారిత ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం, స్మార్ట్‌ సిటీస్‌ కు సంబంధించిన డాటా సమూహాలను (Data Stacks) తెలంగాణ ప్రభుత్వం తయారుచేస్తుంది. అట్లే, సేకరించిన డాటా సమూహాలతో ప్రజోపయోగ అనువర్తనాలను అభివృద్ధి పరచడం, పరీక్షించడం కోసం డాటా మార్కెట్‌ ప్లేస్‌ ఏర్పాటు చేయబడుతుంది.

10. క్లౌడ్‌ విధానం 

కేంద్ర ప్రభుత్వ మేఘరాజ్‌ విధానం, 2013ను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం క్లౌడ్‌ అడాప్షన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించింది. సంప్రదాయ భౌతిక సర్వర్లతో పోలిస్తే పౌర సేవలను అందించడానికి క్లౌడ్‌ అనువైన మాధ్యమం అనే అవగాహనను ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కల్పించ బడుతుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు క్లౌడ్‌ సాంకేతికతను అవలంబించేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. క్లౌడ్‌ సేవలను అందించే సంస్థల జాబితా సిద్ధం చేయబడుతుంది. దీనితో ప్రభుత్వ శాఖలు, విభాగాలు క్లౌడ్‌ సేవలను పొందడం సులభతరమౌతుంది.

11. సాంకేతికతల సహాయంతో మెరుగైన నగర జీవనం

తెలంగాణ జనాభాలో 40శాతం పట్టణాలు, నగరాల్లోనే జీవిస్తుంది. వీధి దీపాలు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, వ్యర్థాల నిర్వహణ మొదలైన పురపాలక సేవలను అధునాతన సాంకేతికత సహాయంతో ప్రభుత్వం అందిస్తుంది. డాటా ఆధారంగా తాగేనీరు, పీల్చే గాలి నాణ్యత, వాహనాల ట్రాఫిక్‌ పర్యవేక్షణ చేపడతుంది. వచ్చే అయిదేళ్లలో స్మార్ట్‌ సిటీస్‌ సంఖ్యను 40కు పెంచేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

12. ప్రభుత్వ శాఖలకు సాంకేతిక చేయూత

పౌరుల అవసరాలకు అనుగుణంగా, డాటా ఆధారిత సేవలను రూపొందించడంలో ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఐటీ శాఖ చేయూతనిస్తుంది. తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (TSTS) ప్రభుత్వ శాఖలు, విభాగాలకు అవసరమయిన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఉత్పత్తులు కొనుగోలుచేస్తుంది. అట్లే  ప్రభుత్వ శాఖలు, విభాగాలకు సాంకేతిక మానవవనరులను ఎంపిక చేస్తుంది. 

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, అప్లికేషన్లు భారత ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్ల మార్గదర్శకాలు (Guidelines for Indian Government Websites) పాటించేవిధంగా ప్రభుత్వ శాఖలు, విభాగాలతో ఐటీ శాఖ పనిచేస్తుంది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు రూపొందించిన మార్గదర్శకాల అనుసరణ ప్రయత్నాలను ఒక గొడుగు కిందకు తెచ్చి T-Web Project గా ప్రభుత్వం పిలుస్తున్నది. వచ్చే అయిదేళ్లలో T-Web Project కింద అన్ని వెబ్‌సైట్లు, వెబ్‌ అప్లికేషన్స్‌ నిర్దేశిత విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.         

వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలు సేకరించే డాటాను పరిశీలించి పౌర-కేంద్రిత సేవలను రూపొందించేందుకు వీలుగా ఒక డాటా అనాలిసిస్‌ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది.