ఓడిఎఫ్‌లోనూ మనమే నెంబర్‌ వన్‌!

By: మార్గం లక్ష్మీనారాయణ

వినడానికి వింతగా ఉన్నా, ప్రపంచంలో మరుగుదొడ్లకు కూడా ఒక రోజుంది. అదేంటి? అని ఆశ్చర్యపోనక్కరలేదు. ప్రతి ప్రాణికి ఆహారం తీసుకోవడం లాగే విసర్జన కూడా ప్రాముఖ్యమైనది. ఇది వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, భద్రత, అంటువ్యాధులు, సామాజిక ఆరోగ్యానికి అంతకంటే ఆత్మ గౌరవానికి సంబంధించిన అతి కీలకమైన అంశం.

బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన (ఓపెన్‌ డెఫకేషన్‌) వల్ల మహిళలు, బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి సమయాల్లో బహిర్భూమికి వెళ్ళిన ఒంటరి స్త్రీలు లైంగిక దాడులకు గురయ్యే ప్రమాదం
ఉంది. అంతేకాదు, 2015లో ప్రపంచంలో వచ్చిన డయేరియా కేసుల్లో 58శాతం సురక్షిత నీరు లేక, పేలవమైన పారిశుధ్యం కారణంగానే సంభవించాయని అంచనా. పారిశుధ్య లోపం వల్ల ప్రతి ఏటా, ఐదు ఏండ్లలోపు ఉన్న, 5 లక్షల మంది పిల్లలు విరేచనాలతో చనిపోతున్నారు. పారిశుధ్యం అందుబాటులో ఉంటే, 5శాతం-20శాతం వరకు 5ఏండ్లలోపు పిల్లల మరణాలు తగ్గుతాయి. అలాగే పిల్లల్లో 7శాతం-17శాతం అసమానతలు తగ్గుతాయి. ఇంకా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల మట్టి ద్వారా సంక్రమించే హెల్మిన్‌ థియాసిస్‌, డయేరియా, స్కిస్టోసోమియాసిస్‌ వంటి వ్యాధులు, పిల్లలలో ఎదుగుదల మందగించడం వంటివి సంభవిస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా 420 కోట్ల ప్రజలు ‘‘సురక్షిత పారిశుధ్యం’’ లేకుండా నివసిస్తున్నారు. ఇంకా 67.3 కోట్ల మంది ప్రజలు బహిరంగ మలవిసర్జనను పాటిస్తున్నారు. అందరికీ పారిశుధ్యాన్ని సాధించడం, బహిరంగ మలవిసర్జనను ముగించడం లక్ష్యంగా ప్రజలను చైతన్య పరచడం కోసమే ఈ ప్రపంచ మరుగుదొడ్డి దినం. 2001, నవంబర్‌ 19న సింగపూర్‌కు చెందిన జాక్‌ సిమ్‌ నేతృత్వంలోని వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌ దీన్ని ప్రారంభించింది. తర్వాత నవంబర్‌ 19న వరల్డ్‌ టాయిలెట్‌ డే జరపాలని అధికారికంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేరకు 2013, జూలై 24న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ 67వ సెషన్లో 122 దేశాలు ఈ తీర్మాణాన్ని ఆమోదించాయి. ‘‘టాయిలెట్లకు విలువ ఇవ్వడం’’ అనేది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం 2021 థీమ్‌.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌
దీనికి అనుగుణంగా, మన దేశంలో 2014 అక్టోబర్‌ 2న గాంధీజీ 145వ జయంతి సందర్భంగా ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’ (ఎస్‌బిఎమ్‌) ప్రారంభమైంది. 2019 అక్టోబర్‌ నాటికి దేశంలో బహిరంగ మల విసర్జనను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 ఏండ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 5 ఏండ్లలో కేవలం ఐదేళ్లలో 39శాతం లక్ష్యాన్ని సాధించింది. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ఈ పథకం కింద మరుగుదొడ్లు కట్టుకునే లబ్ధిదారులకు రెండు విడతలుగా ఇచ్చే 12వేలలో 60శాతం కేంద్రం, 40శాతం రాష్ట్రాలు భరిస్తున్నాయి.

దేశంలోనే మొదటి గ్రామంగా ముఖరా (కె)
అయితే, 2020, జులై 22 నాటికే తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామం మొదటి బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామంగా ఎంపికైంది. అంతేకాదు కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వశాఖ కూడా ఈ గ్రామ వీడియోలు, ఫోటోలని తన పోర్టల్‌లో పోస్టు చేసింది. ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆ గ్రామ సర్పంచ్‌ మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్‌లను సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ కి పిలుపించుకుని అభినందించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి గ్రామం ముఖరా (కే) గానే మారింది. అనేక రంగాల్లో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న అవార్డులు రివార్డులే ఇందుకు నిదర్శనం. ఒక్క ఓడిఎఫ్‌ లోనే కాదు, అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.

తాజా కేంద్ర నివేదికల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌
ఇక దేశంలో పట్టణాలు, నగరాలు, మహానగరాలను మినహాయించి, మొత్తం 5,82,903 ఆవాసాలున్నాయి. అందులో 31 డిసెంబర్‌ 2021 నాటికి ఆ ఏడాదిలో కేవలం 26,138 గ్రామాలలో మాత్రమే మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. అంటే ఇది 04.48 శాతం మాత్రమే. కానీ, దేశంలో స్వచ్ఛ భారత్‌ ప్రారంభించిన ఏడాది 2014 ఏడాదిలోనే జూన్‌ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మాత్రం దేశంలో మిగతా రాష్ట్రాలకు, మొత్తం దేశానికి మించిన 96.74 శాతం అనూహ్య ప్రగతిని సాధించింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 14,200 ఆవాసాలలో 13,737 ఆవాసాలలో దాదాపు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించి, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది. దేశానికి ఆదర్శంగా, గర్వకారణంగా, ఇక్కడి మహిళలు, ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన రాష్ట్రంగా అవతరించింది. ఐక్య రాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి, దేశం 2019 నాటికి 100 శాతం లక్ష్యాన్ని నిర్దేశించుకుని అతి తక్కువ శాతం సాఫల్యతతో పని చేస్తుండగా, తెలంగాణ రాష్ట్రం ఆ రెండు లక్ష్యాలను మించి, 2021 నాటికే వంద శాతానికి చేరుకోవడం అసాధారణ విషయం. ఇక రెండో స్థానంలో ఉన్న తమిళనాడు (35.39శాతం) మనకు తేడా 61.35శాతం ఉండటం కూడా గమనార్హం. కేరళ (19.78శాతం), ఉత్తరాఖండ్‌ (09.01 శాతం), హరియాణ (05.75శాతం), కర్ణాటక (5.59శాతం), ఆంధ్రప్రదేశ్‌ (04.63శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. కాగా, జమ్ము కాశ్మీర్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, నాగాలాండ్‌, మిజోరం, త్రిపుర, గోవా మొదలైన 7 రాష్ట్రాలు సున్న ప్రగతితో ఆఖరున ఉన్నాయి. దేశంలో, మిగతా రాష్ట్రాల్లో ఓడిఎఫ్‌ నత్తనడకన నడుస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం శర వేగంగా పూర్తి కావస్తున్నది.

సమర్థవంతమైన సిఎం కేసీఆర్‌ నాయకత్వం
సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన నాయకత్వం, పటిష్టమైన పరిపాలన వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నది. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ క్రెడిట్‌ కచ్చితంగా కేసీఆర్‌ కే చెందుతుంది. మరోవైపు తనదైన శైలిలో అందరినీ ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖలను నిర్వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు నాయకత్వం, అంతకంతకు నిరంతరం పని చేస్తున్న సంబంధిత శాఖల అధికారులు, కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది చేస్తున్న కృషిని ఏమాత్రం విస్మరించలేం.

పల్లెలకు పరిపాలనా సంస్కరణలు
అయితే, స్థానిక పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచే విధంగా తీసుకువచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, అడిషనల్‌ కలెక్టర్లకు స్థానికపరిపాలన పనుల అప్పగింత, అందరికీ పదోన్నతులు, ప్రతి గ్రామానికి గ్రామకార్యదర్శుల నియామకం, పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు ని కేసీఆర్‌ చేపట్టారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలలో వర్క్స్‌, పారిశుధ్య, స్ట్రీట్‌ లైట్స్‌, గ్రీన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా 8,20,729 మందిని సభ్యులుగా భాగస్వాములను చేశారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, ఇంటింటికీ స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన మిషన్‌ భగీరథ మంచినీరు, నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు అందుబాటులోకి వచ్చాయి.

గ్రామీణాభివృద్ధిలో ‘‘పల్లె ప్రగతి’’ కొత్త శకానికి నాంది!
ఇదేగాక, ఇలాంటి అనేక లక్ష్యాలను సాధించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గతంలో ఎక్కడా, ఎన్నడూ లేని వినూత్న పథకాలు. నిజంగా గ్రామీణాభి వృద్ధిలో ‘‘పల్లె ప్రగతి’’ కొత్త శకానికి నాంది! గా నిలిచింది. ఇప్పటికే రాష్ట్రంలో 4 విడతలుగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పండుగలా జరిగాయి. ప్రజాప్రతినిధులంతా ప్రజలతో కలిసి భాగస్వాములయ్యారు. దీంతో నిరంతర పారిశుధ్యం జరుగుతున్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను సంపూర్తిగా రాష్ట్రం అమలు చేస్తున్నది. తద్వారా సత్ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఓడిఎఫ్‌లో సాధించిన ప్రగతి రాష్ట్రాన్ని తప్పకుండా ఆరోగ్య తెలంగాణగా మారుస్తాయనడంలో సందేహం లేదు.