|

అంతర్జాతీయ స్థాయికి మన హరితహారం

By: శ్రీకాంత్‌ బాబు బందు

సామాజిక అటవీ క్షేత్రం

2015లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో పురుడు పోసుకున్న ఆకుపచ్చని ఆశయం ఏడో ఏట అడుగుపెట్టి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. గత ఆరేళ్లుగా చేసిన హరిత యజ్ఞం ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కళ్లకు ఇంపుగా పచ్చదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సంకల్పిత లక్ష్యమైన రాష్ట్ర భూభాగంలో 33 శాతం పచ్చదనం సాధించే దిశగా పరుగులు పెడుతోంది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో పచ్చదనం సుమారు నాలుగు శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. వచ్చే యేడాది ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వచ్చే మరో రిపోర్టులో ఈ ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉండే అవకాశముంది.

అందుకే మన తెలంగాణకు హరితహారం జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది. అనేక రాష్ట్రాలు మన కృషి వెనుక కార్యాచరణను ఆరా తీస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాలు తమ అధికారులను పంపి నివేదికలు కోరాయి. స్వయంగా పార్లమెంట్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి చేసిన ప్రకటనలోనూ మొక్కలు నాటడం, చెట్లు పెంచటంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు కూడా మన పచ్చదనం పెంపు ప్రయత్నాలను ప్రశంసిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ పర్యావరణ నిపుణుడు ఎరిక్‌ సోల్‌ హెమ్‌ బ్రేవో తెలంగాణ అంటూ హరితహారాన్ని, అటవీ పునరుద్ధరణ ప్రయత్నాలను ప్రశంసించారు.

ప్రపంచలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణకు హరితహారం ప్రశంసలు అందుకుంటోంది. బ్రెజిల్‌, చైనా దేశాల తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో పచ్చ దనం పెంపు కార్యక్రమం తీసుకుని విజయవంతం చేయటం నిజంగా అద్భుతమే. ఆరేళ్ల కిందట 230 కోట్ల మొక్కలు నాటడం మన లక్ష్యం అని ముఖ్యమంత్రి కేసీఆరే చెబితే, మొదట్లో ఎవరూ నమ్మలేదు. అయ్యేదా పోయేదా అని తేలిగ్గా తీసుకున్నారు. అయితే పట్టుదలతో, రాజకీయ వ్యూహాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించినట్లుగానే, హరిత తెలంగాణ సాధన కూడా కొనసాగుతోంది. మొక్కలు నాటడం, పెంచటం, సంరక్షించటం ఒక్క రోజులో అయ్యే పనికాదు. సంవత్సరాల పాటు నిరంతర కృషి, పట్టుదల అవసరం. ప్రభుత్వ పరంగా ఎంత చేసినా, ఇది సామాజిక కార్యక్రమం. సమాజంలోని అన్ని వర్గాలూ భాగస్వామ్యులై ఉన్న అటవీ సంపదను కాపాడుకోవటం, కొత్తగా పచ్చదనం పెంచటమే హరిత హారం లక్ష్యం. ఈ దిశగా తెలంగాణ సమాజం విజయవంతం అయింది. ఇదే స్ఫూర్తి మరికొన్నాళ్లు కొనసాగితే హరిత లక్ష్యం సిద్ధించటం తథ్యం.

అయితే తెలంగాణ రాష్ట్రానికి ఈ హరిత ప్రశంసలు, పొగడ్తలు ఊరికే రాలేదు. గత ఆరేళ్లుగా చేసిన నిరంతర కృషి ఫలితం. పట్టువదలని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి చేసిన హరిత యజ్ఞం ఫలితాలు ఇవి. జంగల్‌ బచావో, జంగల్‌ బడావో నినాదం తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా చేయని ప్రయత్నం లేదు. తెలంగాణకు హరితహారం గొడుగు కింద అడవులను, అటవీ సంపదను కాపాడటం, క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుద్ధరణ,  కొత్తగా పచ్చదనం విస్తీర్ణం పెంచటం, పట్టణ ప్రాంతాలకు సమీపంలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను అభివృద్ధి చేయటం, ప్రతీ గ్రామంలో ఒక నర్సరీ, ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయటం, అన్ని రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్‌ (రహదారి వనాలు) లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం  మొత్తం నర్సరీల సంఖ్య  – 15,241. ఈసారి బహళ రహదారి వనాలకు (మళ్టీలెవల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌) ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీ రోడ్ల వెంట బహుళ వనాలు నాటే కార్యక్రమం. వీలున్న ప్రతీ చోటా యాదాద్రి (మియావాకీ) మోడల్‌లో చెట్లు నాటి, వనాల అభివృద్ధి జరుగుతోంది.

ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి, పెంచే బాధ్యత ఆయా కుటుంబాలపై పెడుతున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రతీ ప్రాంతంలో అటవీ భూముల సరిహద్దులు గుర్తింపు, అటవీ పునరుద్ధరణకు చర్యల కోసం అటవీ బ్లాకుల వారీగా జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో అటవీ పునరుద్ధరణ ప్రణాళికలు చేస్తున్నారు. పటిష్ట చర్యలు, పర్యవేక్షణ ద్వారా అటవీ భూములు, సంపద రక్షణకు చర్యలు. ఇప్పటికే గ్రీన్‌ బడ్జెట్‌ నిధులను నెలనెలా ప్రభుత్వం విడుదల చేస్తోంది.

ప్రతీ మండల కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో పెద్ద ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత. ఖచ్చితంగా 85 శాతం మొక్కలు బతికేలా పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ చట్టం చేసి అమలుకు నిర్ణయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలుతీసుకుంటోంది. గత ఆరు విడతల్లో నాటిన మొక్కలు మొత్తం  220.70 కోట్లు. అడవుల బయట 159.88 కోట్ల మొక్కలు. అడవుల లోపల 60.81 కోట్ల మొక్కలు. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధికి నిర్ణయం. ఇప్పటికే పూర్తయిన పార్కులు – 53 (35 ప్రజలకు అందు బాటులోకి, 18 రెడీగా ఉన్నాయి.) మిగతా 56 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను రానున్న ఏడాదిలో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అడవులు కాపాడటం, పచ్చదనం పెంచటాన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మెరుగైన ఫలితాలు రాబట్టింది. అందుకే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి.