వార్తల్లోని ప్రముఖులు
By: కేశవపంతుల వెంకటేశ్వర శర్మ
ఆంథోని అల్బనీస్

ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా ఆంథోని అల్బనీస్ మే 22న ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల్లో లేబర్ పార్టీ 72 స్థానాల్లో గెలుపొందింది. 1996లో పార్లమెంట్ సభ్యుడిగా, 2013లో ఉపప్రధానిగా, 2019 నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
జ్రోస్ రామోస్ హోర్టా

తైమూర్ దేశానికి అధ్యక్షుడిగా జోస్ రామోస్ హోర్టా మే 23న ఎన్నికయ్యారు. ఆయన గతంలో 2006 నుంచి 2007 వరకు ప్రధానిగా పనిచేశారు. ఈ దేశం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయ్యింది. ఆయనకు 1996లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ దేశం ఇండోనేషియా నుంచి విముక్తి పొందింది.
కిశోర్ జయరామన్

రోల్స్ రాయిస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ కిశోర్ జయరామన్ ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ అవార్డును మే 23న అందుకున్నారు. ఈయన యూకే బిజినెస్ కౌన్సిల్ సభ్యుడు. 2015లో బెంగళూరులో ఇంజినీరింగ్ సెంటర్‌ను స్థాపించారు.
వివేక్ కుమార్
ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా వివేక్ కుమార్‌ను జాయింట్ సెక్రటరీ స్థాయిలో నియమించేందుకు క్యాబినెట్ నియామక కమిటీ మే 22న ఆమోదం తెలిపింది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన ఆయన 2014లో పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు.
అభిలాష బరాక్

ఆర్మీ ఏవియేషన్ కార్ప్ పోరాట ఏవియేటర్‌గా చేరిన తొలి మహిళా అధికారిగా అభిలాష బరాక్ మే 25న రికార్డులకెక్కింది. హర్యాణాకు చెందిన ఆమె 36 మంది పైలట్లతో పాటు శిక్షణ పూర్తిచేశారు.
మొహిందర్ కే మిధా
వెస్డ్ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా భారత సంతతికి చెందిన మొహిందర్ కే మిధా మే 25న ఎన్నికయ్యారు. ఆమె ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందినవారు. బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డులకెక్కారు. 2022-23కు ఆమెను ఎన్నుకున్నారు.
గౌతమ్ రాణా

స్లొవేకియాలో అమెరికా రాయబారిగా (భారతీయ-అమెరికన్) గౌతమ్ రాణా మే 25న నియమితులయ్యారు. అతడు అల్జీరియాలోని అమెరికా ఎంబసీలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేస్తున్నారు.
వినయ్ కుమార్ సక్సేనా
22వ ఢల్లీి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనా మే 26న నియమితులయ్యారు. అనిల్ బైజల్ రాజీనామా చేయడంతో వినయ్‌ను ఆ స్థానంలో నియమించారు.
గీతాంజలి శ్రీ, డైసీ రాక్వెల్
భారత్‌కు చెందిన గీతాంజలి శ్రీతో పాటు అమెరికాకు చెందిన అనువాదకురాలు డైసీ రాక్వెల్కు 2022కు ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ మే 26న లభించింది. గీతాంజలి హిందీలో రచించిన ‘రేత్ సమాధి’ నవలను ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో డైసీ రాక్వెల్ ఇంగ్లీష్‌లోకి అనువదించింది. హిందీ మూల రచనకు బుకర్ ప్రైజ్ రావడం ఇదే మొదటిసారి. ప్రైజ్‌మనీ కింద ఇచ్చే 50 వేల పౌండ్ల నగదును ఇద్దరికి సమానంగా పంచుతారు. ఈ బహుమతిని 2005 నుంచి బ్రిటన్ ప్రదానం చేస్తుంది.
అన్వర్ హుస్సేన్ షేక్
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కమిటీ ఆన్ టెక్నికల్ బారీస్ ఆన్ ట్రేడ్‌కు ఛైర్మన్‌గా భారత్‌కు చెందిన అన్వర్ హుస్సేన్ షేక్ మే 26న ఎన్నికయ్యారు. దీనిలో సభ్యదేశాల సంఖ్య 164. ఈ సంస్థ 1995, జనవరి 1న ఏర్పడిరది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
నటరాజన్
బ్యాడ్ బ్యాంక్‌గా పరిగణించే నేషనల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)కి ఎండీ, సీఈవోగా నటరాజన్ సుందర్ మే 30న నియమితులయ్యారు. ఈయన ఎస్బీఐలో 37 సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి. ఇది మొండి బకాయిల వసూలుకు పరిష్కార మార్గాలను సూచిస్తుంది.
థాయోసేన్జి

సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ)కు కొత్త డైరెక్టర్‌గా సుజోయ్ లాల్ థాయోసేన్ మే 31న నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ ఐపీఎస్ మధ్యప్రదేశ్ క్యాడర్ అధికారి. ఎస్ఎస్బీ నేపాల్ (1,751 కి.మీ.), భూటాన్ (699 కి.మీ.) దేశ సరిహద్దులను కాపాడుతుంది. ఎస్ఎస్బీని 1963లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
జుల్ఫికర్ హసన్
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్)కి కొత్త డైరెక్టర్ జనరల్‌గా జుల్ఫికర్ హసన్ మే 31న నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ ఐపీఎస్ పశ్చిమ బెంగాల్ క్యాడర్ అధికారి. బీసీఏఎస్ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిని 1978లో స్థాపించారు.
భీంసింగ్

జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు భీంసింగ్ మే 31న మరణించారు. 1982లో పాంథర్స్ పార్టీని స్థాపించారు. 2012 వరకు 30 సంవత్సరాల పాటు ఆ పార్టీ ఛైర్మన్‌గా కొనసాగారు. 2022లో అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు.
రష్మీ సాహూ
రుచి ఫుడ్లైన్ డైరెక్టర్ రష్మీ సాహూ ‘టైమ్స్ బిజినెస్ అవార్డ్-2022’ జూన్ 1న అందుకున్నారు. ఆమెకు ఈస్టర్న్ ఇండియా లీడిరగ్ రెడీ టు ఈట్ బ్రాండ్ విభాగంలో ఈ అవార్డు లభించింది.
హరిణి లోగన్

అమెరికాలో జూన్ 3న నిర్వహించిన 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏండ్ల హరిణి లోగన్ విజేతగా నిలిచింది. 21 పదాలకు స్పెల్లింగ్‌లను తప్పులేకుండా చెప్పిన ఆమె స్క్రిప్స్ కప్ ట్రోఫీని అందుకుంది. 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది. టెక్సాస్‌కు చెందిన ఆమె 8వ గ్రేడ్ చదువుతుంది. విక్రమ్ రాజు రెండో స్థానంలో నిలిచాడు. 1925 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
బజ్రమ్ బేగాజ్
అల్బేనియా దేశ 8వ అధ్యక్షుడిగా బజ్రమ్ బేగాజ్ సోషలిస్ట్ పార్టీ తరఫున జూన్ 4న ఎన్నికయ్యారు. 140 పార్లమెంట్ సీట్లలో బేగాజ్కు అనుకూలంగా 78, వ్యతిరేకంగా 4 ఓట్లు వేశారు. ఆయన ప్రస్తుతం అల్బేనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఏఏ ఎఫ్) చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. అల్బేనియా రాజధాని టిరానా. కరెన్సీఅల్బేనియన్ లెక్. ప్రధానిఈది రామ.
ధోని
డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్ (డీఏఏఎస్) అయిన చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్‌కు మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా జూన్ 5న నియమితులయ్యారు. ఈ సంస్థలో ధోని పెట్టుబడులు కూడా పెట్టాడు. గరుడ ఏరోస్పేస్ను 2015లో స్థాపించారు. దీని వ్యవస్థాపకుడు, సీఈవో అగ్నీశ్వర్ జయప్రకాష్.
సతీష్ పాయ్

ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇనిస్టిట్యూట్ (ఐఏఐ) కొత్త ఛైర్మన్‌గా సతీష్ పాయ్ జూన్ 6న నియమితులయ్యారు. ఈయన హిందాల్కో ఎండీగా పనిచేస్తున్నారు. అల్యూమి నియం పరిశ్రమల స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, డిమాండ్‌కు తగ్గట్టు అల్యూమినియం ఉత్పత్తులను పెంచడం ఐఏఐ లక్ష్యం.
అలోక్ కుమార్ చౌదరి
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అలోక్ కుమార్ చౌదరిని కేంద్ర ప్రభుత్వం జూన్ 7న నియమించింది. ఈయన ఎస్బీఐలో 1987లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఎస్బీఐని 1955, జూలై 1న స్థాపించారు. ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా.
ఐపీఈఎఫ్‌లో భారత్
ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ (ఐపీఈఎఫ్)ను అధికారికంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మే 23న జపాన్‌లో ఆవిష్కరించారు. దీనిని అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనిలో భారత్‌కు సభ్యత్వం ఇచ్చారు. మొత్తం 13 సభ్యదేశాలు ఉన్నాయి. అవి.. భారత్, ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండోనేషియా, జపాన్, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్, వియత్నాం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా.
క్వాడ్ కూటమి
4వ క్వాడ్ కూటమి (చతుర్భుజ కూటమి) ప్రతినిధుల సమావేశం జపాన్ రాజధాని టోక్యోలో మే 24న నిర్వహించారు. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ తీరంలో రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం అంశాలపై చర్చించారు. ఇది 2007లో ఏర్పడింది.
పర్యాటక ప్రాంతాల సూచీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘ది ట్రావెల్ అండ్ టూరిజమ్ డెవలప్మెంట్ ఇండెక్స్ (టీటీడీఐ)’ను మే 23న విడుదల చేసింది. 117 దేశాలకు చెందిన ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి నివేదికలో జపాన్ మొదటి స్థానంలో నిలువగా.. అమెరికా 2, స్పెయిన్ 3, ఫ్రాన్స్ 4, జర్మనీ 5, స్విట్జర్లాండ్ 6, ఆస్ట్రేలియా 7, యూకే 8, సింగపూర్ 9, ఇటలీ 10వ స్థానాల్లో నిలిచాయి.
- భారత్ 54, శ్రీలంక 74, పాకిస్థాన్ 83,
చాద్ 117వ స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27.
రష్యా క్షిపణి
రష్యా నేవీ బారెంట్స్ సముద్రంలో అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌక నుంచి జిర్కాన్ క్రూయిజ్ క్షిపణిని మే 28న ప్రయోగించింది. వెయ్యి కిలోమీటర్ల (540 నాటికల్ మైళ్లు) దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. జిర్కాన్ ధ్వని కంటే 9 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది.
యూఎస్ ఫ్రాంటియర్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్‌గా యూఎస్‌కు చెందిన ఫ్రాంటియర్ నిలిచింది. 59వ ఎడిషన్ ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ల టాప్-500 జాబితాను జర్మనీ మే 30న విడుదల చేసింది. ఫ్రాంటియర్‌ను హెవ్లెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజెస్ (హెచ్‌పీఈ) ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించి తయారుచేశారు. దీనికి తరువాత ఫుగాకు (జపాన్) ఉంది.
నేవీ విన్యాసాలు
భారత్-బంగ్లాదేశ్ నావికా విన్యాసాలు బంగ్లాదేశ్‌లోని పోర్ట్ మోంగ్లాలో మే 24, 25 తేదీల్లో నిర్వహించారు. ‘బొంగోసాగర్’ పేరుతో నిర్వహించిన ఈ విన్యాసాలు మే 26, 27 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో కూడా చేపట్టారు. ‘అధిక స్థాయి ఇంటర్ ఆపరబిలిటీ, ఉమ్మడి కార్యాచరణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం’ లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ కోరా యుద్ధనౌకలు, బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్ఎస్ హైదర్, బీఎన్ఎస్ అబు ఉబైదా యుద్ధనౌకలు పాల్గొన్నాయి.
గబాన్ పర్యటనలో ఉప రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆఫ్రికా దేశం గబాన్లో మే 31న పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు అలీబొంగో ఒండిరబా, ప్రధాని రోజ్ క్రిట్కస్టెన్ ఒసౌకా రపోండాలతో సమవేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు.
గ్లోబల్ పేరెంట్స్ డే
గ్లోబల్ పేరెంట్స్ డేని జూన్ 1న నిర్వహించారు. పిల్లల జీవితంలో పేరెంట్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం దీని థీమ్ ‘అప్రిసియేట్ ఆల్ పేరెంట్స్ త్రో ఔట్ ది వరల్డ్ (ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులందరినీ మెచ్చుకోండి)’.
అదేవిధంగా జూన్ 1న వరల్డ్ మిల్క్ డే (ప్రపంచ పాల దినోత్సవం)ని కూడా జరుపుకొంటారు. పాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం దీని థీమ్ ‘రాబోయే 30 ఏండ్లలో గ్రీన్‌హౌజ్ ఉద్ఘారాలను తగ్గించి, పాడి పరిశ్రమను సుస్థిరంగా మార్చేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చడం ద్వారా ‘డెయిరీ నెట్ జీరో’ సాధించడమే లక్ష్యం.
భారత్-సెనెగల్
ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతో సెనెగల్ అధ్యక్షుడు మకీ సాల్ జూన్ 1న సెనెగల్‌లోని డాకర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2022-26 కాలానికి సంబం ధించి కల్చరల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం (సీఈపీ) పునరుద్ధరణకు సంబంధించి, వీసా రహిత పాలన అధికారానికి సంబంధించి, యువత విషయాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
70 ఏండ్ల పాలన
క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు జూన్ 2న ప్రారంభమై 5న ముగిశాయి. 96 ఏండ్ల క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్‌లో ఎక్కువ కాలం సింహాసనాన్ని అధిష్టించిన రాణిగా చరిత్రలో నిలిచారు.
టర్కీ పేరు మార్పు
టర్కీ దేశం పేరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు, నూతన నామాన్ని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కవుసోగ్లు జూన్ 3న లేఖ రాశారు. టర్కీగా ఉన్న దేశం పేరును టుర్కీయేగా మార్చుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కూడా తమ దేశం పేరును టుర్కీయేగా ఉచ్ఛరించాలని ప్రపంచదేశాలను కోరుతున్నారు. 1923లో స్వాతంత్య్రం పొందిన అనంతరం మొదట ఈ దేశాన్ని టుర్కీయేగా పిలిచేవారు.
వీగిన అవిశ్వాసం
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జూన్ 6న నిర్వహించిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ‘పార్టీగేట్’ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్సన్‌పై సొంత పార్టీ కన్జర్వేటివ్ సభ్యులే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 211 మంది జాన్సన్‌కు అనుకూలంగా, 148 మంది వ్యతిరేకంగా ఓటువేయడంతో అవిశ్వాసం వీగిపోయింది.
నాటో ఎక్సర్సైజ్
నాటో సభ్యదేశాల నౌకాదళ ఎక్సర్సైజ్ను బాల్టిక్ సముద్రంలో బాల్టిక్ ఆపరేషన్స్ (బీఏఎల్టీఓపీఎస్-22)జూన్ 5 నుంచి ప్రారంభించారు. ఆతిథ్య దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్లతో కలిపి మొత్తం 16 దేశాలు దీనిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆ దేశాల నుంచి 45 నౌకలు, 75కు పైగా విమానాలు, 7,500 మంది సిబ్బందితో ఈ ఎక్సర్సైజ్ను రెండు వారాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ 1972లో ప్రారంభమయ్యింది. ప్రస్తుతం నిర్వహించే ఎక్సర్సైజ్ 51వది.
ఆహార భద్రతా దినోత్సవం
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జూన్ 7న నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎఫ్ఏవో) సంయుక్తంగా ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అసురక్షిత ఆహారంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, రోజువారీ జీవితంలో పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేయడం దీని లక్ష్యం. ఈ దినోత్సవాన్ని నిర్వహిం చాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018, డిసెంబర్ 20న నిర్ణయించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘సేఫర్ ఫుడ్, బెటర్ హెల్త్ (సురక్షితమైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం)’.
ఎక్స్ ఖాన్ క్వెస్ట్
మల్టీనేషనల్ శాంతి పరిరక్షక మిలిటరీ ఎక్సర్సైజ్ ‘ఎక్స్ ఖాన్ క్వెస్ట్-2022’ మంగోలియాలో జూన్ 6న ప్రారంభమయ్యింది. 16 దేశాలు 14 రోజులు నిర్వహించే ఈ ఎక్సర్సైజ్ ఆ దేశాధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురేల్సుఖ్ ప్రారంభించారు. దీనిలో పాల్గొన్న భారత సైన్యానికి లఢక్ స్కౌట్స్ బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. సైనిక సంబంధాలను బలోపేతం చేయడం, శాంతి పరిరక్షక సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం.
ప్రపంచ సైకిల్ దినోత్సవం
ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జూన్ 3న నిర్వహించారు. సైకిల్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి 2018 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో నిర్వహించిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 72వ సెషన్లో సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.
వరల్డ్ ఓషియన్ డే
యూఎన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఓషియన్ డే (ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం)ని జూన్ 8న నిర్వహించారు. మహాసముద్రాల ప్రాధాన్యం, దైనందిన జీవితంలో అవి పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని 1992లో రియో డి జనీరో (బ్రెజిల్)లో జరిగిన ఎర్త్ సమ్మిట్‌లో ప్రతిపాదించారు. ఈ ఏడాది దీని థీమ్ ‘రివిటలైజేషన్: కలెక్టివ్ యాక్షన్ ఫర్ ది ఓషియన్ (పునరుజ్జీవనం: మహాసముద్రం కోసం సామూహిక చర్య)’.