అద్భుతంగా రాష్ట్రాభివృద్ది దృశ్యాలను క్లిక్ మనిపించిన కెమెరాలు

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రఫీ పోటీలను  అయిదు విభాగాలుగా విభజించి నిర్వహించడం జరిగింది. 1. బంగారు తెలంగాణా, 2.పల్లె, పట్టణ ప్రగతి, 3. ఉత్తమ వార్తా చిత్రం. 4.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి 5. స్కైలైన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ విభాగాలలో పోటీకి ప్రవేశాలను జూలై 9 న ఆహ్వానించారు.

ఈ ప్రకటనకు స్పందించిన 96 మంది ఫోటోగ్రాఫర్‌లు  మొత్తం 1200 ఫోటోలను పోటీలకు పంపడం జరిగింది. వీటన్నింటిని జె.ఎన్‌.టి.యు ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల రిటైర్డ్‌ అసోషియేట్‌ ప్రొఫెసర్‌ ఎం.నాగరాజ, సీనియర్‌ జర్నలిస్టు డా. గోవింద రాజు చక్రధర్‌, హిందూ దినపత్రిక మాజీ చీఫ్‌ ఫోటోగ్రాఫర్‌ హెచ్‌ సతీష్‌లు సభ్యులుగా ఏర్పడిన కమిటీ పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి రూ. 20,000, ద్వితీయ బహుమతి రూ. 15,000, తృతీయ బహుమతి 10,000, కన్సోలేషన్‌ బహుమతికి రూ. 5,000ల చొప్పున, మెమెంటో, సర్టిఫికెట్‌లను విజేతలకు అందజేయడం జరిగింది.

విజేతలైన ఫోటోగ్రాఫర్లకు అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ కూర్మాచలం అనీల్‌లు హాజరయ్యారు.