గ్రామాలలో క్రీడా మైదానాలు

  • తెలంగాణలో క్రీడలకు మంచి రోజులు వచ్చాయి

By: యు. వెంకటేశ్వర్లు

ఒకప్పుడు గ్రామాలలో తొక్కుడు బిల్ల, అష్టా చెమ్మ, కోతికొమ్మచ్చి, గోలీలాట, వామన గుంటలు, కర్ర బిళ్ళ, గిల్లమ్‌ గోడి, వంగితే దూకుడు, అచ్చన గిల్లలు, కబడ్డీ, కో కో లాంటి సుమారు 60 రకాల క్రీడలు ఆడేవారు. ఆయా ప్రాంతాలలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా  ఆటలు ఆడుకునేవారు. అయితే రాను రాను ఆధునిక పోకడలు, పాశ్చాత్య సంస్కృతి పోకడలతో గ్రామీణ క్రీడలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ప్రస్తుత యువతకు ఆ ఆటల పేర్లు కూడా తెలియదు. ఇక ముఖ్యమైన వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, కో కో, ఫుట్‌ బాల్‌ వంటి ఆటలు గ్రామాలలో అసలే తెలియదు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం నుండి ఒలింపిక్‌ క్రీడలలో మన ప్రాతినిథ్యం మనకు ఎన్ని పథకాలు వస్తున్నాయో తెలియంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆడే వాలీబాల్‌, క్రికెట్‌, కబడ్డీ, కోకో, బాస్కెట్‌ బాల్‌ వంటి క్రీడలలో కూడా మనం వెనకబడి ఉన్నాం.

మనిషి మనుగడ తో ముడిపడి ఉన్న క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శారీరక ధారుఢ్యం తోపాటు, మానసిక వికాసం, వినోదాన్ని కలిగించే పలు క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి . కనుమరుగైపోతున్న  క్రీడలకు ముఖ్యంగా గ్రామీణ క్రీడలకు పునరుజ్జీవం పోసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని తెచ్చి క్రీడలకు, క్రీడాకారులకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. క్రీడలలో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిథ్యం ఉండేందుకు గ్రామ ప్రాంతాలనుండి క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతో క్రీడా సదుపాయాలను కలుగజేసీ క్రీడలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపల్‌ పట్టణ వార్డులలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం జరిగింది.

జూన్‌ 3న ప్రారంభమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్‌ పట్టణ వార్డులలో ఎకరం స్థలంలో తెలంగాణ గ్రామీణ ప్రాంగణాలు ప్రారంభం చేయడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు సాకారమయ్యాయి. ఈ క్రీడా ప్రాంగణాలలో వాలీబాల్‌, కబడ్డీ, కోకో, డబల్‌ బార్‌, సింగల్‌ బార్‌ కోర్టులు ఉన్నాయి. కేవలం క్రీడా ప్రాంగణాలు మాత్రమే ఏర్పాటు చేయడమే కాకుండా, గ్రామీణ యువత ఆటలు అడుకునేందుకు అవసరమైన క్రీడా సామగ్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా గ్రామస్థాయి నుండి క్రీడాకారులను తీర్చిదిద్ది రాష్ట్ర, జాతీయ స్థాయిలకు తీసుకువెళ్లడం తద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన.

అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మున్సిపల్‌ వార్డులలో ఎకరం స్థలంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే చాలా గ్రామాలలో క్రీడ ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. ప్రత్యేకించి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అన్ని గ్రామాలు, మున్సిపల్‌  వార్డుల్లో నూటికి నూరుశాతం క్రీడా ప్రాంగనాలు ఏర్పాటు దిశగా ముందుకెళుతున్నాం. ఈ గ్రామీణ క్రీడా ప్రాంగణాలలో యువత ఆటలు ఆడుకునేందుకు వాలీబాల్‌, కబడ్డీ, కోర్టులతో పాటు వారికి అవసరమైన పోల్స్‌, నెట్లు, బాల్స్‌, క్రికెట్‌ కిట్లు అన్ని క్రీడ పరికరాలను అందజేశాం. రాష్ట్రంలో కనుమరుగైపోతున్న క్రీడలకు పునరుజ్జీవం పోసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతన అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నాం. ప్రత్యేకించి జిల్లా కేంద్రాల్లో ఉన్న క్రీడా మైదానాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది మన క్రీడాకారులు పోటీపడే విధంగా వారికి తర్ఫీదు ఇచ్చేందుకు అవసరమైన విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. క్రీడాశాఖ మంత్రిగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నా వంతు కృషి కొనసాగిస్తా…     

– శ్రీనివాస్‌ గౌడ్‌, మంత్రి