పాలనకు ప్రమాణం

అభిమానం అనేది ఒక్కొక్కరి పట్ల ఒక్కో విధంగా వుంటుంది. కొందరు మనసులో మౌనంగా అభిమానాన్ని పదిలపరుచుకుంటే, మరికొందరు ఆ అభిమానాన్ని పదిమందికి తెలిసేలా ఏదో ఒక రకంగా వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పుస్తకం విషయానికి వస్తే, ప్రభుత్వోద్యోగిగా పలు ప్రభుత్వ శాఖలలో సేవలందించి పదవీవిరమణ చేసి, రచయితగా మనోహరాచారి వ్రాసిన పుస్తకం ఇది. ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ పనితీరును పరిశీలించి,వివిధ ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలును,ప్రజల పట్ల ప్రభుత్వానికి వున్న బాధ్యతను,రాష్ట్రంలో జరిగిన పలు అభివృద్ధి పనులను అన్నింటినీ విశ్లేషించారు రచయిత. అయితే ఒక్కో ఆంశాన్ని లోతుగా పరిశీలించి సమీక్షించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిమానిగా మారిపోయారు.దాంతో ఉద్యమ కాలంలో కేసీఆర్‌ సాధించిన అనేక విజయాలను కూడా ఉటంకిస్తూ వెళ్లారు రచయిత.

ఇక పరిపాలనా కాలానికి సంబధించి చేపట్టిన పలు పథకాలు ప్రజలకు,అంటే వివిధవర్గాలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో వివరణాత్మకంగా వివరించారు రచయిత. మిషన్‌ కాకతీయ,మిషన్‌ భగీరథ,పోలీస్‌ వ్యవస్థను పటిష్టం చేయడం,హరితహారం,టీఎస్‌ఐపాస్‌,రైతు బంధు, కొత్త జిల్లాలు,కొత్త జోనల్‌ వ్యవస్థ, కంటివెలుగు,కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇలా ప్రభుత్వం చేపట్టిన ప్రతి అంశాన్ని సోదాహరణంగా వివరిస్తూ పుస్తక రచనను కొనసాగించారు.

బహుశా! ఈ పుస్తక రచనకు ఉద్యుక్తుడైనప్పుడు రచయిత పేర్కొనదలచిన అంశాలు, రచన కొనసాగుతుండగా మరింత విస్తృతమయ్యాయని ఈ పుస్తకం చదువుతుంటే అనిపిస్తుంది. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనికి ప్రతిపక్షాలు ఆటంకపరుస్తూ సత్వరమే కావలసిన పనులకు సహితం, కోర్టులలో కేసులు వేసి ప్రజలకు త్వరగా అందవలసిన అభివృద్ధి ఫలాలను ఆలస్యం చేస్తున్నారని, ఆ అభివృద్ధి ఆగిపోవద్దని ముందస్తు ఎన్ని కలకు వెళ్లిన అంశాన్నివివరించారు. ఆ తరువాత ఎన్నికల ప్రచార కార్యక్రమం ఎలా కొనసాగింది. అన్ని రాజకీయ పక్షాలు ప్రచార కార్యక్రమాలలో ఎలా పాల్గొన్నాయి, చివరికి విజయం ఎవరిని వరించింది వగైరా అంశాలన్నింటినీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అసెంబ్లీ సమావేశాల వరకు జరిగిన ప్రతి అంశాన్ని ఈ పుస్తకంలో వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తొలిప్రభుత్వ పరిపాలన పట్ల అందరికీ పరిపూర్ణ అవగాహన కలిగే విధంగా సమస్త సమాచారాన్ని అందించిన రచయిత అభినందనీయుడు. అందమైన కలర్‌ ఫొటోలతో తీర్చిదిద్దిన పుస్తకం ఎంతో ఆకర్షణీయంగా వుంది. ఇటువంటి పుస్తకాన్ని పాఠకులు తమ బుక్‌ షెల్ఫ్‌ లో పెట్టుకోవడం ఎంతో అవసరం.

– ఎమ్కే

పుస్తకం పేరు : ప్రమాణస్వీకారం నుండి ప్రమాణస్వీకారం వరకు
రచయిత : కన్నోజు మనోహరాచారి
పేజీలు : 170 : వెల : రూ. 250/-
ప్రతులకు :కన్నోజు మనోహరాచారి
ఫ్లాట్‌ నెం. 402, శిల్పి చైతన్య టవర్స్‌
దిల్‌ సుఖ్‌ నగర్‌
హైదరాబాద్‌ – 060.