లాభదాయక సేద్యం

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయాన్ని శాస్త్రీయ విధానంలో ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘నియంత్రిత సేద్యం’ చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో స్పందించిన అన్నదాతలు మొక్కజొన్న సేద్యానికి స్వస్తి చెప్పడం, పత్తిపంట సేద్యాన్ని నిరుటితో పోలిస్తే రెట్టింపు విస్తీర్ణంలో చేపట్టడం గమనిస్తే రైతుల మనోభావాలు స్పష్టమవుతున్నాయి. మూస పద్ధతిలో పంటను పండిస్తే సరిపోదు. రైతుకు గిట్టుబాటుధర లభించడం, తర్వాతి పంటల దిశగా కార్యాచరణ చేపట్టడం అవసరం. కోవిడ్‌ కష్టాల కారణంగా సొంత ఊళ్ళకు చేరుకున్న యువజనులకు స్థానికంగా సేద్యం ద్వారానే ఉపాధి లభిస్తుంది. ఈ దిశలో ముఖ్యమంత్రి పిలుపును రైతులు సజావుగా అవగతం చేసుకుని అమలు చేయగలిగారు.

వాస్తవానికి నియంత్రిత సేద్యం, అందించే రైతు స్వయం నిర్ణయాధికారాన్ని హరించడమే అంటూ వినిపిస్తున్న విమర్శలు, వక్రభాష్యాలు అర్థం లేనివి. రైతులకు సేద్యానికి కావలసిన సాగునీరు, ఉచిత కరెంటు సరఫరా, రైతుబంధు, పంట అమ్మకాల్లో గిట్టుబాటు ధర అందేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఎంతవరకు ప్రయోజనం కల్పించినాయో, అన్నదాత అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. అందుకే విమర్శలు, వక్రభాష్యాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగారు.

గత యేడాది సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి 4 లక్షల 76వేల ఎకరాల్లో వరిసేద్యం జరిగింది. ఫలితంగా రికార్డు స్థాయిలో పంట దిగుబడులు అందాయి. పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడంతో రైతు శ్రమఫలితాన్ని సజావుగా అందుకోగలిగాడు. ఇక భారత ఆహార సంస్థ సేకరించిన బియ్యంలో సింహభాగం వాటా తెంగాణ రాష్ట్రానిదే అని సంస్థ ఉన్నతాధికారుల గణాంకాలు వివరాలతో సహ ప్రకటించడం విశేషం.

ఈ విధంగా సేద్యాన్ని పండుగగా మారిస్తే తప్ప గ్రామాలు స్వయం సమృద్ధి సాధించలేవనే సత్యాన్ని ప్రభుత్వం గుర్తించినందునే ఈ చర్యలన్ని సాధ్యమయ్యాయి.  రైతన్న రాజుగా మారే శుభతరుణం కనుచూపు మేరలో కనిపిస్తోంది.