తెలంగాణ అభ్యుదయ కవి గులాం యాసీన్
By: గుండొజు. యాదగిరి

అది 1971, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ కవి సమ్మేళనం! వేదికనలంకరించిన ఉద్దండ కవి పండితులు ఇరువదారుగురిలో విశ్వనాథ సత్యనారాయణ, వానమామలై వరదాచార్యులు, దివాకర్ల వెంకటావధాని, ముకురాల రామారెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, ఆరుద్ర, దాశరథి, తిరుమల రామచంద్ర ప్రభృతుల సరసన ఆసీనార్హత పొందిన యువకవి గులాం యాసీన్ అందరిలో పిన్నవయస్కుడు. వేదిక పైకి తనను ఆహ్వానించగానే అతడు వేదిక ఎక్కి…
‘‘మన మెల్లరము నేడు పండుగలు చేద్దాం
మనసిచ్చి మనిషికై జీవించుదాం !
సహన సంస్కృతి మమత సమత సౌభాగ్యాల
మన మెల్లరము నేడు పండుగలు చేద్దాం
పేరాశ హృది నుండి పెకలించి వేద్దాం!
స్వార్ధ చింతన విడిచి స్వాభిమానము నిలిచి
సామరస్యము పెంచి అభయ హస్తము చాపి
కూడు గుడ్డకు రోసి గొల్లు గొల్లున యేడ్చి
నీడ గూడెరుగని జనత బాధలు దీర్చె
మార్గాలు కన్గొనుచు మసలుకొందాము
వర్గ కుల తత్వాలు వదలు కొంము
సంకుచిత భావాలు తొలగి పోవాలి
సామరస్యం బొకటె జగతి నిలపాలి’’
అంటూ వసుధైక కుటుంబకమ్ అనే విశాల విశ్వ భావనా కవిత్వాన్ని ఉద్ఘోషించాడు. ఆహూతులు అభినందించి ఆశీర్వదించారు. కవి గులాం యాసీన్ స్వగ్రామం కల్వకుర్తి. యాసీన్ ఆరడుగుల అందగాడు. తెల్లని లాల్చీ, పైజామా వేషధారణతో హమేషా హసన్ముఖంతో అందరినీ పలుకరించడం ఆయన మూర్తి మత్వం! తాను హైదరాబాద్ ప్రభుత్వోన్నత పాఠశాలలో తెలుగును బోధిస్తే భార్య ఫర్హద్ సుల్తానా హిందీ బోధించేది. తల్లిదండ్రులు ఆషాబీ గులాం అహ్మద్‌లకు 02-01-1946లో జన్మించాడు. తల్లి ఆషాబీ ముస్లిం పరదా పద్ధతికి స్వస్తి చెప్పి, 1950 దశకాల్లోనే ప్రభుత్వ ఉపాధ్యాయినిగా విధులు నిర్వహించింది. ఆమె పుట్టినిల్లు భువనగిరి. తల్లి రూపాన్ని సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్న గులాం యాసీన్ 1963 సం॥లో కల్వకుర్తి ప్రభుత్వోన్నత పాఠశాలలో హెచ్ఎస్సి పూర్తి చేసి, తెలుగుపై అభిమానంతో బిఓఎల్ పట్టాపొంది హైదరాబాద్ ఛత్తా బజార్ ఉన్నత పాఠశాలలో చేరారు. తెలుగు మాట్లాడే హిందువులతోనే ఎక్కువ దోస్తానాలు చేసిండు. తల్లి ప్రభావంతో ఖురాన్, భారత, భాగవత, రామాయణాది కావ్యాలను పఠిస్తూ, చల్లని సాయంకాలాల్లో స్థానిక గ్రంథాలయంలో ప్రబంధాలను తిరగేస్తూ ఉగాది కవి సమ్మేళనాల్లో తన కమ్మని గొంతుకతో వసంత కోకిలలా కవితా గానం చేసేవాడు. హైదరాబాద్ సుల్తాన్ షాహీలో హిందువులు అధికంగా వుండే ఒక వాడకట్టులో భార్య, ముగ్గురు పిల్లలతో సుఖంగా వుండేవాడు.
ఉర్దూ, పారశీకాల్లో ప్రసిద్ధి పొందిన సాహిత్యాన్ని అవగాహన చేసుకొని, సర్వమతాలపై సమరస భావన గలిగిన ఆయన భగవద్గీతా రహస్యాలు గ్రహించి, సందర్భానుకూలంగా అందులోని శ్లోకాలు ఉటకించేవాడు. విద్యార్థి దశలో పాలమూరు ప్రముఖ కవి ముకురాల రామారెడ్డి, కేతవరము రామకోటి శాస్త్రి, పెద్దాపురం రంగారావులు ఆయన సౌశీల్యానికి ప్రభావితులై కవిత్వంలో ప్రోత్సహించారు. తర్వాత వేలూరు సహజానంద సహకారంతో కవిత్వరంగంలో ఉత్తేజితులైనారు. ‘‘సుకవితా యద్యస్తి రాజ్యేనకిమ్?’’ అంటే మంచి కవిత్వం ఉంటే రాజ్యంతో ఏం పని అని మనసారా విశ్వసించేవాడాయన!
గులాం యాసీన్ పేరుతో పంపిన కవితలను కొన్ని పత్రికలు పక్షపాత బుద్ధితో ప్రచురించని సందర్భంలో ఆయన ‘మృత్యుంజయ’, ‘విజయ’ నామాంతరాలతో వ్రాస్తే ప్రచురణ పొందాయి. ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ కేంద్రాల ద్వారా అనేక పర్యాయాలు కావ్యగానం ప్రసారం జరిగింది. హైదరాబాద్‌లోని ‘సాహితీ లత’ వంటి పెక్కు సాహిత్య సంస్థలతో సన్నిహిత సంబంధాలుండేవి. తరచూ కవితా గోష్ఠుల్లో పాల్గొనే వారు. కవిత్వం ఆనందానికి, ఆత్మ సౌందర్యానికి, సంఘ సంస్కరణలకు, జాతీయ సమైక్యతకు, మానవత్వ విలువల పరిరక్షణకు సాధనంగా ఉపయోగపడాలని, హింసా ద్వేషాలతో జాతిని పెడత్రోవ పట్టించేది కవిత్వం కాదని ఆయన అమూల్యాభిప్రాయం. దాన్నే బలంగా విశ్వసించాడు. కవితల్లో ఇదే చాటేవాడు. ఆయన కవిత్వం సరళ పదజాలంతో సర్వులకు సుబోధకంగా, మనోజ్ఞంగా ఉండేది. ఆయన రాసిన ‘విప్లవ వైతాళికుడు దాశరథి’ వ్యాసం పలువురి ప్రశంసలందుకుంది. ఆయన రచనలు 1. కృష్ణ శతకము (కంద పద్య కృతి), 2. విజయ భేరి, పాకిస్థాన్ భారత్‌పై దండెత్తినప్పుడు ఆవేశ పూరితుడై రచించిన దేశభక్తి కవితలు. 3. అశ్రుధార 4. యాసీన్ గేయాలు 5. సమతా దర్శనము 6. భారతి, 7. భాగ్య రేఖలు, 8. గురు ప్రశంస.

ఇలా సాఫీగా జీవితం సాగుతున్న తరుణంలో దేశచరిత్రలో గులాం యాసీన్ జీవితంతో విషాదకర ఘోర దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ముఖ్యమంత్రిని గద్దెదించి మరొక ముఖ్యమంత్రిని గద్దెపై ప్రతిష్టించే క్రమంలో మత వైషమ్యాలకు రాజకీయ పార్టీలు పెద్దపీట వేసి అమాయక ప్రజలను ఊచకోతకోసే మత మాఫియా ముఠాలతో నగరాన్ని గజగజ వణికించేవారు. అలాంటి సంఘటనే 1983 జనవరి 5నాడు జరిగిన ఎన్నికల సందర్భంలో పునరావృతమయింది. అదే ఎన్నికల్లో మొదటిసారి గెలిచిన ఎన్‌టి. రామారావు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి కర్ఫ్యూ విధించినా మారణకాండ ఆగలేదు. ఆ మతోన్మాద దాడిలో 10మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రణాళిక ప్రకారం గులాం యాసీన్‌ను అంత మొందించాలనీ సంకల్పించిన మతపిచ్చి కిరాయి గూండాలు సుల్తాన్ షాహీలోని గులాం యాసీన్ ఇంటిపై దాడిచేసి ఆయనను ఆయన భార్య ఫర్హాద్ సుల్తానాను, 10 ఏండ్ల కుమారుడు షబ్బీర్‌ను తేజ్ తల్వార్లతో నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. బాత్రూంలో ఉన్న ఇద్దరు కూతుళ్ళు మీరజ్, నైనూ ఆదుర్మార్గుల బారినుండి తప్పించుకున్నారు. (ఈనాడు 09-01-1983 సంపాదకీయం).
ఇంతవరకు గులాం యాసీన్ చేసిన ఘోర నేరం ఏమిటి? అతడు హిందూ మతాభిమాని కావడం, మత సామరస్యాన్ని, జాతి సమైక్యతను, దేశభక్తిని ప్రబోధించే కవితలు రాయడం, కవిసమ్మేళనాల్లో, విజయవాడ, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాల్లో కవితా గానం చేస్తూ, భారత్ పై పాకిస్తాన్ దాడిని ఖండించడం, భాషా విద్వేషాలను ఖండించడం మానవతా వాదాన్ని, ధర్మాన్ని ఎలుగెత్తి చాటడం ఆయన చేసిన నేరాలు. మత మౌఢ్యం తలకెక్కిన వారికివి నచ్చలేదు. అనాథలుగా మిగిలిన ఆయన ఇరువురు కుమార్తెలను ఆదరించి, దరిచేర్చుకున్న ఒక మార్వాడీ కుటుంబం పెద్దమ్మాయిని ఎంబిబిఎస్, చిన్న కుమార్తెను ఇంజనీరింగ్ చదివించింది. తల్లిదండ్రుల జీవితాలు ఇలా భయానకంగా ముగియడం నుండి ఆయన కూతుళ్ళు నేటికీ కోలుకోలేక పోతున్నారు. స్వతంత్రం సిద్ధించిన పిమ్మట దేశంలో హత్యకు గురైన మొదటి కవి గులాయాసీన్ ! నేటికీ హైదరాబాద్‌లో ఆయనను జ్ఞాపకం చేసుకునే కవులు అనేకులున్నారు.
ప్రతి ఉగాది రోజు పాతనగరం ఆయన దోస్తులు ఆయన కవిత్వం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అతడు లేదు, అతని కమ్మని కవిత్వమూ లేదు.
‘ఫూల్బన్కర్ ముస్కురానా జిందగీ,
ముస్కురాకే గమ్ బులానా జిందగీ,
హర్దిన్ న మిలేతో క్యాహువా?
దూర్ రహకర్భీ దోస్తీ నిభానా జిందగీ.
(పూలవలె చిర్నవ్వులు చిందించమే జీవితం! చిర్నవ్వులతో చింతలను మరిపించడమే జీవితం. ప్రతిదినం కలిసి కనపడకపోతేనేం. దూరతీరాలనుండి స్నేహాన్ని కొనసాగించడమే జీవితం ` పరవస్తులోకేశ్వర్ గులాం యాసీన్‌ను స్మరిస్తూ తన షహర్ నామా పుస్తకంలో ఈ కవితను ఉటంకించారు.)