పి.వీ కో నూలుపోగు

‘పి.వి మన ఠీవి’ అని ప్రతి తెలుగువాడూ గుండెనిండా సగర్వంగా చెప్పుకొనే పాములపర్తి వేంకట నరసింహా రావు శతజయంతి వత్సరమిది. ఎవరు స్మరించినా, ఎవరు విస్మరించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే గాక దేశవ్యాప్తంగా, ప్రపంచ దేశాలలో కూడా పి.వి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఎంతో ముదావహం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, భారతదేశ పూర్వ ప్రధానిగా పి.వి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన చేసిన సంస్కరణలు – అవి భూ సంస్కరణలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు – నేటికీ ఆదర్శప్రాయం. పలు భాషల కోవిదుడే కాదు, ఆయా భాషలలో రచనలు కూడా చేయగల దిట్ట. అందుకే ఆయన ప్రాతః స్మరణీయుడయ్యారు.

తెలుగు బిడ్డగా, అందునా, తెలంగాణ ముద్దు బిడ్డగా ఆయన చేసిన సేవలను దేశవ్యాప్తంగా మరోసారి స్మరించుకొనేలా పి.వి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారు. అంతేగాదు, దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పి.వికి ‘భారతరత్న’ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్లమెంటులో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌ లోని సెంట్రల్‌ యూనివర్సిటీకి పి.వి పేరు పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ విన్నపాలను కేంద్రం సత్వరం ఆమోదిస్తుందని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

పి.వి. తెలుగువాడు. తెలంగాణవాడు. జర్నలిస్టు, సాహితీ వేత్త కాబట్టి ఆయనకు అక్షర నివాళి అర్పించే విధంగా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి. కవులు పాటలు రాయాలి. పత్రికలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాలి. రాష్ట్రంలోని ప్రతి ఊరికీ పీవీ గొప్పతనం తెలిసేలా, ప్రజలంతా ఆయన ఘనచరిత్ర తెలుసుకొనేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పి.వి శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి ఆదేశాలను శిరసావహిస్తూ, చంద్రునికో నూలుపోగులా తెలంగాణ ముద్దుబిడ్డ పి.వి. నరసింహారావును స్మరించుకుంటూ ‘తెలంగాణ’ మాసపత్రిక ఈ ప్రత్యేక సంచికను పాఠకుల కరకమలాలకు అందజేస్తోంది. ఇందుకు మా విన్నపాన్ని మన్నించి సహకరించిన రచయితలు, రచయిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఈ చిరు ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…..