ఇంటింటా ఇంద్రధనుస్సు సంక్షేమ ఉషస్సు

By: నూర శ్రీనివాస్‌

(గత సంచిక తరువాయి)

ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 28 నుంచి 30 లక్షల వరకు గొల్ల కుర్మల జనాభా ఉంది. వీరిలో 5 లక్షల నుంచి 6 లక్షల కుటుంబాల వారు 1 కోటి 75 లక్షల గొర్రెలు, మేకలను పెంచుతున్నారనే గణాంకాల ఆధారంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ తాను ప్రాతినిధ్యం వహించే గజ్వేల్‌ నియోజక వర్గంలోని కొండపాక గ్రామంలో 20 జూన్‌, 2017న ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ జిల్లాల్లోని 100 నియోజక వర్గాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్విరామంగా ఈ పథకం కొనసాగిస్తూ యాదవ జీవితాల్లో వెలుగురేఖలు పూయించారు.

సమగ్ర మత్స్య విధానంతో..

రాష్ట్రంలోని మత్స్యకారులను ఆదుకోవాలని, మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయాలని టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నది. 5 సెప్టెంబర్‌, 2018న రూ. 1,000 కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. రాష్ట్రంలోని దాదాపు రెండు లక్షలమందికి విలువైన ఉపకరణాలను రూ. 535 కోట్ల సబ్సిడీతో పంపిణీ చేసింది. ఈ పథకం కింద మత్స్యకారులకు 75 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీతో పరికరాలను అందిస్తున్న రాష్టంగా తెలంగాణ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. అంతేకాకుండా మత్య పరిశ్రమ ఊహించని రీతిలో అభివృద్ధి చెందడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దీంతో లక్షల మంది మత్స్య కారులకు ఉపాధి లభించేలా ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రొత్సహిస్తున్నది. చెరువుల్లో చేపలను పెంచే బెస్తలు (గంగపుత్రులు), ముదిరాజులతో పాటు ఇతర కులాల్లోని చేపల పెంపకందారులకు ఉచితంగా 100శాతం సబ్సిడీతో చేప పిల్లలను దేశంలో అంది స్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 

రజకులు.. నాయీబ్రాహ్మణులకు చేయూత

రజకులు, నాయీబ్రాహ్మణుల జీవనస్థితి గతులు మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించింది. రజకుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో (ఆగస్టు11, 2018న) రజక సంఘాల ప్రతినిధులతో స్వయంగా సీఎం కేసీఆర్‌ సమావేశమై వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ల ద్వారా వందల కోట్లను ఖర్చు చేస్తూ వారి జీవనోపాధికి భరోసా ఇచ్చారు. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రవేశ పెట్టారు. రజకులకు ఆధునాతన దోభీఘాట్లు, ఆధునిక సెలూన్ల ఏర్పాటుకు కావలసిన నిధులను కేటాయిస్తూ సర్కారు ముందుకు సాగుతున్నది. 

గీతన్న రాత మార్చిన సర్కార్‌

రాష్ట్రంలో కల్లు గీత ప్రధానవృత్తి, ఆ వృత్తిని ఎంచుకున్న గౌడన్న నుదిటిరాతను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ప్రజలకు ప్రాణహాని కలగని మద్యం, స్వచ్ఛమైన కల్లు అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను పునరుద్ధ రించింది. కల్లు కాంపౌండ్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో వేలాది గీత కార్మికుల కుటుంబాలు ఇవ్వాళ శిరసెత్తి సగర్వంగా నిలుచున్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువు కట్టలపై ఈత చెట్లను నాటించింది. రాష్ట్రంలో  గౌడ కులస్థులు ఆత్మగౌరవంతో బతికేలా  సీఎం కేసీఆర్‌  నీరా పాలసీని తెచ్చారు. 

చేనేతకు చేయూత

రాష్ట్ర ప్రభుత్వం  నేతన్నకు చేయూత  అనే పొదుపు పథకాన్ని ప్రారంభించి తద్వారా రాష్ట్రంలో లక్షలాది నేత కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపింది.  ఒక నెలలో పొందే కూలీలో 8 శాతం వాటాను నేతన్న జమ చేస్తే, ప్రభుత్వం 16 శాతం జమ చేస్తుంది. గరిష్టంగా రూ.2,400 వరకు జమ చేసే వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నది. థ్రిఫ్ట్‌ పథకంలో మరమగ్గాల ఆధునీకకరణకు చర్యలు చేపట్టింది. చేనేత కార్మికుల నుంచి ఒక్కపైసా వసూలు చేయకుండా ప్రభుత్వం నేతన్న కుటుంబాలకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. మరోవైపు చేనేత కళాకారులకు 50శాతం కూలీని పెంచింది. 

దేశం గర్వించే భారీ పరిశ్రమ

ఫాంటు ఫ్యాషన్‌ నినాదంతో  దేశంలోనే అతిపెద్ద వస్త్రనగరిగా వరంగల్‌ను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. 2వేల ఎకరాల స్థలంలో  కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్కు (కేఎంటీపీ) స్థాపనకు సీఎం కేసీఆర్‌ (22 అక్టోబర్‌, 2017న) శంకుస్థాపన చేశారు. నూలుపోగు నుంచి రెడీమేడ్‌ వస్త్రాల వరకు అన్నిరకాల వస్త్రాలను తయారు చేసే కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు దేశంలోనే పెద్దదిగా నిలుస్తుంది. మరోవైపు సిరిసిల్లలో అప్పరెల్‌ పార్క్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల రుణ మాఫీ పథకాన్ని తెచ్చి లక్షలాది నేతన్నలను రుణవిముక్తి చేసింది.

బీసీల జాబితాలో మరో 17 కులాలు 

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 17 కులాలను గుర్తించిన ప్రభుత్వం వారిని బీసీ జాబితాలో చేర్చింది. గుర్తింపుకు నోచుకోని 17 కులాల్లో 13 కులాలను బీసీ ఏ జాబితాలో, 4 కులాలను బీసీ డీ జాబితాలో చేర్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 09 సెప్టెంబర్‌, 2020న జారీ చేసింది.

ఆరోగ్య లక్ష్మితో తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్ష

తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్‌ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని ప్రతి రోజూ అందిస్తున్నది.  ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని జనవరి 1, 2015 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని 35,700 అంగన్‌ వాడీ కేంద్రాలు 149 ఐసిడిఎస్‌ల ద్వారా కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది.  ఈ పథకం కింద ఏడు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు 4,85,800 మంది, గర్భిణీలు, బాలింతలు 3,35,527 మంది లబ్ధిపొందుతున్నారు.

అంగన్‌వాడీ, ఆశావర్కర్ల జీతాల పెంపు

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు స్వరాష్ట్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ అనూహ్యంగా జీతాలు పెంచి సమాజంలో వారికి గౌరవాన్ని పెంచారు. అంగన్‌వాడీలతో సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేసి వారి సాధక బాధకాలను తెలుసుకొని చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో 150 శాతం జీతాలు పెంచారు. దీంతో 67వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధిపొందుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30శాతం జీతాలు  పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆశా వర్కర్లను ప్రభుత్వం మరింతగా భాగస్వాములను చేసింది. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు నెలకు కేవలం రూ. 1,000 నుంచి రూ.1,500 మాత్రమే పారితోషికం లభించడం సరికాదని భావించిన సీఎం కేసీఆర్‌ వారి జీతాన్ని 6 వేలకు పెంచారు. 2017 మే 5న ప్రగతి భవన్‌లో ఆశా వర్కర్లతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని 27,045 మందికి పారితోషికాన్ని అదే నెల నుంచి రూ.6 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

మహిళా కమిషన్‌

రాష్ట్ర ప్రభుత్వం 27 డిసెంబర్‌ 2020న  మహిళా కమిషన్‌ ఏర్పాటు చేసింది. కమిషన్‌ చైర్‌పర్సన్‌గా  మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డితోపాటు  ఆరుగురిని కమిషన్‌ సభ్యులుగా నియమించింది. సభ్యులుగా గద్దల పద్మ, కటారి రేవతిరావు, సూదం లక్ష్మి, కుమ్ర ఈశ్వరీ బాయి, షాహీన్‌ అఫ్రోజ్‌, కొమ్ము ఉమాదేవిలను నియమించిన విషయం తెలిసిందే.

ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్‌

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అనేది ఉమ్మడి రాష్ట్రంలో నామ మాత్రంగా ఉండేది. అయితే ఈ వర్గాలు అభ్యున్నతి చెందనంత కాలం సమాజం పురోగమించదు అన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని సవరించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. దేశ నలుమూలల నుంచి పార్లమెంటేరియన్లు, శాసనకర్తలు రాష్ట్రం అమలు చేస్తున్న నమూనాను తమతమ రాష్ట్రాల్లోనూ అనుసరించాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఇటీవలే రాజస్థాన్‌, ఒడిశా వంటి రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీల్లో చట్టాలు సవరించుకోవడం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దూరదృష్టికి నిదర్శనం.

ఎస్సీ, ఎస్టీ జనోద్ధరణ

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. స్వయం ఉపాధి, పథకాలకు శ్రీకారం చుట్టి పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దటమే కాకుండా ఈ వర్గాల సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు అహర్నిశలు ప్రభుత్వం కృషి చేస్తున్నది.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు

ఎస్సీలు, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం వారికి అవసరమైన ప్రొత్సాహాన్ని అందిస్తూ, రాయితీలు కల్పిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను రిజర్వ్‌ చేసి ఆ వర్గాల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఎకరం స్థలంలో రూ. 5 కోట్లతో ప్రత్యేక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వమే రూ.5 కోట్ల వరకు మార్జిన్‌ మనీ కింద అందిస్తున్నది.

తెలంగాణకు ఫ్రైడ్‌

ఎస్సీ, ఎస్టీ వర్గాల ఔత్సాహికులకు స్టేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ రాపిడ్‌  ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ ఎస్సీ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ (టీఎస్‌ ప్రైడ్‌) అనే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారితోపాటు, ఇప్పటికే పరిశ్రమలను ఏర్పాటుచేసిన వారు వాటిని విస్తరించాలనుకున్నా ప్రభుత్వం సహాయం అందిస్తున్నది.  దీనిద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు స్థాపించే పరిశ్రమలకు ఒక్కో యూనిట్‌కు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీని రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచారు. ఇన్వెస్ట్‌ మెంట్‌ సబ్సిడీ ద్వారా పరిశ్రమల స్థాపన కయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీని గరిష్టంగా రూ.75 లక్షల వరకు అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తల కిచ్చే సబ్సిడీని 10 శాతం పెంచి 45శాతం ఇస్తున్నారు. సేల్స్‌టాక్స్‌ మినహాయింపును 50 నుంచి 100 శాతానికి పెంచారు. టీఎస్‌ ప్రైడ్‌ ద్వారా 2,467 మంది ఎస్సీలకు రూ.112.79 కోట్లు, 1,929 మంది ఎస్టీలకు రూ. 87.21 కోట్లు మంజూరు చేశారు. వీరికి ప్రభుత్వం రూ. 338 కోట్ల ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్‌లను అందించింది. 

కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్‌

ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీలకు శిక్షణనిచ్చి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం చేసే అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించి దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచింది.

పారిశ్రామివేత్తలుగా గిరిజనబిడ్డలు

గిరిజనులకు అవకాశాలిస్తే.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతారని ప్రభుత్వం భావించి దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా  ముఖ్యమంత్రి గిరిజన ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (సీఎం ఎస్టీఈఐ) పథకం ప్రవేశపెట్టి వందలాది మందిని యువపారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతోంది. సంవత్సరానికి వంద మంది చొప్పున ఎంపిక చేసి వారికి వ్యాపార, పారిశ్రామిక మెళకు వలు నేర్పించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దింది. ఇప్పటికే ఇందులో మూడు వందల మంది ఎస్టీ యువతీ, యువకులు తమకు తాము ఉపాధిని పొందటమే కాకుండా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. 

రాజ్యాంగ నిర్మాతకు ఆకాశమంత గౌరవం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా  ముఖ్యమంత్రి కేసీఆర్‌ 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ కాంస్య విగ్రహానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.  దేశంలోనే పెద్దదిగా 125 అడుగుల ఎత్తుతో, 45.5 అడుగుల వెడల్పుతో దీని నిర్మాణం చేపట్టనున్నారు. దాని నిర్మాణానికి 791 టన్నుల స్టీలు, 96 మెట్రిక్‌ టన్నుల ఇత్తడి వినియోగించనున్నారు. రూ.140 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ విగ్రహ నిర్మాణం టెండర్ల దశలో ఉంది.

దళిత విజ్ఞాన కేంద్రం

 ప్రభుత్వం దళిత యువతకు వివిధరంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌ బోరబండలోని ఇందిరానగర్‌లో 9 అంతస్తులతో ఆధునిక విజ్ఞాన కేంద్రాన్ని నిర్మిస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ అతి పెద్ద మ్యూజియంతోపాటు సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ భవనంలోనే ముందు భాగంలో 26 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ భవనం కోసం 1,550 చదరపు అడుగుల స్థలాన్ని 2016లో ప్రభుత్వం కేటాయించింది. దీని నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేసింది. 2016 ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌ దీనికి శంకుస్థాపన చేశారు. 

దళితులకు భూపంపిణీ

1983 నుంచి సమైక్య రాష్ట్రంలో ఎస్సీలకు భూ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. 35 ఏండ్లలో 19 ఏండ్లు కాంగ్రెస్‌ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి 2014 దాకా తెలంగాణలో 32,800 మందికి 39,798 ఎకరాల భూమిని పంచినట్లు రికార్డుల్లో ఉంది. ఒక్కొక్కరికి సగటున 1.21 ఎకరాల చొప్పున పంచారు. ఎందుకు పనికి రాని భూములను తమకిచ్చి తమ జీవితాలను ఆగం చేశారని దళితులు నిట్టూర్చిన స్థితి గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంత భూమి ఇచ్చామన్నది ముఖ్యం కాదు.. ఇచ్చిన భూమి ఎలా సద్వినియోగం అవుతున్నది అనే మానవీయ స్పర్శతో సీఎం కేసీఆర్‌  తెలంగాణ ఏర్పడిన వెంటనే 15 ఆగస్టు 2014న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయంపై ఆధారపడిన ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఎస్సీల భూపంపిణీ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం 19 ఏండ్లలో రూ. 2.65 కోట్లు, టిడిపి ప్రభుత్వం 16 ఏళ్లలో రూ. 71 కోట్లు ఖర్చు చేశాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.678కోట్ల నిధులతో 15,443 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 6,194 దళిత కుటుంబాలకు పంపిణీ చేసింది. 

నెరవేరిన దశాబ్దాల పంచాయతీల కల

తండాలను, గూడెలాను గ్రామ గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఉద్యమ నేతగా కేసీఆర్‌ ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా  1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్డు ఏరియాలో ఉండడంతో వాటిని అవి ఎస్టీలకే రిజర్వు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కార్‌ది. ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేసింది. దీంతో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యేందుకు అవకాశం లభించింది.

2021-22 బడ్జెట్‌ హైలెట్స్‌:

–        ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 21,306.85 కోట్లు

–        ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి: 12,304.23 కోట్లు

–        బీసీ సంక్షేమ శాఖకు రూ.5522 కోట్లు

–        బీసీ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు

–        మైనారిటీ గురుకులాల కోసం రూ. 561 కోట్లు

–        బీసీ గురుకులాల నిర్వహణ కోసం: రూ.545 కోట్లు

–        మైనారిటీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ.1606 కోట్లు 

–        స్త్రీ, శిశు సంక్షమ శాఖకు రూ.1702 కోట్లు

–        జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు ఇప్పటి వరకు 1082 మంది విద్యార్థులకు రూ.178.52 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

–        గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు త్రీఫేజ్‌ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రూ. 103 కోట్లు

–        ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రూ.18కోట్లు

–        ఇస్లామిక్‌ కల్చరల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం నగరంలోని కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. త్వరలో ఈ నిర్మాణ పనులు ప్రారంభం. 

–        విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న 1684 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.294 కోట్ల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లను  ఇప్పటికే అందించింది. 54 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు రూ.1054 కోట్లతో పక్కా భవనాల నిర్మాణం జరుగుతున్నది.

–        మైనారిటీ సంక్షేమం కోసం 2008 నుంచి 2014 దాకా రూ.812 కోట్లు ఖర్చుచేస్తే గడచిన ఆరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.5712 కోట్లను ఖర్చుచేసింది.

కరోనా సమయంలోనూ…

వరుసగా రెండు సంవత్సరాలుగా కరోనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే పేదింట పెండ్లి తిప్పలు ఉండకూడదని సీఎం కేసీఆర్‌ తన మానసపుత్రిక అయిన కల్యాణలక్ష్మికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నిధులు విడుదల చేస్తూ తన మానవీయతను చాటుతున్నారు. మరోవైపు  ప్రతీయేటా ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ పేదలను మిగితా వర్గాలతో సమానంగా ఆదరిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 40వేల మందికి అదనంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద చెక్కులు పంపిణీ చేయటం విశేషం.

లబ్దిదారులు ఎవరెంత..? (మార్చి 31, 2021 వరకు)

సంవత్సరం        మైనారిటీ ఎస్సీ     ఎస్టీ      బీసీ     ఈబీసీ    మొత్తం

2014-15           5414    5159    2472    –             –           13405

2015-16           27446  30614  17736  –             –           75796

2016-17           27383  25340  14715  35652    –           103090

2017-18           24927  25223  16326  61469    3722    131667

2018-19           34205  30600  16500  82575    8103    171983

2019-20           36325  34648  24190  71447    7928    174538

2020-21           29234  30854  17022  132383  13540   223033

మొత్తం            184934          182438 108961383526  33293   893152

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకప్రగతి నిధి బడ్జెట్‌ కేటాయింపులు

–        2018-19 బడ్జెట్లో రూ.3604.90 కోట్లు.

–        2018-19 బడ్జెట్లో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖకు రూ.12,708.73 కోట్లు

–        గిరిజన సంక్షేమశాఖకు రూ.8,063.48 కోట్లు 

–        ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కింద 2016-17బడ్జెట్లో రూ. 7,122 కోట్లు

–        2017-18లో రూ. 14,375 కోట్లు,

–        2018-19లో రూ.12,708.73 కోట్లు,

–        2019-20లో రూ.16,581 కోట్లు,

–        2020-21లో కోసం రూ.16,534.97 కోట్లు,

–        ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కింద 2016-17 బడ్జెట్లో రూ. 3,752 కోట్లు,

–        2017-18లో రూ. 8,165 కోట్లు కేటాయించారు.

–        2018-19లో ఎస్టీలకు రూ.8,063.48 కోట్లు,

–        2019-20 లో ఎస్టీల కోసం రూ.9,827కోట్లు కేటాయించారు.

–        ఎస్టీల కోసం  2020-21లో రూ.9,771.27 కోట్లు కేటాయించారు.