రాజన్న సిరిసిల్లకు అగ్రస్థానం

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 డిసెంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2022 ర్యాంకింగ్‌లో నవంబర్ -2022 లోనూ రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకున్నది. తాజాగా డిసెంబర్ మాసంలోనూ ఆ మార్క్‌ను నిలబెట్టుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తాగునీరు-పారిశుధ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అన్ని గ్రామాలను మోడల్ గ్రామాలుగా ప్రకటించినందుకు గాను దేశంలోనే రాజన్న సిరిసిల్ల మొదటి స్థానం దక్కించుకుంది.
ప్లస్ మోడల్‌లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో గృహ స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించుకొని ఉపయోగించుకోవడం, అన్ని ఇన్సిటిట్యూషన్స్ లోపల మరుగు దొడ్ల వినియోగం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్ని గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దడం, ప్రతి గ్రామంలో పారిశుధ్యానికి సంబంధించిన వాల్ పెయింటింగ్స్ ఏర్పరచడం జరిగింది. ఈ అవార్డు మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో కలెక్టర్ అనురాగ్ జయంతి సారధ్యంలో చేసిన కృషికి గుర్తింపుగా వచ్చింది. ఈ కృషిలో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, శానిటరీ సిబ్బంది, ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందనలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల అధికారులకు ప్రశంస
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2022 కింద డిసెంబర్ మాసంలో 4 స్టార్ కేటగిరీలతో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం సాధించిన విషయాన్ని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తాగునీరు-పారిశుధ్య మంత్రిత్వ శాఖ (డి.డి.డబ్ల్యుఎస్) తన ట్విట్టర్‌లో రాజన్న సిరిసిల్ల నెంబర్ 1 అంటూ పోస్ట్ చేసింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా అధికారులను ప్రశంసిస్తూ, వెల్‌డన్ అంటూ అభినందిస్తూ డి.డి.డబ్ల్యుఎస్ అధికారిక ట్విట్టర్ హాండిల్‌లో పోస్ట్ చేసింది.
ఈ జిల్లాతో పాటు సచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో రెండు, మూడు కేటగిరీల్లో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు నిలిచాయి. వీటితో పాటు 3 స్టార్, 2 స్టార్ రేటింగుల్లో తెలంగాణ పల్లెలు టాప్ ర్యాంకుల్లో నిలిచి సత్తా చాటాయి.
అచీవర్స్ 3 స్టార్ రేటింగులో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలువగా, జగిత్యాల జిల్లా రెండో స్థానాన్ని, పెర్ఫార్మర్స్ 2 స్టార్ రేటింగులో భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా మొదటిస్థానాన్ని సాధించింది. తాజాగా కేంద్రం ప్రకటించిన 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్ రేటింగ్స్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులు రాష్ట్రానికి రావడం పట్ల పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.