తెలుగు భాషకు నీడనిచ్చిన ‘రావిచెట్టు’

ravichettu

దేశాభిమానం, మాతృభాషాభిమానం, వితరణశీలంమెండుగాగల రావిచెట్టు రంగారావు అజ్ఞానాంధకారం అలుముకున్న నిజాం పాలనాప్రాంతంలో గ్రంథాలయోధ్యమాన్ని, విజ్ఞాన చంద్రికాగ్రంథ ప్రచురణ, పంపిణీ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజా చైతన్యానికి, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికారు.

ఆగర్భశ్రీమంతుడైన ఈ మున్సబు సరసుడు, మేధావంతుడు, దార్శనికుడు కావడమేకాకుండా ధార్మికుడు కావడంవల్ల బంగారానికి తావి అబ్బినట్లయింది. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్న తెలుగుభాషా పోషకుడు శ్రీకృష్ణదేవరాయల పేరున నిజాం రాజ్యంలోని హైదరాబాద్‌లో వారు, మునగాల రాజా నాయిని వెంకటరంగారావు బహద్దూర్‌, వారి మంత్రి కొమర్రాజు లక్ష్మణరావు ప్రభృతులతో కలిసి 1901 సెప్టెంబర్‌ ఒకటో తేదీన నెలకొల్పిన తొలి తెలుగు గ్రంథాలయం ‘దేశగ్రంథాలయములందు శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం లెస్స’ అని వాసికెక్కింది.

వరంగల్‌ జిల్లా మడికొండకు చెందిన రావిచెట్టు నరసింహారావు-వేంకటమ్మ దంపతులకు 1877 డిసెంబర్‌ 10న నల్లగొండ జిల్లా దండంపల్లిలో వారి మాతామహుడు-అక్కినేపల్లి రంగారావు ఇంట్లో రంగారావు జన్మించారు. ఆయన బాల్యంలోనే కుమారుని ముద్దుముచ్చటలు కూడా సరిగా చూసుకునే అదృష్టంలేక తొలుత వేంకమాంబ, కొంత కాలానికి నరసింహారావు కన్నుమూశారు.

అనంతరం ఒంటరియైన రంగారావును కొమరగిరి అప్పారావు చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి, ఊటుకూరి వెంకటప్ప కుమార్తె లక్ష్మీనర్సమ్మతో వివాహం జరిపించారు. యుక్తవయస్కుడైన పిదప తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మొత్తం వారి స్వాధీనమయ్యాయి. తండ్రినుంచి సంక్రమించిన ‘మున్సబుగిరి’ స్వీకరించి ‘మున్సబుదారు’ అయ్యారు. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, ఇంగ్లీషు, సంస్కృతం భాషలు నేర్చుకున్నారు. వాటిలో ప్రావీణ్యము సంపాదించారు. తెలుగంటే వారికి వల్లమాలిన అభిమానం. మత, సాంఘిక, రాజకీయాల్లోనూ వారికి సరైన అవగాహన ఉండేది.

ఆగర్భశ్రీమంతులలో అరుదుగా కనిపించే ఆదరణశీలం రంగారావులో ఎక్కువగా ఉండేది. ఆర్థిక సహాయం ఆశించి తన వద్దకు వచ్చే బాలలందరికీ విద్య చెప్పించేవాడు. ఇంట్లో ఉంచుకుని వారి బోధన తదితర అవసరాలు కూడా తీర్చే దానగుణం వారిది. రంగారావు దంపతులకు సంతానం లేనందున లక్ష్మీనర్సమ్మ రంగారావు మనస్సు తెలుసుకుని మసలుకునేవారు. ఇంట్లో ఉంచుకున్న పిల్లలందర్ని ఆ దంపతులు తమ స్వంత పిల్లల్లాగా చూసుకునేవారు.

భాషాభిమానం మిక్కిలిగా గల రంగారావు హైదరాబాద్‌లో ఉన్న భాష విషయిక సంస్థలన్నింటిలో సభ్యత్వం తీసుకున్నారు. కొన్ని సంస్థలకు ఆర్థిక సహాయం చేశారు. కొందరు మహారాష్ట్ర మిత్రులతోకూడి దేశంలో మరోచోటలేని సంస్కృత భాండాగారాన్ని -‘శ్రీశంకర భగవత్పూజ్యపాదగీర్వాణ రత్న మంజూష’ పేరున ఏర్పాటు చేశారు. అందులో చతుర్వేదాలు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, నాటకాలు ఇత్యాది సంస్కృత ప్రబంధాలెన్నో కొనుగోలు చేసి సేకరించి పాఠకుల సౌకర్యార్థం ఉంచారు. ఇంతేకాకుండా ఈ గ్రంథాలయం తాలూకు రెండువేల రూపాయల విలువపై వచ్చే వడ్డీతో ప్రతియేట కొత్తగా వచ్చే సంస్కృత గ్రంథాలు కొనుగోలు చేసేవారు.

ఇట్లా హైదరాబాదులో తెలుగేతర భాషల గ్రంథాలయాలెన్నో ఉన్నా, తెలుగు గ్రంథాలయం లేకపోవడం పెద్దలోటుగా రంగారావు గ్రహించారు. ఈలోగా మునగాల రాజా నాయిని వెంకటరంగారావు బహద్దూర్‌ హైదరాబాద్‌ నగర సందర్శనము కావించడంవల్ల, రావిచెట్టు రంగారావుకు వారితో స్నేహం కుదిరింది. రాజావారి మంత్రి-కొమర్రాజు లక్ష్మణరావు పండితోత్తముడు, మహాపరిశోధకుడు. వారి సలహాననుసరించి తెలుగు భాషా నిలయాన్ని స్థాపించాలని నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల తెలుగు భాషా వికాసానికి కృషి చేయవచ్చునని ఆ మూర్తిత్రయం భావించింది.ఈ తరుణంలో విజయనగర సామ్రాజ్య సాహిత్య వైభవాన్ని కళ్ళకుకడుతూ తాజాగా రాబర్ట్‌ సూవర్‌ రచించిన ‘ఫార్గాటన్‌ ఎంపైర్‌’ అనే గ్రంథాన్ని వారు చదివి శ్రీకృష్ణ దేవరాయల భాషా సేవకు, వారి కవితాశక్తికి, వారి ఆస్థానంలోని అష్టదిగ్గజాల కవితా సృజనకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ ప్రభావంతో కొత్తగా వారు నెలకొల్పుతున్న తెలుగు గ్రంథాలయానికి ‘శ్రీకృష్ణదేవరాయల’పేరును పెట్టారు. అట్లా ఇప్పటికి నూటా పదిహేను సంవత్సరాల క్రితం నిజాం రాజ్యంలో తొలి తెలుగు గ్రంథాలయం అప్పుడు రాంకోఠిలోగల రావిచెట్టు రంగారావు బంగాళాలో స్థాపించడం జరిగింది. తొలి సమావేశానికి పాల్వంచ, భద్రాచలం సంస్థానాధిపతి రాజా పార్థసారథి అప్పారావు అధ్యక్షత వహించారు. ఈ గ్రంథాలయం తొలి అధ్యక్షుడుగా రాజానాయని వెంకటరంగారావు బహదూర్‌, కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు ఎన్నికయ్యారు. మరునాటి నుంచే రంగారావు తెలుగు గ్రంథాలయ ఆవశ్యకతను తెలుగు ప్రజానీకానికి వివరించి చెబుతూ, మంచి గ్రంథాల సేకరణకు ఉపక్రమించారు.

దాదాపు ఐదేండ్లపాటు వారు కార్యదర్శిగా ఉండి గ్రంథాలయ అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశారు. ఎందరో దాతలవద్దకు వెళ్ళి చందాలు వసూలు చేసి, ఆరువందల రూపాయలు నిలువ చేశారు. అప్పుడు కార్యదర్శిగా ఉన్న రంగారావే కోశాధికారిగా ఉన్నందున ఆ డబ్బుకు మామూలు వడ్డీ ఇచ్చేవారు. అయితే మద్రాసులో విదేశీయుల ‘అర్బత్తునాట్‌ కంపెనీ’లో డబ్బు పెడితే వడ్డీ ఎక్కువ వస్తుందని భావించి అందులో గ్రంథాలయం

సొమ్ము పెట్టారు. దురదృష్టవశాత్తు ఆ కంపెనీ దివాలా తీయడంతో దాచిన సొమ్ము దయ్యాలపాలైనట్టు మొత్తం పోయింది. అయినాకూడా అధైర్యపడకుండా రంగారావు గ్రంథాల యానానికి తెప్పించే పత్రికలను మాన్పించలేదు. గ్రంథాల కొనుగోలుకు వెనుకకుపోలేదు. తెలుగు మాట్లాడరానివారిని, మాట్లాడితే వెక్కిరించేవారిని, తెలుగులో మంచి గ్రంథాలు లేవనే అసంతృప్తివాదుల ఇంటికి మంచి గ్రంథాలను పంపించి చదివించేవారు. మాతృభాషపట్ల వారికి మమకారం పెరగడానికి దోహదం చేసేవారు. భాషా నిలయంలో కేవలం హిందువులనేకాకుండా మహ్మదీయులను, క్రైస్తవులను, ఇతర మతస్తులను కూడా సభ్యులుగా చేర్చుకున్నారు. అయినా భాషా నిలయంలో మత విషయాల ఊసులేకుండా కేవలం భాషా విషయాలే చర్చించేవారు.

కేవలం కార్యదర్శి, కోశాధికారిగానే కాకుండా రంగారావు భాషా నిలయంలో ఉపదేశకుడుగా, విలేకరిగా, ఒక్కొక్కసారి భృత్యుడుతానై-అన్ని పనులు ఒక్క చేతిమీదుగా చేసేవారు.

భాషా నిలయానికి సంబంధించిన మొత్తం పనులను రంగారావు స్వయంగా చూచుకోగలడనే నమ్మకంతో ఇతర సభ్యులు నిలయ అభివృద్ధికి అంతగా సమయం కేటాయించక, పట్టించుకోక అశ్రద్ధ చేస్తున్నారని, అందరినీ భాషా నిలయం అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే తలంపుతో రంగారావు ఐదేండ్ల కార్యదర్శిత్వం తర్వాత 1907లో ఆ పదవికి రాజీనామా ఇచ్చి మరొకరిపై పనిభారం వేయాలని కాంక్షించారు. అయినా భాషా నిలయాభివృద్ధికి తన చేయూత సదా ఉంటుంద’ని హామీ ఇచ్చారు. అయినా కూడా రంగారావునే కార్యదర్శిగా సభ్యులందరూ ఎన్నుకున్నారు. కాని దానికి రంగారావు ససేమిరా అంగీకరించలేదు. అయితే చివరికి కోశాధికారిగా మాత్రం కొనసాగడానికి వారు అంగీకరించారు.

భాషా నిలయం అభివృద్ధికి, పాఠకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని రంగారావు ఏ నిర్ణయమైనా తీసుకునేవాడు. కాబట్టి ఆయన మాటే వేదంలా ఉండేది.

భాషా నిలయానికి పత్రికలు, కొత్త గ్రంథాలు తెప్పించినంత మాత్రాన మాతృభాషాభివృద్ధి జరుగదని భావించి భాషా నిలయానికి అనుబంధంగా ఒక పాఠశాలను నెలకొల్పి కొత్త పద్ధతిలో చరిత్ర, భూగోళం, గణితం మొదలైనవి తెలుగులోనే బోధించాలని ఆలోచన చేశారు. దానికి సభ్యులు అంగీకరించారు. దానితో పది, పన్నెండువేలమంది విద్యార్థులతో ఒక పాఠశాల ప్రారంభించారు. కానీ సభ్యులు చేసిన వాగ్ధానాలు కేవలం వాగ్ధానాలుగా మిగలడంతో పాఠశాల నిర్వహణకు రంగారావు చొరవ తీసుకుని, చందాలకోసం తిరుగలవలసి వచ్చింది. విద్యార్థులకు పలకలు, బలపాలు, పుస్తకాలు కొనిచ్చారు. అయినాకూడా ఆ పాఠశాల కేవలం నాలుగైదు మాసాలు నడిచి మూతపడిపోయింది.

భాషా నిలయం కార్యదర్శిగా ఉన్నప్పుడే కాకుండా రంగారావు తప్పుకున్నతర్వాత సైతం ఏదైనా సభ ఏర్పాటు చేస్తే, తమ ఇంట్లో నౌకర్లను వెంటబెట్టుకుని, రెండుమూడు గంటలుముందే వెళ్ళి పనులన్నీ పురమాయించేవారు. ఆ తర్వాత వారే కార్యదర్శిని పిలిపించేవారు అట్లా ఉండేది వారి పనితీరు.

ఇది ఇట్లా ఉండగా సంస్కృత భండాగారం ముఖ్య పోషకులు కొందరు ఆసక్తిలేక చేయిజారవిడవడంవల్ల, దాని మూలధనం బ్యాంక్‌లోవేసి, భాషా నిలయంలో సంస్కృత గ్రంథాలయాన్ని విలీనం చేశారు.

భాషా నిలయం పక్షాన పురాతన కవిప్రణీతములైన సత్ప్రంబంధాలను ప్రచురించాలనే ప్రయత్నం చేశారు. ఈ భాషా నిలయం ప్రేరణతో సికిందరాబాద్‌లో, హనుమకొండ మొదలగు పట్టణాల్లోనూ భాషా నిలయాలు వెలిశాయి. మహారాష్ట్ర తదితర భాషా సంస్థలకు ఇది ఆదర్శంగా నిలిచింది. కానీ శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయానికి స్వంత భవనం లేదనే బాధ రంగారావులో ఉండేది.

త్రిలింగదేశానికి రాజధానిగా ఉన్న హనుమకొండకు ఒకటిరెండుసార్లు వెళ్లివచ్చిన రంగారావు-అక్కడ స్థానికులతో ముచ్చటించి భాషానిలయమొకదాన్ని ఏర్పాటు చేయడానికి స్ఫూర్తినిచ్చారు. స్థానికులు ఉత్సాహంగా ముందుకువస్తే భాషా నిలయం ఏర్పాటు చేయడానికి తాము సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్లా రెండుమూడుసార్లు ప్రయత్నించిన పిదప 1904 జనవరి 26న రాజా నాయిని వెంకటరంగారావు బహద్దూర్‌ దోహదంతో రాజరాజనరేంద్ర భాషా నిలయం నెలకొల్పారు. ఈ గ్రంథాలయంకోసం అనేక ముద్రణాల యాలకు, గ్రంథ విక్రయశాలలకు లేఖలువ్రాసి అనేక గ్రంథాలు ఉచితంగా, కొన్ని సగం ధరకు, మరికొన్ని పాతికశాతం ధరకు తెప్పించి ఇచ్చారు. హనుమకొండలో బ్రిటిష్‌ పోస్టాఫీసు లేనందున గ్రంథాలను, పత్రికలను తమ పేరున హైదరాబాద్‌కు తెప్పించి హనుమ కొండకు పంపేవారు. అంతేకాకుండా భాషా నిలయానికి స్వంత గృహవసతి కల్పించడానికి కూడా రంగారావు చాలా కృషి చేశారు.

రాజా నాయిని వెంకటరంగరావు బహద్దూర్‌, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు త్రయం కేవలం శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం వ్యవస్థాపనలోనేకాకుండా-తెలుగు ప్రజా నీకాన్ని జాగృతులుగా తీర్చిదిద్దడానికి వారిలో విజ్ఞాన చంద్రికలు ప్రసరింపజే యడానికిగాను ‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మాల’ను ఏర్పాటు చేశారు. మనలోని లోపాలను సవరించుకోవడానికి మహా పురుషుల జీవిత చరిత్రలు ఉపకరి స్తాయనీ, దేశభక్తిని, నీతిని, సంస్కర ణాభిలాషను ప్రేరేపించే గ్రంథాలు తొలుత ఉచితంగా, సముచితంగా రచిం చేవారికోసం అన్వేషించారు. వాటి ముద్రణకు అయ్యే ఖర్చును భరించేవారు, వాటిని చందాదారులకు పంపిణీ చేసే కార్యభారం మోసేవారు కావలసి వచ్చారు. గ్రంథాలు ఉచితంగా రచించడానికి కొమర్రాజు లక్ష్మణరావు ముందుకురాగా, వాటిని ముద్రించడానికి నాయిని వెంకటరంగారావు అంగీకరించారు. ఇక మిగిలిపోయిన పంపిణీభారాన్ని రావిచెట్టు రంగారావు తన భుజస్కంధాలపై వేసుకున్నారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల మేనేజర్‌గా, గుమాస్తాగా, భృత్యుడుగా, అన్నీ తానై రాత్రింబవళ్ళు ఎంతో ఓర్పుతో, నేర్పుతో రంగారావు కార్యభారం నిర్వహించారు. కేవలం మాతృభాషాభిమానంవల్ల మాత్రమే వారు విద్యాధికులను గుర్తించి అనంతరకాలంలో కొంగ్రొత్త గ్రంథాలను వ్రాయించారు. కొత్త చందాదారులను చేర్పించి వారు తెలుగు గ్రంథాలు పఠించడానికి కారణభూతులయ్యారు. అప్పుడు సుమారు పన్నెండువందలమంది చందాదారులు ఉండేవారు. సంపాదకులు మద్రాసులో ఉండి గ్రంథాలు ముద్రించి హైదరాబాద్‌ పంపిస్తే అక్కడినుంచి చందాదారులకు పంపడం ఆలస్యమయ్యేది. ఆ జాప్యాన్ని నివారించడానికి కార్యస్థానం 1909లో మద్రాసుకు మార్చారు. దానితో రంగారావు సతీ సమేతంగా మద్రాసు వెళ్ళి ఆరు మాసాలున్నారు. ఆ కార్య భారం డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతికి అప్పగించి తిరిగివారు హైదరాబాద్‌ వచ్చారు. ముఖ్య కార్యాలయం మద్రాస్‌లో ఉన్నా, హైదరాబాద్‌లోని శాఖా కార్యాలయం ఏర్పాటుచేసి రంగారావు నిరంతరం కృషి చేశారు. మద్రాసునుంచి వి.పి.ద్వారా పుస్తకాలు పోస్టులో పంపించే సౌకర్యం లేనందున, హైదరాబాద్‌కు గ్రంథాలు తెప్పించుకుని సుమారు రెండవందలమంది చందాదారులకు ఇక్కడినుంచి పంపేవారు.

పురుషులతోపాటు స్త్రీలు కూడా విద్యావంతులైతే కుటుంబానికి తద్వారా జాతికి మేలు జరుగుతుందని భావించి పరీక్షలలో కృతార్థులైన మహిళలకు బహుమ తులిచ్చి ప్రోత్సహించే పద్ధతి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్త్రీలకు కుట్టు పనులు మొదలయినవి నేర్పించి వారిలో నైపుణ్యాన్ని పెంచాలనీ విద్యాభివృద్ధి చేయూత లక్ష్యంతో ‘ఆంధ్రమహిళా సంఘాన్ని తన భార్య లక్ష్మీనర్సమ్మ కార్య దర్శిగా ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం వారి ఇంట్లోనే స్త్రీ విద్య, శిశుపోషణ, గృహ నిర్వహణ, పాతివ్రత్యము, ఐకమత్యము మొదలయిన అంశాలపై ఉపన్యాస కార్య క్రమాలు నిర్వహించేవారు. ఈ సంఘానికి ఒక పుస్తకా లయాన్ని ఏర్పాటు చేయాలని రంగారావు యోచించారు. కొన్నికొన్ని కారణాలవల్ల రంగారావు ఈ సంఘంతో సంబంధాన్ని వదులుకున్నారు.

రంగారావులో స్వదేశాభిమానం ఎక్కువ. కలకత్తా సమావేశం అనంతరం బయలుదేరిన స్వదేశోద్యమాన్ని వారు అంతకంటే రమారమి పదేండ్లు ముందుగానే అవలంభించారు. దేశీయ వస్తువుల వాడకం, దేశీయ వస్త్రాల ధారణకు వీరు ప్రతినపూనారు. హైదరాబాద్‌లో, కాళీఘాట్‌లో షిరాల్‌కర్‌ స్వదేశ వస్తు భాండాగారంలో కొన్ని భాగాలు వీరు పుచ్చుకున్నారు.

1908 సంవత్సరంలో హైదరాబాద్‌లో మూసీ వరదలు సంభవించి, ఆ జల ప్రళయంలో ఇండ్లు కూలి నానా అవస్థలకులోనైన వారికి వారి ఇల్లే శరణ్యమైంది. ఈ సందర్భంలో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కల్పనాసంఘంలో రంగారావు ఉండి ఇల్లిల్లు తిరిగి మనసా వాచా కృషి చేశారు.

ఇట్లా దేశంకోసం, మాతృభాషకోసం, తన సర్వస్వము ధారపోసిన మహనీయుడు రావిచెట్టు రంగారావు కనీసం మధ్య వయస్సుకు కూడా చేరకుండానే తన ముప్ఫై మూడో ఏటనే సాధారణనామ సంవత్సర బహుళ ద్వాదశీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అనగా 1910 జూలై 3వ తేదీన ఆకస్మికంగా కన్నుమూశారు. ఆ మహానుభావుడి దివ్యస్మృతికి నివాళులర్పిస్తూ మాతృభాష, గ్రంథాలయ ఉద్యమాల్లో వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ రావిచెట్టు రంగారావు జయంతిని తెలంగాణ గ్రంథాలయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటిస్తే సముచితంగా ఉంటుంది.

టి. ఉషాదేవి