విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు

విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల నియామకాలకు ముందడుగు పడింది.  ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ  విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 16ను జారీచేశారు.

గత ఏప్రిల్‌ నెలలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో యూనివర్సిటీలలోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి కామన్‌ బోర్డు ను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పారదర్శకంగా పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ఈ కామన్‌ బోర్డు పనిచేయనుంది. ఈ బోర్డు ద్వారా 3500 పోస్టులు భర్తీ చేయనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొన్నారు.  బోర్డులో విద్యా, ఆర్థికశాఖల కార్యదర్శులు సభ్యులుగా, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా ఉంటారని పేర్కొన్నారు. 

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం, పి.వి.నరసింహ్మారావు వెటర్నరీ వర్సిటీలను ఈ బోర్డు పరిధిలో చేర్చలేదు. వాటిలో నియామకాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.  ఈ బోర్డు పరిధిలో ఉస్మానియ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ (నల్లగొండ), జేఎన్‌టీయూహెచ్‌, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, బాసర ఆర్‌జీయూకేటీ, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయం కూడా వస్తాయి.